వేడి పెరిగింది కదా... వ్యాయామం ఆపేయాలా?

వేడి పెరిగింది కదా... వ్యాయామం ఆపేయాలా?


లైఫ్‌స్టైల్ కౌన్సెలింగ్

 

ఈమధ్యే నేను వ్యాయామం చేయడం మొదలుపెట్టాను. అయితే గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయి కదా. వ్యాయామం ఆపేయాలా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి.

- నవీన్ కుమార్, పిడుగురాళ్ల
వేసవిలో వ్యాయామం చేసేవారు కొన్ని అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి. అవేమిటంటే... మన శరీర ఉష్ణోగ్రతను ఎప్పుడూ ఒకేలా ఉంచడానికి శరీరంలోని చర్మం, రక్తనాళాలు పనిచేస్తాయి. మన శారీరక శ్రమ పెరగగానే రక్తనాళాల్లోకి రక్తం ఎక్కువగా ప్రవహించి చర్మాన్ని చేరుతుంది. శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గించడానికి చర్మంపైన ఉన్న స్వేదగ్రంథులు చెమటను స్రవిస్తాయి. ఆ చెమట ఆవిరి అయ్యే క్రమంలో శరీరం నుంచి ఉష్ణోగ్రతను తీసుకుంటుంది. అందుకే చర్మంపై చెమట పట్టినప్పుడు ఫ్యాన్ నుంచి గానీ, చెట్ల నుంచి గానీ గాలి సోకితే ఒంటికి హాయిగా అనిపిస్తుంది. అలా శరీరంలో పెరిగిన ఉష్ణోగ్రతను తగ్గించడానికి చెమట తోడ్పడుతుంది. అయితే శారీరక శ్రమ అలాగే కొనసాగి ఈ చెమట పట్టే ప్రక్రియ అదేపనిగా జరుగుతుంటే... మన మేను నీటినీ, దానితో పాటు ఖనిజలవణాలను కోల్పోతుంది.మరీ ఎక్కువ వేడిమికి ఎక్స్‌పోజ్ అయినప్పుడు, మనం తగినన్ని నీళ్లు, ద్రవాహారం తీసుకోనప్పుడు మనకు చెమట అతిగా పట్టి శరీర ఉష్ణోగ్రతను ఒకేలా నిర్వహించే వ్యవస్థ దెబ్బతినవచ్చు. అప్పుడు కండరాలు పట్టేయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాదు... వాతావరణంలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు  చాలాసేపు కూర్చొని ఉండి, అకస్మాత్తుగా నిలబడినా లేదా అదేపనిగా నిలబడి వ్యాయామం చేసినా అకస్మాత్తుగా కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. దీన్నే ‘హీట్ సింకోప్ అండ్ ఎక్సర్‌సైజ్ అసోసియేటెడ్ కొలాప్స్’ అని అంటారు. వాతావరణంలో వేడి పెరుగుతున్న సమయంలో  మీరు వ్యాయామం మానేయాల్సిన అవసరం లేదు. కానీ పైన పేర్కొన్న  అనర్థాలు నివారించడానికి ఈ కింది జాగ్రత్తలు పాటించండి.ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల సమయంలో పగటివేళ ఎండకు ఎక్స్‌పోజ్ కావద్దు. మీరు మీ వ్యాయామాలను వాతావరణం చల్లగా ఉండే వేకువజామున చేయండి  చెమటను పీల్చే కాటన్ దుస్తులను ధరించండి  బాగా నీళ్లు తాగండి. ఒంట్లో ఖనిజ లవణాలు (ఎలక్రొలైట్స్) భర్తీ అయ్యేలా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోండి  మీరు వ్యాయామం చేసే ముందర ఒకసారి వాతావరణం ఎలా ఉందో పరిశీలించండి. మరీ వేడిగా ఉంటే వ్యాయామాన్ని చల్లటి వేళకు వాయిదా వేసుకోండి. ఒకవేళ మీరు వ్యాయామం చేస్తున్న సమయంలో తలనొప్పి, కళ్లుతిరిగినట్లు, వాంతి వచ్చినట్లు  అనిపిస్తే వెంటనే వ్యాయామం ఆపేసి, డాక్టర్‌ను సంప్రదించండి.

 

-డాక్టర్ సుధీంద్ర ఊటూరి

కన్సల్టెంట్, లైఫ్‌స్టైల్ అండ్

రీహ్యాబిలిటేషన్

కిమ్స్ హాస్పిటల్స్

సికింద్రాబాద్


హోమియో కౌన్సెలింగ్

 

నా వయసు 33 ఏళ్లు. నేను ఈమధ్య టీఎస్‌హెచ్ పరీక్ష చేయించుకున్నాను. థైరాయిడ్ ఉందని అన్నారు. గత ఆర్నెల్లుగా నా జుట్టు విపరీతంగా రాలిపోతోంది. ఇది హార్మోన్ లోపం వల్ల వచ్చిందని డాక్టర్లు అంటున్నారు. హోమియోపతిలో చికిత్స అందుబాటులో ఉందా?

 - అనిత, ఖమ్మం
మన తలలో దాదాపు లక్షా ఇరవై వేల నుంచి లక్షా యాభై వేల వెంట్రుకలు ఉంటాయి. ఒక వెంట్రుక ఒక నెలలో దాదాపు ఒక సెంటీమీటరు పెరుగుతుంది. రోజూ 40 నుంచి 50 వెంట్రుకలు రాలుతూనే ఉంటాయి. జుట్టు రాలడం సమస్యకు చాలా కారణాలు ఉన్నాయి. దానిలో హార్మోన్ లోపాలు, థైరాయిడ్ సమస్య, రక్తహీనత, పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోకపోవడం, ఆందోళన, నిద్రలేమి వంటివి దీనికి కొన్ని కారణాలు. కొన్ని రకాల మందులు వాడటం, హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం జట్టు రాలడానికి కారణమయ్యే ఇంకొన్ని అంశాలు. జుట్టు రాలడానికి ఇంకా సూర్యకాంతికి ఎక్స్‌పోజ్ కావడం, మోతాదుకు మించి క్లోరిన్ ఉండే ఈత కొలనుల్లో ఈతకొట్టడం వంటివీ కారణమవుతాయి. జుట్టుకు రంగు వేసుకునే విషయంలోనూ సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. కొందరికి ఈ హెయిర్ డైలు సరిపడవు. వాటి నుంచి అలర్జీ వస్తుంది. అందుకే వాటి ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి. డాండ్రఫ్ (చుండ్రు), ఎగ్జిమా, అలొపేషియా సమస్యలూ కారణమవుతాయి. జుట్టు సమస్యలు తీరాలంటే ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ ఒంటిని సరైన గాడిలో పెట్టాలి. శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక వికాసం కూడా పెంపొందించుకోవాలి.జుట్టు రాలడాన్ని అరికట్టడానికి హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. ఇందులో కేవలం జుట్టు రాలడం అనే అంశాన్నే కాకుండా దీనికి కారణాలైన థైరాయిడ్, రక్తహీనత, హార్మోన్ సమతౌల్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. ఆర్నికా, జబొరాండి, వింకమైనర్‌తో తయారు చేసిన నూనెలు, మంచి షాంపూలు హోమియోలో అందుబాటులో ఉన్నాయి. హోమియో ఔషధాలైన యాసిడ్ ఫ్లోర్, నేట్రమ్‌మూర్, ఫాస్ఫరస్, వింకామైనర్, ఆలోస్ లాంటి మందులు వాడితే సమస్య తగ్గుతుంది. అయితే ఆ మందులను నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో వాడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

 

-డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి

ఎండీ (హోమియో)

స్టార్ హోమియోపతి

హైదరాబాద్


 

పల్మనాలజీ కౌన్సెలింగ్

 


మా నాన్నను వెంటిలేటర్ మీద పెట్టారు. వెంటిలేటర్ మీద పెట్టినవాళ్లు ఇక బతకరనీ బంధువులు అంటున్నారు. మాకు చాలా ఆందోళనగా ఉంది. తగిన సలహా ఇవ్వండి.

 - వీరభద్రరావు, చిట్యాల
వెంటిలేటర్ మీద పెట్టిన పేషెంట్ ఇక బతకరనేది చాలామందిలో ఉండే అపోహ. అయితే జబ్బు తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, చాలా సందర్భాల్లో రోగి పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉన్నప్పుడు చివరి ప్రయత్నంగా వెంటిలేటర్ మీద పెడతారు. దాంతో సాధారణ ప్రజల్లో ఈ దురభిప్రాయం ఏర్పడింది. కానీ ఇప్పుడున్న  వైద్య పరిజ్ఞానం వల్ల అనేక వ్యాధులకు చాలా ఆధునిక చికిత్సలు అందుతున్నందున వెంటిలేటర్ మీద పెట్టినవాళ్లూ బతికేందుకూ, మళ్లీ నార్మల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ.వెంటిలేటర్ అనేది కృత్రికంగా శ్వాస అందించే యంత్రం. దీన్ని పెట్టడానికి ముందుగా శ్వాసనాళంలోకి ఒక గొట్టం వేసి, దాన్ని కృత్రిమ శ్వాస అందించే వెంటిలేటర్‌తో అనుసంధానం చేస్తారు. రక్తంలో ఆక్సిజన్ తక్కువగా ఉండటం, కార్బన్ డై ఆక్సైడ్ పెరుగుతున్నా, రోగికి ఆయాసం పెరుగుతున్నా, ఊపిరితీసుకోవడానికి అవసరమైన కండరాలు పనిచేయకపోయినా వెంటిలేటర్ అమర్చుతారు. సాధారణంగా నిమోనియా, సీవోపీడీ వంటి వ్యాధులకూ, రక్తానికి ఇన్ఫెక్షన్ పాకే సెప్సిస్ వంటి కండిషన్‌లలో వెంటిలేటర్ పెడుతుంటారు. ఒకసారి వెంటిలేటర్ పెట్టిన తర్వాత... పరిస్థితి మెరగయ్యే వరకూ వెంటిలేటర్ తీయడం కష్టం కావచ్చు.సాధారణంగా ఐదు కంటే ఎక్కువ రోజులు వెంటిలేటర్ పెట్టడం అవసరమైతే ట్రకియాస్టమీ చేస్తారు. దీనివల్ల స్వరపేటికకు నష్టం వాటిల్లదు. వెంటిలేటర్‌ను త్వరగా తొలగించే అవకాశాలు పెరుగుతాయి. దీనివల్ల అవసరమనుకుంటే ఎలాంటి ప్రమాదమూ లేకుండా వెంటిలేటర్ మళ్లీ పెట్టేందుకు ఆస్కారం ఉంటుంది. ఇటీవల మన వద్ద కూడా పాశ్చాత్య దేశాల్లో ఉన్నంత వైద్యపరిజ్ఞానం, ఉపకరణాలు అందుబాటులోకి ఉన్నాయి. అయితే వైద్యపరమైన అంశాలలో మన దగ్గర తగినంత అవగాహన లేకపోవడం వల్ల అపోహలు రాజ్యమేలుతున్నాయి. మీరు ఏదైనా సందేహం కలిగినప్పుడు నేరుగా మీకు చికిత్స అందిస్తున్న డాక్టర్లను సంప్రదించండి. అంతేగానీ ఎలాంటి అపోహలను నమ్మకండి.

 

-డాక్టర్ ఎస్.ఎ. రఫీ

కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్

కేర్ హాస్పిటల్స్

బంజారాహిల్స్

హైదరాబాద్

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top