మా ఇంటి భాగ్యలక్ష్మి | Sakshi
Sakshi News home page

మా ఇంటి భాగ్యలక్ష్మి

Published Wed, Mar 13 2019 12:27 AM

The encouragement that my husband gave me was my success - Sakshi

కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ అదేక్రమంలో ఆశయాలను సాధించి అటు పుట్టినింటికి, ఇటు మెట్టినింటికీ కూడా మంచి పేరు తీసుకు వచ్చిందామె. పదవ తరగతి పూర్తవగానే పెద్దలు ఆమెను ఓ అయ్య చేతిలో పెట్టి బాధ్యత తీర్చుకున్నారు. అయితే ఉన్నత చదువులు చదివి మంచిఉద్యోగం చేయాలని చిన్ననాటినుంచి కన్నకలను నెరవేర్చుకుందామె. అందుకు కట్టుకున్న వాడిచ్చిన ప్రోత్సాహం ప్రాణం పోసింది. ఈ చదువులమ్మ ప్రస్థానం ఎందరికో ఆదర్శం.పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మిని అదే జిల్లా నిడదవోలు మండలం, తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన బండారు సోమశేఖర్‌కు ఇచ్చి పెళ్లి చేశారు ఆమె తల్లిదండ్రులు. సోమశేఖర్‌ ఉదయం ఏడుగంటలకే పనికి వెళ్లి, రోజంతా కష్టపడి నాలుగు రాళ్లు సంపాదించి రాత్రికి ఇల్లు చేరే రోజుకూలి. పెళ్లప్పటికి భాగ్యలక్ష్మి 10వ తరగతి మాత్రమే పూర్తి చేసింది.

బాగా చదువుకోవాలన్న తన కోరిక నెరవేరక పోవడంతో అత్తవారింట అడుగుపెట్టిన భాగ్యలక్ష్మి మొదట్లో చాలా ముభావంగా ఉండేది. భర్త తనను అర్థం చేసుకోగలవాడని తెలుసుకుని కొన్నాళ్లకు ధైర్యం చేసి తనకు ఇంకా చదువుకోవాలని ఉందని చెప్పింది. అతనికి కూడా ఆమెను చదివించాలని అనిపించింది. అయితే కుటుంబ ఆర్ధికపరిస్థితుల దృష్ట్యా వెంటనే అందుకు పూనుకోలేకపోయాడు. అలా ఎనిమిదేళ్లు గడిచిపోయాయి. ఓ కొడుకు పుట్టాడు. అప్పటికే బంధువుల్లో కొందరు చదువుకుని ఉన్నత స్థానాల్లోకి వెళుతుండడంతో సోమశేఖర్‌కు ఎలాగైనా భార్య కోరిక నెరవేర్చాలనిపించింది.  దాంతో 2008లో భాగ్యలక్ష్మి చదువుకు పచ్చజెండా ఊపాడు.

ఆ మాత్రం ఆసరా ఉంటే చాలనుకుంది భాగ్యలక్ష్మి. ఆంధ్రవిశ్వవిద్యాలయం నుంచి దూరవిద్య ద్వారా డిగ్రీ చదవడానికి ప్రవేశ పరీక్ష రాశారు.తొమ్మిదేళ్ల తర్వాత రాసిన తొలిపరీక్షలో విజయం సాధించిన భాగ్యలక్ష్మి ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. డిగ్రీ చదవడానికి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో తరగతులకు హాజరవుతూ డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత అదే ఆంధ్రా యూనివర్శిటీ నుంచి ఎం.ఎ. తెలుగులో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చదివారు. టీచర్‌ అవాలనే లక్ష్యంతో బీఈడీ కూడా చేశారు. అది పూర్తయిన తర్వాత నేషనల్‌ ఎటిజిబిలిటీ టెస్ట్‌ (నెట్‌), స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(సెట్‌) పరీక్షల్లో అర్హత సాధించారు. 2014లో తొలిసారి డీఎస్సీ రాశారు. ఆ ప్రయత్నంలో విఫలమయినా, నిరుత్సాహపడలేదు. 2018లో  వెలువడిన డిఎస్సీ ప్రకటన ఆమెలో ఊపిరి పోసింది. రేయింబవళ్లు కష్టించి, పరీక్ష రాశారు. దీంతో తూ.గో., ప.గో., కృష్ణా జిల్లాల (జోన్‌–2) పరిధిలో గురుకుల పాఠశాల్లో ఉన్న ఒకే ఒక్క గ్రాడ్యుయేట్‌ తెలుగు టీచర్‌ పోస్టు భాగ్యలక్ష్మిని వరించింది.
బోణం గణేష్, సాక్షి ప్రతినిధి
ఫొటోలు: గాడి శేఖర్‌బాబు, నిడదవోలు

ఆశయం తనది... ఫలాలు అందరివి
‘‘నేను పెద్దగా చదువుకోలేదు. తనకు చదువంటే చాలా ఇష్టం. మావేమో రెక్కాడితేగాని డొక్కాడని బతుకులు. చదువంటే ఫీజులు, పుస్తకాలని ఖర్చు. అందుకే చాలా కాలం ధైర్యం చేయలేకపోయాను. అయినా తన ఆశయాన్ని బతికించాలనుకున్నాను. తను కూడా ఎంతో కష్టపడింది. సగటు భార్యలకుండే ఎలాంటి కోరికలు ఆమెకు లేవు. సరదాలు, షికార్లు తెలియవు. అన్నిటినీ దూరంపెట్టి చదువుపైనే ధ్యాస ఉంచి ఈ రోజు ఈ విజయాన్ని తను సాధించి, ఫలితాన్ని మాకు అందించింది.’
బండారు సోమశేఖర్‌

ఇది అందరి విజయం
‘‘పదవ తరగతి తర్వాత పెళ్లై పోతే జీవితం చాలా గందరగోళంగా కనిపించింది. కానీ అర్థం చేసుకుని ప్రోత్సహించే భర్త దొరకడంతో నా జీవితమే మారిపోయింది. ఆర్థికఇబ్బందులు చాలాసార్లు మా మానసిక స్థైర్యాన్ని పరీక్షించాయి. కానీ వాటితో పోరాడుతూనే ముందుకు వెళ్లాం. నా భర్త కూలిడబ్బులతో పాటు నేను ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తూ కుటుంబ అవసరాలకు, చదువుకు ఖర్చుచేశాం. నాతోపాటే మా అబ్చాయి సాయిని నా ఆలోచనలకు తగ్గట్టుగానే చదివించుకుంటున్నాను. నా ఈ విజయంలో ఎంతోమంది  చేయూత ఉంది. ముఖ్యంగా మేం అద్దెకున్న ఇంటియజమాని కొమ్మిన కృష్ణవేణి, నా భర్త మేనమామ కీర్తి ఆంజనేయులు, మా మేనమామ శ్రీమంతుల రామాంజనేయులు కష్టకాలంలో చేయూతనిచ్చారు. స్నేహితులు, బంధువులు, మా ఊరివాళ్లు ఇచ్చిన ప్రోత్సాహం కూడా నా విజయానికి తోడయ్యింది.        
సలాది భాగ్యలక్ష్మి

Advertisement
Advertisement