జనారణ్యంలో కారుణ్యమూర్తి

Doctor Shirani Special Story - Sakshi

ఆమె జైనమతాన్ని అవలంబించలేదు. జైనం ఏం చెప్పిందో విననూ లేదు. అయినా... జైన బోధనల్లోని అహింసను నమ్మింది. జీవకారుణ్యతనే జీవితంగా మలుచుకుంది. సాటి జీవికి హాని కలిగించని సమాజాన్ని కోరుకుంది. మూగజీవికి బతుకునిచ్చే సమాజస్థాపన కోసం శ్రమిస్తోంది. నోరు లేని జీవులకు అమ్మయింది. వాటి గొంతుక తానే అయింది.

మనుషులకు ఉన్నట్లే జంతువులకు కూడా హక్కులుంటాయి. ఆ హక్కుల పరిరక్షణ జరగాలి. ప్రకృతి మనిషికి ఇచ్చినట్లే జంతువులకు కూడా జీవించే హక్కునిచ్చింది. మనుషులతో పని లేకుండా వాటి జీవిక ఏదో అవి జీవించేస్తుంటాయి. అయితే ఆ మూగజీవాల హక్కులకు తరచూ భంగం జరుగుతూ ఉంటుంది. తమ హక్కులను కాపాడుకోవడంలో ఏ మాత్రం రాజీ పడని మనిషి... జంతువుల హక్కును కాలరాయడానికి మాత్రం అత్యుత్సాహం చూపిస్తుంటాడు. జంతువులు తమకు హక్కులున్నాయని నోరు తెరిచి చెప్పలేవు. ఆ నోరు లేని మూగ జీవాలు... తమకు చేతనైన సైగలు, సంకేతాలతో తెలియచేసినా సరే... నోరున్న మనుషులు వాటి మనసును గ్రహించలేరు. గ్రహించలేరు... అనడానికంటే గ్రహించాలనుకోరు అనడమే కరెక్ట్‌. మనిషి తన సౌకర్యాల కోసం జంతువుల జీవించే హక్కును కాలరాయడం మీద కొరడా ఝళిపించి, వాటి హక్కులను పరిరక్షించడానికి పూనుకున్నారు డాక్టర్‌ షిరానీ పెరైరా.

వెయ్యి ప్రాణుల తల్లి
చెన్నై, రెడ్‌ హిల్స్‌లోని షిరాని ఇంటికి వెళ్తే... ముప్పైకి పైగా పెట్‌ డాగ్స్‌ ఆమె చుట్టూ తిరుగుతుంటాయి. అవన్నీ ఎవరో కొంతకాలం పెంచుకుని ఆ తర్వాత రోడ్డు మీద వదిలేసినవే. ఆమె సంరక్షణలో అలాంటి కుక్కలు, పిల్లులు, ఆవులు, ఎడ్లు, గుర్రాలు, కోతులు, పక్షులతోపాటు అనేక రకాల జంతువులు, స్తబ్దుగా పడుకుని ఉండే ఎలుకలు... మొత్తం వెయ్యికి పైగా ఉన్నాయి. ‘‘నాకు పిల్లలు లేరు. అలాగని నన్ను తల్లి కాదంటే ఒప్పుకోను. వెయ్యికి పైగా అందమైన ప్రాణులకు తల్లిని. రోజూ సాయంత్రం హోమ్‌కి వెళ్లి పలకరిస్తాను. చేత్తో తాకినప్పుడు అవి ఉత్సాహంగా ఉరకలు వేస్తాయి. తల్లికి అంతకంటే గొప్ప సంతోషం ఏముంటుంది?’’ అంటారు షిరాని.

ప్రయోగాల కోసం పుట్టలేదు
అక్వాటిక్‌ బయాలజీలో పీహెచ్‌డీ చేసిన 55 ఏళ్ల షిరానీ ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ (ఐసిఎఆర్‌) లో సైంటిస్టుగా 20 ఏళ్ల పాటు ఉద్యోగం చేశారు. ఆ తర్వాత రిటైర్‌మెంట్‌ తీసుకుని పూర్తి సమయాన్ని యానిమల్‌ వెల్ఫేర్‌ కోసం కేటాయించారు. గాయపడిన జంతువులకు ఆశ్రయం ఇవ్వడంతో సరిపెట్టుకోవడం లేదామె. జంతువుల హక్కుల కోసం పోరాడుతున్నారు. జంతువులు పుట్టేది లాబొరేటరీల్లో ప్రయోగాల కోసం కాదు, అందమైన జీవితాన్ని ఆస్వాదిస్తూ జీవించడానికేనంటారామె. ‘‘జంతుప్రేమికుల ఇంట్లో పుట్టడం నా అదృష్టం. పదిహేడు పిల్లుల మధ్య పెరిగాను. మా అన్నయ్య... బయట ఎక్కడైనా గాయపడిన పిల్లి కనిపిస్తే చాలు, ఇంటికి తీసుకువచ్చేవాడు. నేను దాని బాగోగులు చూసేదాన్ని. ఒక కప్పు కింద నివసిస్తున్న ప్రాణులన్నీ కలిస్తేనే కుటుంబం. తమ కోసం తాము మాట్లాడలేని నా స్నేహితుల కోసం నేను మాట్లాడుతున్నాను. యానిమల్‌ టెస్టింగ్‌ని పూర్తిగా నిర్మూలించాలి, అన్ని రంగాల్లోనూ టెస్టింగ్‌కు ప్రత్యామ్నాయమార్గాలను పెంపొందించుకోవాలి’’ అన్నారు షిరాని.

సౌందర్యం చాటు అనైతికం
డాక్టర్‌ షిరానీ పెరైరా సైంటిస్టు, యానిమల్‌ యాక్టివిస్టు మాత్రమే కాదు, సిపిసిఎస్‌ఈఏ (కమిటీ ఫర్‌ ద పర్పస్‌ ఆఫ్‌ కంట్రోల్‌ అండ్‌ సూపర్‌విజన్‌ ఆఫ్‌ ఎక్స్‌పెరిమెంట్స్‌ ఆన్‌ యానిమల్స్‌) మెంబరు కూడా. సిపిసిఎస్‌ఈఏ భారత ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తున్న చట్టబద్ధమైన సంస్థ. పరిశోధనల కోసం జంతువుల మీద విచక్షణ రహితంగా మందులను ప్రయోగించడానికి వ్యతిరేకంగా పోరాడుతుందీ కమిటీ. ఆమె 2007లో చేపట్టిన ఉద్యమ ఫలితంగా డిసెక్షన్‌ కోసం జంతువులను ఉపయోగించడాన్ని ప్రభుత్వం 2012లో నిషేధించింది. ఆ తర్వాత రెండేళ్లకు భారత ప్రభుత్వం జంతువుల మీద కాస్మటిక్స్‌ ప్రయోగాన్ని కూడా నిషేధించింది. ‘మనుషులు... తాము అందంగా కనిపించడానికి మేకప్‌ చేసుకుంటారు. అందుకోసం వివిధ రకాల సౌందర్య సాధనాలను వాడతారు. రకరకాల రసాయనాల సమ్మేళనమైన సౌందర్యసాధనాలు మనిషి చర్మం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయో అనే కోణంలో పరిశోధనలు జరుగుతాయి. ఆ పరిశోధనలకు బలయ్యేది కూడా జంతువులే. కాస్మటిక్‌ ప్రోడక్ట్‌ మార్కెట్‌లోకి రావడానికి ముందు ఆ ప్రోడక్ట్‌ను అనేక దశల్లో జంతువుల మీద ఉపయోగిస్తారు. మనం చర్మం పాడవకుండా ఉండడానికి మూగ జీవాల చర్మం మీద ప్రయోగాలు చేయడం అనైతికమని గళాన్ని వినిపించారు డాక్టర్‌ షిరానీ పెరైరా. ఔషథాల తయారీ పరిశ్రమలు, వ్యవసాయ ఎరువులు– పురుగుమందుల తయారీ కంపెనీలు కూడా లాబొరేటరీల్లో జంతువుల ప్రాణాలను ఫణంగా పెట్టి పరిశోధనలు చేస్తుంటాయి. ఆఖరుకి నొప్పిని తగ్గించే చిన్న మాత్ర కూడా ముందు జంతువుల మీదనే దాడి చేసి తీరుతుంది.

మూగరోదన
లాబొరేటరీల్లో మూగజీవుల మీద ప్రయోగాలు నిర్వహించిన తర్వాత అవి తిరిగి ఆరోగ్యవంతం కావడానికి తీసుకోవాల్సిన చర్యల మీద చాలా పరిశ్రమలు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదంటారు షిరాని. ‘‘ప్రయోగానికి ముందు మత్తు ఇస్తారు. ప్రయోగం తర్వాత వాటిని అలాగే వదిలేస్తుంటారు. మత్తు వదిలే కొద్దీ ఆ ప్రాణులకు నొప్పి తెలుస్తుంటుంది. రకరకాల మందుల ప్రభావం వల్ల అవి హృదయవిదారకంగా మూలుగుతుంటాయి. మూగప్రాణుల రోదన మనసుని పిండేస్తుంది’’ అని ఆవేదన చెందారామె. కుక్కల వంటి ఒక మోస్తరు పెద్ద ప్రాణుల మీద అనేక దఫాలుగా ప్రయోగాలు చేస్తారు. కాలేయం, ఊపిరితిత్తులతోపాటు ఇతర దేహభాగాలు నిర్వీర్యమై పోయి చివరికి అవి జీవచ్ఛవాలుగా మారుతుంటాయి. ఒంటికి ఎండ తగిలినా భరించలేనంతగా బలహీనపడిపోతాయి. మనదేశంలో సరాసరిన ఏడాదికి ఐదు నుంచి ఏడు వేల శునకాలు ప్రయోగాల బారిన పడి అనారోగ్యం పాలై, ప్రాణాలు కోల్పోతున్నాయన్నారామె.  అమెరికా, యూరప్‌ దేశాల్లో నిబంధనలు కఠినంగా ఉండడంతో అనేక బహుళ జాతి కంపెనీలు యానిమల్‌ టెస్టింగ్‌కి మనదేశాన్ని వాడుకుంటున్నాయి. యానిమల్‌ టెస్టింగ్‌లో ప్రధానంగా ‘రిఫైన్‌మెంట్, రిడక్షన్, రీప్లేస్‌మెంట్‌’ అనే మూడు ఆర్‌లకే పరిమితమవుతుంటారు. యానిమల్‌ టెస్టింగ్‌లో అతిముఖ్యమైనది రీ హాబిలిటేషన్‌ను మర్చిపోతున్నారని చెప్పారామె. అందుకే అలాంటి ప్రాణులను కాపాడే బాధ్యత చేపట్టినట్లు కూడా చెప్పారు డాక్టర్‌ షిరాని.

మహావీర్‌ అవార్డు అందుకుంటున్న డాక్టర్‌ షిరాని
అహింసకు అవార్డు
డాక్టర్‌ షిరాని గత ఏడాది భగవాన్‌ మహావీర్‌ ఫౌండేషన్‌ నుంచి ‘మహావీర్‌ అవార్డు’ అందుకున్నారు. ఇది అహింసాయుతమైన సమాజ స్థాపన, శాకాహార సాధన కోసం కృషి చేసేవారికి ఇచ్చే పురస్కారం. పాతికేళ్లకు పైగా చేసిన నిస్వార్థ సేవకు ఆమె అందుకున్న గౌరవం ఇది. డెబ్బయ్‌ ఏళ్లకు పైగా వాడుకలో ఉన్న విద్యుదాఘాతంలో అత్యంత కిరాతకంగా జంతువులను సంహరించే పద్ధతికి అడ్డుకట్ట వేశారామె. ప్రయోగశాలల్లో పరిశోధనలకు మూగజీవాలకు బదులుగా ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రవేశ పెట్టారు. గుర్రాలు, శునకాల వంటి జంతువుల మీద ప్రయోగాలు నిర్వహించేటప్పుడు పాటించాల్సిన నియమావళిని ప్రతిపాదించారామె. ఆమె సూచించిన నియమావళి ఆధారంగా ప్రభుత్వం జాతీయస్థాయిలో గైడ్‌లైన్స్‌ రూపొందించింది. జంతువుల పరిరక్షణ కోసం ఇలాంటి నిబంధనల రూపకల్పన చేసిన తొలిదేశం మనదే. జంతువుల అక్రమ రవాణా మీద సహేతుకమైన వివరాలతో ఆధారాలతో అంతర్జాతీయ వేదికల మీద ప్రసంగించారు. సర్కస్‌ కంపెనీల్లో ప్రాణాంతకమైన విన్యాసాలకు బలవుతున్న దాదాపు తొంభై జంతువులను రక్షించారు షిరాని. తమిళనాడులోని సఖి మండల్‌ సహోద్యోగ్‌ సంస్థ 2016లో మహిళా దినోత్సవం నాడు అత్యంత శక్తివంతమైన, స్ఫూర్తిదాయకమైన మహిళలను సత్కరించింది. ఆ సందర్భంగా గవర్నర్‌ రోశయ్య చేతుల మీదుగా ‘వాయిస్‌ ఫర్‌ ద వాయిస్‌లెస్‌ అవార్డు’ అందుకున్నారు షిరాని.

నిశ్శబ్దమైన శబ్దం
తమ మీద జరుగుతున్న అకృత్యాల మీద తిరగబడాలని మనుషులకే కాదు మూగ ప్రాణులకు కూడా ఉంటుంది, అయితే తమ ఆక్రోశాన్ని గళమెత్తి చెప్పలేవు. అందుకే ‘సౌండ్‌ ఆఫ్‌ సైలెన్స్‌’ ప్రచారాన్ని చేపట్టారు షిరాని. ఆమె చేపట్టిన నిశ్శబ్ద విప్లవం మూగ ప్రాణుల సంరక్షణ కోసం ప్రభుత్వం చట్టాలు చేసేటంతటి పెద్ద శబ్దాన్నే చేసింది. లక్ష సంతకాలు సేకరించి ఆరోగ్య పరిశోధన మంత్రిత్వ శాఖ, ఇండియన్‌ మెడికల్‌ రీసెర్చ్‌ కౌన్సిల్, డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌కు ప్రతిపాదన అందచేశారు షిరాని. మూగప్రాణులకు జన్మతః సంక్రమించిన జీవించే హక్కును కాలరాసే హక్కు ఎవరికీ లేదని నినదించారామె. మాంసం కోసం గేదెలు, ఆవులు, పిల్లులను వధించే దురాచారాన్ని కూడా అడ్డుకున్నారు. ఒంట్లో శక్తి ఉన్నంత కాలం రేస్‌ కోర్సులో పరుగెత్తి పరుగెత్తి... తమ మీద పందెం కాసిన పందెం రాయుళ్లను గెలిపించడానికే అంకితమైన గుర్రాల బాధలు వేరుగా ఉంటాయి. శక్తి ఉడిగిన తరవాత వాటికి ఆహారం పెట్టడమూ వృథానే అన్నట్లు వ్యవహరిస్తారు వాటి నిర్వహకులు. ఒకవేళ గాయపడినట్లయితే ఆ గుర్రాలను ఎంత త్వరగా వదిలించుకుంటే ఆ మేరకు ఖర్చు తగ్గుతుందని కూడా భావిస్తారు. అలాంటి గుర్రాలు కూడా షిరాని ఆశ్రయంలో సేదదీరుతున్నాయిప్పుడు. మూగజీవి గాయపడి నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు సమాచారం అందుకున్న వెంటనే షెల్టర్‌ హోమ్‌ అంబులెన్స్‌ వచ్చి ఆ ప్రాణిని హోమ్‌కు చేరుస్తుంది.

రిటైర్‌మెంట్‌ హోమ్‌
జంతువుల సంరక్షణ కోసం నడుపుతున్న హోమ్‌ని షెల్టర్‌ హోమ్‌ అంటే ఒప్పుకోరు డాక్టర్‌ షిరాని. ‘ఈ ప్రాణులు పని చేయగలిగినంత కాలం పని చేసి, విశ్రాంత జీవనాన్ని ఈ హోమ్‌లో గడుపుతున్నా’యన్నారు. పని చేయలేని గుర్రాలను పోలీసులు తుపాకీతో కాల్చి చంపేసేవాళ్లు. 2009 వరకు ఇదే కొనసాగింది. ఇప్పుడు రిటైర్‌ అయిన గుర్రాలు షిరాని రిటైర్‌మెంట్‌ హోమ్‌లో అంత్యకాలాన్ని ప్రశాంతంగా గడపగలుగుతున్నాయి. చెన్నై నగరంలో 1932 నుంచి 1995 వరకు ఏటా ఇరవై వేల శునకాలను బేసిన్‌ బ్రిడ్జి లేథాల్‌ చాంబర్‌లో కరెంట్‌ షాక్‌తో అత్యంత కిరాతకంగా చంపేసేవాళ్లు. మూగజీవాలకు ప్రేమను పంచుతూ, శ్రద్ధగా చూసుకోవాల్సిన సమయంలో వాటి ప్రాణాలు తీయడం ఏమిటని ప్రశ్నించారు షిరాని. ఆమె పోరాట ఫలితంగా ఎలక్ట్రిక్‌ షాక్‌తో ప్రాణాలు తీయడం వంటి మొరటు పద్ధతులను 1995లో నిషేధించింది ప్రభుత్వం. ఇది ఆమె తొలి విజయం, పాతికేళ్లకు పైగా కొనసాగుతున్న తన సర్వీస్‌లో ఇప్పటి వరకు లక్షల ప్రాణాలను కాపాడారు షిరాని. మాజీ కేంద్రమంత్రి మనేకా గాంధీ 1994లో పీపుల్‌ ఫర్‌ యానిమల్‌ సంస్థను స్థాపించారు. చెన్నై విభాగాన్ని నడిపించే బాధ్యతను షిరాని చేపట్టారు. ఆ వివరాలను చెబుతూ ‘‘పీపుల్‌ ఫర్‌ యానిమల్‌ స్థాపనతో నా ఆలోచనలకు ఒక రూపం వచ్చినట్లయింది. మనేకా గాంధీ ప్రోత్సాహం, ఆర్థిక సహకారం అందించడం వల్లనే ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇన్నేళ్లపాటు కొనసాగించగలిగాను’’ అన్నారు డాక్టర్‌ షిరాని పెరైరా.– వాకా మంజులారెడ్డి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top