భలే మామయ్య

Dhanikonda Hanumantha Rao Special Story Bhale Mavayya - Sakshi

కథాసారం

అనుకున్న పని వొక్కటీ కాలేదు. కాని యీ ఊరుకాని ఊళ్లో కాలక్షేపం ఎలా? ఇంత పెద్ద పట్టణంలో యెవరో ఒక స్నేహితుడు ఉండిఉండొచ్చు; కాని ఎక్కడ ఉంటున్నాడో తెలియదు.

సామాను హోటల్లో పడేశాను. ఊరు కొత్తదైనా– పట్టణమైనా ఇంతకన్నా గొప్ప పట్టణాల్నే చూసిన నాకు దీని ప్రత్యేకత యేమీ కనిపించలేదు. తిరిగిన బజారే తిరుగుతూ గడిపాను. కొంతసేపు రైల్వేస్టేషనులో కూర్చున్నాను. వొచ్చే జనమూ, పొయ్యే జనమూ ఆకర్షించలేదు: కొత్తదనమేది కనిపించకపోతే– కనిపించలేదే అనే మరో కొత్త బాధ. కనిపించాక దాన్ని భరించగలమో లేమో అది వేరే విషయం!
సినిమా మంచిది కాదని తెలుసు. అంతకన్నా గత్యంతరం లేదు. వెళ్లి కొత్తగా తలకాయ నెప్పిని  తెచ్చుకోవటమా, మానటమా అనే సమస్య తెగక, హాలు దగ్గరే తారాట్లాడసాగాను.

‘‘ఎప్పుడూ రావటం?’’ ఎంతో పరిచయాన్ని సూచించే కంఠస్వరం వెనుక నుంచి వినవొచ్చింది. మనిషిని ముసలివాడుగానే చెప్పవొచ్చు. ముఖకళలో ఎంతో ఆత్రుత, మాధుర్యం, తను పోగొట్టుకుని ఇక దొరకదని నిరాశ చేసుకున్న విలువైన వస్తువేదో హఠాత్తుగా కనిపించినప్పుడు కలిగే ఆనందం లాంటిదాన్ని నేను గుర్తించాను. బహుశా నేనెవర్నో తెలిసి ఉండితీరాలి. నాకు మాత్రం ముఖం ఎక్కడా చూసిన జ్ఞాపకం రావటం లేదు. నా చిన్నతనంలో నన్ను యెరిగివుంటాడు. మా కుటుంబంతో పరిచయం వుండివుండొచ్చు. నిజానికి మా బంధువు లందర్నీ నేను యెరుగను. కనుక ఆ అనుభవంతోటే సంభాషణను నడపగలిగే చాకచక్యం నాకు వున్నదని వేరే చెప్పాలా?

అన్నాను: ‘‘వుదయానే వొచ్చాను.’’ ‘‘ఇంటికన్నా రాలేదే?’’
ఈయన యెవరో నిర్ధారణగానన్నా తెలియదు. ఈయన ఇంటి సంగతి నాకెలా తెలుస్తుంది?

‘‘ఏం లేదు... వేరే పనివుండి...’’ అని నీళ్లు నమిలాను. ‘‘మనసులో వుండాలి కాని, పనులు అడ్డం వొస్తయ్యా?... రా పోదాం.’’
నేనేమీ మాట్లాడకుండా ఆయన వెనకాలే నడవసాగాను. యీయన యెవరో తెలుసుకోవటం యెట్లాగా?
‘‘అందరూ కులాసా?’’ అన్నాడు.
‘‘ఆ’’ అన్నాను. ఆ ‘అందరూ’ అనే పదంలో యెందరు వున్నారో కూడా ఊహించకుండానే.
సందుల్లోంచి తీసుకు వెళ్తున్నాడు– ఆ పెద్దమనిషి ముఖం చూస్తే అపకారాన్ని చేసే చిహ్నాలు కనిపించటం లేదు.

‘‘రండి’’ అన్నాడు ఇంట్లోకి జొరబడుతూ.
మధ్య తరగతి ఇల్లు. శుభ్రంగా వుంది. నన్ను సావిట్లో కుర్చీలో కూర్చోబెట్టి లోపలికి వెళ్లాడు. ఐదు నిమిషాల తర్వాత పదేళ్ల పిల్ల కాఫీ పట్టుకొచ్చింది. అందిస్తూ నా మొహంలోకి తేరిపార చూచింది– నేను అవునా కాదా అన్నట్టు. వెళ్తూ వెళ్తూ ‘బావగారే’ అనుకుంది తనలో– నాకు వినిపించేటంత మెల్లిగా!

ముసలాయన వొచ్చాడు. గది గుమ్మంలోంచి రెండు స్త్రీ మొహాలు రహస్యంగా తొంగిచూస్తున్నవి. ఒక ముసలామె, యీ ముసలాడికి భార్య అయివుండొచ్చు; ఆమె వెనుకాల పద్దెనిమిదేళ్ల నవజవ్వని. వీళ్లెవరిగోలా నాకు పట్టలేదు. ఆ యువతి! నన్నా విధంగా చూసినందుకే నా గొప్పతనమంతా ఇప్పుడే బైటపడ్డట్టు ఉప్పొంగిపొయ్యాను.
‘‘ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్నాము. ఇలాటి శుభ గడియలు జీవితంలో ఉండవేమోననే నిరాశ కూడా ఒకప్పుడు కలగకపోలేదు...’’ అని ముసలాడు నా మొహంలోకి చూశాడు. నన్ను ఉద్దేశించిన మాటలే అయినా, నాకు అర్థం కానందువల్ల పరధ్యానంలో వున్నట్టు తల వొంచేశాను.
‘‘పిల్లా తల్లీ కూడా ఏకధారగా ఏడ్చారనుకో. ఏమనుకొని ఏం లాభం? ఎవరి తప్పని కూడా విచారించటం అనవసర మనిపించింది. తప్పు యెవరిదైనా దాని ఫలితం దానికి ఇచ్చుకున్న జరిమానా ఒక పండంటి కాపురం.’’

ఎలా అర్థం చేసుకునేది యీ మాటల్ని?
ముసలాడు మళ్లీ సాగించాడు: ‘‘నిజానికి వెధవ గొలుసు... ఏం అది లేకపోతే? సంసారానికి అది అడ్డమా? యీమాత్రం ఆలోచన వుంటే అది నీతో పోట్లాడుతుందీ? పోనీ నువ్వు మాత్రం– ఏదో సరదా పడి అడిగింది కదా అని ముచ్చట తీర్చకూడదూ? మరీ తిండికీ గుడ్డకూ మొహం వాచినవాళ్లు కాదుగా? సంవత్సరం నుంచీ యెడమొగం పెడమొగం!’’
ముసలాడి లెక్చర్‌ పూర్తయి, మంచినీళ్ల కోసం ఆజ్ఞాపించాడు.

ఇప్పుడు కాస్త తలకెక్కింది. ఈయన అల్లుడు ఈయన అమ్మాయితో పోట్లాడటం వల్ల సంవత్సరం నుంచీ పుట్టింట్లోనే ఉండిపోయింది. యీ పోట్లాటకు కారణం గొలుసు చేయించమని ఆమె అడగటం, అల్లుడు కాదనటమూను. పోతే ఆ అల్లుడు నాలాగే ఉంటాడు కాబోలు. కనుక, వెంటనే ఆయన పొరపాటును చెప్పి ఇక్కణ్నుంచి తప్పుకోవటం అత్యుత్తమం.
మంచినీళ్ల గ్లాసుతో ఆ యువతి ప్రవేశించింది. నేను అక్కడే ఉన్నట్లు ఇప్పుడే చూసినట్టు నా ముఖంలోకి చూసి, ఎంతో సిగ్గుపడి ఆ గ్లాసుతో ముందుకు పోవటమా లేక వెనక్కు తగ్గటమా అని ఆలోచిస్తూన్నట్టు తోచింది.

‘‘సిగ్గేమిటే? మీ ఆయనేనే!’’ అన్నాడు ముసలాడు.
ముసిముసి నవ్వుల్తో ముసలాడికి గ్లాసు అందించింది. ఇలాంటి అపురూపవతిని ఏ కఠిన హృదయుడు కష్టాలపాలు చేసివుంటాడు? యీ క్షణంలో ‘‘నేను మీరు అనుకునే వ్యక్తిని కాను’’ అని చెపితే యీమె కొయ్యబారవొచ్చు. ఇంతమందీ నన్ను ఇంటి అల్లుడుగానే నమ్మారు. ‘‘నేను నేనే’’ అని రుజూ చేసుకునేందుకు తాతలు దిగిరావాలి. నా పనల్లా అన్నిటికీ మౌనంగా కూర్చోవటమే. మిగతా పనులల్లా వాటంతటవే జరుగుతవి. అనుకున్నట్టే అల్లుడికి జరగాల్సిన మర్యాదల్లో ఏ లోటూ లేకుండానే జరిగింది.

చచ్చి స్వర్గానికి పోయి పొందదగ్గ సౌఖ్యం ఏదన్నావుంటే– అదంతా చవిచూశాను. మాటల్నీ, లాలననూ పట్టి చూస్తే యెంత అమాయకురాలో ననిపించింది. ఆ దౌర్భాగ్యుడైన భర్త మీద నిజంగా జాలివేసింది. యెన్నాళ్లయినా ఇక్కడే ఉందామా అనిపించింది.

మర్నాటి వుదయం నిద్ర లేచేప్పటికి కాఫీ వుప్మాలు సిద్ధంగా వున్నవి. స్వర్గంలో మాత్రం ఇంతకన్న ఎక్కువ వుండేడుస్తుందా? బైటికి వెళ్లబుద్ధి కాలేదు. ఇంట్లో బాధపడలేక బైటికి వెళ్లవలసిన అవసరం ఇంకా కలగలేదు. ఇలాగే ఐదు రోజులు గడిచిపోయినవి. కాలం సాగినకొద్దీ నాలో భయం ఎక్కువవసాగింది. వాళ్లు వెళ్లమనరు– కానీ యీ వ్యవహారం చాలాదూరం వెళ్లేట్టుగా వుంది. నేను వెళ్లేప్పుడు ఆమె కూడా నా వెంటపడితే? అసలు బండారమంతా అప్పుడు బైటపడక మానదాయె.

మెల్లిగా కదలేశాను. ‘‘రేపు నేను వెళ్తాను’’ అన్నాను ఆమెతో.‘‘ఎక్కడికీ! నన్ను కూడా తీసుకు వెళ్లండి.’’‘‘నేను వెళ్లి ఉత్తరం రాస్తాను. మీ నాన్న తీసుకొచ్చి దిగపెడతాడులే!’’‘‘ఊహు. నన్ను తీసుకువెళ్లకపోతే చంపుకున్నట్టే!’’

ఎంత బతిమాలి చెప్పినా ఇదే వరస. ఇంకో వుపాయం ఆలోచించాను. సామాన్యంగా స్త్రీలను నగలతో మభ్యపెట్టవొచ్చు. ఇన్నాళ్లుగా ఆమెను బాధపెట్టిన ఆ గొలుసు కనక చేయించి ఇస్తే ఆమెకు ఎంతో తృప్తి కలుగుతుంది. పిల్లాడికి తినుబండారమేదో ఇచ్చి మాయపుచ్చినట్టు యీమె మనసును కూడా వేరే తోవలోకి నెట్టి నేను బైటపడదామనే నిశ్చయానికి వొచ్చాను.

మర్నాడు గొలుసు సంగతి ఎత్తేప్పటికి బుంగమూతి పెట్టి ‘‘పోనీండి– మళ్లీ ఆ సంగతి దేనికి?’’ అంది.
‘‘అది కాదు... గొలుసు చేయించుకో. ఇదుగో పైకం’’ ఐదు వందల రూపాయల కాగితాలు ఇచ్చాను. ఇంత ధరా అనే అనుమానం నాకు కలగలేదు. ఆమె ముఖం వికసించటంతో నాకు ఎంతో రిలీఫ్‌ కలిగింది.
‘‘యీ మధ్యాహ్నం బండికి నేను వెళ్తాను. మళ్లీ ఐదారు రోజుల్లో వొచ్చి నిన్ను తీసుకెళ్తాను. అప్పటికి యీ బోసిమెడలో గొలుసు కూడా వుంటుందిగా!’’ అని ఊరడించి బైటపడ్డాను.
 
స్నేహితుణ్ని వెతికాను. సాయంత్రం దాకా వాడితో ఉండి రాత్రిబండికి పోదామని నిశ్చయం. ఆ ముసలాడు ఎక్కడ యెదురౌతాడో నని భయంగానే వుంది.
ఆ సాయంత్రం కాఫీ హోటల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మావాడి స్నేహితులు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు.

హఠాత్తుగా ఒకడు ‘‘అడుగో మామయ్య అల్లుణ్ని తీసుకొని వెళ్తున్నాడు!’’ అన్నాడు. తిరిగి చూద్దును కదా– ముసలాడు! ‘‘ఎవరూ?’’ అన్నాను.
‘‘ఆ ముసలాడు అఖండుడు. కొత్త మొహం ఊళ్లో కనిపిస్తే– కాస్త జల్సారాయుడిగా ఉంటే చాలు తన అల్లుడని భ్రమించినట్టు యెత్తువేసి ఇంటికి తీసుకువెళ్తాడు.’’
ముసలాడు యువకుడితో మేము కూర్చున్న హోటల్‌కే వొచ్చాడు. నన్నెక్కడ చూస్తాడోనని భయపడి చస్తున్నాను. చూడనే చూశాడు– నన్నెప్పుడూ చూడనట్టే ఊరుకున్నాడు.
ఇక జీవితంలో ఆ వూరు వెళ్లదల్చుకోలేదు.

ధనికొండ హనుమంతరావు (1919–1989) కథ ‘మామయ్య’కు సంక్షిప్త రూపం ఇది. ఈ సరదా కథ సౌజన్యం: కథానిలయం. క్రాంతి పబ్లికేషన్స్, క్రాంతి ప్రెస్సుల స్థాపకుడు ధనికొండ. అభిసారిక పత్రిక వ్యవస్థాపకుడు. నవలలు, నాటకాలు, కథలు విస్తృతంగా రాశాడు. అనువాదాలు చేశాడు. ఇంద్రజిత్‌ కలంపేరుతోనూ రాశాడు. గుడ్డివాడు, మగువ మనసు, జగదేక సుందరి, క్లియోపాత్రా ఆయన రచనల్లో కొన్ని.
- ధనికొండ హనుమంతరావు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top