వరుడు కావలెను

Summary Of Illindala Saraswati Devi Salabhalu - Sakshi

కథాసారం

వెంటనే మీనాక్షమ్మకు పొరుగింటాయన ఈ మాదిరిగా ఉంటాడని ఒక నిశ్చితమైన అభిప్రాయమేర్పడ్డది. ఎక్కువ ఆలస్యము చేయకుండా చిన్న కొడుకును పంపి అతడి సైన్‌ బోర్డును చూచి రమ్మంది.

మీనాక్షమ్మకు తమ పొరుగింటిలోకి ఎవరో కాపురానికి వచ్చారని అప్పుడే తెలిసింది. ఒక అరగంటలో పంపిన మనిషి తిరిగి వచ్చాడు– ‘‘ఒక్క అయ్యగారే ఉంటున్నారు. 27 లేక 28 సంవత్సరాల వయసు ఉంటుంది. మన అబ్బాయిగారి కంటె ఒక ఛాయ తెలుపు, కాస్త పొడుగు, తటాలున చూస్తే అబ్బాయిగారిలా ఉంటాడు. వెంబడి వంటమనిషి కాబోలు ఉన్నాడు’’ అన్న సమాచారముతో.

ఈ వివరాలతో మీనాక్షమ్మ ఒక చక్కని రూపకల్పన చేసుకున్నది. మనసులో ఆ ఊహలు వాయువేగ మనోవేగములతో పరుగెత్తటము మొదలుపెట్టాయి. ‘అబ్బాయి కంటె ఒక ఛాయ ఉంటే అందగాడి క్రింద లెక్కే. తటాలున చూస్తే అబ్బాయిలా ఉన్నాడంటే ఏమర్థము? అబ్బాయి అమెరికా వెళ్లి మూడేళ్లు ఉండి వచ్చిన నాగరికుడు.’

వెంటనే ఆమెకు పొరుగింటాయన ఈ మాదిరిగా ఉంటాడని ఒక నిశ్చితమైన అభిప్రాయ మేర్పడ్డది. ఎక్కువ ఆలస్యము చేయకుండా చిన్న కొడుకును పంపి అతడి సైన్‌ బోర్డును చూచిరమ్మంది. రెండు నిమిషాలు కాకముందే దాని మీద ఉన్న విషయం ‘రఘువీర్‌– ఆబ్కారీ ఇన్‌స్పెక్టరు’ అన్న వార్త తెలిసింది.

ఆ రోజు ఉదయం పదకొండు గంటల దగ్గరనుండి సాయంకాలము అయిదు గంటల వరకూ మీనాక్షమ్మ తహతహలాడి పోయిందంటే అందరూ నమ్మరు. ఆ రోజు జీడిపలుకులు వేసిన ఉప్మా రామశర్మ యింటికి రాగానే మీనాక్షమ్మ స్వయముగా అందించి, చిక్కటి కాఫీ పెద్ద గ్లాసుతో ఇచ్చింది. సిగరెట్టును నోటికందించుతూ ‘‘అట్లా చల్లగాలికి వెళ్లుదాము రారు?’’ అన్నది.

ఎన్నడూ ఎరుగని ఈ గౌరవ మర్యాదలకు శర్మ విస్తుపోయాడు. మనసులో తట్టిన ఊహను అంత తొందరగా బైట పెట్టని స్వభావమే ఆమెతో కాపురము చేస్తున్న ఈ పాతికేళ్ల నుండీ  రక్షిస్తున్నది అతడిని. వెంటనే తల ఊపి చెప్పులు వేసుకుని బయలుదేరాడు. ఆమె తృప్తికరముగా ముఖము పెట్టి అతడిని అనుసరించింది.

వాళ్లిద్దరూ ఎటు వెళ్లాలనుకున్నారోగాని– మరో అయిదు నిమిషాలకు పొరుగింటి ముందర నిలబడి ఉన్నారు. గోడకు తగిలించిన సైన్‌ బోర్డును చూపిస్తూ మిగిలిన వివరాలన్నీ ఒక్క గుక్కలో చెప్పింది. మీట నొక్కితే గంట మ్రోగినట్లుగా– అతడు తలవంచుకొని నడుస్తూ ‘‘అవును అవును’’ అన్నాడు.

మరునాడు అతడు కచేరి నుంచి వచ్చేసరికి మసాలా దోశ చేతికి వచ్చింది. అతడు ఖాళీ చేసిన ప్లేటును మీనాక్షమ్మ స్వయముగా అందుకొన్నది. అతడు కాఫీ త్రాగగానే– మాటల సందర్భంలో చెప్పినట్టుగా మీనాక్షమ్మ చెప్పింది. ‘‘ఆ ఇన్‌స్పెక్టర్‌ గారు దత్తపుత్రుడట. తోటలు దొడ్లు ఉన్నాయట. నగరములో రెండు పెద్ద ఇళ్లు ఉన్నాయట. చక్కగా చిన్నతనములోనే మంచి ఉద్యోగము కుదిరింది కదండీ!’’

‘‘నిజమే నిజమే. మంచి ఉద్యోగమే. చిన్నతనము కూడాను’’ వెనుకటి ధోరణిలోనే అన్నాడు శర్మ.

నాలుగు రోజులైన తర్వాత మీనాక్షమ్మ నౌకరును పొరుగింటికి పూలకొరకు పంపి ‘‘అమ్మాయిగార్లకు ఆ రంగు పూలంటే ఎంతో యిష్టము. పెరట్లో వున్నవి కోసకోవచ్చునా?’’ అని అడగమన్నది. వెళ్లినవాడు వెంటనే తిరిగి వచ్చాడు. ‘‘దత్తు గారి అమ్మాయిలు ఉదయం ఏడుగంటలకే వచ్చి కోసుకుపోయా’’రని.

మీనాక్షమ్మ తెల్లబోయింది. ‘‘పొరుగింటి ఆయనను గురించి దత్తుగారింట్లో అంత తొందరగా ఎట్లా తెలిసింది?’’
సాయంకాలము రామశర్మ యింటికి రాగానే ఒక తీర్మానము ఆయన ముందర పెట్టింది. 
మరునాడు సాయంత్రము అయిదింటి వరకూ మీనాక్షమ్మ కూతుళ్లు ముగ్గురు నైలాన్‌ చీరెలు కట్టుకుని ముస్తాబై సిద్ధముగా ఉన్నారు. ఉపాహార విందుకు సర్వము సిద్ధముగా ఉన్నది. కూతుళ్లతో మీనాక్షమ్మ గడప దగ్గరే నిలబడి ఎదురు చూస్తున్నది అతిథి కొరకు.

రామశర్మ ఆ నాలుగింటికే ఇంటికి రావలసింది. ఆయన రాకపోవటం కొంత కొరతగానే ఉన్నది. కాని ఆ కారణం చేత ఏ లోటు జరుగకూడదన్న పట్టుదల ఉండటం వల్ల ఉత్సాహాన్ని ఇనుమడింప చేసుకున్నది.

సరిగ్గా సమయానికి వచ్చిన అతిథిని చూడగానే ముఖము ప్రఫుల్లమయింది. ఎదురుగావెళ్లి తీసుకొనివచ్చి కూర్చోబెట్టింది. తన కూతుళ్లను ముగ్గురినీ పిలిచి ఒక్కొక్కరినీ ఆయనకు పరిచయం చేసింది.

‘‘వారు ఎంతో సరదాపడి మిమ్మల్ని అల్పాహారవిందుకు పిలిచారు గాని పాపము రావటానికి ఏదో అననుకూలము వచ్చి ఉంటుంది. మీరు అన్యధా భావించకండి’’ అంటూ క్షమాపణ కోరింది. అతడు తగినట్లుగా సమాధానము ఇచ్చి, ముభావముగా స్వల్పముగా ఫలహారము తీసుకున్నాడు.

‘‘వీటి రుచి మీకు సరిపడలేదేమో!’’అన్నది కాస్త నొచ్చుకుంటూ.
‘‘లేదండీ. రాత్రి దత్తుగారింట్లో విందు భోజనము. ఇంకా నేను దాని నుంచి తేరుకోలేదు’’ అన్నాడు. మీనాక్షమ్మకు దేహములో విద్యుచ్ఛక్తి ప్రవహించినట్లయింది. ‘‘తాను అల్పాహార విందుకు ఆహ్వానించక ముందే వాళ్లు తనకంటే ఒక అడుగు ముందు వేస్తున్నారు మొదటినుంచీ’’ అనుకున్నది.
అతిథి సెలవు తీసుకుంటూ ‘‘విద్యావంతులూ సంస్కారులూ అయిన మీ కూతుళ్ల పరిచయ భాగ్యము లభించినందులకు సంతోషంగా ఉన్నది. ఈ ఊరు నాకు నచ్చింది. అందులో ఇల్లు చక్కగా పొందికగా బాగా కుదిరింది. మంచి పొరుగు– ఒక గొప్ప విశేషము’’ అన్నాడు.

మీనాక్షమ్మ మనసు పండు వెన్నెలయింది. అతడికి ప్రత్యేకముగా ఆ యిల్లు నచ్చటములో– నచ్చినదని తనకు చెప్పటంలోనూ ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది. దత్తుగారి ఇల్లు కనబడుతూనే వున్నా అవతల వీధిలో ఉన్నది. అందులోనూ తన కూతుళ్లందరూ విద్యావంతులన్న ప్రశంస వచ్చింది. విద్య దేమిటి? ఎవరికయినా వస్తుంది. కాని సంస్కారము వంట పట్టాలంటే మాటలా? ఆ మాటే కదూ అతడు వెళ్లుతూ వెళ్లుతూ తన కూతుళ్ల వంక చూస్తూ అన్నది.

ఒకరోజు సాయంత్రం మీనాక్షమ్మ కూతుళ్లను తీసుకొని క్లబ్బుకు వెళ్లింది. అక్కడ దత్తుగారి అమ్మాయిలే టేబిల్‌ టెన్నిస్‌ ఆడుతున్నారు. మీనాక్షమ్మ కూతుళ్లతో కాసేపు ఆడి, వాళ్లు బయలుదేరారు.
‘‘అంత తొందర పడతారేమిటి? ఉండండి మేము వస్తాము’’ అన్నది మీనాక్షమ్మ పెద్దకూతురు.
‘‘ఇక్కడికి కొత్తగా వచ్చారే రఘువీర్‌ ఇన్‌స్పెక్టర్‌ గారు– ఆయన ఈ సాయంత్రం మా యింటికి వస్తానన్నారు. సంగీతపు పోటీ పెట్టారు మా యింట్లో’’ అన్నది.
మీనాక్షమ్మ పెద్దకూతురికి ఆవేశమెక్కువై ‘‘అందులో మన కర్ణాటక సంగీతమంటే బొత్తిగా లేదు. ఇంకా భరతనాట్యంలో బాగా అభిరుచి ఉన్నది’’ మొదట ఏమీ అనకూడదనుకున్నది గాని అణచుకోలేక అనేసింది.
రోషములో అసూయ మేళవించగానే దత్తుగారి అమ్మాయి ముఖం కందగడ్డవలె అయింది.
‘‘నీకేం తెలుసు? ఆయన మా యింటికి వచ్చినప్పుడు భరతనాట్యాన్ని గురించి హేళన చేస్తూ  అసహ్యముగా మాట్లాడాడు’’ అన్నది.
‘‘అసంభవం. మీకాయన సంగతి పూర్తిగా తెలియదు’’ అని మీనాక్షమ్మ కూతురు గద్దించింది.
దత్తుగారమ్మాయి ‘‘మాకు ఆయన సంగతి తెలియదట గానీ– మీకేనా తెలిసింది’’ అని హేళన చేసింది.

అప్పటివరకూ ఊరుకున్న మీనాక్షమ్మ ‘‘అమ్మాయి, ఏ మాట తొందరపడి అనకూడదు. మా అమ్మాయి– అతడు పరస్పరము అభిమానముతో మెలుగుతున్నారు. మేము వాళ్లకు నిశ్చితార్థము చేద్దామనుకుంటున్నాము. మరి ఆయన సంగతి దానికి తెలియకుండానే మాట్లాడిందంటావా?’’ అన్నది మందలింపుగా.
ఆ అమ్మాయి తెల్లబోయి ‘‘ఈ సంగతి ఆయనకు తెలుసునా’’ అన్నది.
‘‘మేము అనుకున్నాం. ఒక మంచి రోజు చూసి ఆయనతో చెప్పాలనుకుంటున్నాను’’ అన్నది.
దత్తుగారమ్మాయిలు చేతిలో ఉన్న బంతులు అక్కడ పడేసి ఇంటి తోవ పట్టారు.
మీనాక్షమ్మ కూతుళ్లను తీసుకొని ఇంటికి వెళ్లుతూ ‘‘అయినా దత్తుగారి అమ్మాయిలకు బొత్తిగా మర్యాద తెలియదు. తమకే అన్నీ తెలుసునని విరగబడి పోతారు’’ అన్నది.
శ్రావణమాసపు వర్షాలు నాలుగు రోజులపాటు ఎవరినీ ఒకరి యింటినుంచి మరొకరి యింటికి పోనివ్వలేదు.
కాస్త తెరిపిగా ఉన్ననాటి సాయంత్రం ఇన్‌స్పెక్టరు గారి నౌకరు అందరి యిళ్లకూ ఒక్కొక్క బొమ్మ– చారెడు సున్నిపిండి చక్కిలాలు పంచాడు. ఏమిటంటే ‘‘అమ్మగారు అబ్బాయిగారిని ఎత్తుకొచ్చారు గదండీ’’ అన్నాడు.


ఇల్లిందల సరస్వతీదేవి 
(ఇల్లిందల సరస్వతీదేవి కథ ‘శలభాలు’ ఇది. సౌజన్యం: ‘ఇల్లిందల సరస్వతీదేవి ఉత్తమ కథలు’(ఎన్బీటీ). సరస్వతీదేవి (15 జూన్‌ 1918– 31 జూలై 1998) పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు. వివాహానంతరం ఖమ్మం జిల్లాలోని తెలగవరం వచ్చి, తెలంగాణ కోడలయ్యారు. భర్త ప్రోత్సాహంతో పెళ్లి తర్వాత కూడా చదువు కొనసాగించారు. ఆలిండియా రేడియోకు ప్రసంగాలు, కథానికలతో రచనా వ్యాసంగం మొదలుపెట్టారు. జర్నలిజం కోర్సు చేశారు. 1958–66 వరకు ఆంధ్రప్రదేశ్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ సభ్యులుగా ఉన్నారు. స్వర్ణ కమలాలు, తులసి దళాలు, రాజహంసలు ఆమె కథాసంపుటాలు. స్వర్ణకమలాలకు 1982లో కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది. నీ బాంచను కాల్మొక్త, పెళ్లి కూతుళ్లు, అనుపమ ఆమె నవలలు. కళ్యాణవల్లి, వ్యాస తరంగిణి, జీవన సామరస్యం, నారీ జగత్తు, వెలుగు బాటలు ఆమె వ్యాస సంపుటాలు. తేజోమూర్తులు, జాతిరత్నాలు ఆమె ఇతర రచనలు.)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top