
క్యాన్సర్ అంటువ్యాధా... వంశపారంపర్యమా?
కుటుంబ సభ్యుల్లో చాలా దగ్గరి వారికి క్యాన్సర్ అని తెలిశాక విలవిలలాడిపోతారు
కుటుంబ సభ్యుల్లో చాలా దగ్గరి వారికి క్యాన్సర్ అని తెలిశాక విలవిలలాడిపోతారు. ఇక అది లేట్ స్టేజ్ అని తెలిశాక ఇంకా నిస్సహాయమైన పరిస్థితి. ఆ షాక్ నుంచి తేరుకోడానికి చాలాకాలం పడుతుంది. అయితే డాక్టర్ల ద్వారా రోగులకు అందించాల్సిన సేవల గురించి తెలుసుకొని, వారు ఉండే ఆ కొంతకాలం వారికి అన్ని సౌకర్యాలూ కల్పిస్తారు. వారు సంతోషంగా ఉండటానికి కావాల్సిందంతా చేస్తారు. అయితే ఇలా సేవలు చేసే సమయంలో కొన్ని సందేహాలు కలుగుతాయి. పైగా వారు పడుతున్న బాధ చూస్తున్నప్పుడు, వారి చికిత్సను గమనిస్తున్నప్పుడు, ఆ చికిత్స సమయంలో వస్తున్న ఇతర కాంప్లికేషన్లు పరికిస్తున్నప్పుడు పగవారికి కూడా ఆ బాధ వద్దు అనిపించడం సహజం. ఇక ఆ వ్యాధితో బాధపడేవారు పెద్దవయసు వారైతే... ఆ వయసులో వచ్చే ఇతర అనర్థాలు... క్యాన్సర్ బాధతో కలగలసి వారిని చూసేవారిని, ఆ సేవలు చేసేవారిని మరింత వేదనకు గురిచేస్తాయి. ఆ వేదన నుంచి అనేక సందేహాలు తలెత్తుతాయి. ఆ సందేహాలలో అనేకం అపోహలే అయి ఉంటాయి. అందులో ముఖ్యమైనది... క్యాన్సర్ అంటువ్యాధా? ఇంత దగ్గరగా ఉండి సేవలు చేయడం వల్ల మనకూ వస్తుందా? ఇలా ఎన్నో సందేహాలూ... సంశయాలు.
ఏది వాస్తవం... ఎంత వాస్తవం?
క్యాన్సర్ అంటువ్యాధి అన్న మాట ఎంతమాత్రమూ వాస్తవం కాదు. క్యాన్సర్ ఒంట్లోని కణం నుంచి పక్క కణానికి మాత్రమే పాకుతుంది. అంతేగాని... ఒకరి ఒంటి నుంచి మరొకరికి అంటదు. ఇక మరి కొందరిలో మరో సంశయం. ‘‘క్యాన్సర్ ఉన్నదని తెలిశాక చాలా మంది సర్జరీ వద్దని సలహా ఇచ్చారు. కత్తి తగిలితే క్యాన్సర్ కణం మరింత రెచ్చిపోతుందని కొందరు చెప్పారు. అయినా వినకుండా సర్జరీ చేయించాం. అందుకే ఇది అంతగా పెచ్చరిల్లిందా? శస్త్రచికిత్స చేయించకపోతే రోగి మరింత కాలం బతికేవాడా?’’ అనే సందేహాలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈ అపోహ కూడా ఎంతమాత్రమూ సరికాదు. క్యాన్సర్ గడ్డ అయినప్పుడు, దాన్ని సర్జరీ ద్వారా తొలగించడానికి వీలున్నప్పుడు శస్త్రచికిత్సే సరైన చికిత్స.
అది జరగకపోయి ఉంటే రోగి మరింత త్వరగా చనిపోయేవాడన్నది గుర్తించాలి. కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ గడ్డ తొలగించడానికి వీల్లేనంత సంక్లిష్టమైన చోట ఉంటే తప్ప దాన్ని వదలరు. తొలగించే సౌలభ్యం ఉన్నప్పడు దాన్ని తొలగించి... ఒంట్లో మరెక్కడా క్యాన్సర్ కణం లేదని నిర్ధారణ చేసుకున్నప్పుడు ఆ రోగి అందరిలాగే సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా జీవించే అవకాశం ఉందని గ్రహించాలి. పథ్యం సరిగా పాటించనందువల్ల జరగకూడదనుకున్నది జరిగిందా అనే సందిగ్ధ పరిస్థితి మరికొందరిలో ఉంటుంది. కానీ అన్నం సయించి తినగలుగుతున్నప్పుడు రోగి అందరిలాగే సమతులమైన, ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. అలా తింటేనే రోగనిరోధకశక్తి పెరిగి మరింత కాలం ఆరోగ్యంగా బతకగలుగుతాడు.
అంటుకోవడం కాదు ఇతర అంశాలే కారణం...
క్యాన్సర్ అంటుకోవడం ఎంతమాత్రమే కారణం కాకపోగా... చాలా ఇతర అంశాలే కారణమవుతాయి. నిర్దిష్టంగా క్యాన్సర్‌కు ఇదీ కారణం అని చెప్పలేకపోయినా... చాలామందిలో నిర్వహించిన అధ్యయనాల మేరకు పొగతాగడం, ఆల్కహాల్ వంటి దురలవాట్లు, తీవ్రమైన మానసిక ఒత్తిడి, వయసు పైబడటం, దీర్ఘకాలం పాటు కృత్రిమ హార్లోన్లు తీసుకోవడం, పొగాకు నమలడం, ఆస్‌బెస్టాస్ వంటి కంపెనీల్లో పనిచేయడం, వృత్తిపరంగా రేడియేషన్‌కు గురికావడం వంటి అంశాలు తోడ్పడతాయి. ఇక కొందరిలోనైతే ఎలాంటి రిస్క్‌ఫ్యాక్టర్స్ లేకపోయినా క్యాన్సర్ రావచ్చు.
క్యాన్సర్ అంటువ్యాధి కాదు గానీ... క్యాన్సర్‌కు దారితీసే కొన్ని అంటువ్యాధులు...
స్వతహాగా క్యాన్సర్ అంటువ్యాధి కాదు గానీ కొన్ని అంటువ్యాధులు క్యాన్సర్లకు దారితీయవచ్చు. ఉదాహరణకు హెపటైటిస్–బి అనేది అంటువ్యాధి. కలుషితమైన సూదులు, సెక్స్‌ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. ఇది అంటువ్యాధి. ఇది సోకిన వారిలో చాలామందికి ఆ తర్వాతి కాలంలో కాలేయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. క్యాలేయ క్యాన్సర్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. కానీ వ్యాధి వ్యాప్తిచేయగల వయసులో హెపటైటిస్–బి మాత్రం ఒకరిని నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఇదీ గమనించాల్సిన అంశం. అలాగే హెచ్‌పీవీ వైరస్. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఆ వైరస్ సోకిన చాలామందిలో ఆ తర్వాతి దశలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అయితే ఈ క్యాన్సర్ మాత్రం అంటువ్యాధి కాదు. అదీ తేడా. అయితే ఇప్పుడు హెపటైటిస్–బి ని నివారించడానికీ, హెచ్‌పీవీ నివారణకూ వాక్సిన్లు ఉన్నాయి. ఆ వ్యాక్సిన్లు తీసుకోవడం అంటే... ముందు ఆయా వ్యాధులను నివారించడం, ఆ తర్వాత ఆయా క్యాన్సర్లనూ నివారించడం అన్నమాట.
క్యాన్సర్ వంశపారంపర్యమా?
చాలావరకు కాదు. అయితే క్యాన్సర్ వంశపారంపర్యం కానే కాదు కచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే కొన్ని రకాల క్యాన్సర్లు దగ్గరి బంధువుల్లో కనిపించినప్పుడు అవి వారి వారసుల్లో కనిపించే అవకాశాలు కాస్త ఎక్కువే. ముఖ్యంగా మహిళలకు వచ్చే క్యాన్సర్లలో ఇలా వంశపారంపర్యంగా కనిపించే అవకాశాలు పెరుగుతాయి. ఉదాహరణకు దగ్గరి బంధువుల్లో ఇద్దరికి రొమ్ముక్యాన్సర్ కనిపిచిందంటే... ఆ కుటుంబంలోని వారికి ఆ క్యాన్సర్ ముప్పు ఎక్కువ అని గుర్తుంచుకోవాలి. క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా అని తెలుసుకోవాలంటే బీఆర్‌సీఏ 1, బీఆర్‌సీఏ2 వంటి జీన్ మ్యూటేషన్ పరీ క్షలు చేయించుకోవాలి. ఈ పరీక్షలు పాటిజివ్‌గా వచ్చాయంటే వారిలో రొమ్ము క్యాన్సర్ కణం ఉన్నట్లు పరిగణించాలి. ఇలాంటి వారికి కౌన్సెలింగ్ అవసరమవుతుంది.
Dr. Ch. Mohana Vamsy
Chief Surgical Oncologist
Omega Hospitals, Hyderabad
Ph: 98480 11421, Kurnool 08518273001