ఇక్కడ అందం అమ్మబడును

Buchi Babu Story On Human Psychology  - Sakshi

అద్దంలో మొహం చూసుకున్నాడు. ఏ మార్పూ లేదు. అనుకున్నంత వికృతమైన మొహం కాదు. అందులో కొంత అందం లేకపోలేదు. పొట్లం విప్పాడు. అందులో అట్టపెట్టె– ఆరంగుళాల పొడవు, నాలుగంగుళాల వెడల్పు. మూత తీశాడు– గుప్పున కొట్టింది

ఇంట్లోకి సరుకులు తెద్దామని బజారుకి బైలుదేరాడు పరంధామయ్య. చల్లబడిన తర్వాత వెడతానన్నాడు. వెంటనే వెళ్లమంది పార్వతమ్మ. అతనికి వెళ్లాలనే వుంది. కాని భార్య తొందరగా వెళ్లమంది కాబట్టి కొంచెం ఆలస్యం చెయ్యడంలో కాస్తంత తృప్తి. సెలవు కోసం వారం అంతా ఎదురుచూస్తూ, తీరా వొచ్చిం తర్వాత ఏమీ చెయ్యక వృథాగా గడిపేశామే అని బాధపడుతూ మళ్లా పని ప్రవాహములో కొట్టుకుపొయ్యే మధ్యతరగతి వ్యక్తి పరంధామయ్య. సెలవు రోజున తన వ్యక్తిత్వానికి అనువైన పని ఏదో చెయ్యాలి. ఏం చెయ్యాలో తెలియదు. తనూ, భార్య యింకెవ్వరూ లేకుండా, అలా షికారు తిరిగి సినిమాకెళ్లి, ఏ హోటల్లోనో భోంచేసి, పార్కులో పెళ్లినాటి సంఘటనలు స్మరించుకుని, ఆమె తొడమీద తల ఆనించి పడుకుని ఆకాశంలో నక్షత్రాలకేసి నిశ్చలంగా చూస్తూ విశ్వంలోని నిశ్చలత్వాన్ని తనలో నింపుకుని క్రొత్త సౌందర్యాన్ని, ఆనందాన్ని పొంది...

అదే పేచీ–వారి జీవితాల్లో ఆనందం, సౌందర్యం లేవు. శారీరక సౌందర్యం అంత ముఖ్యమైంది కాదంటారు. మరేదో శీలంలో సౌందర్యంట– మనస్సులో వుంటుందిట. బాహ్య సౌందర్యం వుంటేనే ఆ మిగతావి కూడా వుంటాయి. సౌందర్యం ఎట్లా వొస్తుంది? డబ్బుంటే అదే వొస్తుంది. శాస్త్రజ్ఞులు కనుక్కొన్న పరికరాల ద్వారా అందాన్ని కూడా పొందవచ్చు.తన అందం గూర్చి పరంధామయ్యకి బోలెడన్ని శంకలు. అందం స్త్రీది, తెలివి పురుషుడిదీ అనుకునే రోజులు వెళ్లిపోయినై. కొంచెం పొడుగాటి ముక్కు. కాస్తంత పొట్టిదిగా వుంటే ఎంత బావుండును. పెదవులు కొంచెం వంకర. జుత్తు పాపిడ తిన్నగారాదు. 
కాఫీ హోటలుకు చేరుకున్నాడు. ఆలోచనలతో దూరమే తెలియలేదు.

టీ త్రాగాడు. బైలు దేరాడు. తన మాట వొదిలేద్దాం. పార్వతమ్మ అందం విషయం ఆలోచించు. ఆమె అందంగా వుండదు. కనుబొమ్మలకి ఆకారం లేదు. అర్ధచంద్రాకారం ఆకృతి కలిగి దట్టంగా, నల్లగా, స్ఫుటంగా వుండాలి. అలా లేవు. ఆ ముక్కు? కాస్తంత పొట్టిదనే వొప్పుకోవాలి. తన ముక్కులో పొడుగైన ఆ కాస్త భాగం కోసేసి, ఆవిడ ముక్కు మొనకి అతికించివేస్తే ఎంత బాగుంటుంది! ఇంతకీ తను ఎక్కడికి నడుస్తున్నట్లు? సరుకుల కోసం. ముందు ఆ కొట్లో కెడదాం. ఆ సందు మలుపులో. సందు మలుపు తిరగగానే, ఒకరి వెనుక ఒకరు వరుసగా నిలబడ్డ జనం– రోడ్డంతా కమ్మేశారు. ఏం జనం, ఏం జనం? ఏదేనా ఊరోగింపు కాబోలు. వరుసగా నిలబడడం దేనికో? ఇవతల ప్రక్క మొగాళ్ల క్యూ ఫర్లాంగు. అవతల స్త్రీల క్యూ. ఎందుకు నిలబడ్డారో?

‘ఏ అబ్బాయ్‌– ఏమిటిదంతా?’’ సమాధానం చెప్పకుండా, ఆ కుర్రాడు పరుగెత్తుకెళ్లి క్యూలో కూరుకుపొయ్యాడు. తనకెందుకు? తన దోవను తను పోక. ఇందరు మనుషుల్ని ఒదిలి ఎలా వెళ్లడం? అదే మానవత్వం అంటే. తోటి మానవుడి రహస్యాన్ని పంచుకోవడం. క్యూ ప్రభావం సుడిగాలిలా పరంధామయ్యని చుట్టేసింది. మానవ హృదయం దేన్నో ఆశించి రోదిస్తుంటే తాను చెవులు మూసుకోగలడా!
‘క్యూ చివరలో ఏముందబ్బాయి?’ క్యూ సమరంలో గాయపడి వెనక్కి తిరిగొచ్చిన బాలవీరుడు.‘‘అందం అమ్ముతున్నారుటండి’’ అని బాలవీరుడు కుంటుకుంటూ నిష్క్రమించాడు. పరంధామయ్య పరధ్యానం కట్టిబెట్టి ఒక్క గంతేసి క్యూ చివరలో స్థావరం ఏర్పరచుకున్నాడు. ఒక మజిలీ గడిచింది. మదీనా చేరాడు. మక్కాకి పోవాలి. వెనక మరో పదిగజాల జనం గొలుసు కట్టేసుకున్నారు.

తను సౌందర్యం గురించి ఆలోచించటం, సౌందర్యం లభ్యం కావటం– క్యూలో కాలక్షేపం కాదు. ముందువాడి వెన్ను ఎంతసేపని చూడగలం? వెనక్కి తిరిగితే, ఆసామీ మీసాల మధ్య నలిగిన చుట్ట. ఆయన కనుబొమ్మలు చూడు– అదొక పిల్ల అడివి. ఆడాళ్లకి వేరే క్యూ పెట్టారు. పౌరసత్వ బాధ్యతలు గుర్తెరింగిన ప్రజ, ఏమీ తోచకపోతే స్త్రీలకేసి చూస్తూ కూర్చోవచ్చు. క్యూలో నిలబడిం తర్వాత ముందువారిని, వెనక వారిని ఈ క్యూ ఎందుకని అడిగే అధికారం లేదు. చివరిదాకా అనుభవించి, తనకు తానే సత్యం తెలుసుకుని హతమవ్వాలి. అయినా, అందం అమ్మడం ఏమిటో! సరిగ్గా విన్నానా? లేకపోతే యింతమంది స్త్రీలు, పురుషులు యీ క్యూలో అవతరించరు. అందం అమ్మడమేమిటి నా నెత్తి. అందంగా చేసే పరికరాన్ని అమ్మడం అని. వాక్యంలో ఏదో లోపించింది.

క్యూలో అడుగు ముందుకు కదిలింది. ఆ ముసలమ్మకి అందం ఎందుకు? వార్ధక్యం, జాడ్యం, మృత్యువు లేకుండా చేసే మార్గం కనుక్కునేటందుకే సిద్ధార్థుడు సంసారం త్యజించి, ధ్యానం సాగించి బుద్ధుడుగా అవతరించాడట. నిజంగా బుద్ధుడు సాగించినది సౌందర్యాన్వేషణే– అది సాధ్యం కాకపోయినప్పుడు, వేరే లోపల అందం, నిర్యాణము, శాంతి అంటూ తత్వచింతనలో పడ్డాడు. మరో రెండు గజాలు పురోగమనం. మరో మూడు.   ప్రజ యింక  ఆగరు.   అందం   ఆకలై ముందుకు నెట్టివేస్తోంది. ఏదో వాసన. ఏమిటి చెప్మా! ‘‘కలరా వుండలా?’’ ‘‘ఏమో. గసగసాలు’’. ‘‘అబ్బే కర్పూరం దండలండి’’ ‘‘చమురు కంపు’’ ఒక్కసారి పదిగజాలు. అమ్మయ్య! ఆవిడెవరు? రమణయ్యగారి చెల్లెలా. ఆవిడే. చాలా అందమైంది. ఈమధ్యనే భర్త కాలం చేశాడు. అంత అందమైన భార్యకు భర్తగా వుండేందుకు తగనని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పుకుంటారు. ఆవిడకేం కావాలో?

రెండు గజాల దూరంలో శిఖరం, దైవం సాక్షాత్కారం. కొబ్బరికాయ కొట్టి పూజారి పళ్లెంలో అణా వుంచినట్లు ప్రతివాడూ ఆ కిటికీముందు నిలబడటం, డబ్బు సమర్పించుకోడం, వాడిచ్చిన ప్రసాదం కళ్ల కద్దుకొని– పత్రి పూలూ వగైరా మాదిరి బిల్లు చీటీ యిస్తాడు– దాన్ని చెవులో బదులు జేబులో వుంచుకొని బైటపడటం– అల్లా జరుగుతోంది. ఒక్కొక్క భక్తుడే దూరంగా వెళ్లిపోతున్నాడు. వారి మొహాలలో శాంతి ఆనందం తాండవిస్తున్నాయా? ఇంక ముందు యిద్దరే వున్నారు. పరంధామయ్య సింహద్వారం చేరుకున్నాడు. ఎదురుగా గోడ. దానిలో వో కంత. చెంపలు వేసుకో, కళ్లు మూసుకో, పర్సు తీ– చిల్లర.
‘‘పావలా’’ అన్నాడు దైవం.

ఇంత పొట్లం ఏదో చేతిలో పెట్టాడు. పెద్దదే– ఏదో వాసన. దూరంగా, తొందరగా నడిచి వెళ్లాడు. ముందు విశ్రాంతి కావాలి. దాహంగా వుంది. మనుషుల వాసన చొక్కాలో ప్రవేశించింది. ఇందాక హటల్లోకి చేరుకున్నాడు. అద్దంలో మొహం చూసుకున్నాడు. వెనకటిదే. ఏ మార్పూ లేదు. అనుకున్నంత వికృతమైన మొహం కాదు. అందులో కొంత అందం లేకపోలేదు. 
పొట్లం విప్పాడు. అందులో అట్టపెట్టె– ఆరంగుళాల పొడవు, నాలుగంగుళాల వెడల్పు. మూత తీశాడు– గుప్పున కొట్టింది. అందులో వున్నది ఇంగువ. దాన్ని వర్ణిస్తూ కాగితం. అందం మార్కు ఇంగువనే ఎల్లప్పుడూ వాడండి. సువాసన, నూతనమైన మూలికలు, అత్తరులు జోడించి సమకూర్చిన పరిమళం. భుజించిన మొన్నాడు కూడా దాని పరిమళం వదలదు. మీ వంటకాలలో వాడితే మీ ఇల్లాలి పట్ల ప్రేమ, ఆదరణ పెరుగుతాయి.

పరంధామయ్య చాలా సేపటి వరకూ తేరుకోలేదు. కాని తనొక్కడే కాడు. వేలమందిలో తను వొక్కడు. వాళ్లందరూ చేసినపనే తనూ చేశాడు. కించపడటానికేముంది?
సరుకులు కొనుక్కుని మెల్లిగా ఇంటికి చేరుకునేటప్పటికి పార్వతమ్మ వంటింట్లో వుంది.‘‘ఇంత ఆలస్యమైందేం?’’
‘‘ఏమీ లేదు. మెల్లిగా నడుచుకుంటూ వొచ్చాను’’
‘‘ఇదేమిటి– యి పొట్లం?’’
‘‘చూడు.’’
ఆవిడ మొహంలో చిరునగవు లేదు. అసంతృప్తిని వొక్క చూపులో వ్యక్తం చెయ్యగల కళాజీవి.
‘‘ఇంత ఇంగువ తెచ్చుకుంటారా ఎవరేనా?’’
‘‘అంతే యిచ్చాడు వాడు.’’
‘‘చిన్న పొట్లం అడగలేక పొయ్యారా?’’
‘‘చిన్న పొట్లం వుంటుందని నాకు తెలియదు.’’
‘‘ఇంకెప్పుడూ ఇట్లాంటి పని చెయ్యకండి’’ అని పార్వతమ్మ వంటింట్లో కెళ్లింది. సుళువుగా బైట పడినందుకు లోలోన సంతోషపడ్డాడు.
‘‘ఇదిగో చూడండి. నేను తీసుకొచ్చాను– చిన్న పొట్లం’’ అన్నదామె.
‘‘నువ్వూ ఆ క్యూలో నిలబడ్డావా?’’

‘‘ఆహా. పనిపిల్ల చెప్పింది. ఇంగువ చవగ్గా అమ్ముతున్నారని. ఇదేమిటో చూద్దామని దాన్ని తీసుకొని బైలుదేరాను. క్యూలో నుంచోవడం లేదు ఏం లేదు. ఎలాగో సందు చేసుకొని యీ పొట్లం లాక్కుని వొచ్చింది. ఈ చిన్న పొట్లం దానికిస్తాను. మీరు తెచ్చింది మనకుంటుంది.’’పార్వతమ్మ ఎంతవరకూ నిజం చెప్పిందో పరంధామయ్యకి తెలుసు. తనెంత నిజం చెప్పాడో ఆమె కూడా అంతే. ఇది అన్యోన్యం కాక మరేమిటి


కలంపేరు బుచ్చిబాబుతో ప్రసిద్ధులైన శివరాజు వెంకట సుబ్బారావు (1916–1967) ‘సౌందర్యాన్వేషణ’ కథకు సంక్షిప్త రూపం ఇది. స్త్రీ పురుష సంబంధాలు, మానసిక చైతన్యం మీద బుచ్చిబాబు ఎక్కువ దృష్టి పెట్టారు. నన్ను గురించి కథ వ్రాయవూ?, అరకు లోయలో కూలిన శిఖరం, బీ, నిప్పు లేని పొగ ఆయన కథల్లో కొన్ని. ఆయన రాసిన ఒకే ఒక్క నవల ‘చివరకు మిగిలేది’ తెలుగు సాహిత్యంలో ఎన్నదగినది. ‘నా అంతరంగ కథనం’ పేరిట పాక్షిక ఆత్మకథ వెలువరించారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top