దోసె వేసి మనసు దోచి

Bangalore Basavanagudi Gandhi Bazaar dosa special - Sakshi

ఫుడ్‌  ప్రింట్స్‌

బెంగళూరు బసవనగుడి గాంధీ బజార్‌... నిత్యం దోసె ప్రియులతో  కిటకిటలాడుతూ ఉంటుంది...  అక్కడి వెన్న దోసె నోటిలో వేసుకుంటే  వహ్వా అనిపిస్తుంది. కాని దాని కోసం గంటసేపు నిరీక్షించాల్సిందే.. అంత డిమాండ్‌ ఉన్న హోటలే విద్యార్థి భవన్‌... ఇటీవలే 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న  విద్యార్థి భవన్‌ ఈ వారం ఫుట్‌ ప్రింట్స్‌...

‘ఏడున్నర దశాబ్దాలుగా అదే వెన్న దోసె తింటున్నాం’ అనుకుంటారు బెంగళూరు వాసులు. వారికి ఇదేమీ కొత్త కాదు. ప్రతిరోజూ కనీసం మూడు వేల మంది విద్యార్థి భవన్‌ టిఫిన్లు రుచి చూస్తుంటారు. ఇందులో రచయితలు, కళాకారులు, సినీతారలు, కార్పొరేట్‌ వృత్తులవారు... ఒకరనేమిటి... అందరూ వెన్న దోసె రుచికి ఎగబడవలసిందే. 1943 లో దక్షిణ కన్నడ ప్రాంతం సాలిగ్రామం నుంచి వెంకటరమణ ఊరల్‌ కన్నడిగుల కోసం ప్రత్యేకమైన దోసెలు వేయడం ప్రారంభించారు. ఇరుకు సందుల్లో ఉండే విద్యార్థి భవన్‌లో దోసె తినడానికి సంపన్న వర్గాలు సైతం వస్తుంటారు. లోపల ఖాళీ లేకపోతే ఎంతో ఓరిమిగా బయటే నిరీక్షిస్తుంటారు ఈ దోసె ప్రియులు. ఇక్కడకు వెన్న దోసె తినడానికి ఎంత మంది వస్తున్నారని లెక్కించకుండా, వేస్తున్న దోసెల సంఖ్యను లెక్కిస్తారు. మామూలు రోజుల్లో రోజుకి 1250, శని ఆదివారాలు 2200 దోసెలు వేయాల్సిందే. లోపల ఉన్నవాళ్లు బయటకు వెళ్తేనే, బయట ఉన్నవారు లోపలకు రాగలుగుతారు. అంత రద్దీగా ఉంటుంది.

ఇదీ చరిత్ర...
బెంగళూరులోని అతి పురాతన ప్రదేశం బసవనగుడి ప్రాంతంలోని గాంధీ బజార్‌. స్వతంత్రానికి పూర్వం, ఈ ప్రాంతంలో అనేక విద్యాసంస్థలు ఉండేవి. వీటిలో నేషనల్‌ కాలేజీ, ఆచార్య పాఠశాల కూడా ఉన్నాయి. ‘విద్యార్థి భవన్‌ను విద్యార్థుల కోసం ప్రారంభించటం వల్ల దానికి విద్యార్థి భవన్‌ అనే పేరు స్థిరపరిచేశారు. ప్రారంభించిన కొన్ని రోజులకే విద్యార్థి భవన్‌ పేరు బెంగళూరు అంతా వ్యాపించింది. ఈరోజు ప్రతి సెలబ్రిటీ ఇక్కడకు వచ్చి దోసె, కాఫీ రుచి చూడవలసిందే’ అంటారు విద్యార్థి భవన్‌ నిర్వాహకులు అరుణ్‌ కుమార్‌ అడిగా. అరుణ్‌ టెలికాం ఇంజనీర్‌. వారసత్వంగా వస్తున్న వ్యాపారాన్ని నిలబెట్టడం కోసం తాను చేస్తున్న కార్పొరేట్‌ ఉద్యోగాన్ని వదిలేశారు. 

ఎటువంటి మార్పు లేదు...
విద్యార్థి భవన్‌లో నేటికీ కేవలం ఆరు రకాల టిఫిన్లు మాత్రమే ఉంటున్నాయి. వెన్న దోసె, పూరీ సాగు, ఖారా బాత్, కేసరి బాత్, ఇడ్లీ సాంబారు, ఉప్పిట్లు, రవ్వ వడ... ఇవీ విద్యార్థి భవన్‌ మెనూ. ‘వీటికి సెలబ్రిటీ స్టేటస్‌ వచ్చేలా మేం రూపొందించాం’ అంటారు అరుణ్‌. 1970 ప్రాంతంలో విద్యార్థి భవన్‌ను ఊరల్‌ వంశీకులు రామకృష్ణ అడిగాకు అప్పగించారు. విద్యార్థి భవన్‌ పేరును రెండింతలు చేశారు రామకృష్ణ.

అదే సంప్రదాయం...
విద్యార్థి భవన్‌ను... అదే పేరు, అదే స్టాఫ్, అదే మెనూ, అదే నియమాలతో తీసుకున్నారు రామకృష్ణ అడిగా. అరుణ్‌ అడిగా ఈ హోటల్‌ను తన చేతుల్లోకి తీసుకున్నప్పటికి, అదే ప్రాంతంలో ఉన్న ఎస్‌ఎల్‌వి హోటల్‌ మూతపడింది. ఆ సమయంలోనే రామకృష్ణ అడిగా ఈ వ్యాపారాన్ని తన కుమారుడు అరుణ్‌ అడిగాకు అప్పచెప్పాలనుకున్నారు. ‘‘మా నాన్నగారికి 60 సంవత్సరాలు నిండటంతో, ఆయన వెనుకగా ఉండి నడిపించాలనుకున్నారు. అప్పటికి నేను ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి గారితో కలిసి పనిచేస్తున్నాను. ‘మీ నాన్నగారి వ్యాపారాన్ని నువ్వు తీసుకోవడం వల్ల ఆ వ్యాపారం మరింత వృద్ధి చెందుతుంది. ఇక్కడ ఈ కార్పొరేట్‌ ఉద్యోగాన్ని నువ్వు విడిచిపెట్టడం వల్ల కంపెనీకి ఎటువంటి నష్టమూ కలగదు’ అని సలహా ఇచ్చారు నారాయణమూర్తి. ఆయన సూచన మేరకు నేను నాన్నగారి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నాను’’ అన్నారాయన.

ప్రముఖులు...
వెన్న దోసె తింటూ వారి సృజనకు అక్కడే పదును పెట్టేవారు. బిఆర్‌ లక్ష్మణరావు, ఫీల్డ్‌ మార్షల్‌ కరియప్ప, విద్యావేత్త హెచ్‌ నరసింహయ్య, సినీ నటులు విష్ణువర్థన్, అనంత్‌ నాగ్, శంకర్‌ నాగ్‌... ఇక్కడకు నిత్యం వచ్చే ప్రముఖులలో కొందరు. ప్రముఖ సాహితీవేత్త మస్తి వెంకటేశ అయ్యంగార్‌... ఏనాడూ ‘రవ్వ వడ’ను మిస్‌ అయ్యేవారు కారు. బసవనగుడి క్లబ్‌కి వెళ్తూ మార్గమధ్యంలో ఆగి పార్సిల్‌ చేయించుకునేవారు. డి.వి. గుండప్ప, జి.సి.రాజారత్నం వంటి కవులు ఇక్కడి ‘సాగు మసాలా’ కోసం తప్పనిసరిగా వచ్చేవారు.  ప్రముఖ క్రికెట్‌ ఆటగాడు గుండప్ప విశ్వనాథ్, సినీ నటి భారతి నేటికీ దోసె రుచి చూస్తున్నారు.

రజనీకాంత్‌ను కనిపెట్టలేకపోయారు...
ప్రముఖ కన్నడ సినీ నటుడు డా.రాజ్‌కుమార్‌ ఈ దోసెలు చాలా ఇష్టం. ఇక్కడ నుంచి దోసె పార్సిల్‌ తీసుకువెళ్లేవారు.  వీరప్పన్‌ చెర నుంచి బయటకు వచ్చిన రాజ్‌కుమార్‌ను విద్యార్థి భవన్‌కు ఆహ్వానించి ఆప్యాయంగా దోసె తినిపించారు అరుణ్‌ అడిగా. రజనీకాంత్‌ తరచుగా మారువేషంలో వచ్చి ఇక్కడ దోసె తిని వెళ్తుంటారని గట్టిగా గుసగుసలు వినపడతాయి. ఎలాగైనా ఆయనను గుర్తించాలని అక్కడి ఉద్యోగులు ప్రయత్నిస్తున్నప్పటికీ వారి ప్రయత్నం నేటికీ ఫలించలేదట. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top