పాలు – మురిపాలు | Ayurveda terminology does not use any adjectives | Sakshi
Sakshi News home page

పాలు – మురిపాలు

Sep 1 2018 12:29 AM | Updated on Sep 1 2018 12:31 AM

Ayurveda terminology does not use any adjectives - Sakshi

సంస్కృతి సాంప్రదాయాలకు, సనాతన సదాచారాలకు భారతావని కాణాచి అనే విషయం జగద్విదితం. ఆహార ద్రవ్యాలలోను, పవిత్ర పూజా ప్రక్రియలలోను ‘పాలు’ ప్రధాన పదార్థం. గోమాతకు దైవత్వం సిద్ధించడానికి ముఖ్య కారణం గోక్షీరపు విశిష్టతే. ఆయుర్వేద పరిభాషలో ఏ విశేషణమూ వాడకపోతే క్షీరం అంటే గోక్షీరమే. తైలం అంటే నువ్వుల నూనే. అదేవిధంగా నవనీతం, ఘృతం (వెన్న, నెయ్యి) కూడా ఆవు పాలకు సంబంధించినవే. నవ జాత శిశు పోషణలో మాతృ స్తన్యం తర్వాత అతి ముఖ్య పాత్ర మేక, ఆవు పాలదే. ఎన్నో ఓషధుల్ని శుద్ధి చేయటానికి ఆవు పాలను వాడతారు. అన్ని వయసుల వారికీ ఆవు పాలు ఉత్తమ రసాయనంగా (సప్తధాతు పుష్టికరంగా) ఉపకరిస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. తద్వారా ఓజోవర్థకంగా పనిచేస్తాయి.

ఆవుపాల గుణగణాలు: (సుశ్రుతుడు)‘‘స్వాదు శీతం మృదు స్నిగ్ధం బహలం శ్లక్ష్య పిచ్ఛిలంగురు మందం ప్రసన్నం చ గవ్యం దశ గుణం పయః’’(చరకుడు): ‘‘తదేవ గుణమేవ ఓజః సామాన్యాత్‌ అభివర్థయేత్‌
ప్రవరం జీవనీయం క్షీర ముక్తం రసాయనం’’చిక్కగా, జిడ్డుగా, మృదువుగా ఉంటాయి. (గేదె పాలతో పోలిస్తే పలచగా ఉంటాయి). తియ్యగా ఉండి, శరీరానికి చలవ చేస్తాయి. ఆలస్యంగా జీర్ణమై, ఆకలిని తీర్చి, మనసుకి ప్రసన్నంగా, బలవర్థకంగా పనిచేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ‘జీవనీయ’ గుణ ప్రధానంగా ఉంటాయి. వాత హరంగా, పిత్త హరంగా, ఉండి, రక్త స్రావాలను అరికట్టే లక్షణం కలిగి ఉంటుంది. తక్షణ  శుక్రకరం, వీర్య వర్థకం.

గేదె పాలు: ‘మహీషీణాం గురుతరం గవ్యాత్, శీతతరం
పయ: స్నేహాన్యూనం అనిద్రాయ హితం అత్యగ్నియేచ తత్‌’’ఆవు పాల కంటె అధిక గుణాలు కలిగి, నిద్రాజనకంగా పనిచేస్తాయి. అత్యాకలిని అరికట్టి తృప్తినిస్తాయి.
మేక పాలు: (చరకుడు) ‘‘ఛాగం కషాయం మధుర శీతం గ్రాహి పయాలఘురక్తపిత్త అతి సారఘ్నం క్షయ కాస జ్వరాపహం’’  (చరకుడు)తీపితో పాటు కొంచెం వగరుగా ఉండి తేలికగా జీర్ణం అవుతాయి. రక్త స్రావం, విరేచనాలు, దగ్గు, జ్వరాలను అరికడతాయి.

గాడిద పాలు (భావ మిశ్రుడు):శ్వాస వాతహరం స అమ్లం లవణం, రుచి దీప్తి కృత్‌కఫకాస హరం, బాల రోగఘ్నం గార్ధభీ పయఃదీనికి ఔషధ గుణాలు ఎక్కువ. వయసుని బట్టి పావు చెంచా నుండి ఐదు చెందాల వరకు మాత్రమే సేవించాలి. వాతహరంగా పని చేసి ఉబ్బసం వంటి ఆయాసాలను తగ్గిస్తుంది. కఫాన్ని తొలగిస్తుంది. శిశువులకు కలిగే అన్ని రోగాలకూ ఇది ఉత్తమ ఔషధ తుల్యం.ఈ విధంగా ఆవు పాలు, గేదె పాలు, మేక పాలు శరీర పోషణకు ఉపకరిస్తాయి. నేరుగా పాలు తాగటం, పాయసాలు తయారు చేయటం, శాకపాకాలలో వాడటం వంటి వివిధ పద్ధతుల్లో సేవిస్తుంటాం. గాడిద పాలను కేవలం ఔషధ పరంగా వాడుతుంటాం. పాల మీగడ చాలా ఎక్కువ స్నిగ్ధంగా ఉండి, అతి చిక్కగా, మృదువుగా గురుతరంగా శరీర పోషణకు ఉపకరిస్తుంది. పెరుగును చిలకడం ద్వారా వెన్న లభిస్తుంది. దీనినే సంస్కృతంలో నవనీతం అంటారు. అతి మృదువుగా ఉండి, కొవ్వుని కరిగించే గుణం కలిగి ఉంటుంది. అందుకే ఇది స్థౌల్య హరం. అంటే స్థూలకాయాన్ని తగ్గిస్తుంది. వెన్నను మరిగించి నెయ్యి (ఘృతం) తయారు చేస్తారు. ఇది అగ్నివర్ధకం. పిత్తహరం.

గమనిక: పచ్చ గడ్డి, తెలగ పిండి, చిట్టు, తౌడు, ఆహారంగా సేవించే దేశీ ఆవుల పాలు, వాటి ఉత్పత్తులు మాత్రమే ఆరోగ్యకరమని గుర్తుంచుకోవాలి. ఈనాడు జెర్సీ ఆవులు, వాటికి ఇచ్చే విచిత్ర ఆహారాలు, అధిక పాల కోసం వాటికి ఇచ్చే కెమికల్‌ ఇంజక్షన్లు... వీటి వల్ల పేరుకి ఆవు పాలైనా అనర్థాలే అధికం అని శాస్త్రజ్ఞుల పరిశోధనలలో కనిపిస్తోంది.

ఆధునిక జీవ రసాయనిక శాస్త్రం రీత్యా:పాలు మంచి బలవర్థక సమీకృత ఆహారం. ఇందులో మాంసకృత్తులు, పిండి పదార్థాలు, కొవ్వులు సమతుల్యంగా ఉంటాయి. డి, బీ 12, బీ6, బీ2 విటమిన్లు లభిస్తాయి. ఎ, డీ లు కూడా కొంతవరకు లభిస్తాయి. సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, క్యాల్షియమ్‌లు సమృద్ధిగా ఉంటాయి. ఎముకలకు, ఇతర ధాతువులకు బలాన్ని కలుగచేస్తాయి. స్థూలకాయులు, మధుమేహ రోగులు కూడా పాలు సేవించవచ్చని, చెడు కాదని పరిశోధకుల పరిశీలన.  ఒకవేళ పాలలోని లాక్టోజు ( ్చఛ్టిౌట్ఛ) పడకపోతే మాత్రం వాంతులు, విరేచనాల వంటివి కలుగుతాయి. వైద్యుని సంప్రదించడం, పాలు సేవించడం మానెయ్యటం వంటి జాగ్రత్తలు అవసరం.గుర్తు ఉంచుకోవలసిన ముఖ్య సారాంశం:భూరి రసధాతు సారంబె క్షీరమనగశుభము బల్యంబు మేధ్యంబు శుక్రకరముసప్తధాతు పుష్టికర రసాయనంబుదేశియావు పాలకు సదా తిరుగు లేదు.పాల మీగడ వెన్నలున్‌ పరమ బలముకూర్మి సేవింప నవనీత గుణము జూచిస్థూలకాయంబు తగ్గును శోష లేకభతర భూమికి గోమాత వరము సుమ్ము!

డా. వృద్ధుల లక్ష్మీనరసింహ శాస్త్రి, ప్రముఖ ఆయుర్వే వైద్య నిపుణులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement