అణువుకన్నా సూక్ష్మం ఆత్మవిద్య!

అణువుకన్నా సూక్ష్మం ఆత్మవిద్య! - Sakshi


నచికేతోపనిషత్తు



యముడు ఇస్తానన్న మూడు వరాలలో రెండిటిని నచికేతుడు అడిగాడు. ఒకటి ఇహానికి, మానవ సంబంధాలకూ చెందినది. రెండవది స్వర్గానికి చేర్చే అగ్ని ఉపాసన. మూడవది మరణం తరువాత ఆత్మస్థితిని తెలుసుకోవటం. మూడవ వరం నచికేతుడు అడిగినట్లు ఇవ్వటానికి యముడు వెంటనే ఒప్పుకోలేదు. అతని మనస్సు మార్చటానికి ప్రయత్నించాడు. నచికేతుని శ్రద్ధను పరీక్షించి ఆత్మవిద్యను

 చెప్పనారంభించాడు.

 

నచికేతా! శ్రేయస్సు, ప్రేయస్సు అని రెండు ఉన్నాయి. వాటిలో శ్రేయస్సు శుభప్రదం. ప్రేయస్సు ఇహలోక సుఖాలకు మాత్రమే పరిమితం. ఈ రెండూ జీవులకు బాధకారణాలే. స్వర్గాది సుఖాలు ఇచ్చే శ్రేయస్సు కాక కేవలం భౌతికసుఖాలనిచ్చే ప్రేయస్సును కోరుకునేవాడు హీనుడు. శ్రే యస్సు, ప్రేయస్సు రెండూ మానవునికి ప్రయత్నిస్తే దొరికే వే. వాటిలో ఏది శాశ్వతానంద దాయకమో జ్ఞానులు మాత్రమే తెలుసుకుంటారు. వారిని ధీరులు అంటారు. అశాశ్వతమైన ప్రేయస్సును కోరుకునేవారిని మందబుద్ధులు అంటారు. నాయనా! నువ్వు బుద్ధిమంతుడివి. తాత్కాలిక సుఖాలను ఇచ్చే కోరికలను వదులుకున్నావు. అజ్ఞానులైన మానవులు చాలామంది సంపదకోసం వెంపర్లాడుతూ అగాథంలో పడిపోతున్నారు. విద్య, అవిద్య అనే రెండు దారులు ఉన్నాయి. రెండూ వేరువేరు గమ్యాలకు చేరుస్తాయి. వాటి మధ్య చాలా దూరం ఉంది. నచికేతా! నువ్వు విద్యామార్గాన్నే కోరుకున్నావు. ఎటువంటి ఐహికభోగాలకూ, ప్రలోభాలకూ నువ్వు లొంగలేదు. అవిద్యామార్గంలో వెళ్లే మూర్ఖులు తామే ధీరులమనీ, పండితులమనీ అనుకుంటారు. గుడ్డివాడితో నడిచే గుడ్డివాడిలా గోతిలో పడుతూ ఉంటారు. అజ్ఞానానికి, ధనమదంతో కళ్లు నెత్తికి ఎక్కినవారికి మోక్షమార్గం కనిపించదు. ఈలోకమే ఉంది. పరలోకం లేదు అనుకుంటూ పదేపదే నా చేతికి చిక్కుతూ ఉంటాడు.



నచికేతా! ఆత్మతత్వం అందరికీ తెలియదు. వినటం సాధ్యం కాదు. విన్నవారు అయినా సమగ్రంగా దానిని గ్రహించలేరు. అంతటి ఆత్మజ్ఞానాన్ని బోధించే ఆచార్యుడు దొరకటం కూడా ఆశ్చర్యమే. అటువంటి గురువు చెప్పిన దానిని ఆమూలాగ్రం గ్రహించగల శిష్యుడు దొరకటమూ అద్భుతమే. అల్పజ్ఞానంతో బోధించేవారి ద్వారా ఆత్మతత్త్వం బోధపడదు. ఆత్మజ్ఞాని అయిన గురువు ద్వారా మాత్రమే అది తెలుస్తుంది. ఆత్మవిద్య అణువుకన్నా సూక్ష్మం. అన్ని తర్కాలకూ అతీతం. నువ్వు తెలుసుకోవాలనుకుంటున్న ఆత్మజ్ఞానం తర్కంతో, వాదోపవాదాలతో తెలియదు. సుజ్ఞాని అయిన గురువునుండి అది లభిస్తుంది. తెలుసుకోదలచిన జిజ్ఞాసువు సత్యనిష్ఠ, స్థిరచిత్తం కలిగినవాడు అయి ఉండాలి. నువ్వు అటువంటివాడివి. నాకు అరుదుగా దొరికావు.



‘‘గురువర్యా! యమధర్మరాజా! అశాశ్వతమూ అధ్రువమూ అయిన సామగ్రితో శాశ్వతమైన వస్తువును పొందటం అసాధ్యం. నిధులు అనిత్యం. అయినప్పటికీ అశాశ్వతమైన భౌతికమైన పదార్థాలతో  శాశ్వతమైన, నిత్యమైన స్వర్గాన్ని పొందాను’’ నచికేతా! మానవులు భౌతికమైన కోరికలు తీర్చుకోవాలని చూస్తారు. యజ్ఞయాగాది కర్మలతో అనంతమైన, అభయప్రదమైన పారలౌకిక ప్రయోజనాన్ని పొందుతారు. నువ్వు వీటన్నింటిని దాటివచ్చావు. ధీరుడివై దృఢచిత్తంతో ఆత్మజ్ఞానాన్ని పొందాలనుకునే వారికి ఆదర్శంగా నిలిచావు. అంత తేలికగా అంతుపట్టనిది, గూఢమైనది, గుండె గుహలో దాగి ఉన్నదీ అతిప్రాచీనమైనది, నవీన మైనది అయిన ఆత్మను అధ్యాత్మయోగం ద్వారా తెలుసుకొని ఏకాగ్రతతో ధ్యానించి దర్శించగలిగిన ధీరునికి హర్షశోకాలకు సుఖదుఃఖాలకు అతీతమైన స్థితి లభిస్తుంది. ధర్మప్రధానమైన ఆత్మతత్వాన్ని విన్న మానవుడు ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతాడు. శాశ్వతమైన ఆనందాన్ని పొందుతాడు. నాయనా! ఈ జ్ఞానసౌధం తలుపులు నీకోసం తెరచి ఉన్నాయి.



‘‘సమవర్తీ! ధర్మాధర్మాలకు, కృతాకృతాలకు, భూతభవిష్యత్తులకు సంబంధం లేకుండా నీవు దర్శించిన ఆత్మతత్వాన్ని నాకు బోధించు’’

 ‘‘నచికేతా! అన్ని వేదాలు, తపస్సులు, ఏ పరమపదాన్ని చెబుతున్నాయో, దేనికోసం సాధకులు బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నారో, దాన్ని గురించి సంగ్రహంగా చెబుతాను విను. అదే ఓంకారం. ప్రణవాక్షరమే పరబ్రహ్మం. అదే ఉత్తమం. ప్రణవోపాసన చేసినవారి కోరికలు ఏవైనా సిద్ధిస్తాయి. ఓంకారమే శ్రేష్ఠమైన ఆలంబనం. దీన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మలోకంలో స్థిరనివాసం ఏర్పరచుకుంటాడు. ఆత్మకు చావుపుట్టుకలు లేవు. ఎటువంటి మార్పులకూ లోనుకాదు. శరీరం పోయినప్పటికీ ఆత్మ నశించదు. జన్మించదు. అది శాశ్వతం. ఆద్యంత రహితం. చంపినవాడు హంతకుడనీ, చచ్చినవాడు హతుడనీ ఆత్మజ్ఞానం లేనివాడనీ అనుకుంటారు. ఆత్మ చంపదు. చావదు. అణువుకన్నా సూక్ష్మమూ, బ్రహ్మాండం కన్నా పెద్దదీ అయిన ఆత్మ ప్రాణుల్లో దాగి ఉంది. నిష్కాముడూ, సుఖదుఃఖాలకు అతీతుడు అయిన సాధకుడు మంచిమార్గంలో నడిచే ఇంద్రియాలు, మనసు సహాయంతో మహిమాన్వితమైన ఆత్మను దర్శించుకోగలుగుతాడు. కదలకుండా కూర్చునే ఎక్కడికైనా ప్రయాణిస్తాడు. నిద్రలోనే ఎక్కడికైనా వెళతాడు. తేజోమయమైన ఆత్మ తత్త్వాన్ని ఇటువంటి వాడు తప్ప మరొకడు తెలుసుకోలేడు’’.

 - డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top