దీప కాంతుల శోభితం అరుణాచలం

In Arunachalam The Kartika Festivals Are Celebrated Grandeur - Sakshi

తిరుమలలో బ్రహ్మోత్సవాలు, శబరిమలైలో మకరజ్యోతి ఉత్సవం ఎంత వైభవంగా జరుగుతాయో ..... ప్రసిద్ధ శైవక్షేత్రం అరుణాచలంలో కార్తీగ దీపోత్సవాలు అంతటి వైభవంగా జరుగుతాయి. ఈ ఏడాది డిసెంబర్‌ ఒకటిన మొదలైన ఉత్సవాలు 14వ తేదీ దాకా జరుగుతాయి. అతి ముఖ్యమైన భరణీ దీపాన్ని ఈ నెల 10వ తేదీన అంటే వచ్చే మంగళవారం వెలిగిస్తారు. ఆ రోజు సాయంత్రం అరుణాచలం కొండ మీద  అత్యంత భారీగా దివ్య జ్యోతి దర్శనం ఇస్తుంది. పున్నమి రాత్రుల వెన్నెలతో పోటీ పడుతూ వెలిగిపోయే దివ్య జ్యోతి కాంతుల్ని దర్శించుకొనేందుకు లక్షల సంఖ్యలో భక్తులు అరుణగిరికి పయనం అవుతున్న తరుణం ఇది. దాదాపు 10, 12 కిలోమీటర్ల దూరం వరకు ఈ జ్యోతి దర్శనం ఇస్తుందంటే అతిశయోక్తి కాదు. దాదాపు రెండు వారాల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో అనేక విశిష్టతలు గోచరిస్తాయి. వీటినే కార్తీక బ్రహ్మోత్సవాలు అనికూడా అంటారు. ఇందులో మొదటి రోజున అంటే ఈ ఏడాది డిసెంబర్‌ ఒకటిన .. అరుణాచలేశ్వర ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం ప్రారంభమయింది.

అనంతరం పంచమూర్తుల ఊరేగింపు. అంటే వినాయకుడు, కుమారస్వామి, చండీశ్వర స్వామి సహా పార్వతీ పరమేశ్వరుల ఊరేగింపు జరిగింది. అదే రోజు రాత్రి అధికార నంది వాహనంపై సోమస్కందమూర్తి మాడ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. ఇక ప్రతీ రోజూ రెండు పూటలా ఉదయం సమయంలో చంద్రశేఖరమూర్తిగా, రాత్రి సోమస్కంధ మూర్తిగా ఊరేగింపు నిర్వహిస్తూ వచ్చారు. ఇక ఎనిమిదో రోజు వచ్చేసరికి ఉత్సవాలు ఊపందుకోవటం జరుగుతుంది. పదో రోజు కార్యక్రమాన్ని దృష్టిలోపెట్టుకొని చాలా మంది భక్తులు ముందుగానే విచ్చేస్తుంటారు. ఎనిమిదో రోజు అంటే నేటి ఉదయం అశ్వవాహనంపై చంద్రశేఖరమూర్తి మాడవీధులలో ఊరేగింపు. సాయంత్రం 4 గంటల నుండి భిక్షాటనమూర్తి మాఢవీధులలో ఊరేగింపు జరుగుతుంది. అదేరోజు రాత్రి పంచకళ్యాణివాహనంపై సోమస్కందమూర్తి మాడవీధులలో ఊరేగింపు జరుగుతుంది. ఇందులో నాలుగు కాళ్లు కిందకు ఆనని రీతిలో దీన్ని రూపొందించారు.

తొమ్మిదోరోజు ఉదయం పురుష మృగ వాహనంపై చంద్రశేఖరమూర్తి మాడవీధులలో ఊరేగింపు. రాత్రి కైలాస రావణ వాహనంపై సోమస్కందమూర్తి మాడవీధులలో ఊరేగింపు జరుగుతుంది. ఇక ఈ సమయానికి నెమ్మదిగా అరుణాచల క్షేత్రం భక్తులతో పోటెత్తుతుంది. డిసెంబరు 10న ఉదయం 4 గంటలకు అరుణాచలేశ్వర ఆలయంలో భరణీదీపం వెలిగిస్తారు. ఈ రోజంతా భక్తుల పూజలతో క్షేత్రం మార్మోగిపోతుంది. అదేరోజు సాయంత్రం 6 గంటలకు అరుణగిరి మీద మహాదీపం వెలుగుతుంది. దీనిని  దీపనాడార్‌ వంశస్తులు తీసుకొని రావటం సాంప్రదాయం. 600 మీటర్ల ఒత్తితో 2500 కేజీల ఆవునెయ్యితో అత్యంత వైభవంగా మహాదీపోత్సవం కాగానే అరుణగిరి కోటి కాంతులతో ధగధగాయమానంగా వెలిగిపోతుంది. ఈ వైభవాన్ని చూసేందుకు వెయ్యికనులు చాలవంటే అతిశయోక్తి కాదు. ఈ రోజున జరిగే ఊరేగింపును చూస్తుంటే ఒడలు పులకించిపోవటం ఖాయం.

అగ్ని రూపుడైన అరుణాచలేశ్వరుడు దేవేరితో కలిసి అరుణ కాంతులతో వెలిగిపోతూ దర్శనం ఇస్తారు. అరుణాచల శివ అంటూ భక్తులు స్వామి వారిని పిలుస్తూ ఊరేగింపులో పాల్గొంటారు. ఆ సమయంలో జరిగే గిరి ప్రదక్షిణ అద్భుతమైనది. వేలమంది ఒక్కసారిగా కదులుతూ గిరిని ప్రదక్షిణం చేసుకొంటారు. తర్వాత 11వ రోజున అయ్యన్‌ కొలనులో చంద్రశేఖరమూర్తి తెప్పోత్సవం. 12వరోజున పరాశక్తి తెప్పోత్సవం, 13వ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తెప్పోత్సవం, 14వ రోజున  చండికేశ్వరుని తెప్పోత్సవంతో కార్యక్రమం ముగుస్తుంది. వాస్తవానికి అరుణాచల క్షేత్రంలో ఎన్నెన్నో అద్భుతాలు గోచరిస్తాయి. అగ్ని లింగ రూపంలో స్వామివారు, అందరినీ అనుగ్రహించే అమ్మవారు, పర్వత రూపంలో నిలిచిన పరమాత్మ, కలియుగంలో మార్గదర్శనం చేసిన రమణ మహర్షి ఆశ్రమం కనిపిస్తాయి. కావ్యకంఠ మహాముని ముక్తినొందిన క్షేత్రం ఇది. అందుచేత అరుణాచల దర్శనం సకలపాప హరణం అని చెప్పుకోవచ్చు.
– వై. రమ విశ్వనాథన్‌
సీనియర్‌ పాత్రికేయులు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top