గతంతో వర్తమానం సంభాషణ

Article On Mridula Koshy Book In Sakshi Sahityam

కొత్త బంగారం  

మృదులా కోషీ రాసిన తొలి నవల, ‘నాట్‌ ఓన్లీ ద థింగ్స్‌ దట్‌ హావ్‌ హాపెన్డ్‌’– కేరళ కుగ్రామంలో అన్నాకుట్టీ వర్గీస్, మరణశయ్య మీదనుండగా ప్రారంభం అవుతుంది. దుబాయ్‌లో ఉండే సవతి చెల్లి కూతురు– నీనా, పెత్తల్లితోపాటు ఉంటుంది. కొడుకు జ్ఞాపకాలు అన్నాని విడిచిపెట్టక, మరణించడానికి ఇష్టపడదు. ఆమె నీనాతో చెప్పిన మాటలే శీర్షికకి ఆధారం: ‘జ్ఞాపకాలే నిజమైతే, జరిగిన సంగతులే కాక, జరగబోయేవి కూడా గుర్తుంటాయి’. ఆమెని తండ్రీ సవతి తల్లీ కలిసి, మద్రాసు కాన్వెంట్లో ఉంచినప్పుడు 16 ఏళ్ళ వయస్సులో, పెళ్ళి కాకుండానే గర్భవతి అవుతుంది. కుటుంబ వొత్తిడివల్లా, ఆర్థిక స్థితి సరిగ్గా ఉండకపోవడంతోనూ అక్కడి నన్స్, అన్నా నాలుగేళ్ళ కొడుకైన మధుని, ఊర్లోకొచ్చిన ఒక జర్మన్‌ జంటకప్పగిస్తారు. ఆ తరువాత కుంటివాడైన తంబీని పెళ్ళి చేసుకున్నప్పటికీ, శేషజీవితమంతా కొడుకు కోసం ఎదురు చూడ్డంలోనే గడుపుతుంది అన్నా. 

జర్మన్‌ జంటలో, భర్త ట్రైన్‌ ప్రయాణంలో కుర్రాడిని వదిలేస్తాడు. మధు మూడేళ్ళు ఢిల్లో రైల్వే స్టేషన్‌ ప్లాట్ఫామ్‌ మీద ముష్టెత్తుకునే గుంపుతో గడుపుతాడు. ఏడేళ్ళ వయస్సులో ఒక ఏజెన్సీ ద్వారా, ఒక అమెరికన్‌ కుటుంబం మధుని దత్తత తీసుకుని, ‘ఆసా గార్డనర్‌’గా మారుస్తుంది. నవల్లో మనకి పరిచయం అయ్యేది పెద్దవాడయి, తన గతకాలపు జ్ఞాపకాలతో సతమతమవుతూ ఉండి, కాలిఫోర్నియాలో తన్ని పెంచుకున్న దంపతులతోనూ, తన మాజీ భార్యా కూతురితోనూ కూడా సంబంధాలు నిలుపుకోలేకపోయిన ఆసా. 

రచయిత అనేకమైన పాత్రల దృష్టికోణాలతో కథ చెప్తారు: అన్నా సవతి తల్లి సారమ్మ, సవతి చెల్లెలు టెస్సీ, ఆమె కూతురు నీనా. రెండు భాగాల్లో ఉన్న పుస్తకం– వర్తమానానికీ గతానికీ సులభంగా మారుతూ, అన్నా మరణం తరువాత కేవలం 36 గంటల్లోనే చోటు చేసుకున్నదైనప్పటికీ, ఆ పరిధిలోనే మూడు దశాబ్దాల సంఘటనలని జ్ఞాపకాల ద్వారా కలిపి కుడుతుంది. మొదటి భాగంలో పాఠకులని కేరళ, మద్రాస్, పాండిచ్చేరి తిప్పి, రెండవ భాగంలో అమెరికాని చూపిస్తుంది. మొదటిది అన్నా గురించి మాట్లాడుతుంది. రెండవది కొడుకు చుట్టూ తిరుగుతుంది. 

తల్లీ కొడుకూ కూడా, ఊహించుకున్న ఆశాజనకమైన సంఘటనల చుట్టూ తమ జీవితాలని మలచుకుంటారు. ఉదా: అన్నకుట్టీ చివరకు తన కొడుకుని కలుసుకుంటుంది. ఆసా కూడా తనెవరో తెలుసుకుని, తల్లిని చేరుకుంటాడు.కేరళ గ్రామ ప్రజల మీద ఉండే క్రిస్టియానిటీ ప్రభావం గురించీ, దత్తత ప్రక్రియలో జరిగే మోసం, దుర్వినియోగించబడే డబ్బు గురించీ కోషీ మాట్లాడతారు. అన్నా జ్ఞాపకాలనీ, కేరళ గ్రామీణ జీవితాలనీ అద్భుతంగా వర్ణిస్తూ, పాత్రలని ఎంతో నిపుణతతో చెక్కుతారు.యువతుల ఊసులాటలప్పుడు, వారి నోట్లోంచి వెలివడే ‘అయ్యై, య్యో’లని హాస్యంగా చిత్రీకరిస్తారు.

మతం పట్ల గ్రామీణుల దృక్పథం అన్నా మృతదేహం చుట్టూ మూగినప్పుడు కనిపిస్తుంది. అది వాళ్ళకి ఆమె పట్ల ఉన్న ప్రేమవల్ల కాక, ప్రార్థన తరువాత తినబోయే ఫలహారాల కోసం ఎదురుచూపు. పుస్తకం చదవడానికి తేలికైనదే కానీ సంతోషకరమైనదని అనలేం. వచనం విషాదాన్నీ కలిగించదు. ఉత్కంఠ పెంచుతుంది. దత్తత ప్రభావం, అణచివేత గురించిన ఆలోచనలనీ రేకెత్తిస్తుంది కనుక చదవాల్సినది. అయితే, ఎన్నో సందేహాలు సమాధానం లేకుండానే మిగిలిపోతాయి. నవల కవర్‌ పేజీ వెనక, రచయిత జీత్‌ థాయిల్‌ రాసిన ఎండార్సుమెంటు ఉంది. 2013లో ‘క్రాస్‌వర్డ్‌ బుక్‌ అవార్డ్‌’ కోసం షార్ట్‌ లిస్ట్‌ అయిన ఈ నవలని హార్పర్‌ కాలిన్స్‌ ప్రచురించింది.
కృష్ణ వేణి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top