
కేసీఆర్.. ఖబడ్దార్
కుంటి సాకులు చెప్పే మహానుభావుడు.. దొరతనం చేసే పెత్తందారు.. నిరంకుశ భావాలు కలిగిన అహంకారి.. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యక్తిని ఎవరూ కూడా కోరుకోరని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య నిప్పులు చెరిగారు.
- ప్రజాస్వామ్యంలో నిన్నెవరూ కోరుకోరు...
- నాలుగో తరగతిలోనే తెలంగాణ కోసం
- బడిగంట కొట్టిన: పొన్నాల లక్ష్మయ్య
బచ్చన్నపేట/నర్మెట, న్యూస్‌లైన్ : కుంటి సాకులు చెప్పే మహానుభావుడు.. దొరతనం చేసే పెత్తందారు.. నిరంకుశ భావాలు కలిగిన అహంకారి.. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యక్తిని ఎవరూ కూడా కోరుకోరని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ పొన్నాల ల క్ష్మయ్య నిప్పులు చెరిగారు. ‘నాలుక చీరేస్తావా.. ఎంట్రికలు పీకుతావా.. ఖబడ్దార్’ అని హెచ్చరించారు. కేసీఆర్ వ్యవహార శైలిపై జనాభాలో 87 శాతం ఉన్న మైనార్టీలు, దళితులు, వెనుకబడిన తరగతుల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన సినీనటి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి జయసుధతో కలిసి వరంగల్ జిల్లా జనగామ నియోజకవర్గం బచ్చన్నపేట, నర్మెటలో జరిగిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ యాభై తొమ్మిదేళ్ల కిత్రం..మదరాసు నుంచి ఆంధ్రోళ్లను నిజాం పాలన (మన తెలంగాణ)లో కలుపుతారట.. అంటూ పట్నం పిల్లగాళ్లు చెప్పగానే బళ్లో బడి గంట కొట్టి ఆనాడే ఉద్యమ బాట పట్టానని పొన్నాల ల క్ష్మయ్య చెప్పారు. నాన్ ముల్కీ గో బ్యాక్, విశాలాంధ్ర వద్దు, తెలంగాణ ముద్దు అనే నినాదాలతో నాడే రోడ్డు ఎక్కామన్నారు. 26 కొత్త రాష్ట్రాల డిమాండ్ ఉన్నా.. సోనియా 2009న చేసిన ప్రకటనకు కట్టుబడి సాహసోపేత నిర్ణయం తీసుకుని తెలంగాణ ఇచ్చారన్నారు.
తొలి సీఎం పొన్నాల : జయసుధ
తెలంగాణలో జరుగుతున్న తొలి ఎన్నికల్లో కాంగ్రెస్సే విజయం సాధిస్తుందని... మొట్టమొదటి సీఎం పదవి పొన్నాల లక్ష్మయ్యకే దక్కనుందని సినీ నటి, ఎమ్యెల్యే జయసుధ పేర్కొన్నారు. బచ్చన్నపేటలో ఆమె విలేకరులతో మాట్లాడారు. పవన్ కల్యాణ్ వంటి వ్యక్తులు ఓట్లు వేయొద్దని చెబితే ప్రజలు వినే పరిస్థితుల్లో లేరని... ఆయన హీరోయిజం సినిమాల వరకే పరిమితమని విమర్శించారు.