మారుతున్న సమీకరణలు | The equations are changing rapidly approaching elections | Sakshi
Sakshi News home page

మారుతున్న సమీకరణలు

Apr 26 2014 2:08 AM | Updated on Aug 14 2018 4:21 PM

ఎన్నికలు సమీపించే కొద్ది సమీకరణలు వేగంగా మారుతున్నాయి. జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన కుటుంబాలు సైతం టీడీపీ అధినేత చంద్రబాబు కోటరీ కారణంగా నిర్లక్ష్యానికి గురయ్యాయి.

సాక్షి ప్రతినిధి, కడప: ఎన్నికలు సమీపించే కొద్ది సమీకరణలు వేగంగా మారుతున్నాయి. జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన కుటుంబాలు సైతం టీడీపీ అధినేత చంద్రబాబు కోటరీ కారణంగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. ప్రజాభిమానంతో నిమిత్తం లేకుండా, డబ్బే ప్రధాన అర్హతగా పావులు కదుపుతుండటంతో నాయకులు జీర్ణించుకోలేకున్నారు. వెర సి తెలుగుదేశం పార్టీని వీడేందుకు బలమైన నేతలు సమాయత్తమవుతున్నారు. జిల్లాలో టీడీపీకి బుద్ధి చెప్పాలనే తలంపుతో తదనుగుణంగా అడుగులేస్తున్నారు. అందులో భాగంగా అపార ప్రజామద్దతున్న వైఎస్సార్‌సీపీ వైపు మొగ్గుచూపుతున్నారు.
 
 జిల్లాలో రాజకీయ పార్టీలు ఎలా ఉన్నా గ్రూపులకే ప్రాధాన్యత ఉండేది. ప్రధానంగా దివంగత నేతలైన వైఎస్ రాజశేఖరరెడ్డి, కందుల ఓబులరెడ్డి గ్రూపులు ఉండేవి. ఎన్నికలు ఏవైనా ఆయా గ్రూపులే తలపడేవి. అందులోభాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కందుల గ్రూపును ఎన్నికల కోసం  బాగా వాడుకునేవారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిపై ప్రత్యక్ష పోటీకి పురమాయించారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీకి కందుల కుటుంబమే దిక్కుగా ఉండేది. అలాంటి పరిస్థితుల నుంచి  కందుల కుటుంబాన్ని పూర్తిగా నిర్లక్ష్యానికి గురిచేశారని పరిశీలకుల అభిప్రాయం.
 
 రెండు దశాబ్ధాలుగా ప్రతి ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు కందుల బ్రదర్స్‌ను సంప్రదించి, కడప పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థులను ఎంపిక చేసేవారు. ఆపరిస్థితిని ఈమారు పూర్తిగా విస్మరించారు. అందుకు కారణం పోట్లదుర్తి గ్రామవాసి,  రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కారకుడుని, కందుల వర్గం బలంగా విశ్వసిస్తోంది. ఈపరిస్థితిలో ప్రాధాన్యతలేని పార్టీలో అంటిపెట్టుకుని ఉండడం కంటే అభిమానించే నాయకులతో మైత్రి చేసేందుకు కందుల సోదరులు సమాయత్తమైనట్లు సమాచారం.
 
 వైఎస్సార్‌సీపీలోకి మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ....
 టీడీపీ పొలిట్‌బ్యూరో మాజీ సభ్యుడు కందుల రాజమోహన్‌రెడ్డి, కడప మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి, పట్టభద్రుల పశ్ఛిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్సీ ముండ్ల వెంకటశివారెడ్డిలతో పాటు, కందుల కుటుంబ సన్నిహితులు వైఎస్సార్‌సీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. జిల్లా రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించే కందుల రాజమోహన్‌రెడ్డిని తెలుగుదేశం పార్టీ పూర్తి నిర్లక్ష్యానికి గురి చేసిందనే చెప్పాలి. అధినేత చంద్రబాబు సానుకూలత చూపినా, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సైంధవుడిలా అడ్డుపడుతుండటంతో  కందుల సోదరులు తీవ్రమనస్థాపానికి గురైనట్లు సమాచారం. టీడీపీలో సీఎం రమేష్ కారణంగా ఎదురవుతున్న పరాభావానికి ప్రతీకారం చూపాలనే దిశగా వారు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
 
 పోట్లదుర్తి గ్రామస్థాయికే పరిమితమైన సీఎం రమేష్ మాటకు విలువనిచ్చి, జిల్లా వ్యాప్తంగా అనుచరవర్గం, బంధువర్గం కల్గిన  కందుల సోదరులను విస్మరించడంపై వారి  అనుచరులు రగిలిపోతున్నట్లు సమాచారం ఆమేరకు ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకోవాలనే తలంపుతో కందుల రాజమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వెంకట శివారెడ్డి, శనివారపు శంకర్‌రెడ్డి, కందుల చంద్రఓబుల్‌రెడ్డి, కందుల మదన్‌మోహన్‌రెడ్డి తదితరులు వైఎస్సార్‌సీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు  తెలుస్తోంది. ఆమేరకు శనివారం జిల్లాలోని వైఎస్సార్‌సీపీ నేతలంతా కందుల  నివాసానికి తరలిరానున్నట్లు తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement