బ్రెయిలీ దీపాలు

బ్రెయిలీ దీపాలు - Sakshi


పుట్టుకతోనే అంధత్వం ఉన్న జగదీశ్‌బాబు పట్టుబట్టి డిగ్రీ పూర్తి చేశారు. అదే పట్టుదలతో టీచర్ వృత్తిని ఎంచుకున్నారు. అంతటితో తన కష్టాలు గట్టెక్కాయని కదా అని ఆయన ఊరుకోలేదు. తోటి అంధ టీచర్లకు తను ఏ విధంగా ఉపయోగపడగలనని ఆలోచించారు. ఆ ఆలోచనకు కార్యరూపమే ఈవారం మన ‘మిణుగురులు’.

 

-నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

 

 జగదీశ్‌బాబు స్వస్థలం విశాఖపట్నం పద్మనాభ మండలంలోని రెడ్డిపల్లి. తండ్రి శ్యామలరావు, తల్లి నిర్మల. ముగ్గురు కుమారులలో రెండవ సంతానం జగదీశ్‌బాబు. మేనరికం కారణంగా జగదీశ్‌తో పాటు పెద్దబ్బాయి రవి శంకర్ కూడా అంధుడుగానే జన్మించాడు.

 జగదీశ్‌బాబు రెడ్డిపల్లిలోనే ప్రైమరీ పాఠశాలలో టీచర్‌గా విధులను నిర్వర్తిస్తున్నారు. సాధారణ విద్యార్థులకు బోధించే పాఠ్యపుస్తకాలను అంధులైన టీచర్లు చదవలేరు. అలాంటప్పుడు విద్యార్థులకు సరైన బోధన అందదు. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను బ్రెయిలీ లిపిలోకి అనువదించి, వాటిని ప్రింట్ చేయించి, అంధులైన టీచర్లకు ఉచితంగా అందజేయాలనుకున్నారు జగదీశ్. అయితే, అది అంత సులువైన పని కాదు. ఎంతో సమయం, మరెంతో డబ్బు అవసరం అవుతాయి. ఇందుకోసం కలెక్టర్ అనుమతి తీసుకున్నారు. కొంద రు పెద్దల సాయం తీసుకున్నారు. తనే స్వయంగా పాఠ్య పుస్తకాలను బ్రెయిలీ లిపిలోకి అనువ దించారు. వాటిని ప్రింట్ చేయించారు. ‘‘ఇప్పటివరకు 5,436 మంది అంధ ఉపాధ్యాయులకు బ్రెయిలీ లిపిలోకి మార్చిన పుస్తకాలను అందజేశాను. 2010 నుంచి ఈ పనిని ఓ యజ్ఞంలా చేపట్టాను. రెండేళ్ల పాటు అనువదించాను. ఒక్కో సంవత్సరం ఒక్కో తరగతి పుస్తకాలు మారుతుంటాయి. అలా మారిన కొత్త పుస్తకాలను అనువదించాల్సిందే! డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా ఒకరిని నియమించుకొని ఈ పని చేస్తున్నాను’’ అని వివరించారు జగదీశ్‌బాబు. వీటితో పాటూ పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అంధ విద్యార్థుల కల నిజం చేయాలనే సంకల్పంతో వారికి కావల్సిన మెటీరియల్‌ను సీడీల రూపంలోనూ ఉచితంగా అందజేస్తున్నారు జగదీశ్. అలాగే ‘ఆసరా’ అనే స్వచ్ఛంద సేవాసంస్థను ఏర్పాటు చేసి ఎన్నో సేవాకార్యక్రమాలనూ నిర్వహిస్తున్నారు.



వచ్చే జీతం నుంచే...



సంపాదించిన మొత్తాన్ని సమాజసేవకు ఉపయోగించాలనుకునేవారు చాలా తక్కువమంది. అయితే జగదీశ్‌బాబు తనకు నెలనెలా వచ్చే  జీతంలో నుంచే ఈ సేవా కార్యక్రమాలన్నీ చేయడం విశేషం. ఇందుకు ముందుగా అమ్మానాన్నల అనుమతి తీసుకున్నారు జగదీశ్‌బాబు. ‘‘నాకు నెలకు 26 వేల రూపాయల జీతం వస్తుంది. బ్రెయిలీ ప్రింటర్ కొనుగోలుకు బ్యాంక్ లోను తీసుకున్నాను. లోనుకు 3000లు పోగా మిగిలే 23,000 ఈ పనికోసం పెడుతున్నాను. అమ్మనాన్న, నా కుటుంబం, అన్నయ్య కుటుంబం అంతా కలిసే ఉంటాం. ‘వ్యవసాయం వల్ల వచ్చే ఆదాయం మన తిండికి, బట్టకు ఎలాగూ సరిపోతుంది. నా జీతాన్ని సేవాకార్యక్రమాలకు ఉపయోగించుకునే అవకాశమివ్వ’మని కోరాను. అందుకు అమ్మానాన్న ఒప్పుకున్నారు. ఐదేళ్ల క్రితం పెళ్లయింది. మా పోషణ కూడా అమ్మనాన్నలే చూస్తున్నారు. అందుకు వారికి నేను ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను’’ అని చెప్పారు జగదీష్.

 

మానేసినవారిని... మళ్లీ బడికి...



ఆర్థికస్థోమత లేని కారణంగా అర్థంతరంగా చదువులు మానేసే ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు తగినంత ఆర్థికసాయం చేస్తూ తిరిగి వారిని బడిలో చేర్పిస్తున్నారు జగదీశ్. ‘‘ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పిల్లలలో కొందరు పెన్సిల్ కూడా కొనలేని పరిస్థితిలో ఉంటారు. అలాంటి పిల్లలు స్కూల్ నుంచి డ్రాపవుటవుతుంటారు. వారికి యూనిఫామ్‌లు, ఫీజులు, స్కాలర్‌షిప్‌లు ఇచ్చి తిరిగి స్కూల్లో చేర్చే ప్రయత్నం చేస్తుంటాను. ఇందుకు టీచర్ ఉద్యోగం చేస్తున్న అన్నయ్య రవిశంకర్, బెంగుళూర్‌లో ఉద్యోగం చేస్తున్న మా తమ్ముడు కిశోర్ కొంత సాయం చేస్తుంటారు. మా స్నేహితుడు అమెరికాలో ఉన్నాడు. అతని నుంచి కొంత సాయం తీసుకుంటాను. పేద పిల్లలను చదివించమని స్థితిమంతులను వేడుకుంటాను. అలా కొందరు పిల్లల విద్యాబుద్ధుల బాధ్యత తీసుకున్నవారూ ఉన్నారు’’ అని వివరించారు జగదీశ్.

 

ఆశయానికి ఊతం



జగదీష్ బాబు అర్ధాంగి జ్యోతి కూడా అతని ఆశయంలో తోడుగా నిలిచింది. ఈ విషయం గురించి చెబుతూ - ‘జ్యోతి మాకు దూరపు బంధువే! అయితే పెళ్లయ్యేంతవరకు ఆ విషయం తెలియదు. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. తను డిగ్రీ వరకు చదువుకుంది. బ్రెయిలీ ప్రింటింగ్‌ను జ్యోతి మానిటర్ చేస్తుంది. ఎన్ని బుక్స్ తయారవుతున్నాయి, ఎవరెవరికి పంపించాలి అనే వన్నీ తనే చూస్తుంది. మాకో పాప. నా ఆశయానికి సహకరించే ఇల్లాలు దొరికినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటుంటాను’’ అన్నారు జగదీష్.

 కంటి చూపు లేకపోయినా సమాజం పట్ల కనీస బాధ్యతతో ఉన్న జగదీష్‌బాబు లాంటివారంతా దివ్యదృష్టి ఉన్నవారే!

 

నా భర్త చేస్తున్న సమాజ సేవ  గురించి నాకు పెళ్లికి ముందే తెలుసు. నలుగురికి సాయపడాపలనే తపన గల కుటుంబం వారిది. అలాంటి కుటుంబంలో నేను ఆనందంగా ఉంటాను అనిపించింది. అందుకే ఈ పెళ్లికి సంతోషంగా ఒప్పుకున్నాను. ఏవో చిన్న చిన్న పనులు చేస్తూ ఆయనకు సహాయంగా ఉంటున్నాను.

 - జ్యోతి,

 జగదీశ్ బాబు భార్య

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top