నామినేషన్ల కోలాహలం | Nominations extravaganza | Sakshi
Sakshi News home page

నామినేషన్ల కోలాహలం

Mar 20 2014 2:26 AM | Updated on Sep 2 2017 4:55 AM

స్థానిక సంస్థలకు సంబంధించి నామినేషన్లు పోటెత్తాయి.

చిత్తూరు (అర్బన్), న్యూస్‌లైన్: స్థానిక సంస్థలకు సంబంధించి నామినేషన్లు పోటెత్తాయి. బుధవారం ఒక్క రోజే జెడ్పీటీసీ స్థానాలకు 232, ఎంపీటీసీ స్థానాలకు 2,296 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పెట్టిన జై సమైక్యాంధ్ర పార్టీకి కేవలం అయిదు నామినేషన్లే వచ్చాయి.
 
 ఒక్క రోజే 232 నామినేషన్లు
 ఈనెల 17నుంచే జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. తొలిరోజు పాడ్యమి, రెండో రోజు మంగళవారం రావడంతో కేవలం ఐదు నామినేషన్లు పడ్డాయి. బుధవారం జిల్లా పరిషత్ కార్యాలయం అభ్యర్థులతో సందడిగా మారింది. ఈ ఒక్క రోజే 65 జెడ్పీటీసీ స్థానాలకుగాను 232 నామినేషన్లు దాఖలయ్యాయి.
 
 నామినేషన్లు వేయడానికి వచ్చిన అభ్యర్థులు, వారి ప్రతిపాదకులు, బంధువులతో చిత్తూరు-వేలూరు రోడ్డు నిండిపోయింది. పోలీసులు ముందస్తుగానే ఈ రోడ్డులో భారీ వాహనాలను నిషేధించారు. అభ్యర్థుల తాకిడి ఎక్కువ కావడంతో చిత్తూరు వన్‌టౌన్ సీఐ షాదిక్‌అలీ ఆధ్వర్యంలో జెడ్పీ వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
 
 గందరగోళం
 జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు వేయడానికి వచ్చిన అభ్యర్థులకు ఇబ్బందులు తప్పలేదు. ప్రధానంగా జెడ్పీటీసీగా పోటీ చేయడానికి వచ్చిన చాలామంది అభ్యర్థుల పేర్లు ఓటర్ల జాబితాలో కనిపించలేదు. ఇందులో కురబటకోట నుంచి నామినేషన్ వేయడానికి వచ్చిన ధనలక్ష్మి పేరు ఆ మండల ఓటర్ల జాబితాలో కనిపించలేదు. పీటీఎం నుంచి వచ్చిన అనితామురళి, గుడిపాల నుంచి పోటీచేయడానికి వచ్చిన లక్ష్మి, విజయపురం నుంచి వచ్చిన గీతమ్మలతో పాటు పదుల సంఖ్యలో అభ్యర్థుల పేర్లు ఓటర్ల జాబితాలో గల్లంతయ్యాయి.
 
 నామినేషన్లు స్వీకరించే అధికారులు అభ్యర్థిల్ని జిల్లా పంచాయతీ అధికారిని కలవాల్సిందిగా ఆదేశించారు. చేసేదేమీలేక నామినేషన్లు వేయడానికి వచ్చిన అభ్యర్థులు గంటల తరబడి వేచివుండి డీపీవో వద్ద ఉన్న మస్టర్ ఓటర్ల జాబితాలో పేర్లు చూసుకుని వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు.
 
 నేడు 300 వరకు వచ్చే అవకాశం
 జెడ్పీటీసీ నామినేషన్ల దాఖలకు గురువారం ఆఖరి రోజు కావడంతో దాదాపు 300 వరకు అభ్యర్థుల వచ్చే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. చివరి రోజున ఇబ్బందులు కలగకుండా రిటర్నింగ్ అధికారి రవిప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో అన్ని అదనపు ఏర్పాట్లు చేశారు. గురువారం సాయంత్రం 5 గంటల వరకు జెడ్పీ సమావేశపు హాలులోనికి వస్తారో వారి నామినేషన్లు అన్నింటినీ స్వీకరిస్తారని ఆర్‌వో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement