అనంత కార్పొరేషన్ బరిలో 222 మంది పోటీ | Infinite corporation to compete in the ring 222 | Sakshi
Sakshi News home page

అనంత కార్పొరేషన్ బరిలో 222 మంది పోటీ

Mar 19 2014 2:50 AM | Updated on Jun 1 2018 8:47 PM

మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లకు నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 222 మంది బరిలో మిగిలారు.

అనంతపురం కార్పొరేషన్, న్యూస్‌లైన్: మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లకు నామినేషన్ల ఉపసంహరణ అనంతరం  222 మంది బరిలో మిగిలారు. వైఎస్‌ఆర్‌సీపీతో పొత్తు పెట్టుకున్న సీపీఎంకు 42, 49, 50వ డివిజన్లు, సీపీఐకి 2వ, 9వ డివిజన్ కేటాయించడంతో ఆ డివిజన్లలో వైఎస్‌ఆర్‌సీపీ తన అభ్యర్థులను నిలపలేదు. పొత్తులో భాగంగా 40వ డివిజన్‌ను సీపీఐకి ఇవ్వాల్సి ఉండగా పొత్తు ఖరారయ్యే సమయానికి  వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసి వ్యక్తికి పార్టీ బి-ఫారం ఇచ్చింది. దీంతో ఈ డివిజన్‌లో స్నేహపూర్వక పోటీ నెలకొంది.  49 డివిజన్లలో పోటీ చేస్తున్న టీడీపీ 4వ డివిజన్లో అభ్యర్థిని నిలపలేదు. ఇక్కడ మాజీ మంత్రి జేసీదివాకర్‌రెడ్డి ప్రధాన అనుచరుడు కోగటం విజయభాస్కర్‌రెడ్డి భార్య శ్రీదేవి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. దివాకర్‌రెడ్డి ఇప్పటికే టీడీపీలోకి చేరేందుకు సిద్ధమయ్యారు.
 
 దీంతో ఆయన అనుచరుడు కోగటం విజయభాస్కర్‌రెడ్డి భార్య పోటీ చేస్తున్న డివిజన్‌లో పోటీ ఉంచలేదు.ఇదిలా ఉండగా  71 మంది స్వతంత్ర అభ్యర్థులు  బరిలో నిలిచారు. వీరిలో వైఎస్‌ఆర్‌సీపీ, తెలుగుదేశం పార్టీలకు చెందిన రెబల్ అభ్యర్థులు కూడా ఉన్నట్లు సమాచారం. ఇది ఒక రకంగా ఈ రెండు పార్టీలకు సంకట పరిస్థితిగా మారింది. ప్రస్తుతం ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్యనే తీవ్ర పోటీ ఉండడంతో తప్పని సరిగా ఇండిపెండెంట్ల ప్రభావాన్ని ఎదుర్కొక తప్పని పరిస్థితి నెలకొంది.
 
 బరిలో పార్టీల అభ్యర్థులు
 ఎన్నికల బరిలో 50 డివిజన్లకు 222 మంది పోటీ చేస్తున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు 45 మంది, తెలుగుదేశం పార్టీ తరఫున 49 మంది, బీఎస్‌పీ 4, బీజేపీ 11, సీపీఐ 3, సీపీఎం 3, కాంగ్రెస్ 22, లోక్‌సత్తా 6, ఇతర పార్టీలు 8, స్వతంత్ర అభ్యర్థులు 71 మంది ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
 
 మాక్ పోలింగ్ తప్పనిసరి
  శిక్షణ సమావేశంలో డీఆర్వో హేమసాగర్
 మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ నిర్వహించే గంట ముందు ఈవీఎంల పనితీరు సరి చూసుకునేందుకు మాక్ పోలింగ్ తప్పనిసరిగా నిర్వహించాలని డీఆ ర్వో హేమసాగర్ సూచించా రు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో మున్సిపల్ ఎన్నికల్లో మాస్టర్ ట్రైనర్‌లుగా నియమితులైన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ  పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్‌ను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్లు పనితీరులో ఎలాంటి సమస్యలు లేకుండా సరిచూసుకోవాలన్నారు. రియల్ పోలింగ్ ప్రారంభానికి ముందు కంట్రోల్ యూనిట్ రీడింగ్ జీరో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.  పోలింగ్ పూర్తి కాక ముందే ఎట్టి పరిస్థితుల్లోనూ కంట్రోల్ యూనిట్‌లో క్లోజ్ బటన్ నొక్కకూడదని హెచ్చరించారు. పోలింగ్ పూర్తై తర్వాత కంట్రోల్ యూనిట్‌లో క్లోజ్ బటన్ ప్రెస్ చేసి సీల్ వేయాలన్నారు. ఈవీఎంలు ఏర్పాటు నుంచి ఎలా వినియోగించాలన్న అంశంపై కలెక్టరేట్ ఎన్నికల విభాగం డీటీ భాస్కర్ నారాయణ కూలంకుషంగా వివరిస్తూ శిక్షణ ఇచ్చారు.                       - న్యూస్‌లైన్, అనంతపురం కలెక్టరేట్
 
 పొందు నష్టం.. పోరు లాభం
 
  టీడీపీతో పొత్తుపై కమలనాథులు  ా ఒంటరిగానే బరిలోకి..
  పన్నెండు మందికి ‘బి’ ఫారాలు
 
 టీడీపీతో పొత్తుపై కార్యకర్తల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఒంటరి పోరుకే బీజేపీ ఓటేసింది. సొంతంగా బలమున్న చోట మాత్రమే పోటీ చేసి కొన్ని స్థానాలను గెలుచుకుంటే చాలనుకుంది. ఇందులో భాగంగానే కార్పొరేషన్‌లోని 12 స్థానాల్లో నామినేషన్ వేసిన అభ్యర్థులకు మంగళవారం ‘బీ’ ఫారాలు ఇచ్చి ఒంటరిగానే సత్తా చాటుకునేందుకు సంసిద్ధమైంది. కార్పొరేషన్ పరిధిలో తొలుత 13 స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ నాయకులు రంగం సిద్ధం చేశారు. అయితే 25వ వార్డులో నామినేషన్ వేసిన అభ్యర్థినికి టీడీపీతో సంబంధాలున్నట్లు భావించడంతో బీ ఫారం నిరాకరించారు.  
 
 బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి నేతృత్వంలో  పోటీ చేస్తున్న అభ్యర్థులు   పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి అధికారులకు బీ ఫారాలు అందజేశారు. అనంతరం వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఓటమి భయంతోనే  కాంగ్రెస్ పార్టీ ఎనిమిదేళ్లపాటు స్థానిక ఎన్నికలు నిర్వహించలేదన్నారు.   సీమాంధ్రుల మనోభావాలకు విరుద్ధంగా  రాష్ట్ర విభజనకు తెగబడడంతో, ప్రస్తుతం ఆ పార్టీకి పోటీ చేసేవారు కరువయ్యారన్నారు. ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోతుందని జోస్యం చెప్పారు. మంచి నడవడిక, దేశభక్తి కల్గిన బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.   క్షేత్ర స్థాయిలో టీడీపీతో పొత్తును కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఒంటరిగానే పోటీ చేస్తున్నామన్నారు.  మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ కమ్యూనిస్టులతో జత క ట్టనుందని తెలిశాక సిద్ధాంత వైరుధ్యమున్న పార్టీలతో చెలిమి కష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు.     
 - న్యూస్‌లైన్, అనంతపురం కల్చరల్
 
 మడకశిరలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరాలి
 మడకశిర, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ మడకశిర పార్టీ నాయకులను కోరారు. మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో మంగళవారం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు పార్టీకి అత్యంత కీలకమైనవన్నారు. మడకశిరలోని 20 వార్డుల్లోనూ గెలుపు సాధించేందుకు కృషి చేయాలన్నారు.
 
 చైర్మన్ సీటును సాధించడం ద్వారా, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో విజయానికి బాటలు వేయాలన్నారు. వార్డుల్లో ప్రచారం ముమ్మరం చేయాలని కోరారు.  కోఆర్డినేటర్ డాక్టర్ తిప్పేస్వామి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలను కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే వైటీప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్,టీడీపీలకు బుద్ధిచెప్పాలని విజ్ఞప్తి చేశారు.జిల్లా అధికార ప్రతినిధి వైసీగోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో సమైక్యంగా పని చేసి పార్టీని గెలిపించాలని కోరారు.ఈసమావేశంలో స్థానిక నాయకులు మున్సిపల్ అభ్యర్థులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
 
 మేయర్ పదవిపై టీడీపీలో డైలమా
 
 వైఎస్‌ఆర్‌సీపీ ముందడుగుతో కంగుతిన్న నేతలు
 మేయర్ పదవిని ఏ వర్గానికి కట్టబెట్టాలన్న అంశంపై టీడీపీ నేతలు  డైలమాలో పడ్డారు. బలిజ సామాజిక వర్గానికి మేయర్ పదవి, ముస్లిం వర్గానికి డిప్యూటీ మేయర్ పదవి ఇస్తామంటూ  వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల సమక్షంలో ప్రకటించడంతో టీడీపీ నేతలు కంగుతిన్నారు.  ఈ నిర్ణయాన్ని ఎదుర్కొనేందుకు ఏం చేయాలన్న అంశంపై  ఆ పార్టీ నాయకుల్లో చర్చ మొదలైంది.  వైఎస్సార్‌సీపీ ప్రకటనతో తమ పార్టీ నేతలు కలవరపాటుకులోనయ్యారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం తమ పార్టీ నీతలు మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను ఏ సామాజిక వర్గాలకు ఇవ్వాలన్న విషయం వెల్లడి చేసేందుకు సాహసించలేని స్థితి లో ఉన్నారని వారు అంటున్నారు. ఈ ప్రకటనతో వైఎస్సార్‌సీపీ ఓ అడుగు ముందుకు వేయగా, ఆ మేరకు రాజకీయంగా టీడీపీపై తొలి వేటు పడిందని చెబుతున్నారు. తమ పార్టీ నాయకులు ఏ విషయంలోనూ నిర్దిష్టమైన నిర్ణయాన్ని ఎప్పటికీ తీసుకోలేరని ఆపార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు అంటున్నారు.  రాష్ట్ర విభజన విషయంలోనూ తమ పార్టీ అధినేత ‘కొబ్బరి చిప్పల’ నాయ్యం అంటూ ఇలాగే వ్యవహరించారని ఉదహరిస్తున్నారు.  
 - న్యూస్‌లైన్, అనంతపురం కార్పొరేషన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement