ఈ చరిత్ర ఓటు సిరాతో... | Indian history created by Vote Ink | Sakshi
Sakshi News home page

ఈ చరిత్ర ఓటు సిరాతో...

Mar 23 2014 4:20 AM | Updated on Aug 29 2018 8:54 PM

1952.. భారతావనిలో తొలి ఎన్నికల పండుగ. అరకొర ఏర్పాట్లు.. చాలీచాలని సిబ్బందితోనే ఎన్నికలు జరిగాయి. రూ.10 కోట్ల ఖర్చుతో దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగిశాయి.

1952.. భారతావనిలో తొలి ఎన్నికల పండుగ. అరకొర ఏర్పాట్లు.. చాలీచాలని సిబ్బందితోనే ఎన్నికలు జరిగాయి. రూ.10 కోట్ల ఖర్చుతో దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగిశాయి. ఆ ఎన్నికల్లో జవహర్‌లాల్ నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పట్నుంచి ఇప్పటి వరకు 15 సార్లు లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. తొలినాళ్లలో ఏకపార్టీ ప్రభుత్వాలు సుస్థిర పాలనను అందించగా, ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీ ఆవిర్భావంతో సంకీర్ణాల యుగం మొదలైంది.

ఎన్నికల భారతంఅధికార పార్టీ /కూటమి గెలిచిన సీట్లు
* ప్రభుత్వాల  పదవీ కాలం సంవత్సరాల్లో
* ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం

 
 1. స్వతంత్ర భారతంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలు. ఉత్తరప్రదేశ్‌లోని ఫూల్‌పూర్ నుంచి విజయం సాధించిన  నెహ్రూ మొదటి ప్రధానిగా పీఠాన్ని అధిష్టించారు. బొంబాయి నుంచి పోటీ చేసిన రాజ్యాంగ రచయిత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓటమి పాలయ్యారు.
2. ఈ ఎన్నికల ద్వారా ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చారు. యూపీలోని రాయ్‌బరేలీ నుంచి గెలుపొందారు. భారతీయ జనసంఘ్ తరఫున యూపీలోని బలరామ్‌పూర్ నుంచి పోటీ చేసి వాజ్‌పేయి తొలిసారి నెగ్గారు.
3. కాంగ్రెస్ 361 స్థానాలను గెలుచుకుని హ్యాట్రిక్ కొట్టింది. సీపీఐ 29 సీట్లను గెల్చుకుంది. దేశం ఇద్దరు ప్రధానులను కోల్పోయింది. నెహ్రూ 1964 మేలో కన్నుమూయగా.. తర్వాతి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 1966లో మరణించారు.
4. సీట్ల సంఖ్య బాగా తగ్గినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇందిర ప్రధాని అయ్యారు. 1969లో కాంగ్రెస్ రెండుగా చీలింది. కాంగ్రెస్ (ఓ-ఆర్గనైజైషన్) నుంచి కాంగ్రెస్  (ఆర్) ఆవిర్భవించింది.
5. మొట్టమొదటి మధ్యంతర ఎన్నికలివి. మొత్తం 518 సీట్లకుగాను కాంగ్రెస్(ఆర్) 352 సీట్లను నెగ్గి వరుసగా ఐదోసారి అధికార పీఠంపై కూర్చుంది. ఇందిర ప్రధాని అయ్యారు. ఆమె ఇచ్చిన ‘గరీబీ హటావో’ నినాదంతో కాంగ్రెస్ ప్రభంజనం కొనసాగింది. 1967 ఎన్నికలతో పోలిస్తే 69 సీట్లను అదనంగా గెల్చుకుంది.
6. మూడు దశాబ్దాల కాంగ్రెస్ పాలనకు చరమగీతం పలికిన ఎన్నికలివి. 1975-77 మధ్య 19 నెలలపాటు ఇందిర విధించిన ఎమర్జెన్సీ కాంగ్రెస్ పరాజయానికి కారణమైంది. ఇందిరతోపాటు సంజయ్ ఓటమిని మూటగట్టుకున్నారు. జనతా పార్టీ అధికారంలోకి వచ్చి మొరార్జీ దేశాయ్ గద్దె నెక్కారు.
7. దేశంలో రెండోసారి జరిగిన మధ్యంతర ఎన్నికలు. ఇందిర నాలుగోసారి ప్రధాని అయ్యారు. కాంగ్రెస్ మద్దతిస్తా మనడంతో 1979లోచరణ్ సింగ్ ప్రధానిగా ప్రమాణం చేశారు. పార్లమెంట్ మొహం చూడకుండానే మధ్యంతర ఎన్నికలు వచ్చాయి.
8. ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన ఎన్నికలివి. రాజీవ్‌గాంధీ నాయకత్వంలో జరిగిన ఎన్నికల్లో 404  సీట్లు గెల్చుకుని కాంగ్రెస్  విజయం సాధించింది.  రాజీవ్  ప్రధాని పీఠమెక్కారు. ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్టీఆర్ ప్రభంజనంతో టీడీపీ 30 స్థానాల్లో  నెగ్గింది.
9. రెండోసారి కాంగ్రెసేతర ప్రభుత్వం కొలువు దీరింది. రాజీవ్‌గాంధీ ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్‌ను బోఫోర్స్ స్కాం దెబ్బతీసింది. 197 స్థానాలే గెల్చుకుంది.  వీపీసింగ్ నేతృత్వంలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడింది.
10. రామాలయం కోసం రథయాత్ర చేసిన అద్వానీని వీపీ సింగ్ ప్రభుత్వం.. అరెస్టు చేసింది. దీంతో నేషనల్ ఫ్రంట్‌కు బీజేపీమద్దతు ఉపసంహరించు కుంది.  కాంగ్రెస్ మద్దతుతో చంద్రశేఖర్ పగ్గాలు చేపట్టారు. 1991లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి
 వ చ్చింది. పీవీ నరసింహారావు  ప్రధాని అయ్యారు.
11.ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ దక్కలేదు. బీజేపీ 161 ఎంపీ స్థానాలు గెల్చుకుంది. పార్లమెంట్‌లో మెజారిటీ నిరూపించుకోలేక 13 రోజులకే వాజ్‌పేయి గద్దె దిగారు. తర్వాత దేవెగౌడ, గుజ్రాల్ ప్రభుత్వాలు ఏర్పడ్డా మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలాయి.
12. ఈ ఎన్నికల తర్వాత వాజ్‌పేయి ప్రధాని పీఠమెక్కారు. ఎన్డీయే నుంచి అన్నా డీఎంకే వైదొలగడంతోఅవిశ్వాస పరీక్ష  ఎదుర్కొన్నారు. ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం పడిపోయింది. వాజ్‌పేయి 13 నెలలే ప్రధానిగా  ఉన్నారు.
13. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధం బీజేపీకి కలిసొచ్చింది. ఎన్డీఏ కూటమికి 299 సీట్లు దక్కాయి. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలకు 139 సీట్లు వచ్చాయి. థర్డ్‌ఫ్రంట్ 41 సీట్లతో సరిపెట్టుకుంది. వాజ్‌పేయి సర్కారు 6 నెలల ముందే ఎన్నికలకు వెళ్లింది.
14. కాంగ్రెస్ నేతత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చింది. మన్మోహన్‌సింగ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. పీవీ తర్వాత గాంధీ కుటుంబం నుంచి కాకుండా కాంగ్రెస్ తరఫున ప్రధాని అయిన రెండో వ్యక్తి మన్మోహన్ సింగ్.
15. యూపీఏ రెండోసారి అధికారంలోకి వచ్చింది. మన్మోహన్ సింగ్ మళ్లీ ప్రధాని పీఠాన్ని అధిష్టించారు. కాంగ్రెస్ 206 సీట్లు (28.6% ఓట్లు), బీజేపీ 116 సీట్లు(18.8% ఓట్లు) గెల్చుకున్నాయి.ఈ ఎన్నికల్లో మొత్తం 71.69 కోట్ల మంది ఓటర్లు ఉండగా 41.70 కోట్ల ఓట్లు పోలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement