నీ కంత సీన్ లేదు బాబూ

నీ కంత సీన్ లేదు బాబూ - Sakshi


డిపాజిట్లు కూడా రాని పార్టీ నీది!

కుండబద్దలు కొట్టిన బీజేపీసాక్షి ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్ : కింద పడ్డా తనదే పైచేయి అని భావించే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు భారతీయ జనతా పార్టీ గట్టి షాకే ఇచ్చింది. రాష్ట్రంలో టీడీపీ బలహీనపడుతున్న వైనాన్ని ఆ పార్టీ నేతల ముందే తేటతెల్లం చేసింది. పొత్తులపై ప్రాథమిక చర్చల సందర్భంగా బీజేపీకి రాష్ట్రంలో ఎంత బలముందని, పదేళ్లలో ఆ పార్టీలో వచ్చిన మార్పేమిటని అన్ని సీట్లడుగుతారంటూ చులకనగా మాట్లాడటంతో బీజేపీ నేతలు భగ్గుమన్నారు. అసలు రాష్ట్రంలో నీ సీనిదీ అంటూ టీడీపీ పరాజయాల చిట్టా ముందు పెట్టారు. గత పదేళ్లలో టీడీపీ ఎలా బలహీనపడుతూ వచ్చిందీ, ఎక్కడెక్కడ డిపాజిట్లు కోల్పోయిందీ.. తెలంగాణ, సీమాంధ్రల వారీగా సోదాహరణంగా బయటపెట్టారు. వాస్తవిక బలమేమిటో తెలుసుకోకుండా ఎన్ని సీట్లిస్తామంటే అన్నింటికే తలూపే వెర్రిబాగులం కాదంటూ సైకిల్ చక్రాలు చతికిలపడ్డ వైనాన్ని వివరించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా గట్టి సమాధానం చెప్పారు. దీంతో చర్చలకు వెళ్లిన టీడీపీ ప్రతినిధులకు దిమ్మతిరిగి మైండు బ్లాకయింది. బీజేపీ నుంచి ఇంత ఘాటైన ప్రతిస్పందన వస్తుందని ఊహించని ఆ నేతలు బిక్కమొహాలేశారు. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీతో పొత్తును బీజేపీ తెలంగాణ, సీమాంధ్ర శాఖలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అందుకు తగిన శాస్త్రీయ కోణాన్ని జాతీయ నాయకత్వానికి నివేదించాయి. టీడీపీతో పొత్తు లేకుండా ఒంటరిగా వెళ్లడం వల్ల పార్టీకి జరిగే లాభమేమిటో సవివరంగా ఆ నివేదికల్లో పొందుపరిచాయి. అసలు పవన్ కల్యాణ్ వంటి శక్తులు బీజేపీతో కలసిరావడానికి సిద్ధంగా ఉన్న సమయంలో టీడీపీతో పొత్తు అవసరమే ఉండదని కూడా నివేదించాయి. అయితే, కలిసొచ్చే పార్టీలతో పొత్తు కుదుర్చుకోవాలన్న జాతీయ నేతల నిర్ణయం మేరకు టీడీపీతో చర్చలు జరుగుతున్నాయి. టీడీపీతో పొత్తు వ్యవహారాన్ని తే ల్చే బాధ్యతను బీజేపీ జాతీయ నాయకత్వం సీనియర్ నేత అరుణ్ జైట్లీకి అప్పగించింది. అరుణ్ జైట్లీ దూతగా బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ రాష్ట్రానికి వచ్చి పలు దఫాలుగా టీడీపీ నేతలతో సంప్రదింపులు జరిపారు. అంతకు ముందే బీజేపీ సీమాంధ్ర, తెలంగాణ శాఖల ముఖ్యులు టీడీపీ బలంపై వాస్తవిక నివేదిక సమర్పించి చర్చకు పెట్టడంతో జాతీయ నాయకత్వం సైతం అసలు విషయాన్ని గ్రహించింది. పార్టీ ఇరుప్రాంతాల నేతలు ప్రకాశ్ జవదేకర్‌తో సమావేశమై, 2009 నుంచి టీడీపీ బలం ఏ విధంగా తగ్గుతూ వస్తోందో సోదాహరణంగా ఆయన ముందు పెట్టారు. ఈ నివేదికలు జవదేకర్‌ను సైతం ఆలోచనలో పడేశాయని తెలిసింది. ఇరు శాఖల నేతల నివేదికలను సమగ్రంగా విశ్లేషించుకున్న తర్వాత జాతీయ నాయకత్వం సైతం పొత్తులపై తొందరపడాల్సిన అవసరం లేదన్న అభిప్రాయానికి వచ్చినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం.నాలుగు దఫాలుగా చర్చలుప్రకాశ్ జవదేకర్‌తో టీడీపీ నేతలు సీఎం రమేష్, సుజనా చౌదరి నాలుగుసార్లు చర్చలు జరిపారు. తొలి దశలో బీజేపీ పెట్టిన ప్రతిపాదనను టీడీపీ నేతలు తోసిపుచ్చారు. తెలంగాణలో 70, సీమాంధ్రలో 40 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని బీజేపీ తెలిపింది. ఆ ప్రతిపాదనను చంద్రబాబు ముందు పెట్టినప్పుడు తన నోటి వెంట మాటలు రావడంలేదని, ఏ బలముందని బీజేపీ ఇన్ని సీట్లు కోరిందంటూ రుసరుసలాడారు. నగరంలోని ఒక హోటల్‌లో జరిగిన రెండో దఫా చర్చల సందర్భంగా బీజేపీ ప్రతిపాదనలను పక్కనపెట్టి టీడీపీ కొన్ని ప్రతిపాదనలు చేసింది. 1999, 2004 ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నప్పుడు ఇచ్చిన సీట్ల ప్రాతిపదికనే ఈసారీ ఇస్తామని తెలిపింది. ఆ ప్రతిపాదన బీజేపీ నేతల్లో ఆగ్రహం తెప్పించింది. అసలు టీడీపీకి ఉన్న బలమేమిటని ప్రశ్నించింది. 2009 నుంచి టీడీపీ పూర్తిగా బలహీనపడిందని చెబుతూ గడిచిన ఐదేళ్లలో ఆ పార్టీ ఎలా దిగజారిందో లెక్కలను ముందు పెట్టారు. 2009 ఎన్నికల్లో పరాజయం నుంచి ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల వరకు మొత్తం వాస్తవాల చిట్టా ముందు పెట్టడంతో టీడీపీ నేతల నోట మాటరాలేదు.

పార్టీ అంతర్గత నివేదికలు, టీడీపీ బలహీనపడిందంటూ ఆ నేతల ముందుంచిన చిట్టా, పార్టీ జాతీయ నేతలకు వివరించిన విషయాలపై విశ్వసనీయ వర్గాల సమాచారం ఇలా ఉంది..సీమాంధ్ర శాఖ చెప్పిన విషయాలు..- 2009 సాధారణ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయి ఉండి కూడా ఎక్కడా బలపడలేదు. 2009 తర్వాత 55 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా, అందులో 26 చోట్ల డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. (ఒక్క అవనిగడ్డలో మాత్రమే గెలిచింది. అదీ.. అక్కడ ప్రధాన పార్టీలేవీ పోటీ  పెట్టకపోవడంవల్ల)

 టీడీపీ నాయకత్వ వైఖరిని నిరసిస్తూ సీమాంధ్ర ప్రాంతంలో 8 మంది ఎమ్మెల్యేలు, పలువురు ఎమ్మెల్సీలు ఇతర పార్టీల్లో చేరారు. ముఖ్య నేతలు సైతం పార్టీని వీడారు.

2012లో 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగితే.. టీడీపీ అంతకు ముందున్న స్థానాలను కూడా గెలుచుకోలేకపోయింది. నాలుగు చోట్ల మూడో స్థానానికి దిగజారింది. ఆళ్లగడ్డ, రాజంపేట, రైల్వే కోడూరు, నర్సాపురం, రామచంద్రాపురం వంటి చోట్ల డిపాజిట్లు కోల్పోయింది.

అలాగే నెల్లూరు లోక్‌సభకు ఉపఎన్నిక జరగ్గా దాని పరిధిలోని ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు (అర్బన్), నెల్లూరు (రూరల్) నియోజకవర్గాల్లో కూడా డిపాజిట్ కోల్పోయింది.

రాష్ట్ర విభజనకు బీజేపీ అనుకూలంగా నిర్ణయం ప్రకటించగా, విభజన ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని అనేకసార్లు స్పష్టం చేశారు. అయితే కచ్చితంగా దానిపైనే కట్టుబడి ఉండకుండా దోబూచులాట ధోరణి వల్ల టీడీపీపై సీమాంధ్ర ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిన ప్పుడు అన్ని పార్టీలు, అందరు ప్రజాప్రతినిధులు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, సీమాంధ్ర విషయంలో చంద్రబాబు అసలు నోరు విప్పలేదు. సీమాంధ్రకు ఏ విధంగా నష్టం వాటిల్లుతుందన్న విషయంలో ఒక్క మాటా మాట్లాడలేదు.

విభజన అనివార్యమని తెలిసిన సందర్భంలోనూ సీమాంధ్ర కోసం ప్యాకేజీ కావాలన్న విషయంలో కూడా టీడీపీ ఎక్కడా స్పందించలేదు.

ఇటీవలి కాలంలో వచ్చిన అనేక సర్వేల్లోనూ టీడీపీ బాగా వెనుకబడి ఉందని స్పష్టమైంది.

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఏర్పడిన టీడీపీ.. ప్రాథమిక సిద్ధాంతాన్ని కాదని కాంగ్రెస్ నేతలందరినీ చేర్చుకోవడం వల్ల ప్రజల్లో పలుచనైంది.

ఎన్నికలొచ్చే సమయంలో కూడా కేంద్రంలో చక్రం తిప్పే సత్తా తమకే ఉందని చెబుతూ తృతీయ కూటమి ఏర్పాటు చేస్తామన్నారు. అది జరిగిన కొద్ది రోజులకే మాట  మార్చారు.

బీజేపీ ఎన్నికల ముందు పొత్తులే కాదు.. ఎన్నికల అనంతర పరిస్థితులనూ బేరీజు వేసుకోవాలి.తెలంగాణ అభ్యర్థుల ఎంపిక షురూసాక్షి, హైదరాబాద్: అధిష్టానం నుంచి తుది నిర్ణయం వెలువడనప్పటికీ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాత్రం 119 నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించారు. గతంలో పార్టీ ఓడిన స్థానాలు, ఒకే అభ్యర్థిత్వం ఉన్న నియోజకవ ర్గాల్లో ఇప్పటికే ఓ నిర్ణయానికొచ్చారు. ఇలాంటి 21 నియోజకవర్గాలకు అనధికారికంగా అభ్యర్థులను ఖరారు చేసి.. ప్రచారం చేసుకోవాల్సిందిగా కూడా సూచించారు. మిగతా వాటికి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను మంగళవారమే మొదలుపెట్టారు. తెలంగాణలో ఒంటరిపోరుకు తాము సిద్ధమని బీజేపీ తెలంగాణ ఉపాధ్యక్షుడు ప్రేమేందర్‌రెడ్డి పేర్కొన్నారు.తెలంగాణ శాఖ తేల్చిన లెక్కలు- వివిధ సర్వేలు తేల్చిన లెక్క ప్రకారం బీజేపీకి తెలంగాణలో 14 నుంచి 16 శాతం ఓటు బ్యాంకు పెరిగింది. ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ మద్దతు 57 శాతంగా తేలింది.

అదే సమయంలో టీడీపీ బలం బాగా తగ్గింది. 2009 (ఆ ఎన్నికల్లో టీడీపీ పరాజయం పొందింది) తర్వాత కాలంలో టీడీపీ బలం తగ్గుతూ వస్తోంది. ఆయా సర్వేల్లో వెల్లడైన ప్రకారం 8 నుంచి 10 శాతం బలం తగ్గింది.

2009లో మహా కూటమి పేరుతో టీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐలాంటి పార్టీలతో కలిసి ఎన్నికలను ఎదుర్కొన్నా, టీడీపీ ఓడిపోయింది. పైగా ఇప్పుడు రెండు రాష్ట్రాలు ఏర్పాటవుతున్న తరుణంలో దాని బలం మరింత తగ్గింది.

2010, 2012 సంవత్సరాల్లో తెలంగాణలో మొత్తం 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగితే, వాటన్నింటిలో టీడీపీ ఓడిపోయింది. 15 స్థానాల్లో టీడీపీ డిపాజిట్ కోల్పోయి చతికిలబడింది.

2009 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలోని 119 స్థానాలకుగాను టీడీపీ 62 నియోజకవర్గాల్లో మాత్రమే పోటీ చేసింది. అందులోనూ 39 స్థానాల్లో మాత్రమే గెలుపొందగలిగింది. రెండు లోక్‌సభ స్థానాల్లోనే విజయం సాధించగలిగింది.

- ఈ ఐదేళ్లలో 15 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరారు.

తాజాగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ అనేక చోట్ల టీడీపీ అభ్యర్థులను దింపలేకపోయింది. కొన్ని చోట్ల బీజేపీ స్థాయిలో కూడా నామినేషన్లు వేయలేని దయనీయ స్థితి. తెలంగాణలోని పది జిల్లాల్లో అయిదు జిల్లాల్లో టీడీపీ పరిస్థితి మరీ దారుణంగా ఉందన్న విషయం మున్సిపల్ ఎన్నికల్లో వేసిన నామినేషన్లే చెబుతున్నాయి.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ కట్టుబడి ఉండగా, టీడీపీ దోబూచులాడింది. దాంతో నాయకత్వం విశ్వసనీయత కోల్పోయింది.పార్టీ అంతర్గత నివేదిక- ఇదే సమయంలో బీజేపీ మహబూబ్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ని ఓడించింది. ఈ ప్రాంతంలో జరిగిన 21 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో ఒక్కటి మినహా అన్నింటినీ టీఆర్‌ఎస్ గెల్చుకొంది. ఆ ఒక్క చోట టీఆర్‌ఎస్‌ను ఓడించింది బీజేపీనే.

టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తెలంగాణ ప్రాంతంలో బీజేపీకిగానీ, టీడీపీకిగానీ అదనంగా ఒక్క సీటు కూడా రాదని ఎన్డీటీవీ సర్వేల్లో తేలింది.

ఏడాది క్రితం జరిగిన టీడీపీ మహానాడులోనూ గతంలో తాను బీజేపీతో కలిసి పనిచేయడం పెద్ద తప్పిదమని, మరోసారి అలాంటి తప్పిదం చేయనని చెప్పిన బాబు.. ఇప్పుడు పొత్తుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. మోడీ అనుకూల వాతావరణం తనకు కలిసి వస్తుందనే నమ్మకంతోనే బాబు పొత్తుకు ముందుకు వస్తున్నారు.

సీమాంధ్రలో పొత్తు వల్ల బీజేపీకంటే టీడీపీకే ఎక్కువ ప్రయోజనం. అక్కడ ఇప్పుడు టీడీపీ శ్రేణులన్నీ నీరసించి par ఉన్నాయి.ఙ- పొత్తు ఉంటే టీడీపీకే లాభం తప్ప పార్టీపరంగా బీజేపీకి ఒరిగేదేమీ ఉండదు.

1999లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు వాజ్‌పేయి హవా, కార్గిల్ ప్రభంజనం టీడీపీకే ఉపయోగపడ్డాయి. ఆ సమయంలో టీడీపీతో పొత్తు వల్ల చాలా చోట్ల పోటీ చేయలేకపోయాం. పార్టీని బలమైన శక్తిగా తయారుచేయలేకపోయాం.

ప్రజాప్రతినిధుల లెక్కలో చూస్తే సీమాంధ్రలో ఇప్పుడు బీజేపీది సున్నా స్థానం. పొత్తుల్లేకుండా పోటీ చేస్తే పార్టీ బలోపేతమవుతుంది. పార్టీపరంగా బీజేపీకి అది అదనపు  లాభం.

బీజేపీకి ఎన్నికల ముందు పొత్తు ఎంత అవసరమో, ఎన్నికల అనంతర పరిస్థితుల్లో ఎన్డీఏకు మద్దతుగా నిలిచే పార్టీలూ అవసరమే.

పొత్తులుండవని కచ్చితంగా తేల్చితే పార్టీలో చేరడానికి చాలా మంది నేతలు ముందుకొస్తున్నారు.

జాతీయ పార్టీలకు మాత్రమే తన మద్దతు అంటూ జన సేన పార్టీ నేత పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనను పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉంది.

పొత్తు ధర్మాన్ని పాటించడంలో టీడీపీకి విశ్వసనీయత లేదు. 2009లో టీఆర్‌ఎస్, లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ విషయం తేటతెల్లమైంది.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top