మా కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాక్కండి! | Sakshi
Sakshi News home page

మా కుటుంబాన్నిరాజకీయాల్లోకి లాక్కండి!

Published Mon, Apr 21 2014 6:24 PM

Bismillah Khan's family refuses to be Modi's proposer

వారణాసి: స్వర్గీయ సంగీత విద్వాంసులు ఉస్తాద్ బిస్మాల్లా ఖాన్ కుటుంబాన్ని ఎన్నికల ప్రచారంలోకి లాగాలని యత్నించిన బీజేపీకి నిరాశే ఎదురైంది. తమ కుటుంబాన్ని రాజకీయాల్లోకి తేవడానికి యత్నించవద్దని ఆయన కుటుంబసభ్యులు బీజేపీకి విన్నవించారు. సంగీత సాధన చేసుకుంటూ బ్రతికే మా కుటుంబం రాజకీయ సంబంధిత కార్యక్రమాలకు ఎప్పుడూ దూరంగానే ఉంటుందని బిస్మాల్లా మనవడు ఆఫాక్ హైదర్ స్పష్టం చేశారు.  బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఏప్రిల్ 24 వ తేదీన వారణాసి లోక్ సభ సీటుకు నామినేషన్ దాఖలు చేసే నేపథ్యంలో బిస్మాల్లా కుటుంబ మద్దతును కూడగట్టేందుకు ఆ పార్టీ యత్నించింది. కాగా, దీనికి సుముఖంగా లేమని బిస్మిల్లా కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు.

'మాకు ఏప్రిల్ 16 వ తేదీన నగర బీజేపీ మేయర్ రాంగోపాల్ మొహలే నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. దీంతో నేను,  నాన్న జమీన్ హుస్సేన్ మరియు మా కుటుంబానికి సన్నిహితంగా ఉండే షకిల్ అహ్మద్ ల కలిసి ఆయన ఇంటికి వెళ్లాం. నామినేషన్ కార్యక్రమానికి సంబంధించి మోడీకి మద్దతుగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సిందిగా  ఆయన విజ్ఞప్తి చేశారు' అని  హైదర్ తెలిపారు.

 

దీనిపై తమ అభిప్రాయం చెప్పేందుకు కొంత సమయం కోరినా రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నామని జమీన్ హుస్సేన్ తెలిపారు. తన తండ్రి బిస్మిల్లా ఖాన్ ఎప్పుడూ కూడా రాజకీయాలకు దూరంగా ఉండేవారని, అదే విషయాన్ని ఆయన తరుచు తమకు ఉపదేశిస్తూ ఉండేవారని ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే మోడీ నామినేషన్ కార్యక్రమానికి తమ కుటుంబం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు జమీన్ తెలిపారు. తాము బీజేపీతోనే కాదు.. ఏ రాజకీయ పార్టీతో కలిసి పని చేయడానికి సిద్ధంగా లేమని ఆయన వివరించారు.

Advertisement
Advertisement