breaking news
Ustad Bismillah Khan
-
వాహ్... ఉస్తాద్‌లు
ఇటీవల ఢిల్లీలో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువపురస్కారం అందుకున్న తెలుగు మహిళలు.ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్... ప్రఖ్యాత సంగీత విద్వాంసులు. నాదం ఆయన షెహనాయ్లో ప్రణవనాదంగా భాసిల్లింది. ఆయన ఉఛ్వాస నిశ్వాసలు నాదంతోనే... నాదస్వరంతోనే. ఆ నాదం స్మృతిగా మిగలరాదు... శ్రుతిగా కొనసాగాలి. కళాసాధనకు అంకితమైన కళాకారులే ఆయన వారసులు. బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం అందుకున్న మన మహిళలు వీళ్లు.సరిగమల సాగరంలో నేనో బిందువునిఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారి షెహనాయ్ వాద్యం అంటే నాకెంతో ఇష్టం. ఇప్పటికి వందల సార్లు కాదు వేలసార్లు విని ఉంటాను. రాత్రి నిద్రపోయే ముందు కూడా బిస్మిల్లా ఖాన్ సంగీత కార్యక్రమం వింటూ నిద్రపోతాను. మహా సముద్రం అంతటి సంగీతప్రపంచంలో ఆయన ఒక సముద్రం అయితే నేను ఒక నీటిబిందువుని. ఇలాంటి గొప్పవారు నాలాంటి ఎందరో సింగర్స్‌కు స్ఫూర్తినిస్తుంటారు. సంగీతమే శ్వాసగా జీవించిన బిస్మిల్లా ఖార్ పేరు మీద పురస్కారం అందుకోవడం అంటే సంతోషశిఖరాన్ని అధిరోహించినట్లే భావిస్తున్నాను. నాకు ఈ ఏడాది ఎన్నో మధురానుభూతులనిచ్చింది. కన్నడ పాటకు బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్‌గా సైమా అవార్డు, కర్నాటక ‘విశ్వమన్య’ పురస్కారం, తెలుగులో బలగం సినిమా పాటకు ఐఫా అవార్డు అందుకున్నాను. ఇంకా గొప్ప సంతృప్తి ఏమిటంటే... నేపథ్యగాయని పద్మభూషణ్ ఉషాఉతుప్, పద్మభూషణ్ సుధా రఘునాధన్ వంటి మహోన్నత గాయనీమణులతో కలిసి వేదిక పంచుకోవడం. బాలికల సంరక్షణ కోసం స్వచ్ఛందంగా నిర్వహించిన సంగీతకార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కలిగిన అనుభూతి చాలా గొప్పది. ఇప్పుడు ఈ జాతీయ స్థాయి పురస్కారం అందుకోవడం ఊహించనిది. ఈ ఏడాది నాకు ప్రత్యేకం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. – సత్యవతి ముదావత్ (మంగ్లీ), సినీ నేపథ్య గాయనిలక్ష్యం మారిందిచిత్తూరులో పుట్టి, హైదరాబాద్‌లో పెరిగిన రెడ్డి లక్ష్మి ఐఏఎస్ లక్ష్యంతో గ్రాడ్యుయేషన్‌కి ఢిల్లీకి వెళ్లారు. ఆమె మీద కళా తపస్వి విశ్వనాథ్ సినిమాల ప్రభావం కూడా ఎక్కువే. డిగ్రీ చదువుతూ కూచిపూడి నాట్యంలో శిక్షణ మొదలుపెట్టారు. ఆ ఆసక్తి ఆమెను ఏకంగా ఢిల్లీలో డాన్స్ ఆకాడమీ స్థాపించేవరకు తీసుకెళ్లింది. కళ కోసం జీవితాన్ని అంకితం చేసిన వారికి ఇలాంటి పురస్కారాలు భుజం తట్టి ఇచ్చే ప్రోత్సాహం వంటివన్నారు లక్ష్మి. పన్నెండేళ్లుగా ఢిల్లీలో ‘నృత్యవాహిని – అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్’ను నిర్వహిస్తున్నారామె. ఢిల్లీ వంటి నగరంలో నాట్యప్రదర్శన పట్ల ఆసక్తితో సుశిక్షితులై సాధన చేసినప్పటికీ చాలా మందికి ప్రదర్శనకు సరైన అవకాశం దొరకదు. అలాంటి వారికి నాట్య ప్రదర్శనకు అనువైన ఈవెంట్స్ ద్వారా వేదికలు ఏర్పాటు చేస్తున్నారు లక్ష్మి. కరోనా సమయంలో ఆన్లైన్ క్లాసులు తీసుకోవడం వల్ల ఆమె సేవ ఎల్లలు దాటింది. ఆన్లైన్లో వివిధ దేశాల నుంచి విదేశీయులతోపాటు ఎన్నారైలు కూడా ఆమె దగ్గర నాట్యంలో మెళకువలు నేర్చుకున్నారు. ఢిల్లీలో రెగ్యులర్‌గా నిర్వహించే క్లాసుల్లో తెలుగు వాళ్లతోపాటు వివిధ భాషల వాళ్లున్నారు. బిస్మిల్లా ఖాన్ యువపురస్కారం అందుకున్న సందర్భంగా ఆమె తన గురువు గారి మార్గదర్శనాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘ఈ రోజు ఈ పురస్కారం అందుకున్నానంటే మా గురువుగారు పద్మశ్రీ గురు జయరామారావుగారి సూచనను పాటించడం వల్లనే. ఆయన పిఠాపురంలో పుట్టారు. కూచిపూడికి వెళ్లి నాట్యం నేర్చుకున్నారు. కాకతాళీయంగా ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీలో డాన్స్ అకాడమీ అవసరం చాలా ఉంది. మన కళారీతులను విశ్వవ్యాప్తం చేయడానికి నీ వంతు ప్రయత్నం చెయ్యి... అని నాకొక డైరెక్షన్ ఇచ్చారు. వారి సహకారంతోనే ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్లో డాన్స్ టీచర్‌గా ఉద్యోగం చేశాను. ఎనిమిదేళ్లపాటు ఢిల్లీలోని ఓ ఎమ్ఎన్సీలో ఉద్యోగం చేసినప్పటికీ నాట్యం కోసం పని చేస్తున్నప్పుడు కలిగిన సంతోషం ఉండేది కాదు. నాట్యంలో నా కళాతృష్ణను తీర్చుకోవడానికే పూర్తి సమయం కేటాయించాలనుకున్నాను. ఆ తర్వాత భరతనాట్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. ఇప్పుడు కూచిపూడి నాట్యంలో పీజీ చేస్తున్నాను. ఇతర నాట్యరీతుల్లోనూ ప్రవేశాన్ని సాధించాను. నాట్యంలో పీహెచ్డీ చేయడం నా ప్రస్తుత లక్ష్యం’’ అన్నారు రెడ్డి లక్ష్మి.నా పాట నాకు నచ్చాలి!‘‘ఇది నా తొలి జాతీయ పురస్కారం. తప్పకుండా నా జీవితంలో మధురమైన ఘట్టమే. చెన్నైలో నా గానం విన్న ప్రముఖులు గోల్డెన్ వాయిస్ అని ప్రశంసించినప్పుడు మాటల్లో చెప్పలేనంత సంతోషం కలిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం అందుకోవడం కూడా...’’ అన్నారు కర్ణాటక సంగీతకారిణి శ్వేతాప్రసాద్. ‘‘మా ఇల్లు ఒక సంగీతం విశ్వవిద్యాలయం వంటిది. నానమ్మ గాయని, తాతయ్య (రక్తకన్నీరు నాగభూషణం) రంగస్థల ప్రదర్శనల్లో నానమ్మ పాల్గొనేది. అమ్మ వీణలో సిద్ధహస్తురాలు. మరో తాతయ్య (అమ్మ వాళ్ల నాన్న) మోహన్‌రావు. ఆయన హైదరాబాద్‌లోని త్యాగరాయగానసభ స్థాపించడం, నిర్వహించడంలో కీలకంగా పనిచేశారు. అలాంటి ఇంట్లో పుట్టడం ఒక వరం. మూడేళ్ల వయసు నుంచి సరిగమలు కూడా నాతోపాటు పెరిగాయి. శోభానాయుడు, అలేఖ్య పుంజల వంటి ప్రముఖ నాట్యకారుల కార్యక్రమాలకు గానమిచ్చాను. నాకు సంగీతమే జీవితం. మరొకటి తెలియదు. నా భర్త నట్టువాంగం కళాకారులు. మేమిద్దరం ముప్పైకి పైగా దేశాల్లో ప్రదర్శనలిచ్చాం. మా తాతగారిలాగే ఎప్పటికప్పుడు నన్ను నేను మెరుగుపరుచుకుంటూ ఉండడమే నా విజయరహస్యం. రక్తకన్నీరు స్ఫూర్తితో... నాగభూషణం తాతయ్య రక్తకన్నీరు నాటకాన్ని ఎనిమిది వేల సార్లు ప్రదర్శించారు. ప్రతి ప్రదర్శన దేనికది భిన్నంగా ఉండేలా చూసుకునేవారు. నిన్నటి కంటే నేడు మరికొంత భిన్నంగా, రేపు మరింత వైవిధ్యంగా ఉండేలా చూసేవారు. అలాగే ఒక ప్రదర్శనకంటే మరో ప్రదర్శన ఇంకా మెరుగ్గా ఉండేటట్లు నాకు నేను మెరుగులు దిద్దుకుంటాను. గాయకులు కానీ చిత్రకారులు కానీ గురువు దగ్గర నేర్చుకున్న విద్య దగ్గరే ఆగిపోకూడదు. సాధన ద్వారా తనవంతుగా మరికొన్ని మెళకువలను అద్దగలగాలి. మన నైపుణ్యం మీద మనకు నమ్మకం ఉండాలి. అప్పుడు తప్పనిసరిగా ఫలితం సంతోషకరంగా ఉంటుంది. నా మట్టుకు నేను ‘నన్ను నేను మెప్పించుకోవాలి’ అనే కొలమానం పెట్టుకుని పాడుతాను. నా పాట నాకే నచ్చకపోతే మరొకరికి ఎలా నచ్చుతుంది? అనేదే నా ప్రశ్న. నా లక్ష్యం భవనాలు, కోట్ల రూపాయలు సంపాదించడం కాదు. సంగీతం నా ప్యాషన్. శుద్ధ సంగీతాన్ని పాడుతాను. సంగీతంతోనే జీవిస్తాను’’ అంటూ సంగీతం పట్ల తన ఇష్టాన్ని వ్యక్తం చేశారు శ్వేతాప్రసాద్.– వాకా మంజులా రెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిది -
బిస్మిల్లాఖాన్ ‘పద్మ విభూషణ్’కు చెదలు
వారణాసి: దివంగత ప్రసిద్ధ షెహనాయ్ వాద్యకారుడు, భారతరత్న పురస్కార గ్రహీత ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పద్మ విభూషణ్ ధ్రువపత్రంలో కొంత భాగాన్ని చెదలు తిన్నాయి. సోమవారం బిస్మిల్లా ఖాన్ 11వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఆయన వస్తువులను శుభ్రం చేసి సర్దుతుండగా ఈ విషయాన్ని గుర్తించారు. 1980లో నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి చేతుల మీదుగా బిస్మిల్లా ఖాన్ పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. 2001లో భారత రత్న అందుకున్న ఖాన్ 2006లో గుండెపోటుతో మరణించడం తెలిసిందే. ఖాన్ ఉపయోగించిన సంగీత వాద్యాలు, సాధించిన పురస్కారాలు, ధ్రువపత్రాలను సంరక్షించేందుకు తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదనీ ఆయన మనవడు వాపోయారు. -
బిస్మిల్లా యువపురస్కార్ ప్రదానం
కూచిపూడి: కృష్ణాజిల్లాకు చెందిన యువ కూచిపూడి నాట్య కళాకారుడు వేదాంతం సత్యనరసింహశాస్త్రి ‘ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కార్ 2012’ అందుకున్నారు. శనివారం రాత్రి త్రిపుర రాజధాని అగర్తలలో జరిగిన కార్యక్రమంలో త్రిపుర గవర్నర్ పద్మనాభ బాలకృష్ణ ఆచార్య ఈ అవార్డును ప్రదానం చేశా రు. కేంద్ర సంగీత నాటక అకాడమీ ఈ అవార్డు కింద రూ.25 వేల నగదు, రజత పతకం, శాలువాను అందజేసింది. కూచిపూడిలోని ప్రముఖ నాట్యాచార్యుడు కళారత్న వేదాంతం రాధేశ్యాం కుమారుడైన నరసింహశాస్త్రి ప్రస్తుతం హైదరాబాద్‌లో కూచిపూడి నృత్యాన్ని ప్రచారం చేస్తున్నారు. అవార్డు ప్రదాన కార్యక్రమంలో సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ లీలా శ్యాంసన్ కూడా పాల్గొన్నారు. శాస్త్రికి అవార్డు రావడంపై కళాకారులు పసుమర్తి కేశవప్రసాద్, డాక్టర్ వేదాంతం రామలింగశాస్త్రి, వై.కె.డి.ప్రసాదరావు, రవిబాలకృష్ణ హర్షం ప్రకటించారు. -
కాశీలో నరేంద్ర మోడీకి 'సన్నాయి' నొక్కులు
వారణాసిలో నరేంద్ర మోడీ నామినేషన్ కు మద్దతునిచ్చే విషయంలో దూరందూరంగా ఉన్న షెహనాయి సామ్రాట్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ కుటుంబం వారణాసి రాహుల్ గాంధీ రోడ్ షో లో దర్శనమివ్వడంతో నరేంద్ర మోడీకి షాక్ తగిలింది. తాము ఏ రాజకీయ పార్టీ తోటూ కలిసి పనిచేయబోమని మోడీకి చెప్పిన బిస్మిల్లా ఖాన్ మనవడు అష్ఫాక్ హైదర్ కాంగ్రెస్ ర్యాలీలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ రోడ్ షోలో భారీ సంఖ్యలో జనం వచ్చారు. శుక్రవారం అరవింద కేజరీవాల్ రోడ్ షో లోనూ జనం భారీగా వచ్చారు. అంతకు ముందు నరేంద్ర మోడీ షోలకూ జనం బాగా వచ్చారు. అయితే దేశం యావత్తూ గర్వించే బనారసీ ఘరానా షహనాయి వాదకుడు బిస్మిల్లా ఖాన్ కుటుంబం రాహుల్ ర్యాలీలో పాల్గొనడం మోడీకి, ఆయన అనుచరులకు మింగుడు పడటం లేదు. ముస్లింలు మోడీని ఇంకా క్షమించలేదన్న విషయాన్ని బిస్మిల్లా ఖాన్ కుటుంబం తిరస్కరణ రుజువు చేస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. -
మా కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాక్కండి!
వారణాసి: స్వర్గీయ సంగీత విద్వాంసులు ఉస్తాద్ బిస్మాల్లా ఖాన్ కుటుంబాన్ని ఎన్నికల ప్రచారంలోకి లాగాలని యత్నించిన బీజేపీకి నిరాశే ఎదురైంది. తమ కుటుంబాన్ని రాజకీయాల్లోకి తేవడానికి యత్నించవద్దని ఆయన కుటుంబసభ్యులు బీజేపీకి విన్నవించారు. సంగీత సాధన చేసుకుంటూ బ్రతికే మా కుటుంబం రాజకీయ సంబంధిత కార్యక్రమాలకు ఎప్పుడూ దూరంగానే ఉంటుందని బిస్మాల్లా మనవడు ఆఫాక్ హైదర్ స్పష్టం చేశారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఏప్రిల్ 24 వ తేదీన వారణాసి లోక్ సభ సీటుకు నామినేషన్ దాఖలు చేసే నేపథ్యంలో బిస్మాల్లా కుటుంబ మద్దతును కూడగట్టేందుకు ఆ పార్టీ యత్నించింది. కాగా, దీనికి సుముఖంగా లేమని బిస్మిల్లా కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. 'మాకు ఏప్రిల్ 16 వ తేదీన నగర బీజేపీ మేయర్ రాంగోపాల్ మొహలే నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. దీంతో నేను, నాన్న జమీన్ హుస్సేన్ మరియు మా కుటుంబానికి సన్నిహితంగా ఉండే షకిల్ అహ్మద్ ల కలిసి ఆయన ఇంటికి వెళ్లాం. నామినేషన్ కార్యక్రమానికి సంబంధించి మోడీకి మద్దతుగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు' అని హైదర్ తెలిపారు. దీనిపై తమ అభిప్రాయం చెప్పేందుకు కొంత సమయం కోరినా రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నామని జమీన్ హుస్సేన్ తెలిపారు. తన తండ్రి బిస్మిల్లా ఖాన్ ఎప్పుడూ కూడా రాజకీయాలకు దూరంగా ఉండేవారని, అదే విషయాన్ని ఆయన తరుచు తమకు ఉపదేశిస్తూ ఉండేవారని ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే మోడీ నామినేషన్ కార్యక్రమానికి తమ కుటుంబం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు జమీన్ తెలిపారు. తాము బీజేపీతోనే కాదు.. ఏ రాజకీయ పార్టీతో కలిసి పని చేయడానికి సిద్ధంగా లేమని ఆయన వివరించారు.