ప్రజల నిత్య జీవిత అవసరాలన్నీ బ్యాంకులతో ముడిపడి ఉన్నాయి.
పోలీస్ కానిస్టేబుల్ - ఎకానమీ
ప్రజల నిత్య జీవిత అవసరాలన్నీ బ్యాంకులతో ముడిపడి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ‘జన్ ధన్ యోజన’ పథకంలో భాగంగా ప్రతి ఒక్కరికీ బ్యాంక్ ఖాతా ఉండాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. వివిధ అవసరాలకు బ్యాంక్ ఖాతాలను తెరిచిన ఖాతాదారులు, ఇతర ఆసక్తి ఉన్న ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించి.. పరిశ్రమలు, వ్యాపారులు, రైతులు, వినియోగదారులకు ద్రవ్యాన్ని అప్పుగా ఇచ్చి, వారికి అనేక విధాలైన సేవలు చేసే ఒక వ్యవస్థీకృత ఆర్థిక సంస్థే వాణిజ్య బ్యాంకు.
వాణిజ్య బ్యాంకులు
బ్యాంకులు ‘విత్త సంస్థలు’. పనితీరు, విధులు, లక్ష్యాల ఆధారంగా వీటిని మూడు రకాలుగా విభజించవచ్చు. అవి:
1. వాణిజ్య బ్యాంక్‌లు
2. సహకార గ్రామీణ/ పట్టణ బ్యాంక్‌లు
3. ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లు
వాణిజ్య బ్యాంక్‌లు: ద్రవ్య పరపతి సౌకర్యాన్ని కల్పించడానికి; సంస్థలకు ఆర్థిక సహాయాన్ని, రుణాలను ఇవ్వడంలో; వ్యవసాయ పెట్టుబడులకు, గృహనిర్మాణానికి అవసరమైన రుణాలను అందించడంలో వాణిజ్య బ్యాంక్‌లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ధనం అధికంగా ఉండి నిల్వ చేసుకోవాలనుకునే వారి నుంచి డబ్బును అప్పుగా తీసుకుని, అవ సరమైనవారికి ఇవి రుణాలు అందిస్తాయి. ఇవి చట్టబద్దంగా జాయింట్ స్టాక్ కంపెనీల కింద నమోదై ఏర్పడతాయి.
మనదేశంలో మొదటి వాణిజ్య బ్యాంక్‌ను 1770లో బ్రిటిష్ యాజమాన్యంలో కోల్‌కతాలో స్థాపించారు. దీని పేరు ‘బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్’. భారతీయుల యాజమాన్యంలో ఏర్పడిన మొదటి వాణిజ్య బ్యాంక్ ‘ఔద్ కమర్షియల్ బ్యాంక్’. దీన్ని 1881లో నెలకొల్పారు. ప్రస్తుతం దేశంలో పనిచేస్తున్న అతి పురాతనమైన బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. దీన్ని 1894లో స్థాపించారు. వీటి కంటే ముందే ప్రెసిడెన్సీల్లో (రాష్ట్రాల్లో) బ్యాంక్‌లను ఏర్పాటు చేశారు.
ఈ విధంగా ఏర్పడినవే బెంగాల్ ప్రెసిడెన్సీ బ్యాంక్ (1806), బొంబాయి ప్రెసిడెన్సీ బ్యాంక్ (1840), మద్రాసు ప్రెసిడెన్సీ బ్యాంక్ (1843). ఈ మూడింటినీ ఏకం చేసి 1921లో ‘ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ను స్థాపించారు. స్వాతంత్య్రానంతరం (1955 జూలై 1న) దీన్ని ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)’గా పేరు మార్చారు. ఇది భారతదేశంలో అతిపెద్ద వాణిజ్య బ్యాంక్‌గా గుర్తింపు పొందింది. దీనికి అధిక బ్రాంచీలున్నాయి. దేశవ్యాప్తంగా దీనికి సుమారుగా 17000 శాఖలున్నాయి. ఎస్‌బీఐ చట్టం - 1959 ప్రకారం దీనికి అనుబంధంగా ఎనిమిది బ్యాంకులను ఏర్పాటు చేశారు.
అవి: 1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్
2. స్టేట్ బ్యాంక్ ఆఫ్ జైపూర్
3. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్
4. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్
5. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్
6. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా
7. స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర
8. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్
1963లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ జైపూర్‌లను విలీనం చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్‌గా ఏర్పాటు చేశారు. 2007లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్రను ఎస్‌బీఐలో విలీనం చేశారు. ప్రస్తుతం ఎస్‌బీఐకి 6 అనుబంధ బ్యాంక్‌లున్నాయి. ఇవేకాకుండా కేంద్ర ప్రభుత్వం 1969లో 14, 1980లో 6 ప్రైవేట్ బ్యాంక్‌లను జాతీయం చేసింది. రెండోసారి జాతీయం చేసిన 6 బ్యాంకుల్లో ఒకటైన ‘న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ను 1993లో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనం చేశారు. ఈ జాతీయ బ్యాంక్‌లన్నీ వాణిజ్య బ్యాంకులే. వీటన్నింటినీ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నియంత్రిస్తుంది. దీన్ని రిజర్‌వ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం-1934 ప్రకారం 1935లో నెలకొల్పారు. 1949లో జాతీయం చేశారు. ఇది వాణిజ్య బ్యాంకులన్నింటికీ కేంద్ర బ్యాంక్.
వాణిజ్య బ్యాంక్‌లను కమర్షియల్ బ్యాంక్‌లు అని కూడా పిలుస్తారు. ఇవి రెండు రకాలు.
1. షెడ్యూల్డ్ బ్యాంక్‌లు: ఇవి ఆర్‌బీఐ చట్టం 1934లోని రెండో షెడ్యూల్‌లో నమోదైన బ్యాంక్‌లు. వీటి మూలధనం, రిజర్వులు కనీసం రూ. 5 లక్షలు ఉండాలి.
ఉదా: ఎస్‌బీఐ, అన్ని జాతీయ బ్యాంకులు.
2. నాన్-షెడ్యూల్డ్ బ్యాంక్‌లు: ఇవి మూలధనం, రిజర్‌వలు రూ.5 లక్షల కంటే తక్కువగా ఉండి, ఆర్‌బీఐ చట్టం 1934లోని రెండో షెడ్యూల్‌లో చేరని బ్యాంకులు.
వాణిజ్య బ్యాంకులను యాజమాన్యాన్ని బట్టి ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు, ప్రైవేట్ రంగ బ్యాంక్‌లుగా వర్గీకరించారు. భారతదేశంలో స్థాపితమై, వాటి ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉన్న ప్రైవేటు బ్యాంకులను స్వదేశీ ప్రైవేటు వాణిజ్య బ్యాంక్‌లు అని అంటారు. విదేశాల్లో స్థాపితమై, అక్కడే ప్రధాన కార్యాలయాలుండి మన దేశంలో శాఖలున్న బ్యాంకులను విదేశీ వాణిజ్య బ్యాంకులు అని పిలుస్తారు. మనదేశంలో స్థాపించిన మొదటి ప్రైవేట్ వాణిజ్య బ్యాంక్ ‘యూటీఐ బ్యాంక్ లిమిటెడ్’. దీన్ని 1994లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీన్ని ‘యాక్సిస్ బ్యాంక్’గా పిలుస్తున్నారు. మనదేశంలో అత్యధిక శాఖలున్న విదేశీ వాణిజ్య బ్యాంక్ - ఏఎన్‌జడ్ గ్రిండ్లేస్ బ్యాంక్.
వాణిజ్య బ్యాంక్‌ల ముఖ్యవిధులు
ఆధునిక వాణిజ్య బ్యాంక్‌లకు విస్తృతమైన విధులున్నాయి. డిపాజిట్లు (నిధులు) సమీకరించడం, రుణాలు ఇవ్వడం వీటి ముఖ్య విధులు. ఇవి ప్రజలు, సంస్థల నుంచి 3 రకాల డిపాజిట్లను స్వీకరిస్తాయి. అవి:
1. నిర్ణీత డిపాజిట్ ఖాతా: ఈ ఖాతాలో డబ్బును ఒక నిర్ణీత కాలానికి జమ చేస్తారు. ఎక్కువ రోజులు డబ్బును దాస్తే ఖాతాదారునికి బ్యాంక్‌లు ఎక్కువ వడ్డీని ఇస్తాయి. ఈ ఖాతా కింద డిపాజిట్ చేసిన సొమ్మును గడువుకు ముందే వెనక్కి తీసుకోవడం సాధారణంగా వీలుకాదు. కొంత వడ్డీని పోగొట్టుకొని ఖాతాను మధ్యలోనే రద్దు చేసుకోవచ్చు. ఈ డిపాజిట్‌పై ఖాతాదారులు అప్పు కూడా తీసుకోవచ్చు. వీటినే టర్‌మ డిపాజిట్ అని కూడా అంటారు. ఒకే మొత్తంలో డిపాజిట్ చేస్తే ‘ఫిక్స్‌డ్ డిపాజిట్’ అని, వాయిదాల పద్ధతిలో డిపాజిట్ చేస్తే ‘రికరింగ్ డిపాజిట్’ అని అంటారు.
2. సేవింగ్‌స అకౌంట్ (పొదుపు ఖాతా): ఖాతాదారులు తమ ఖాతాలో ఎంత సొమ్మై, ఎప్పుడైనా డిపాజిట్ (జమ) చేయవచ్చు. ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు. కానీ నిర్ణీత డిపాజిట్ల కంటే వడ్డీ తక్కువగా ఉంటుంది.
3. కరెంట్ ఖాతా: పెద్ద మొత్తాలను జమచేసే వ్యాపారులు, సంస్థలకు ఈ ఖాతాలు ఉంటాయి. డబ్బులను ఎప్పుడైనా ఎంత మొత్తమైనా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ ఖాతాలోని డిపాజిట్లకు వడ్డీ ఉండదు.
వాణిజ్య బ్యాంక్ ఇచ్చే రుణాలు
1. సాధారణ రుణాలు: వ్యక్తులు తమ విలువైన ఆస్తిని హామీగా చూపించి బ్యాంక్‌ల నుంచి రుణాలు తీసుకోవచ్చు. బ్యాంక్ ఆ రుణాన్ని హామీ చూపిన వ్యక్తి ఖాతాలో జమచేస్తుంది. ఆ వ్యక్తి సొమ్మునంతటినీ అతడి ఖాతా నుంచి తీసుకోవచ్చు. నిర్ణీత కాలం తర్వాత ఆ సొమ్మును సంబంధిత వ్యక్తి నిర్ణీత వడ్డీ సహా బ్యాంక్‌కు తిరిగి చెల్లించాలి.
2. నగదు రుణం: పైవిధంగా రుణం తీసుకున్న వ్యక్తి అతడి ఖాతా నుంచి ఒకేసారి కాకుండా విడతలుగా, బ్యాంక్ అనుమతించినట్టుగా ఆ సొమ్మును వాడుకోవాలి. ఈ రకంగా మంజూరైన రుణానికి వడ్డీ వసూలు చేయరు. అప్పు తీసుకున్న వ్యక్తి ఉపయోగించిన సొమ్ముకు మాత్రమే బ్యాంక్ వడ్డీ వసూలు చేస్తుంది.
3. ఓవర్ డ్రాఫ్ట్: కరెంట్ ఖాతాలో ఉన్న నిల్వ మొత్తాని కంటే ఖాతాదారుడు అధిక సొమ్మును ఉపసంహరించుకోవడానికి బ్యాంక్ అనుమ తించడాన్ని ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం అంటారు. ఈ అవకాశం కొంతమంది ఎంపికచేసిన ఖాతా దారులకు మాత్రమే ఉంటుంది. ఈ సొమ్ముపై బ్యాంక్ వడ్డీ వసూలు చేస్తుంది.
4. బిల్స్ ఆఫ్ ఎక్స్ఛేంజ్‌లో డిస్కౌంట్‌లు ఇవ్వడం:
బిల్స్ ఆఫ్ ఎక్స్ఛేంజ్ కల్గిన వ్యక్తి అతడి బిల్లును హామీగా చూపి కొంత సొమ్మును తీసుకోవడానికి బ్యాంక్ అనుమతిస్తుంది. కానీ బిల్లులో ఉన్న పూర్తి మొత్తాన్ని ఇవ్వకుండా కొంత సొమ్మును తగ్గించుకుంటుంది. ‘బిల్లు నిర్ణీతకాలం’ ముగిసిన తర్వాత ఆ బిల్లును సంబంధిత పార్టీ (వ్యక్తి/ సంస్థ)కి వసూలు కోసం పంపి డబ్బును రాబట్టుకుంటుంది. బ్యాంక్ రుణంగా ఇచ్చిన సొమ్ము, దాని కమీషన్‌ను మినహాయించుకొని మిగిలిన సొమ్మును చెల్లిస్తుంది.
వీటితో పాటు వాణిజ్య బ్యాంకులు వాటి ఖాతాదార్లకు బ్యాంక్ డ్రాఫ్ట్‌లు, షేర్లు, బాండ్లను కొనే-అమ్మే సౌకర్యం కల్పిస్తాయి. లాకర్ సదుపాయాలు కల్పించడం, ట్రావెలర్ చెక్కులను జారీ చేయడం తదితర సేవలను కూడా అందిస్తాయి.
మాదిరి ప్రశ్నలు
1.మొదటిసారిగా మనదేశంలో బ్యాంక్‌లను ఎప్పుడు జాతీయీకరణం చేశారు?
ఎ) 1951
బి) 1956
సి) 1969
డి) 1973
2.బ్యాంక్‌ల కంప్యూటరీకరణను సూచించిన కమిటీ ఏది?
ఎ) చక్రవర్తి కమిటీ
బి) రాజా చెల్లయ్య కమిటీ
సి) రంగరాజన్ కమిటీ
డి) సరయూ కమిటీ
3.ఏ రకమైన చెక్కును బ్యాంక్‌కు సమర్పించిన వెంటనే డబ్బు చెల్లిస్తారు?
ఎ) బేరర్ చెక్కు
బి) క్రాస్‌డ్ చెక్కు
సి) డిమాండ్ చెక్కు
డి) డ్రాఫ్ట్ చెక్కు
4.అతిస్వల్పకాలానికి డబ్బును బ్యాంక్‌లో డిపాజిట్ చేయాలనుకుంటే ఏ ఖాతాలో నిల్వచేయడం ఉత్తమం?
ఎ) కరెంట్ ఖాతా
బి) సేవింగ్‌స ఖాతా
సి) నిర్ణీత ఖాతా
డి) కాలపరిమితి ఖాతా
5.బ్యాంక్ రుణాలు వేటిని సృష్టిస్తాయి?
ఎ) అప్పులు
బి) ఖాతాలు
సి) ఓవర్‌డ్రాఫ్ట్‌లు
డి) డిపాజిట్లు
సమాధానాలు
1) సి; 2) సి; 3) ఎ; 4) బి; 5) డి.