గణతంత్రం అంటే ఏమిటి? | What is a republic? | Sakshi
Sakshi News home page

గణతంత్రం అంటే ఏమిటి?

Aug 6 2014 10:09 PM | Updated on Jul 11 2019 5:01 PM

గణతంత్రం అంటే ఏమిటి? - Sakshi

గణతంత్రం అంటే ఏమిటి?

ప్రవేశికను ‘పీఠిక, అవతారిక, ముందుమాట, ఉపోద్ఘాతం’ లాంటి పర్యాయ పదాలతో పిలుస్తారు.

రాజ్యాంగ ప్రవేశిక
ప్రవేశికను ‘పీఠిక, అవతారిక, ముందుమాట, ఉపోద్ఘాతం’ లాంటి పర్యాయ పదాలతో పిలుస్తారు. ఆంగ్లంలో  దీన్ని ’Prea-mble' అంటారు.  ప్రవేశికను రాజ్యాంగానికి ఆత్మ, హృదయంగా వర్ణిస్తారు. ప్రపంచంలో ప్రవేశికతో కూడిన  లిఖిత రాజ్యాంగాన్ని కలిగి ఉన్న మొదటి దేశం అమెరికా. భారత రాజ్యాంగ ప్రవేశికకు కూడా ఇదే ఆధారమైనప్పటికీ, ఇందులోని లక్ష్యాలు, ఆదర్శాలకు ప్రధాన ప్రాతిపదిక మాత్రం ‘ఆశయాల తీర్మానం’ (Objective Reso-lution). వీటిని  జవహర్ లాల్ నెహ్రూ రాజ్యాంగ పరిషత్‌లో 1946 డిసెంబరు 13న ప్రతిపాదించారు. ఫ్రాన్‌‌స రాజ్యాంగంలోని ‘స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం, గణతంత్రం’ అనే పదాలు, ఐక్యరాజ్య సమితి  చార్టర్‌లోని ప్రకటన కూడా మన రాజ్యాంగ ప్రవేశికకు ఆధారాలుగా చెప్పవచ్చు.
 
 ప్రవేశిక పదజాలం - భావాల వివరణ

 మన రాజ్యాంగ నిర్మాతలు ప్రవేశికలో గొప్ప భావజాలాన్ని ప్రయోగించారు. ప్రతి పదానికి విస్తృత భావం, నిర్దిష్ట, విశిష్ట అర్థం ఉంది. ‘భారత ప్రజలమైన మేము’ అని ప్రవేశిక ప్రారంభమవుతుంది. ప్రజలే రాజకీయ అధికారానికి మూలం, వారే రాజ్యాంగాన్ని రచించుకున్నారనే అర్థంతో దీన్ని ప్రయోగించారు. భారతదేశం ఏ తరహా రాజకీయ వ్యవస్థను ఏర్పర్చుకుంటుందో, దాని స్వభావం ఏమిటో కొన్ని ప్రత్యేక పదాల ద్వారా స్పష్టంగా పేర్కొన్నారు.
 
సార్వభౌమత్వం (Sovereignty): ‘సర్వోన్నత అధికారం’ అని దీని అర్థం. భారతదేశం అంతర్లీనంగా సర్వోన్నత అధికారాన్ని, బాహ్యంగా విదేశీ, దౌత్యవిధానాల్లో స్వేచ్ఛను కలిగి ఉంటుంది. ఏ బాహ్యశక్తి మన విదేశాంగ విధానాన్ని నియంత్రించలేదు.
 
 సామ్యవాదం (Socialist): 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ఈ పదాన్ని   ప్రవేశికలో చేర్చారు. సామ్యవాదం అంటే.. సమసమాజ స్థాపన, ప్రజల మధ్య ఆర్థిక అంతరాలను క్రమంగా తగ్గించడం, ఉత్పత్తి శక్తులను (Land, Labour and Capital) ప్రభుత్వం నియంత్రించడం ద్వారా సంపద కొద్ది మంది వ్యక్తుల చేతుల్లోనే కేంద్రీకృతమవకుండా సాధ్యమైనంతవరకూ జాతీయం చేయడం. ఈవిధంగా ప్రజలకు సమాన అవకాశాలతోపాటు వాటిని అందిపుచ్చుకోవడానికి అవసరమైన తోడ్పాటును కలిగించవచ్చు.
 సామ్యవాదానికి వివిధ రూపాలున్నాయి.
 
కమ్యూనిజం, మావోయిజం, సిండికాలిజం, గిల్డ్ సోషలిజం, ఫెబియనిజం, స్టేట్ సోషలిజం మొదలైన రూపాలు వివిధ దేశాల్లో అమల్లో ఉన్నాయి. అయితే భారత దేశంలో ప్రజాసామ్యవాదం (Democratic Socialism) అమల్లో ఉంది. దీన్నే పరిణామాత్మక లేదా రాజ్యాంగ సామ్యవాదం అంటారు. అంటే ఆర్థిక వ్యవస్థలో చట్టపరంగా ఒక నిర్దిష్ట పద్ధతిలో మార్పులు చేపడతారు. మన సామ్యవాదం ‘గాంధీయిజం + మార్క్సిజం’ మేలు కలయిక. కొంతవరకు గాంధీతత్వం వైపు మొగ్గు చూపారు.  ప్రపంచీకరణ, ఆర్థిక ఉదారవాదం, ప్రైవేటీకరణ నేపథ్యంలో సామ్యవాద తత్వం మసకబారుతోంది.
 
 లౌకికతత్వం (్ఛఛిఠ్చట): ఈ పదాన్ని కూడా 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చారు. లౌకిక రాజ్యం అంటే మత ప్రమేయం లేని రాజ్యం. అధికార మతం ఉండదు, మతవివక్షత ఉండదు. మతం విషయంలో పౌరులకు స్వేచ్ఛ, సమానత్వం ఉంటాయి. మతపరంగా ఎవరికీ ఎలాంటి ప్రత్యేక ప్రయోజనం కానీ, నష్టం కానీ వాటిల్లదు. అధికార మతం ఉన్న రాజ్యాన్ని ’Theocratic State' అంటారు.
 ఉదా: పాకిస్థాన్, బంగ్లాదేశ్.
 
 ప్రజాస్వామ్యం (Democratic): ప్రజాస్వామ్యం అంటే Govt by the people, for the people, of the people అని అబ్రహం లింకన్ పేర్కొన్నారు.  భారత్‌లో పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అమల్లో ఉంది. ఎలాంటి వివక్షత లేకుండా కేవలం నిర్ణీత వయసు పౌరులందరికీ ఓటుహక్కు, ప్రభుత్వ పదవులకు పోటీ చేసే హక్కును కల్పించారు. పాలన చట్టబద్ధంగా ఉంటుంది (Rule of law). చట్టబద్ధత లేకుండా ఏ చర్యా చెల్లుబాటు కాదు. ఏ వ్యక్తికీ ప్రత్యేక హోదా లేదా మినహాయింపు ఉండదు.
 
 గణతంత్రం (Republic): ‘గణం’ అంటే ప్రజలు, ‘తంత్రం’ అంటే పాలన. ఇదే ప్రజాపాలన. వారసత్వ అధికారాలు ఉండవు. భారత రాష్ర్టపతి తదితరులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నిర్ణీత కాలానికి  ప్రజలే ఎన్నుకుంటారు. బ్రిటిష్ రాణి లేదా రాజుకు ఉన్నట్లు వారసత్వ అధికారం ఉండదు.
 
 సామాజిక ఆశయాలు
 ప్రవేశికలో కొన్ని ఉదాత్తమైన ఆశయాలను పొందుపర్చారు. రాజ్యాంగం ద్వారా వాటిని సాకారం చేసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు.
 
 న్యాయం (Justice): న్యాయం ఒక సర్వోన్నతమైన, సమతాభావన. అసమానతలు, వివక్షత లేని ఆదర్శ సమాజాన్ని నిర్మించడం దీని ఉద్దేశం. 3 రకాల న్యాయాలను ప్రస్తావించారు.
 రాజకీయ న్యాయం (Political Justice): పౌరులందరూ ఎలాంటి వివక్షత లేకుండా రాజ్య కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు. సార్వజనీన ఓటు హక్కు, పోటీ చేసే హక్కు, ప్రభుత్వ పదవులు చేపట్టే హక్కు, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు, విజ్ఞాపన హక్కు మొదలైనవాటిని రాజకీయ న్యాయ సాధనకు ప్రాతిపదికలుగా పేర్కొనవచ్చు.
 
 సామాజిక న్యాయం (Social Justice): సమాజంలో పౌరులందరూ సమానులే. జాతి, మత, కుల, లింగ  అనే తేడాలు లేకుండా అందరికీ సమాన హోదాను, గౌరవాన్ని కల్పించాలి. అన్ని రకాల సామాజిక వివక్షతలను రద్దు చేసి,  సామాజికంగా వెనుకబడిన వర్గాలు, కులాలు, తెగల అభ్యున్నతికి కృషి చేయాలి.
 
 ఆర్థిక న్యాయం (Economic Justice): ఆర్థిక అంతరాలను తగ్గించాలి. సంపద ఉత్పత్తి, పంపిణీ, వృత్తి, ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలుండాలి. పేదరికాన్ని నిర్మూలించి, ప్రజలను ఆకలి నుంచి విముక్తి చేయాలి. జీవించడానికి అనువైన పరిస్థితులు కల్పించడమే ఆర్థిక న్యాయం ఆదర్శం.
 
 ప్రవేశికపై ప్రముఖుల అభిప్రాయాలు
 
 కె.యం. మున్షి    :    భారత ప్రజాస్వామ్య గణతంత్రానికి, రాజకీయ జాతకం.
 
 పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ    :    రాజ్యాంగంలో అత్యంత పవిత్రమైన భాగం. ఇది రాజ్యాంగ ఆత్మ, రాజ్యాంగానికి తాళంచెవి లాంటిది.    
 
 ఎం.ఎ. నాని పాల్కీవాలా    :    రాజ్యాంగానికి ఒక గుర్తింపుపత్రం లాంటిది.
 
 సర్ ఎర్నస్ట్ బార్కర్    :    రాజ్యాంగానికి సూచిక లాంటిది.
 
 అల్లాడి కృష్ణాస్వామి అయ్యర్    :    మన కర్తలకు, ఆలోచనలకు రాజ్యాంగంలో వ్యక్తీకరించుకున్న అభిమతం.
 
 జస్టిస్ హిదయతుల్లా    :    అమెరికా స్వాతంత్య్ర ప్రకటనలానే రాజకీయ వ్యవస్థ స్వరూపం.
                         పవిత్ర నిర్ణయాన్ని తెలియజేస్తుంది. విప్లవం తప్ప మరొకటి దీన్ని                        మార్చలేదు.
 
 జె. డయ్యర్    :    రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను, లక్ష్యాలను తెలుసుకోవడానికి
                తాళంచెవి లాంటిది.
 
 
 మాదిరి ప్రశ్నలు
 1.    {పవేశికను ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
     1) అమెరికా    2) ఇంగ్లండ్
     3) రష్యా    4) ఐర్లాండ్
 2.    ‘సౌభ్రాతృత్వం  అంటే సోదరభావం అనే అర్థం వస్తుంది. ఈ భావం సమాజంలో ఐక్యతను, సంఘీభావాన్ని (Unity & Solidarity) పెంపొందిస్తుంది’ అని వ్యాఖ్యానించినవారు?
     1) డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్
     2) డాక్టర్ రాజేంద్రప్రసాద్
     3) జవహర్‌లాల్ నెహ్రూ
     4) మహాత్మాగాంధీ
 3.    ‘ప్రవేశిక రాజ్యాంగ ఆదర్శాలకు, ఆశయాలకు సూక్ష్మరూపం’ అని సుప్రీంకోర్టు 1967లో గోలక్‌నాథ్ కేసులో తీర్పు చెప్పింది. ఇలా వ్యాఖ్యానం చేసిన ప్రధాన న్యాయమూర్తి ఎవరు?
     1) జస్టిస్ కృష్ణ అయ్యర్
     2) జస్టిస్ మాథ్యూ
     3) జస్టిస్ కె. సుబ్బారావ్
     4) జస్టిస్ హెచ్.ఆర్. ఖన్నా
 4.    {పవేశిక ముఖ్య ఆధారం రాజ్యాంగ పరిషత్‌లో నెహ్రూ ప్రతిపాదించిన ఆశయాల తీర్మానం. ఈ తీర్మానంలోని ఏ పేరాగ్రాఫ్‌ల నుంచి ప్రవేశిక మౌలిక పద బంధాలను గ్రహించారు?
     1) 4    2)  5  3)  7  4) పైవన్నీ
 5.    {పవేశికలో పవిత్ర తీర్మానాన్ని  ఎవరి పేరుతో చేశారు?
     1) భారత ప్రజలు
     2) రాజ్యాంగ పరిషత్ స్వేచ్ఛా భారత్
     3) భారత రాజ్యాంగం
     4) భారత స్వాతంత్య్ర చట్టం 1947
 6.    భారతదేశంలోని రాజ్యాధికారానికి మూలం?
         (గ్రూప్-1, 2008)
     1) రాజ్యాంగం    2) పార్లమెంట్
     3) ప్రజలు    4) రాష్ర్టపతి
 7.    {పవేశికకు సంబంధించి కిందివాటిలో వాస్తవం కానిదేది?
     ఎ)    దీన్ని న్యాయస్థానాల ద్వారా  సవరించవచ్చు.
     బి)    రాజ్యాంగం ఏర్పర్చిన, అమలు చేయాల్సిన లక్ష్యాలను తెలియజేస్తుంది.
     సి)    రాజ్యాంగాన్ని చట్టపరంగా అన్వయించడంలో భాషాపరంగా సంశయం ఏర్పడినప్పుడు ప్రవేశిక తోడ్పడుతుంది.
     డి)    రాజ్యాంగం ప్రజాధికారంపై ఆధారపడుతుందని ప్రకటిస్తుంది.
     1) ఎ మాత్రమే    2) ఎ, బి
     3) బి, సి    4) బి, సి, డి
 8.    భారత రాజ్యాంగ పీఠికలోని పదాలు?           (గ్రూప్ - 1, 1984)
     1)    సార్వభౌమాధికార, ప్రజాస్వామిక, సామ్యవాద, గణతంత్ర రాజ్యం
     2)    సార్వభౌమాధికారం, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం
     3)    సార్వభౌమాధికారం, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక
     4)    సార్వభౌమాధికార, లౌకిక, ప్రజాస్వామిక, గణతంత్ర రాజ్యం
 
 సమాధానాలు
     1) 1;    2) 1;    3) 3;    4) 4;        5) 1;    6) 3;    7) 1;    8) 2.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement