జరిమానాల జమానాకు బ్రేక్‌

Sakshi Editorial On Motor Vehicle Bill Implimentation - Sakshi

ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన మోటారు వాహనాల (సవరణ) చట్టాన్ని అన్ని రాష్ట్రాలూ అమలు చేయడం ఇంకా ప్రారంభించలేదు. అమలు మొదలెట్టిన కొన్ని రాష్ట్రాలు పక్షం రోజులు గడవ కుండానే పునరాలోచనలో పడ్డాయి. జరిమానాలను గణనీయంగా తగ్గించే యోచన చేస్తున్నాయి. వాహన వినియోగదారులను చైతన్యం చేశాకే కొత్త చట్టం అమలు ప్రారంభిస్తామన్న రాష్ట్రాలు కూడా బహుశా ఇలా తగ్గించాకే అమలు చేయడం మొదలుపెట్టవచ్చు. వాహనాలు వినియోగించేవారిలో అత్యధికులు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతికి చెందినవారు కనుక కొత్త చట్టం వల్ల వచ్చిపడిన ‘కష్టాల’పై సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. పాలకులు కూడా బాగానే పట్టిం చుకున్నారు. మొదట్లో భారీ జరిమానాల విషయంలో తగ్గేది లేదని చెప్పిన కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ... వారం రోజులు గడిచాక రాష్ట్రాలు కావాలనుకుంటే జరిమానాలను సవరించు కోవచ్చునని అంటున్నారు. భారీ జరిమానాలు అందరిలోనూ బెంబేలెత్తించిన మాట వాస్తవం. తొలి నాడే ఒక స్కూటరిస్టుకి రూ. 23,000 జరిమానా విధించడం, బండి విలువ కూడా అంత ఉండదని అతను మొత్తుకోవడం, ఒక ట్రక్కు డ్రైవర్‌కు రూ. 1,41,000, ఒక ఆటోవాలాకు రూ. 47,500 జరి మానాలు వడ్డించడం మీడియాలో ప్రముఖంగా వచ్చింది. హర్యానా, ఒడిశాలు అత్యధికంగా జరిమా నాలు వసూలు చేసి రికార్డు సృష్టించాయి. హెల్మెట్‌ కొనుగోళ్లు పెరిగాయి.

భారీ శబ్దం చేసే హారన్‌లు మార్చుకునేవారి సంఖ్య పెరిగింది. పరిమిత స్థాయిలో కాలుష్యం ఉన్నదనే ధ్రువ పత్రాల కోసం జనం పరుగులంకించుకున్నారు. ఇక భారీ జరిమానాలపై వచ్చిన వ్యంగ్యాస్త్రాలు సరేసరి. ఈ సవరణ చట్టం హఠాత్తుగా వచ్చింది కాదు. దీనికి సంబంధించిన బిల్లు రూపకల్పనకు సుదీర్ఘకాలం పట్టింది.  రాష్ట్రాల రవాణా మంత్రులున్న కమిటీ ఈ ప్రక్రియలో పాలుపంచుకుంది. ఆ తర్వాత పార్లమెంటు స్థాయీ సంఘం అధ్యయనం చేసి మార్పులు, చేర్పులు సూచించింది. 2014లో సుప్రీంకోర్టు చొర వతో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ కె.ఎస్‌. రాధాకృష్ణన్‌ ఆధ్వర్యాన ఏర్పడిన ముగ్గురు సభ్యుల కమిటీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీన వైఖరిని ఎత్తిచూపింది. డ్రైవింగ్‌ లైసెన్స్‌ల జారీ మొదలు కొని కాలం చెల్లిన వాహనాల నియంత్రణలో విఫలం కావడం వరకూ జరుగుతున్న అనేకానేక లోటు పాట్లను ఎత్తిచూపింది. ఇదంతా అయిన తర్వాతే కేంద్రం సవరణ బిల్లు రూపకల్పనకు పూనుకుంది. ప్రభుత్వాలు తమ వంతుగా చేయాల్సిన పనుల్లో కొన్నయినా ఈపాటికే చేసి ఉంటే బహుశా సవరణ చట్టం అమల్లో ఇప్పుడెదురవుతున్న ప్రశ్నలు ఉండేవి కాదు. భారీ జరిమానా వాతలు పడినవారు రహదార్లు సవ్యంగా ఉంటున్నాయా... సిగ్నలింగ్‌ వ్యవస్థ ఎక్కడైనా పనిచేస్తోందా... వీఐపీలు నిబంధ నలు పాటిస్తున్నారా అంటూ నిలదీస్తుంటే ప్రభుత్వాల దగ్గర వాటికి జవాబు లేదు. 

కనుకనే అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు తగ్గాయి. కొత్త చట్టంలో నిర్దేశించిన జరిమానాలు గరిష్ట మొత్తాలని, వాటికి పరిమితులు విధించే అధికారం రాష్ట్రాలకుంటుందని కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ అధికారి ప్రకటించారు. అయితే సాధారణ ఉల్లంఘనలకు సంబంధించిన నిబం ధనల విషయంలోనే ఈ తగ్గింపు సాధ్యమవుతుంది. మొత్తం 64 నిబంధనలున్న కొత్త చట్టంలో వాటి సంఖ్య 24. అయితే ఈ నిబంధనల ప్రకారం విధించే జరిమానాలు కూడా తక్కువ లేవు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించేవారికి విధించే కనీస జరిమానా ఇంతక్రితం రూ. 100 ఉంటే ఇప్పుడది రూ. 500 అయింది. గరిష్ట మొత్తం రూ. 10,000 జోలికి ప్రభుత్వాలు వెళ్లకపోవచ్చుగానీ రూ. 500 అయితే కట్టి తీరాలి. తాగి వాహనాలు నడపడం, లోపాలున్న వాహనాన్ని వినియోగిం చడం వంటివి తీవ్ర ఉల్లంఘనలకిందికొస్తాయి. అలాగే రహదారి నిర్మాణంలో, దాని నిర్వహణలో కాంట్రాక్టర్లు చేసే లోపాలు కూడా తీవ్ర ఉల్లంఘన పరిధిలోకొస్తాయి.

ఈ ఉల్లంఘనల విషయంలో జరిమానాలు తగ్గించడానికి అవకాశం లేదు. మన దేశంలో ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘన, పర్యవ సానంగా జరుగుతున్న ప్రమాదాలు తక్కువేమీ కాదు. మృతుల్లో 72 శాతంమంది 18–45 మధ్య వయస్కులే. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండే వయస్సులో ఇలా అకాల మరణం చెంద డం వల్ల వారి కుటుంబాలతోపాటు దేశం కూడా ఎంతో నష్టపోతోంది. ప్రకృతి వైపరీత్యాల్లో మరణి స్తున్నవారితో పోల్చినా, ఉగ్రవాద ఘటనల్లో మరణించేవారితో పోల్చినా, ఎయిడ్స్‌వంటి ప్రాణాం తక వ్యాధుల్లో మరణించేవారితో పోల్చినా రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటున్నది. ఏటా మన దేశంలో దరిదాపు లక్షన్నరమంది కేవలం రోడ్డు ప్రమాదాల్లో అకాల మృత్యువాత పడుతున్నారు. 2001–2017 మధ్య దేశంలో 79 లక్షల ప్రమాదాలు జరిగితే దాదాపు 21 లక్షలమంది ప్రాణాలు కోల్పోయారు. 82 లక్షలమంది గాయాలపాలయ్యారు. రోడ్డు ప్రమాదాల వల్ల ఏటా దాదాపు రూ. 3,80,000 కోట్ల మేర నష్టం వాటిల్లుతున్నదని గణాంకాలు చెబుతున్నాయి. 

వాహనచోదకుల్ని క్రమశిక్షణలో పెట్టాల్సిందే. కానీ భారీగా జరిమానాలు విధించడం ఒక్కటే  సర్వరోగ నివారిణిగా భావించకూడదు. రహదారుల నిర్మాణం సరిగా లేనిపక్షంలో కారకులపై చర్యలు తీసుకోవడం, రహదారులు దెబ్బతిన్నప్పుడు తక్షణం మరమ్మతులు చేయించడం, అన్ని చోట్లా సిగ్నల్‌ వ్యవస్థలు పకడ్బందీగా ఉండేలా చూడటం, డ్రైవింగ్‌ లైసెన్స్‌ల జారీలో చోటుచేసు కుంటున్న అవకతవకల్ని సవరించడం, అవినీతికి పాల్పడుతున్న సిబ్బందిపై కఠిన చర్యలు వగైరా అంశాలపై కూడా దృష్టి సారించాలి. ఇప్పటికి 13 రోజులైనా దేశంలో ఒక్కచోట కూడా కాంట్రా క్టర్లపైగానీ, ప్రభుత్వాల సిబ్బందిపైగానీ చర్యలు తీసుకున్న వైనం ఎక్కడా లేదు. వాహన చోదకు లకు భారీ జరిమానాలు విధించడంలోనే అత్యుత్సాహం కనబడుతోంది. కొత్త చట్టం విషయంలో బాగా ప్రచారం చేయడంతోపాటు ప్రజా రవాణా వ్యవస్థ పటిష్టానికి చర్యలు తీసుకోవడం అవసర మని రాష్ట్రాలు గుర్తించాలి. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top