ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇపుడొక లెక్క!

Motor Vehicle Act 2019 Higher Penalty For Traffic Violations - Sakshi

సెప్టెంబర్‌ 1 కొత్త ఎంవీ యాక్ట్‌ అమలు

భారీగా పెరగనున్న ట్రాఫిక్‌ జరిమానాలు

ఏటా 10  శాతం చొప్పున పెరుగుదల

జోరుగా పెండింగ్‌ ఈ–చలాన్ల క్లియరెన్స్‌

సాక్షి, హైదరాబాద్‌: హెల్మెట్‌ లేకపోయినా ఏం పరవాలేదు అని డ్రైవింగ్‌ చేస్తున్నారా.. మద్యం తాగి వాహనం నడుపుతున్నారా.. ఆ.. ఏముంది వందో రెండు వందలో జరిమానా కడితే సరిపోతుంది అని ఆలోచిస్తున్నారా?.. ఇకపై మీ పప్పులుడకవు. ఎందుకంటే వేలకు వేలు జరిమానా కట్టాల్సిందే. అంతేగాకుండా కొన్ని నిబంధనలు పాటించకుంటే ఏకంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ కూడా రద్దు చేస్తారు. ఇంకా ఉంది.. ఓవర్‌ లోడింగ్‌ ప్రయాణికులను ఎక్కించుకుంటే ఒక్కో ప్రయాణికునికి రూ.1000 చొప్పున ముక్కుపిండి మరీ వసూలు చేస్తారు.

ఈ మేరకు వచ్చే ఆదివారం (సెప్టెంబర్‌ 1) నుంచి ‘మోటారు వాహనాల సవరణ చట్టం–2019’ అమల్లోకి రానుంది. దీనికి సంబంధించి కేంద్ర రవాణాశాఖ బుధవారం రాత్రి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇకపై నిబంధనలు పాటించకుంటే జరిమానాలు 100 నుంచి 500 శాతం పెరగనున్నాయి. ప్రధానంగా 25 ఉల్లంఘనలకు సంబంధించిన జరిమానాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ చట్ట సవరణలో ఉన్న మరో కీలకాంశం ఏమిటంటే.. ఇకపై ట్రాఫిక్‌ జరిమానాల మొత్తం ఏటా 10 శాతం చొప్పున పెరుగుతూ ఉంటుంది.  గురువారం నోటిఫికేషన్‌ అందుకున్న రాష్ట్ర రవాణాశాఖ, వాటిని రాష్ట్రంలో అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. శనివారం గాని, వినాయకచవితి సెలవు ముగిసిన త ర్వాత మంగళవారం గాని ఉత్తర్వు జారీ కానుందని రవాణాశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. 

గోల్డెన్‌ అవర్‌ నిధి.. 
ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు ‘గోల్డెన్‌ అవర్‌’ గా పరిగణించే మొదటి గంట అత్యంత కీలకం. ఈ సమయంలో వైద్యం అందితే మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. అందుకే ‘గోల్డెన్‌ అవర్‌’లో క్షతగాత్రులకు ఉచిత చికిత్స అందించేలా నిబంధన తీసుకొచ్చారు. దీని కోసం కేంద్రం ప్రత్యేకంగా ‘మోటారు వెహికిల్‌ యాక్సిడెంట్‌ ఫండ్‌’ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారానే ఆయా ఆస్పత్రులకు చికిత్సకైన ఖర్చులు చెల్లిస్తారు. దేశంలో ఉన్న ప్రతి రోడ్‌ యూజర్‌కు నిబంధనలకు లోబడి ఈ ఫండ్‌ ద్వారా బీమా ఉంటుంది.

కొత్త నిబంధనల ప్రకారం వాహనాల రిజిస్ట్రేషన్‌తోపాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందడానికి ఆధార్‌ తప్పనిసరి. అలాగే ప్రమాదాలకు సంబంధించి వివిధ సందర్భాల్లో ప్రభుత్వాలు ఇస్తున్న పరిహారం భారీగా పెరగనుంది. గుర్తుతెలియని వాహనాలు ఢీకొని ఎవరైనా చనిపోతే ప్రభుత్వం ప్రస్తుతమిస్తున్న రూ.25 వేల పరిహారం రూ.2 లక్షలకు, క్షతగాత్రులకు ఇస్తున్న రూ.12,500 నుంచి రూ.50 వేలకు పెంచారు. రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులకు సహకరించే వ్యక్తులు తమ వివరాలను అటు పోలీసులు, ఇటు వైద్యాధికారులకు చెప్పాల్సిన అవసరం లేకుండా నిబంధన పొందుపరిచారు. 

తల్లిదండ్రులూ బాధ్యులే.. 
ప్రమాణాలకు అనుగుణంగా లేని వాహనాలను రీకాల్‌ చేసే అధికారం ప్రభుత్వాలకు ఉంటుంది. అలాంటి వాహనాలకు ఉత్పత్తి చేసిన కంపెనీలకు గరిష్టంగా రూ.500 కోట్ల వరకు జరిమానా విధించే ఆస్కారం లభిస్తుంది. మైనర్లు వాహనం నడుపుతూ చిక్కితే ఆ చర్య తమకు తెలియకుండానో, తాను వారిస్తున్నా జరిగిందని తల్లిదండ్రులు/సంరక్షకుడు నిరూపించుకోవాలి. లేదంటే వారికీ జైలు శిక్ష, జరిమానా తప్పవు. మైనర్లు వాహనాలు నడుపుతూ లేదా ఉల్లంఘనలకు పాల్పడుతూ చిక్కితే వారి తల్లిదండ్రులకు రూ.25 వేల జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష తప్పదు. ఆ మైనర్‌పైనా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. వాహనం రిజిస్ట్రేషన్‌ శాశ్వతంగా రద్దు అవుతుంది. లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలుగా పరిగణించే ట్రాఫిక్‌ అధికారులు, పోలీసులు ఉల్లంఘనలకు పాల్పడితే సాధారణ వ్యక్తులకు విధించే జరిమానాకు రెట్టింపు విధిస్తారు.  

పెండింగ్‌ చలాన్లు.. చకచకా.. 
మరో 3 రోజుల్లో కొత్తగా పెంచిన జరిమానాలు అమల్లోకి రానుండటంతో పెండింగ్‌ ఈ–చలాన్లను వాహన చోదకులు భారీగా క్లియర్‌ చేస్తున్నారు. సాధారణ రోజుల్లో ఈ–చలాన్‌ చెల్లింపులు రోజుకు రూ.50 లక్షల వరకు ఉంటాయి. అయితే గడిచిన 4 రోజుల చెల్లింపులు పరిశీలిస్తే రూ.65 లక్షలు, రూ.68 లక్షలు, రూ.2.08 కోట్లు, రూ.2.38 కోట్లుగా ఉండి రికార్డు సృష్టిస్తున్నాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top