పాక్‌ సైన్యం దళారీ పాత్ర

Pakistan army negotiates deal with mullah brigade - Sakshi

మూడు వారాలుగా పాకిస్తాన్‌లోని ప్రధాన నగరాలను దిగ్బంధించి ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్న ఛాందసవాద బృందాలదే చివరకు పైచేయి అయింది. ‘దైవదూషణ’ ఆరోపణలొచ్చిన కేంద్ర న్యాయ శాఖ మంత్రి జహీద్‌ హమీద్‌ పదవి నుంచి తప్పుకోక తప్పలేదు. ఆందోళనకారుల ఇతర డిమాండ్లకు సైతం ప్రభుత్వం తలొగ్గి అందరినీ ఆశ్చర్యపరిచింది. కొత్తగా తీసుకొచ్చిన ప్రజా ప్రాతినిధ్య చట్టంలో వాడిన ఒక పదం ఇంత చేటు ఆందోళనకూ, హింసకూ కారణమైందంటే నమ్మ బుద్ధికాదు. కానీ పాకిస్తాన్‌ రాజకీయాల తీరే అంత. అక్కడ ప్రజలెన్నుకున్న పార్లమెంటు కంటే... దేశాన్నేలే ప్రభుత్వం కంటే ఈ ఛాందసవాద బృందాల ఆధిపత్యమే అధికంగా కనిపిస్తుంది. వాటికి పాకిస్తాన్‌ సైన్యం అండదండలీయడం కూడా రివాజే.

నిజానికి ఈ ధోరణులే కొన్ని దశాబ్దాలుగా పాకిస్తాన్‌ సమాజాన్ని దిగజారుస్తున్నాయి. క్రమేపీ దాన్ని ఉగ్రవాద ఊబిలోకి నెట్టేస్తున్నాయి. ఈసారి కూడా అలాంటి పరిణామాలే చోటుచేసుకున్నాయి. ఈ మూడువారాలూ పాక్‌ నగరాలు తీవ్ర హింసను చవిచూశాయి. ఇస్లామాబాద్‌–రావల్పిండి నగరాల మధ్య నున్న ముఖ్యమైన ఫ్లైఓవర్‌ను ఆక్రమించుకున్న 2,000మంది ఆందోళనకారులు నిత్యావసరాలు మొదలుకొని వేటినీ కదలనీయలేదు. ప్రభుత్వం అక్షరాలా స్తంభిం చిపోయింది. అంతర్జాతీయంగా పరువుపోతున్నదని అర్ధమయ్యాక సైన్యాన్ని పిలిపించడానికి ప్రయత్నిస్తే అది బేఖాతరు చేసింది. ఆందోళనకారులతో మాట్లాడి ఒక ఒప్పందానికి రావాలని సలహా ఇచ్చింది. నిజానికి ఇరు పక్షాలూ ఒక అవ గాహన కొస్తే కుదిరేదాన్ని ఒప్పందం అంటారు. ఇది ఆ బాపతు కాదు. ఆందో ళనకారులు రాసిచ్చిన డిమాండ్ల కాగితంపై ఒప్పుకుంటున్నట్టు ప్రభుత్వం చేత పాక్‌ సైన్యం సంతకం పెట్టించింది. పరువు నిలుపుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమై చివరకు ఛాందసవాద బృందాల ముందు పాలకులు సాగిలపడవలసి వచ్చింది.

పాకిస్తాన్‌ ప్రధానిగా పనిచేసిన నవాజ్‌ షరీఫ్‌ కుటుంబం విదేశాల్లో వేల కోట్ల ఆస్తులు కూడబెట్టిందని పనామా పత్రాల్లో వెల్లడయ్యాక ఆయనను పాకిస్తాన్‌ సుప్రీంకోర్టు అనర్హుడిగా తేల్చడంతో నవాజ్‌ పదవినుంచి దిగపోయారు. అసలే అంతంతమాత్రంగా ఉన్న దేశం ఆ తర్వాత మరింత అనిశ్చితిలోకి జారుకుంది. ఆయన స్థానంలో వచ్చిన షహీద్‌ ఖాకాన్‌ అబ్బాసీ పరిస్థితి అయోమయంగా ఉంది. చాన్నాళ్లనుంచి రాజకీయాల్లో ఉంటున్నా, మంత్రి పదవులు చేసినా ఆయనేమీ సమర్ధుడన్న పేరు తెచ్చుకోలేదు. నిజానికి అలాంటి వ్యక్తి ఆ పదవిలో ఉంటేనే తన మాట చెల్లుబాటవుతుందని, వెనకుండి నడిపించవచ్చని షరీఫ్‌ భావించినట్టు న్నారు. ఆయన ముందస్తు జాగ్రత్తల మాటెలా ఉన్నా పాకిస్తాన్‌ ప్రజలు మాత్రం నానా అగచాట్లూ పడుతున్నారు. పాలన ఏమైపోయిందో తెలియక గందరగోళ పడుతున్నారు. ఈలోగా బరేల్వీ సున్నీ ఛాందసవాదులు మహమ్మద్‌ ప్రవక్తకు అపచారం జరిగిందంటూ రోడ్డెక్కారు. ఇంతకూ ఏమిటా అవమానం? పాక్‌ సైనిక దళాల చీఫ్‌గా పనిచేసి ఆ తర్వాత దేశాధ్యక్షుడైన పర్వేజ్‌ ముషార్రఫ్‌ తన ఏలు బడిలో ప్రజా ప్రాతినిధ్య చట్టం తీసుకొచ్చారు. అబ్బాసీ సర్కారు దాని బదులు ఎన్నికల చట్టం పేరిట కొత్త చట్టాన్ని తెచ్చింది. ప్రజాప్రతినిధులుగా పోటీచేసేవారు ఇవ్వాల్సిన డిక్లరేషన్‌లోని ఒక పదాన్ని ఆ చట్టం మార్చింది. మహమ్మద్‌ ప్రవక్త పట్ల అచంచల విశ్వాసాన్ని వ్యక్తం చేయడానికి సంబంధించిన డిక్లరేషన్‌లో ‘ప్రగాఢ విశ్వాసంతో ప్రమాణం చేస్తున్నాను...’ అనడానికి బదులు ‘ఇందుమూలంగా ప్రక టిస్తున్నాను...’ అని ఉంది. ఇది ప్రవక్తను కించపరచడం కిందికొస్తుందని, దేశంలో ముస్లిమేతరులుగా ముద్రబడ్డ అహ్మదీయాలకు లబ్ధి చేకూర్చడమే దీని ఉద్దేశమని ఛాందసవాదుల ఆరోపణ.

అహ్మదీయాలు 1889లో తమ తెగకు ఆద్యుడైన మీర్జా గులాం అహ్మద్‌ను కూడా ప్రవక్తగానే భావిస్తారు. జుల్ఫికర్‌ అలీ భుట్టో ప్రభుత్వం 1974లో రాజ్యాంగ సవరణ చేసి అహ్మదీయాలను ఎన్నికల్లో పోటీకి అనర్హుల్ని చేసింది. వారు ఓటర్లయినా, ఓటు హక్కున్నా పోటీ చేయడం కుదరదని ఆ సవరణ చెబుతోంది. అలాగే ముస్లింల కోసం, ముస్లిమేతరుల కోసం రెండు వేర్వేరు ఓటర్ల జాబితాలు రూపొందించాలని నిర్దేశించారు. 2002లో ముషార్రఫ్‌ తెచ్చిన ప్రజా ప్రాతినిధ్య చట్టం ఒకే ఓటర్ల జాబితాకు పరిమితమవ్వాలని చెప్పినా ఆచరణలో అహ్మదీయాలపై ఉన్న వివక్షను తొలగించలేదు. ఆ చట్టం కూడా అహ్మదీయాలను పోటీకి అనర్హులుగానే పేర్కొంది. అబ్బాసీ ప్రభుత్వం పదాలను మార్చడం మినహా ఇందులో మౌలికంగా చేసిన మార్పేమీ లేదు. కానీ సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారం పర్యవసానంగా ఛాందసవాద సంస్థలన్నీ రెచ్చిపోయాయి. చట్టం తెచ్చిన న్యాయ మంత్రి తప్పుకోవాలని, ఆయనపై దైవదూషణ కేసు పెట్టాలని డిమాండ్‌ చేశాయి. వారి కోసమని ప్రభుత్వం దిగొచ్చి పాత పదజాలాన్ని , పాత సెక్షన్లను యధాతథంగా ఉంచుతూ సవరణ చట్టాలు తెచ్చింది. అయినా వారు శాంతించ లేదు. చివరకు సైన్యం దళారీగా మారి వారి కోర్కెలను ప్రభుత్వం ఆమోదించేలా చేసింది.

చట్టసభలను భ్రష్టు పట్టించడం, వాటికి విలువ లేకుండా చేయడం... తమ విశ్వాసాలే పవిత్రమని, అవి మాత్రమే అధికార భావజాలంగా ఉండాలని కోరుకోవడం పాకిస్తాన్‌లో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అలాగని వేరే దేశాల్లో అంతా సవ్యంగా ఉందని చెప్పలేం. గతంలో శ్రీలంక, ఇప్పుడు మయన్మార్‌ కూడా ఈ ధోరణులకు ప్రతీకలు. ఇలాంటి పోకడలు మన దేశంలో కూడా బయ ల్దేరుతున్నాయని ఇటీవలకాలంలో ప్రజాస్వామికవాదులు ఆందోళనపడుతున్నారు. ప్రజల సమస్యలు చర్చించడానికి, పరిష్కార మార్గాలు అన్వేషించడానికి చట్టసభలున్నప్పుడు వాటిని బేఖాతరు చేయడం, మూకలదే పైచేయి కావడం అంతిమంగా ప్రజాస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేస్తుంది. అరాచకాన్ని తీసు కొస్తుంది. అందువల్లే ప్రైవేటు వ్యక్తుల, బృందాల తీరు పట్ల ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలి. వారికి సాష్టాంగపడే పాలకుల విషయంలో జాగురూకతతో మెలగాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top