అంతరిక్షంలో కొత్త పుంతలు

Falcon Heavy launch is a new achievements in space - Sakshi

‘ఎల్లుండి ఏం తమాషా జరుగుతుందో/ ఎవ్వడూ చెప్పలేడంటే నమ్మండి/ చెబితే మాత్రం నమ్మకండి’ అంటాడు మహాకవి శ్రీశ్రీ తన ‘శరశ్చంద్రిక’ కవితలో. అరవై య్యేళ్ల క్రితం సైన్స్‌ ఫిక్షన్‌ రచయితల ఊహకందని విషయాలు సైతం వాస్తవ రూపం దాల్చే రోజులొచ్చేశాయి. ప్రపంచ చరిత్రలో ఇంతవరకూ ప్రయోగించిన రాకెట్లన్నిటినీ తలదన్నే అత్యంత శక్తిమంతమైన రాకెట్‌ ‘ఫాల్కన్‌ హెవీ’ బుధవారం నిప్పులు చిమ్ముకుంటూ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. 23 అంతస్తుల భవంతికి సమానమైన ఎత్తున్న ఈ రాకెట్‌కు 27 ఇంజిన్లు అమర్చి మండించడం ద్వారా ఈ అనూహ్య ప్రక్రియను శాస్త్రవేత్తలు పూర్తిచేశారు. అది తీసుకెళ్లిన టెస్లా సంస్థ ఎలక్ట్రిక్‌ కారు ఇప్పుడు అంగారకుడి కక్ష్యకు ఆవలనున్న గ్రహ శకలాల మధ్య తిరుగాడు తోంది. అచ్చం వ్యోమగామి పోలికతో రూపొందించిన బొమ్మ డ్రైవర్‌ సీటులో కూర్చుని ఉండగా, అంతరిక్ష అద్భుతాలను గానం చేస్తూ డేవిడ్‌ బోవీ 1972లో విడుదల చేసిన గీతమొకటి ఆ కారులో శ్రావ్యంగా వినిపించే ఏర్పాటు చేశారు. ఆ కారులోని మూడు కెమెరాలు తమ కళ్లముందున్న దృశ్యాలను ఎప్పటికప్పుడు భూమ్మీదకు పంపే సదుపాయమూ ఉంది. అంగారకుడి కక్ష్యలో అది తిరుగాడాలని శాస్త్రవేత్తలు భావించినా అనుకోని రీతిలో అది ఆ కక్ష్యను దాటిపోయింది. అంగా రకుడే వారి లక్ష్యం గనుక ఆ కారు రంగును కూడా ఎర్రగానే ఉంచారు. దాని ఖరీదు 2 లక్షల డాలర్లు(సుమారు రూ. కోటీ 29 లక్షలు).

అది భయమో, విస్మయమో...ఆకాశంలో నిరంతరం జ్వలించే బంతిలా కన బడే అంగారకుడంటే మానవాళికి ఆదినుంచీ ప్రత్యేక ఆసక్తి ఉంది. ఆ ఆసక్తే అంగా రకుడి చుట్టూ అనేక ఊహలల్లింది. అంగారక గ్రహంపై మనుషుల్ని పోలిన జీవరాశి ఉన్నట్టు, వారు భూమ్మీద దండయాత్ర చేసేందుకు వచ్చినట్టు హెచ్‌జీ వెల్స్‌ 1906లో వెలువరించిన ‘వార్‌ ఆఫ్‌ ది వర్ల్‌›్డ్స’ నవల చిత్రించింది. కుజుడి ఉపరిత లంపై ఉన్న ఇనుము ఆక్సైడ్‌ రూపంలో ఉన్న కారణంగా ఆ గ్రహం ఎర్రెర్రగా కనబ డుతున్నదని శాస్త్రవేత్తలు తేల్చారు. ఆ గ్రహాన్ని చేరుకోవాలని, అక్కడున్నదేమిటో తెలుసుకోవాలని, ముఖ్యంగా ఆవాసానికి అది అనువుగా ఉంటుందో, లేదో తేల్చా లని ఆసక్తి ఉన్నవారికి కొదవలేదు. శాస్త్రవేత్తలు సైతం అలాంటి కలలు సాకారమ య్యేందుకు అనువైన పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ప్రఖ్యాత సైన్స్‌ ఫిక్షన్‌ రచ యిత ఆర్థర్‌ సి. క్లార్క్‌ అన్నట్టు ఈ విశాల విశ్వంలో రెండే రెండు సంభావ్యతలుం టాయి. అవి–మానవాళి ఒంటరైనా కావాలి లేదా కాకపోవాలి. ఈ రెండూ ప్రమా దకరమైనవేనంటాడు క్లార్క్‌. ఎందుకంటే ఒంటరితనం ఎటూ భయానకం. మరె వరో ఉన్నారనుకున్నా వారెలాంటివారో తెలియనంతకాలమూ అది కూడా భీతిగొ ల్పేదే. ఎవరిలోనూ కలవలేని అశక్తత ఉన్న వ్యక్తి సైతం సమూహంలో ఒంటరిగా ఉండాలనుకుంటాడు తప్ప అందరూ నశించి తానొక్కడే మిగిలిపోవాలనుకోడు. మనిషిలో అంతర్లీనంగా ఉండే ఈ తత్వమే అన్వేషణలకు పురుడుపోసింది. కాలం గడుస్తున్నకొద్దీ ఆ అన్వేషణాక్రమం ఎన్నో నేర్పుతున్నది.

మనుషుల్ని ‘బహుళ గ్రహ’ జీవులుగా మార్చాలని స్పేస్‌ ఎక్స్‌ 2002 నుంచీ కలలుగంటోంది. అందుకవసరమైన సాంకేతికతను అభివృద్ధి పరిచే క్రమంలో అది తలమునకలై ఉంది. అందులో ఇప్పుడు జరిగిన ఫాల్కన్‌ హెవీ రాకెట్‌ ప్రయోగం మొట్టమొదటిది. వాస్తవానికి ఈ ప్రయోగం 2011లో జరపాలని సంకల్పించారు. అప్పటినుంచి అది వాయిదాలు పడుతోంది. 2016లో ఫ్లారిడాలోని ప్రయోగ వేది కపై ఫాల్కన్‌ 9 రాకెట్‌ పేలి 20 కోట్ల డాలర్ల వ్యయంతో నిర్మించిన ఉపగ్రహం క్షణాల్లో బూడిదైంది. తాను ప్రయోగించబోయే ఫాల్కన్‌ హెవీకి కూడా అలాంటి పరిస్థితే ఎదురుకావొచ్చునని, తానైతే దేనికైనా సిద్ధంగా ఉన్నానని అప్పట్లోనే మస్క్‌ ప్రకటించాడు. విఫలమై ప్రమాదం సంభవిస్తే అందుకు కారణాలేమిటో పరిశో ధించి, అవి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుని ఈ పనిలో ముందుకెళ్తా మని కూడా చెప్పాడు. భూగోళంపై ఈ మూల నుంచి ఆ మూలకెళ్లి తిరిగి స్వస్థలానికెలా చేరుకుంటున్నామో అదే రీతిలో ఏ గ్రహానికైనా వెళ్లొచ్చే రోజులు రావాలన్నది, అది కూడా చౌకగా ఉండాలన్నది ఎలన్‌ మస్క్‌ కాంక్ష. అందుకే ఈ ప్రయో గంలో మూడు బూస్టర్‌లను పంపి అవి తిరిగి భూమిని చేరుకునే ఏర్పాటు చేశారు. అయితే రెండు బూస్టర్లు అనుకున్నట్టే విజయవంతంగా వెనక్కు వచ్చినా మూడోది మాత్రం మధ్యలోనే కాలిపోయింది. ఈ రెండు బూస్టర్‌లూ మరో ప్రయోగానికి ఉపయోగపడతాయి. ఎలన్‌ మస్క్‌ 2002లో తొలిసారి తన పథకమేమిటో చెప్పినప్పుడు అందరూ వింతగా చూశారు. కానీ తాజా విజయంతో ఆయన సంస్థ ప్రపంచంలోనే ఇప్పుడు అగ్రగామి ప్రైవేటు అంతరిక్ష వాణిజ్య సంస్థగా అవతరించింది.

ఇంత ఆర్భాటం లేదుగానీ... గత నెల 21న ‘హ్యుమానిటీ స్టార్‌’ పేరిట కాంతులీనే బంతిలా ఉండే ఉపగ్రహాన్ని చడీచప్పుడూ లేకుండా ప్రయోగించారు. విజయవంతమైన తర్వాతే దాన్ని ప్రకటించారు. ఇప్పుడది 90 నిమిషాలకొకసారి భూమిని చుట్టివస్తుంది. భూగోళంలో ఏ మూలనున్నవారికైనా స్పష్టంగా కనబడు తుంది. దాని గమనాన్ని తెలుసుకోవడానికి అదే పేరుతో ఒక వెబ్‌సైట్‌ ఏర్పా టుచేశారు. మానవాళి తన గురించి, తన చర్యల గురించి, వాటికుండే పర్యవసా నాల గురించి అవలోకనం చేసుకుని తీరుతెన్నులను మార్చుకుంటుందన్న ఆశతో దీన్ని రూపొందించానని రాకెట్‌లాబ్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ పీటర్‌ బెక్‌ చెబుతు న్నాడు. అయితే ఆశయాలు ఎంత ఉన్నతంగా ఉన్నా, ప్రతీకలెంత ప్రభావవం తమైనవైనా ఇప్పటికే వ్యర్థాలతో అస్తవ్యస్థంగా తయారైన అంతరిక్షం భవిష్యత్తులో మరింత కంగాళీగా మారడానికి తప్ప ఈ ప్రయోగాల వల్ల ఉపయోగమే లేదని నిట్టూర్చే నిరాశావాదులున్నారు. ఏదేమైనా స్పేస్‌ ఎక్స్, రాకెట్‌లాబ్‌ సంస్థలు అంత రిక్ష ప్రయోగాలను ఒక కొత్త దశకు తీసుకుపోయాయి. ఈ ప్రయోగాలు అంతి మంగా మానవాళి శ్రేయస్సుకే తోడ్పడాలి. ప్రభుత్వాలకైనా, ప్రైవేటు సంస్థలకైనా అదే గీటురాయి కావాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top