ఈ నియంత్రణలైనా ఫలిస్తాయా?

Editorial On Supreme Court Judgement On Firecrackers - Sakshi

దీపావళి టపాసుల విక్రయాలపై ఉన్న నిషేధం పోయి ఈసారి వాటి వినియోగంపై నియంత్రణ లొచ్చాయి. గత రెండేళ్లుగా జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్‌)లోనూ, దాని శివార్లలోనూ టపాసుల విక్రయాలను పండుగకు 20 రోజుల ముందు నిషేధిస్తూ ఉత్తర్వులు ఇస్తున్న సర్వోన్నత న్యాయస్థానం ఈసారి అందుకు భిన్నంగా వాటిని కాల్చడానికి కొన్ని పరిమితులు విధించింది. దీపా వళి నాడు రోజంతా కాకుండా రాత్రి 8 గంటలకు మొదలుపెట్టి 10 గంటలకల్లా టపాసులు కాల్చ డాన్ని నిలిపేయాలని ఆంక్షలు విధించింది. అలాగే పరిమితికి మించిన ధ్వని, కాంతి, కాలుష్యం వగై రాలు లేకుండా చూడమని ఢిల్లీ పోలీసు శాఖను ఆదేశించింది.

ఈ నియంత్రణలే రాబోయే క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు, ఇతర ఉత్సవాలకు కూడా వర్తిస్తాయని తెలిపింది. దీపావళి పండుగ హడావుడంతా చీకటిపడ్డాక మొదలవుతుంది. పోటాపోటీగా రకరకాల బాణసంచా, టపాసులు కాల్చడం పిల్లలతోపాటు పెద్దలకూ సరదాయే. కానీ మరుసటి రోజు ఉదయం వీధులన్నీ యుద్ధ క్షేత్రా లను తలపిస్తాయి. వ్యర్థాలతో వీధులన్నీ నిండిపోతాయి. ఇదంతా కంటికి కనిపించేది. పర్యావరణ చైతన్యం పెరగడం వల్ల కావొచ్చు...ఆ టపాసులు, బాణసంచా తీసుకొచ్చే కాలుష్యంపై కొన్నేళ్లుగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా దేశ రాజధాని నగరంలో సాధారణ దినాల్లోనే కాలుష్యం హద్దులు దాటుతుండగా దీపావళి రోజున అది మరింతగా పెరుగుతోంది. నిరుడు దీపావళి రోజున న్యూఢిల్లీలో వాయు కాలుష్యం మాములు రోజులతో పోలిస్తే మూడున్నర రెట్లు ఎక్కువున్నదని తేలింది. 

ఈసారి సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల ద్వారా ‘సురక్షితమైన హరిత దీపావళి’ జరుపుకోవాలని సూచించింది. అంటే తక్కువ కాలుష్యం వెదజల్లే టపాసుల్ని, బాణసంచాను మాత్రమే ఈసారి ఉత్ప త్తిచేయాలి. వాటినే అమ్మాలి. అవే కాల్చాలి. భారీగా కాలుష్యం వెదజల్లే అన్ని రకాల బాణసంచా, టపాసులు తయారు చేయడం, వాటిని విక్రయించడం, అవి కొనుక్కుని కాల్చడం ఈ తీర్పు పర్యవ సానంగా చట్టవిరుద్ధమవుతాయి. అలాగే బాణసంచా, టపాసులు రాత్రి 8–10 మధ్య మాత్రమే విని యోగించాలి. అంతకు ముందూ, ఆతర్వాత కాలిస్తే పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు. అంతేకాదు... వాటిని ఎవరింటి ముందు వారు కాల్చడం కాక అందరూ ఒకచోట చేరి ఆ కార్యక్ర మాన్ని పూర్తి చేసే విధానం అనుసరించాలని సూచించింది.

దాంతోపాటు ఆకాశంలోకి రివ్వును దూసుకుపోయి అక్కడ రకరకాల రంగుల్లో కాంతులు వెదజల్లుతూ పెను శబ్దాలతో పేలే టపాసుల్ని కూడా నిషేధించింది. వీటితోపాటు ఆన్‌లైన్‌ విక్రయాలు ఉండరాదని చెప్పింది. అయితే ప్రభుత్వాలు, వివిధ సామాజిక సంస్థల క్రియాశీలపాత్ర లేకుండా ఇదంతా సాధ్యమేనా? ముందస్తుగా వివిధ మార్గాల్లో ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాలను చేపట్టకుండా కింది స్థాయికి ఇదంతా చేరు తుందా? పోలీసులు ప్రతి వీధిలోనూ, ఇంటి ముందూ పహారా కాసి అదుపులో పెట్టడం సాధ్యమా?

మన దేశంలో ఏదైనా సమస్య ముంచుకొచ్చినప్పుడు మాత్రమే దానిపై చర్చ మొదలవుతుంది. న్యాయస్థానాలు కూడా ఆ మాదిరిగానే స్పందిస్తున్నాయి. రెండు మూడేళ్లుగా దీపావళి టపాసుల విషయంలో విచారణలు సుప్రీంకోర్టులో 15, 20 రోజుల ముందు సాగుతున్నాయి. ఉత్తర్వులు వెలు వడుతున్నాయి. ఈసారి కూడా పండుగ పక్షం రోజులుందనగా న్యాయస్థానం మార్గదర్శకాలొ చ్చాయి. నిజానికి దీపావళి కోసమని బాణసంచా, టపాసులు ఈపాటికే భారీ మొత్తంలో ఉత్పత్తి చేసి ఉంటారు. వీటితోపాటు పాత నిల్వలుంటాయి. తమిళనాడులోని శివకాశిలోనూ, దేశంలోని కొన్ని ఇతరచోట్లా బాణసంచా, టపాసుల తయారీ ఏడాది పొడవునా సాగుతూనే ఉంటుంది. వీటిని దీపా వళికి మాత్రమే కాక పెళ్లిళ్లు, వేర్వేరు పండుగల్లో కూడా వినియోగిస్తారు.

ఇప్పటికే దేశ రాజధానిలో వందల టపాసుల దుకాణాలు వెలిశాయని మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ స్థితిలో సుప్రీం కోర్టు ఆదేశాలు అమలుకావడం సాధ్యమా? అందుకు భిన్నంగా ఏడాది ముందుగానే నిర్ణయం తీసు కుని ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు, రాజకీయ పార్టీలు నిరంతరం ఆ దిశగా పనిచేస్తే ఎంతో కొంత ఫలితం వస్తుంది. బాణసంచా, టపాసుల తయారీ విషయంలో ఇప్పుడు విధించిన పరిమి తుల వల్ల వ్యర్థాల పరిమాణం తగ్గడంతోపాటు ధ్వనికాలుష్యం, కాంతి తీవ్రత పరిమితమవుతాయని లెక్కలేస్తున్నారు. మంచిదే. కానీ అసలు గ్రీన్‌ టపాసులకు అవకాశమే లేదని ఉత్పత్తిదారులు చెబు తున్నారు. వాటిల్లో వాడే రసాయనాలను కొంత మేర తగ్గించవచ్చుగానీ దానికి సమయం పడుతుం దంటున్నారు. ఈ ఉత్తర్వులు కనీసం ఏడెనిమిది నెలలక్రితం వచ్చి ఉంటే ఉపయోగం ఉండేదేమో! 

వాయు కాలుష్యం తీవ్రత వల్ల అనేక అనర్థాలు ఏర్పడతాయి. విపరీతమైన దగ్గు, కఫం, ఊపిరా డనీయని ఆస్త్మా, శ్వాసకోశ వ్యాధి, అలెర్జీలు, కేన్సర్‌ వగైరాలు వస్తాయి. ఢిల్లీ నగరంలో ఇప్పుడున్న వాయు కాలుష్యం వల్ల మనిషి ఆయుఃప్రమాణం 6.4 ఏళ్లు తగ్గిందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తు న్నారు. దేశంలో హైదరాబాద్‌తోసహా వివిధ నగరాల్లో జాతీయ వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ)లు ఏర్పాటు చేశారుగానీ వాటివల్ల ఎలాంటి ప్రయోజనం సిద్ధిస్తున్నదో అనుమానమే. పరిశ్రమల యజ మానుల్లో కాలుష్య నియంత్రణపై అవగాహన పెరిగిందా? కాలుష్య నియంత్రణ బోర్డులు చురుగ్గా వ్యవహరించి చర్యలు తీసుకుంటున్నాయా? కాలుష్యం తీవ్రతపై అవగాహన పెరిగి జనం ప్రభు త్వాలపై ఒత్తిళ్లు తెస్తున్నారా? వీటన్నిటికీ లేదన్న సమాధానమే వస్తుంది.

దీపావళి టపాసులు, బాణ సంచా విషయంలో సుప్రీంకోర్టు తాజా నియంత్రణలు హర్షించదగ్గవే. కానీ ఇంత స్వల్ప వ్యవధిలో ఇవి ఎంతవరకూ సత్ఫలితాలిస్తాయన్నది అనుమానమే. పైగా రాజకీయపార్టీలు, సామాజిక సంస్థల తోడ్పాటు, ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తేనే ఇదంతా సాధ్యమవుతుంది. అది జరిగే పనేనా? జల్లికట్టు, కోడిపందాలు వగైరా అంశాల్లో కోర్టు ఉత్తర్వులు ఎలా అమలయ్యాయో అందరికీ తెలుసు. జనం మనోభావాల పేరిట దేన్నయినా చలామణి చేయించే పార్టీలు, సంస్థలు ఉన్నంతకాలం ఫలి తాలు పరిమితంగానే ఉంటాయి.
 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top