మోదీ సుదీర్ఘ సంభాషణ

Editorial On Narendra Modi Interview Of 2019 - Sakshi

మరో ఆర్నెల్లలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండగా ప్రధాని నరేంద్ర మోదీ ఏఎన్‌ఐ వార్తాసంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. గంటన్నరపాటు జరిగిన ఆ ఇంటర్వ్యూలో వివిధ అంశాలపై తన అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకున్నారు. గత పాలకులు ఏ పార్టీకి చెందినవారైనా, వారిలో కొందరు మీడియాతో సంఘర్షించిన సందర్భాలున్నా తరచూ పాత్రికేయులతో సంభాషించేవారు. విశాల ప్రజానీకానికి తమ భావాలు చేరాలంటే మీడియానే ఆధారమని విశ్వసించేవారు. కానీ మోదీ ఇందుకు భిన్నం.

ఆయన కేవలం ఎంపిక చేసుకున్న చానెళ్లతో మాట్లాడతారు. ట్వీటర్‌ ద్వారా, ‘మన్‌ కీ బాత్‌’ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలతో సంభాషిస్తారు. మీడియా సమావేశాల్లో నేతల ప్రసంగాలు పూర్తయిన వెంటనే విలేకరులు ప్రశ్నల బాణాలు సంధిస్తారు. వాటిలో ఎన్నో అంశాలు ప్రస్తావనకొస్తాయి. అప్పుడు ప్రజలకు మరింత లోతుగా ఆ నాయకుల ఆలోచనలు, మనోభావాలు అర్ధమవుతాయి. మోదీ బలమంతా ఆయన సంభాషణ చాతుర్యమే. పార్లమెంటులో జరిగే చర్చల్లో ఈ సంగతి తరచు తెలుస్తూనే ఉంటుంది.

అయినా ఆయన విలేకరుల సమావేశాలకు దూరంగా ఉంటారు. తాజా ఇంటర్వ్యూలో నరేంద్ర మోదీ పలు ప్రశ్నలకు సుదీర్ఘంగా జవాబులిచ్చారు. ఇందులో రామమందిరం మొదలుకొని ఈమధ్యే జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకూ అనేక అంశాలు ప్రస్తావనకొచ్చాయి. పాకిస్తాన్‌తో సంబంధాలు, చైనాతో ఏర్పడ్డ వివాదం, మూకదాడులు, పెద్దనోట్ల రద్దు, ట్రిపుల్‌ తలాక్, శబరిమల తదితర విషయాలపై ఆయన మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రతిపాదిస్తున్న ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి అడిగితే ‘నేను వినలేదు. నాకేమీ తెలియదు’ అని తేల్చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహా కూటమి ఓటమిపాలైన సంగతిని ప్రస్తావించారు. ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామాపైనా పెదవి విప్పారు.

రామమందిరం విషయంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొస్తుందన్న ఊహాగానాలు నిజం కాదని ఆయన తేల్చిచెప్పడం బాగానే ఉంది. ఊహాగానాలపై ప్రభుత్వం స్పందించకపోతే ఉన్నకొద్దీ అవి మరింత చిక్కబడతాయి. అనవసర ఉద్రిక్తతలు ఏర్పడతాయి. కానీ ‘న్యాయ ప్రక్రియ ముగిశాక’ మా బాధ్యతను నిర్వర్తించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పడం వల్ల కొత్త సందేహాలొస్తాయి. సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వెలువడినా దానికి కట్టుబడి ఉంటామని చెబితే వేరు. ఆ స్పష్టత లేకపోవడం వల్ల తమ ఆలోచనలకు భిన్నమైన తీర్పు వస్తే ప్రభుత్వం ఏం చేస్తుందన్న సందేహం మిగిలే ఉంటుంది. ట్రిపుల్‌ తలాక్‌ అంశం వేరు. ఆ విధానం చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించాక ప్రభుత్వం దానికి అనుగుణంగా ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది.

అనంతరం దాని స్థానంలో ప్రవేశపెట్టిన బిల్లు ప్రస్తుతం రాజ్యసభ ముందుంది. మరో ముఖ్యాంశం రైతు రుణ మాఫీ గురించి కూడా మోదీ తన మనోగతం చెప్పారు. రుణమాఫీ వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయనుకుంటే ఆ పని ఖచ్చితంగా చేయాల్సిందేనని అంటూనే ఎన్నోసార్లు రుణ మాఫీ జరిగినా రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి కారణమేమిటని కూడా ఆయన అడిగారు. దానికి భిన్నంగా భూసార పరీక్ష కార్డులు, 22 పంట దిగుబడులకు స్వామినాథన్‌ కమిషన్‌ సూచించినట్టు 50 శాతం అదనంగా ఇవ్వడం వంటి చర్యలు తీసుకుంటున్నామని మోదీ వివరించారు. కానీ కేంద్ర విధానం తాను సూచించిన తరహాలోలేదని స్వయానా స్వామినాథనే ఆమధ్య చెప్పిన సంగతి ఆయనకు తెలిసినట్టు లేదు.

సాగు పెట్టుబడిని కేవలం విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులకయ్యే ఖర్చుకే పరిమితం చేయకుండా పొలంలో పనిచేసేవారి వార్షిక వేతనాలు, కౌలు మొత్తం, బీమా వ్యయం వగైరాలను కూడా లెక్కేసి దానికి అదనంగా ఒకటిన్నర రెట్లు ఇవ్వాలన్నది స్వామినాథన్‌ సూచించిన విధానం. దాన్ని తు చ తప్పకుండా అమలు చేస్తే రైతుల సమస్యలు గణనీయంగా తగ్గుతాయి. అప్పుడు మోదీ చెప్పినట్టు రుణమాఫీ అవసరమే రాకపోవచ్చు. మరో సంగతేమంటే...యూపీ ఎన్నికల సమయంలో బీజేపీయే రుణమాఫీ వాగ్దానాన్ని చేసింది.

అందువల్ల ఎన్నికల్లో లబ్ధి పొందింది. ఆ తర్వాత వచ్చిన ఒత్తిళ్లతో మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం కూడా అమలు చేసింది. రైతుల్లో ఎక్కువమంది బ్యాంకుల దగ్గర కాకుండా ప్రైవేటు రుణాలే తీసుకుంటారన్న మాట కూడా నిజం. తక్కువ వడ్డీకి రుణం దొరికే బ్యాంకుల దగ్గరకు పోకుండా అధిక వడ్డీ వసూలు చేసే ప్రైవేటు రుణాలకు రైతులు ఎందుకు వెళ్తున్నారో గ్రహించి ఆ లోటుపాట్లను కేంద్ర ప్రభుత్వం ఈపాటికే సరిచేసి ఉంటే బాగుండేది. కనీసం ఆ విషయంలో ఏం చేయబోతున్నారో కూడా మోదీ చెప్పలేదు. 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీలు చిక్కినప్పుడల్లా తనపై విరుచుకు పడుతున్నా ఇంటర్వ్యూలో ఆయన గురించి మోదీ అసలు ప్రస్తావించనే లేదు. తెలంగాణలో మహా కూటమి చిత్తుగా ఓడిపోవడం గురించి మాత్రమే మాట్లాడి దానికి సూత్రధారిని మాత్రం ఏమీ అనలేదు. ఆ రెండు పార్టీల ఉన్న బంధం చిత్రమైనది. బాబు చెప్పుకుంటున్నట్టు నిజంగా ఆయన మోదీపై హోరాహోరీగా తలపడుతుంటే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఫిరాయించిన ఎంపీలపై ఈపాటికే అనర్హత వేటు పడి ఉండాలి. చట్టసభల అధ్యక్షులే ఈ విషయంలో నిర్ణయం తీసుకోవా లని నిబంధనలు చెబుతాయి. కానీ అంతిమంగా అది రాజకీయ నిర్ణయం.

ఈ విషయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీలు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను కలిసి అనేకసార్లు వినతిపత్రాలిచ్చినా ఫలితం లేకపోయింది. మరో ఆర్నెల్లలో ఈ సభ గడువు కూడా ముగిసిపోతోంది. చట్టప్రకారం యధావిధిగా జరగాల్సిన అంశంలోనే ఇలాంటి వైఖరి ప్రదర్శిస్తుంటే ఇక వారిద్దరూ ప్రత్యర్థులంటే నమ్మేదెవరు? ఇప్పుడు మోదీ తన జవాబుల్లో బాబు పేరెత్తకపోవడం కూడా దాన్నే ధ్రువపరు స్తోంది. మొత్తానికి ఈ ఇంటర్వ్యూలో సుదీర్ఘ సంభాషణే సాగినా, కీలక అంశాలే ప్రస్తావనకొచ్చినా అసంపూర్ణంగానే అనిపిస్తుంది. కేవలం ఒక్కరితోనే సంభాషించినప్పుడు ఇది తప్పదు. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top