చైనాకు హాంకాంగ్‌ షాక్‌

Editorial On Hong Kong Election Result - Sakshi

జన చేతనను విస్మరిస్తే ఏమవుతుందో చైనా పాలకులకు అర్ధమై ఉండాలి. ఆదివారం హాంకాంగ్‌ పరిధిలోని 18 జిల్లా పాలకమండళ్ల నుంచి 452 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో చైనా అనుకూల ప్రతిని ధులు ఘోర పరాజయం చవిచూశారు. మొత్తం 17 మండళ్లు ప్రజాస్వామ్య అనుకూలవాదుల చేజి క్కించుకోవడంతోపాటు 452 స్థానాల్లో 390వారికి లభించాయి. ఇది దాదాపు 90 శాతం. చైనా అను కూలురకు దక్కినవి కేవలం 59 స్థానాలు మాత్రమే.  సహజంగానే ఈ ఫలితాలు బీజింగ్‌ను దిగ్భ్రాంతి పరిచాయి. సాధారణంగా అయితే ఈ ఎన్నికలకు పెద్దగా ప్రాముఖ్యం ఉండేది కాదు. ఎందుకంటే ఈ మండళ్లకు ఉండే అధికారాలు చాలా పరిమితమైనవి. చెత్త తొలగింపు, బస్సు రూట్లు సదుపాయం, పర్యావరణంవంటి పౌరుల అవసరాలను పర్యవేక్షించి చర్యలు తీసుకోవడానికి మాత్రమే వీటికి అధికారాలుంటాయి. 

కానీ ఆర్నెలక్రితం చిన్నగా మొదలై, చూస్తుండగానే కార్చిచ్చులా వ్యాపించిన ప్రజాస్వామ్య ఉద్యమం కారణంగా ఈ ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది. హాంకాంగ్‌ ప్రజల మనో భీష్టం వ్యక్తమయ్యేది కేవలం ఈ ఎన్నికల ద్వారా మాత్రమే. పైగా హాంకాంగ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కారీ లామ్‌ ఈ ఎన్నికలు తన పాలనకు రిఫరెండం అని ముందే చెప్పారు. ఫలితాలు వెలువడ్డాక సైతం ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తామని, లోపాలను సవరించుకుంటామని అన్నారు. కానీ ఆమెను ఆ పదవిలో కూర్చోబెట్టిన చైనా పాలకులకు మాత్రం ఈ ఫలితాలు కంటగింపుగా మారాయి. దీన్నుంచి గుణపాఠం నేర్చుకోవడం మాని, ఉద్యమకారులపై నిందలేస్తున్నారు. ప్రభుత్వ అనుకూల మీడియా అమెరికా రాజకీయ నాయకులపై ఆరోపణలు చేస్తున్నది. 

హాంకాంగ్‌లో కల్లోలం సృష్టించడమే వారి ఉద్దేశమని అంటున్నది. బ్రిటన్‌కున్న 150 ఏళ్ల లీజు ముగిసి 1997 జూలై 1న హాంకాంగ్‌ తిరిగి చైనాకు దఖలు పడినప్పుడు అప్పటి చైనా నాయకుడు డెంగ్‌ జియావో పెంగ్‌ ఇచ్చిన హామీ బహుశా చైనా నేతలు మర్చిపోయి ఉండొచ్చు. హాంకాంగ్‌లో ఇప్పుడున్న విధానాలన్నీ యధాతధంగా సాగుతా యని, తాము ‘ఒకే దేశం–రెండు వ్యవస్థలు’ అనే విధానానికి కట్టుబడి ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. 

ఒప్పందాన్ననుసరించి 2047లో ఆ నగరం పూర్తి స్థాయిలో చైనా పరిధిలోకొస్తుంది. అప్పటి వరకూ హాంకాంగ్‌ స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు వచ్చే ముప్పేమీ ఉండబోదని డెంగ్‌ తెలిపారు. ఆయన కన్నా ముందు 1993లో చైనా కమ్యూనిస్టు పార్టీ ‘పీపుల్స్‌ డైలీ’లో  రాసిన వ్యాసంలో ఉన్నత స్థాయి నాయకుడొకరు హాంకాంగ్‌ స్వయంప్రతిపత్తిలో తమ జోక్యం ఉండబోదని చెప్పారు. కానీ 1997 నుంచి ఇప్పటివరకూ సాగిన చరిత్రంతా చూస్తే చైనా ఏ ఒక్క హామీనీ నిలబెట్టుకోలేదని అర్ధమవు తుంది. అక్కడి ప్రజల హక్కులు ఒక్కొక్కటే మింగేస్తూ, ఆ నగరాన్ని గుప్పెట్లో బంధించడానికి అది పావులు కదుపుతూనే ఉంది. 

అమెరికా తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో చైనాది ద్వితీయ స్థానం. అది ఎప్పుడో ఒకప్పుడు తమను మించిపోతుందన్న భయం అమెరికాకు ఉంది. ఈ దశలో బాధ్యతాయుతంగా వ్యవహ రించకపోతే, హాంకాంగ్‌కిచ్చిన వాగ్దానం నెరవేర్చకపోతే ప్రపంచ దేశాల్లో తన విశ్వసనీయత దెబ్బ తింటుందని చైనా గ్రహించడం లేదు. ఆర్నెల్లుగా హాంకాంగ్‌ను ఉక్కుపాదంతో అణిచేస్తూ అక్కడి ప్రజలు తిరిగి తనకే పట్టం కడతారని చైనా ఎలా అనుకుందో అంతుబట్టని విషయం. కేవలం గుప్పె డుమంది విదేశీ శక్తుల ప్రోద్బలంతో ఉద్యమం సాగుతున్నదని, దీనికి మెజారిటీ ప్రజల మద్దతు లేదని చెబుతూ వస్తున్న చైనాకు తాజా ఫలితాలు చెంపపెట్టు. 

కనీసం ఇప్పుడైనా పౌరుల ఆగ్రహా వేశాలు ఏ స్థాయిలో ఉన్నాయో అది గుర్తించాలి. నాలుగేళ్లక్రితం జరిగిన ఎన్నికల్లో 14 లక్షలమంది ఓటు హక్కు వినియోగించుకోగా ఈసారి ఆ సంఖ్య 29.5 లక్షలకు చేరుకుంది. మొత్తం 452 స్ధానాల్లో ప్రతి ఒక్కచోటా నువ్వా నేనా అన్న రీతిలో హోరాహోరీ పోరు సాగింది. అయితే నగర నిర్వహణ కమిటీలో ఇప్పటికీ చైనా అనుకూల ప్రతినిధులదే పైచేయిగా ఉంటుంది. అందులో ఉండే 1,200 మంది సభ్యుల్లో మండళ్ల నుంచి ఎన్నికైనవారిలో కేవలం 117మందికి మాత్రమే స్థానం లభిస్తుంది. మిగిలినవారంతా రకరకాల కేటగిరీల్లో చైనా ప్రభుత్వం నామినేట్‌ చేసేవారే ఉంటారు. కనుక  2022లో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ పదవికి జరగబోయే ఎన్నికల్లో చైనాదే పైచేయిగా ఉంటుంది. హాంకాంగ్‌ నగరంపై యధావిధిగా దాని ఆధిపత్యమే కొనసాగుతుంది.   

ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమైనప్పుడు సకాలంలో దాన్ని గుర్తించాలి. కానీ చైనా అందుకు భిన్నంగా తనకెదురు లేదన్నట్టు వ్యవహరించింది. ఆ ధోరణే ఇప్పుడు హాంకాంగ్‌ పౌరులను ఏకం చేసింది. హాంకాంగ్‌లో నేరాలు చేసేవారిని చైనాకు తరలించి, అక్కడి చట్టాల ప్రకారం శిక్షించ డానికి వీలిచ్చే బిల్లు తీసుకురావడం ఇప్పుడు హాంకాంగ్‌లో సాగుతున్న ప్రజాస్వామ్య ఉద్యమానికి మూలం. పైగా ఆ బిల్లు వెనకటి తేదీ నుంచి వర్తించేలా రూపొందించారు. నేరస్తుల అప్పగింత చట్టాన్ని సవరిస్తూ రూపొందించిన ఆ బిల్లు ఆమోదం పొందితే చైనా వ్యతిరేకులందరినీ ఏరిపారేయడం సులభమవు తుంది. అలాంటివారిని చైనా తరలించి అక్కడ అమలవుతున్న చట్టాల కింద కఠిన శిక్షలు విధించడం వీలవుతుంది. 

కేసుల విచారణ, నేరస్తులకు శిక్షలు వగైరాలన్నీ ఒక తంతుగా సాగే చైనా న్యాయ వ్యవస్థకు ఏమాత్రం విశ్వసనీయత లేదు. కనుకనే ఈ సవరణ బిల్లును అంగీకరించబోమని ఉద్యమ నిర్వాహకులు చెప్పారు. మొదట్లోనే చైనా ఇందుకు అంగీకరించి ఉంటే పరిస్థితి విషమించేది కాదు. కానీ లారీ కామ్‌ మొండికేయడంతో ఉద్యమం ఉధృతమైంది. చివరకు ఈ బిల్లును వెనక్కి తీసుకుం టున్నామని ఇటీవల ఆమె ప్రకటించినా ఉద్యమం ఆగే సూచనలు కనిపించడం లేదు. పైగా అది హింసాత్మకంగా మారుతోంది. అందుకు తగ్గట్టే పోలీసు బలగాలు కూడా తీవ్రంగా విరుచుకుపడు తున్నాయి. ఈ ఎన్నికలకు పాలనాపరంగా పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా, దీనిద్వారా వ్యక్తమైన జనాభీష్టాన్ని గ్రహించడం, అందుకు తగ్గట్టుగా వ్యవహరించడం ముఖ్యమని చైనా గుర్తించాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top