‘తక్షణ’ న్యాయం

Editorial On Encounter Of Accused Persons In Disha Murder  - Sakshi

‘దిశ’పై గత నెల 27 రాత్రి సామూహిక అత్యాచారం చేసి, సజీవదహనం చేసిన నరరూప రాక్షసులు నలుగురూ శుక్రవారం వేకువజామున పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. సహజంగానే జాతీయ మానవహక్కుల సంఘం వెనువెంటనే స్పందించి దీనిపై విచారణకు తమ సభ్యుల్నిపంపుతోంది. తెలంగాణ హైకోర్టు కూడా ఈ నెల 9న విచారిస్తామంటోంది. ఎన్‌కౌంటర్‌ గురించి తెలిశాక తెలంగాణలో, ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు...దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీసులకు ప్రశంసలు లభిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వివిధ నగరాల్లో వారిని అభినందిస్తూ ర్యాలీలు జరిపారు.

‘దిశ’ ఉదంతం సమాజం మొత్తాన్ని కదిలించింది. ఆమెకు సరైన న్యాయం దక్కాలంటే ఆ నలుగురినీ వెంటనే ఎన్‌కౌంటర్‌ చేయాలని తొమ్మిదిరోజులుగా జనం డిమాండ్‌ చేస్తున్నారు. నిందితుల్ని షాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో బంధించినప్పుడు వందలాదిమంది చుట్టుముట్టి వారిని తక్షణం తమకప్పగించాలని డిమాండ్‌ చేశారు. రిమాండ్‌ కోసం వారిని తర లించడం సాధ్యం కాక ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ను పోలీస్‌ స్టేషన్‌కే రప్పించవలసివచ్చింది. చివరకు లాఠీచార్జి చేసి చెదరగొడితే తప్ప నేరగాళ్లను జైలుకు పంపడం సాధ్యపడలేదు.

అత్యాచారమైనా, మరే ఇతర నేరమైనా జరిగినప్పుడు అందరిలో ఆందోళన కలుగుతుంది. ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది.ఎన్నాళ్లిలా అనే ప్రశ్న మొలకెత్తుతుంది. ‘దిశ’ ఉదంతం అంతకుమించిన స్పందన తీసు కొచ్చింది. స్థానికంగానే కాదు... దేశవ్యాప్తంగా కూడా అందరినీ కదిలించింది. ఎందుకంటే ఈ నేరగాళ్లు ప్రదర్శించిన క్రౌర్యం తీవ్రత ఆ స్థాయిలో ఉంది. ఆమెను నమ్మించి, ఒక పథకం ప్రకారం నిర్మానుష్య ప్రాంతానికి వచ్చేలా చేసి అదును చూసి కాటేశారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టా డుతుండగా ఆమెపై మృగాల్లా ఒకరి తర్వాత ఒకరు దాడి చేశారు. తమ రాక్షసత్వం కప్పిపుచ్చు కోవడానికి కొన ఊపిరితో ఉన్న ఆమెను సజీవ దహనం చేశారు. 

ఈ కేసులో పోలీసులపై తీవ్ర ఒత్తిడి వచ్చింది. చానెళ్లలో సామాన్య మహిళలు, బాలికలు సైతం వారి పనితీరును ప్రశ్నించారు. ఆ నేరగాళ్లలో లారీ నడుపుతున్న వ్యక్తికి కనీసం డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకపోయినా భారీ వాహనాన్ని నడిపాడు. టోల్‌గేటు దగ్గరలో వాహనం నిలిపి ఉంచినప్పుడు అక్క డికొచ్చిన పోలీసులు దాన్ని వేరేచోట పెట్టుకోవాలని చెప్పారు తప్ప అందులో తరలిస్తున్నదేమిటో, వారి వివరాలేమిటో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. సర్వీస్‌ రోడ్డులో ఓ పక్కకు వాహనం నిలిపివుంచినా అటుగా పోయిన గస్తీ పోలీసులు పట్టించుకోలేదు.

కనీసం ‘దిశ’ ఉదంతం తర్వా తైనా వారిలో అప్రమత్తత ఏర్పడ్డ సూచనలు కనబడలేదని ఒకటి రెండు చానెళ్లు ప్రసారం చేసిన కథనాలు వెల్లడించాయి. ఘటన గురించి తెలిశాక బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించినప్పుడు వారిని సరిగా పట్టించుకోలేదు.  పైగా బాధితురాలి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడారు. మూడు పోలీస్‌స్టేషన్లు తిరిగాకగానీ వారి ఫిర్యాదు స్వీకరించి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు. అది జరిగాక కూడా సీసీ టీవీ ఫుటేజ్‌లు చూడటానికే బోలెడు సమయం పట్టింది. ఇప్పుడు జరిగిన ఎన్‌కౌంటర్‌ తర్వాత ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతూ ఉండొచ్చు. కానీ వ్యవస్థను పట్టిపీడిస్తున్న మౌలిక సమస్యను ఇవి మరుగుపరచకూడదు.

ఒక కుటుంబం ‘దిశ’ను కోల్పోవడానికి కారణమైన ఈ వైఫల్యాలన్నిటినీ సమూలంగా పెకిలించాలి. లేనట్టయితే ఇవే పరి స్థితులు పునరావృతం అవుతాయి. ఇక్కడ మాత్రమే కాదు... దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి ఉదా సీనతే రాజ్యమేలుతోంది. కనుక అన్ని రాష్ట్రాలకూ ఇది గుణపాఠం కావాలి. ఈ విషయంలో ఇప్ప టికే చాలా మార్పొచ్చింది. తెలంగాణతోపాటు అనేకచోట్ల పోలీసు విభాగాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. మహిళల రక్షణపై దృష్టి పెట్టాయి. తెలంగాణ పోలీసు విభాగం ఇంటర్నెట్‌ లేని సందర్భాల్లో సైతం తమ హాక్‌–ఐ యాప్‌ పనిచేసేలా మార్పులు చేసింది. ఆపత్సమయాల్లో ఎస్‌ఓఎస్‌  బటన్‌ నొక్కితే నేరుగా 100కు ఫోన్‌ వెళ్లేలా సవరించారు. ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు కూడా నేరం ఎక్కడ జరిగినా బాధితులొచ్చినప్పుడు కేసు నమోదు చేసుకుని పని ప్రారంభించడం మొదలుపెట్టారు. వెనువెంటనే దాని ఫలితాలు కూడా కనబడటం ప్రారంభించాయి.

అయితే న్యాయవ్యవస్థలో అంతూ దరీ లేకుండా ఏళ్ల తరబడి సాగుతున్న విచారణలు కూడా నేరగాళ్లలో ఒక రకమైన భరోసా కలిగిస్తున్నాయి. తమకేమీ కాదన్న ధైర్యాన్నిస్తున్నాయి. నిరుడు మార్చి నాటికి దేశవ్యాప్తంగా అత్యాచారాలు, ఇతర లైంగిక నేరాలకు సంబంధించి 1,66,882 కేసులు వివిధ న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్నాయి. దర్యాప్తులో జాప్యం, సాక్ష్యాధారాల సేకరణలో లోటుపాట్లు ఇందుకు కారణమవుతున్నాయి. ఆఖరికి డీఎన్‌ఏ సాక్ష్యాలు కూడా న్యాయ స్థానాల్లో నిలబడని దుస్థితి ఉంది. కనుకనే స్వల్ప కేసుల్లో మాత్రమే నిందితులకు శిక్షలు పడు తున్నాయి.

దేశంలో కఠిన శిక్షలు లేకపోవడం వల్లే నేరాలు జరుగుతున్నాయని భావించి నిర్భయ వంటి చట్టం తీసుకొచ్చారు. పోక్సో చట్టాన్ని కూడా కఠినం చేశారు. కానీ నేరం జరిగిందని సమాచారం వచ్చిన దగ్గర్నుంచి న్యాయస్థానాల్లో నిందితులపై చార్జిషీట్లు నమోదు చేసి విచారణ పూర్తయ్యే వరకూ జరిగే క్రమమంతా ఎంతో లోపభూయిష్టంగా ఉంటోంది. దీన్నంతటినీ పట్టిం చుకుని సరిచేసేందుకు ఎవరూ చిత్తశుద్ధితో పూనుకోవడం లేదు.

నిందితులు నిర్దోషులుగా విడుదలైనప్పుడు దర్యాప్తు చేసిన అధికారులను అందుకు బాధ్యుల్ని చేసి చర్య తీసుకోవాలని నాలు గేళ్లక్రితం సుప్రీంకోర్టు సూచించింది. అది ఆచరణలో పెడితే ఎంతోకొంత ఫలితం ఉండొచ్చు. బాధి తురాలి తండ్రి ఎన్‌కౌంటర్‌పై స్పందిస్తూ ఇది ఉపశమనం మాత్రమేనని చెప్పిన మాట విలువైనది. ఇలాంటి నేరాలను శాశ్వతంగా రూపుమాపడానికి శాయశక్తులా కృషి చేయడమే ‘దిశ’కు మనం అర్పించే నిజమైన నివాళి అవుతుంది. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top