పోలీసుల పోరు!

Editorial On Delhi Cops Vs Lawyers - Sakshi

దేశ రాజధాని మంగళవారం విస్తుపోయింది. పదకొండు గంటలపాటే కావొచ్చుగానీ... ఎప్పుడూ ఆందోళనలను, నిరసనలను అణచడం కోసం రంగంలోకి దిగే పోలీసులు ఈసారి తామే ఆందోళన చేశారు. నల్లబ్యాడ్జీలు ధరించారు. వారి కుటుంబసభ్యులను సైతం రంగంలోకి దించి న్యూఢిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయం ముందు ప్లకార్డులు పట్టుకుని గొంతెత్తి నినాదాలు చేశారు.  తమను సముదాయించడానికొచ్చిన ఉన్నతాధికారులను ‘గో బ్యాక్‌..గోబ్యాక్‌’ అంటూ తృణీకరించారు. ఇంత ఆందోళనకు కారణం ఈ నెల 2న ఢిల్లీలోని తీస్‌హజారి కోర్టు ప్రాంగణంలో న్యాయవాదు లకూ, పోలీసులకూ మధ్య తలెత్తిన వివాదం. ఒక వాహనాన్ని పార్క్‌ చేయడం దగ్గర రాజుకున్న వివాదం చూస్తుండగానే ముదిరి రెండు వర్గాలూ కొట్టుకునే స్థాయికి చేరింది. అటు న్యాయ వాదులు, ఇటు పోలీసులు కూడా ఈ ఘటనలో గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమ య్యాయి. పోలీసులు కాల్పులు కూడా జరిపారు. పోలీస్‌ పిస్తోలు కూడా మాయమైందంటున్నారు. శనివారం జరిగిన ఈ గలాటా ఆదివారంనాడు ఢిల్లీ హైకోర్టు ముందుకెళ్లింది. ఇద్దరు ఏఎస్‌ఐ స్థాయి అధికారుల సస్పెన్షన్‌కు ఆదేశాలివ్వడంతోపాటు అదనపు డీసీపీని, స్పెషల్‌ కమిషనర్‌ను బదిలీ చేయాలని న్యాయమూర్తులు ఆదేశించారు. జరిగిన ఉదంతంపై విచారణకు రిటైర్డ్‌ న్యాయమూర్తితో కమిటీ వేశారు. న్యాయవాదులపై మళ్లీ ఆదేశాలిచ్చేవరకూ చర్యలు తీసుకోవద్దన్నారు. ఈ ఆదే శాలన్నీ న్యాయవాదులకు ఉపశమనం కలిగించేవే. సాధారణంగా అయితే ఇక్కడితో అంతా సద్దు మణిగేది. కానీ అంతవరకూ బాధితులుగా కనబడ్డ న్యాయవాదుల పరిస్థితి సామాజిక మాధ్య మాల్లో ప్రచారంలోకొచ్చిన కొన్ని దృశ్యాల పర్యవసానంగా తిరగబడింది. న్యాయవాదులు తీస్‌ హజారి కోర్టు లాకప్‌పైకి దూసుకెళ్లి ఒకరిద్దరు కానిస్టేబుళ్లను చితకబాదడం, అక్కడున్న ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడం వగైరాలన్నీ ఆ దృశ్యాల్లో ఉన్నాయి. అంతేకాదు... సోమవారం కోర్టుకు రికార్డు సమర్పించడానికెళ్లిన కానిస్టేబుల్‌పై కొందరు న్యాయవాదులు అమానుషంగా ప్రవర్తించిన దృశ్యాలు కూడా ప్రత్యక్షమయ్యాయి.

న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించినరోజే పోలీసులు కూడా తమపై జరిగిన దౌర్జన్యం గురించి చెబితే వేరేవిధంగా ఉండేదేమో! కానీ ఈ దృశ్యాలు బయ టపడేవరకూ వారికి కూడా జరిగిన ఘటనపై స్పష్టత లేనట్టు కనిపిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో వెలువడిన దృశ్యాలు న్యాయవాదుల ప్రతిష్టను పెంచవు.  పోలీసుల వల్ల వారికి అన్యాయమే జరిగి ఉండొచ్చు. న్యాయవాదులు కూడా సంయమనం కోల్పోయి రౌడీయిజానికి దిగడం సమస్య పరి ష్కారానికి దోహదపడదు. ఒక చిన్న వివాదాన్ని పరిష్కరించుకోవటంలో ఇరువర్గాల్లోనూ చాక చక్యం లోపించి ఇదంతా సంక్లిష్ట వ్యవహారంగా మారింది. దేశ రాజధానిలో పోలీసులే ఆందోళనకు దిగడం పోలీసు ఉన్నతాధికారులతోపాటు ఆ నగరంలో శాంతిభద్రతల వ్యవహారాలు చూసే కేంద్ర హోంశాఖను కూడా ఇరకాటంలో పడేసింది. 

రెండు వర్గాల మధ్య విశ్వసనీయత కొరవడటం ఈ ఉదంతంలో ప్రధాన సమస్య. న్యాయ వాదులు–పోలీసుల మధ్య మాత్రమే కాదు... పోలీసులకూ, పోలీసు ఉన్నతాధికారులకూ మధ్య కూడా సంబంధాలు సక్రమంగా లేవని ఢిల్లీ ఉదంతం చెబుతోంది. ఒకపక్క తమ సహచరులు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సమయంలోనేæ కొందరు న్యాయవాదులు దౌర్జన్యానికి దిగి తాము కూడా చట్టవిరుద్ధంగా ప్రవర్తించడంలో ఎవరికీ తీసిపోమని నిరూపించారు. ఇదే ఢిల్లీలో గతంలో పాత్రికేయులపై కూడా వారు దౌర్జన్యానికి దిగారు. తాజా ఉదంతంలో పోలీసులు సైతం తమ విధి నిర్వహణ రీత్యా క్రమశిక్షణతో మెలగవలసి ఉండగా అందుకు భిన్నంగా ప్రవర్తించారు. కేటా యించిన స్థలంలో కాక వేరే చోట న్యాయవాది వాహనం ఉంచటం పరిష్కరించవీలులేనంత పెద్ద సమస్యా? గోటితో పోయేదానికి గొడ్డలి తీసుకెళ్లినట్టు న్యాయవాదులతో అంత దురుసుగా ప్రవ ర్తించడం అవసరమా? శాంతిభద్రతల పరిరక్షణ తమ ప్రాథమిక కర్తవ్యం అన్న సంగతిని పోలీ సులు గుర్తుంచుకుంటే ఇలా దురుసుగా ప్రవర్తించి చిన్న వివాదాన్ని శాంతిభద్రతల సమస్యగా మార్చేవారు కాదు. తీస్‌హజారి కోర్టు ఆవరణలో న్యాయవాదులు ఎలాంటి నిబంధనలూ పాటిం చరని, భద్రతా తనిఖీలను సైతం ఖాతరు చేయరని ఎప్పటినుంచో పోలీసులు ఆరోపిస్తున్నారు.

ఆ అవరణను తమ సొంతాస్తిగా న్యాయవాదులు భావిస్తారన్నది వారి ప్రధాన ఫిర్యాదు. తీస్‌హజారి కోర్టు, న్యాయవాదులు–పోలీసుల ఘర్షణ అనగానే ఎవరికైనా 1988నాటి ఉదంతం గుర్తుకొస్తుంది. కిరణ్‌ బేడీ గుర్తొస్తారు. అప్పట్లో ఒక న్యాయవాదిని దొంగతనం ఆరోపణతో అరెస్టు చేసిన పోలీ సులు ఆయనకు సంకెళ్లు వేసి న్యాయస్థానానికి తీసుకురావడం వివాదానికి మూలం. ఈ కేసులో న్యాయవాదికి మెట్రొపాలిటన్‌  మేజిస్ట్రేట్‌ వెంటనే బెయిల్‌ మంజూరు చేయడంతోపాటు సంకెళ్లు వేసిన పోలీసులపై చర్య తీసుకోవాలంటూ పోలీస్‌ కమిషనర్‌ను ఆదేశించారు. న్యాయవాదికి సంకెళ్లు వేయడాన్ని కిరణ్‌బేడీ సమర్థించడం, న్యాయవాదుల ఆందోళన అణచడానికి బలప్రయోగా నికి దిగడం పరిస్థితిని దిగజార్చింది. రెండు నెలలపాటు కోర్టులు స్తంభించిపోయాయి. దాని ప్రభావం ఎంతగా ఉందంటే 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కిరణ్‌బేడీని బీజేపీ ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దించినప్పుడు ఆరు జిల్లాల్లోని న్యాయవాదులంతా ఏకమై ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ప్రత్యర్థిగా కిరణ్‌ బేడీ ఆగమనం కూడా ఆప్‌ ఘనవిజయానికి ఒక కారణం. శాంతి భద్రతల పరిరక్షణకు తమపై ఆధారపడే ప్రభుత్వాలు, ఇబ్బందులు తలెత్తిన సందర్భాల్లో తమకు రక్షణగా నిలబడవన్నది పోలీసులు ఎప్పటినుంచో చేస్తున్న ఫిర్యాదు. జరిగిన ఉదంతం విషయంలో పోలీసుల అసంతృప్తిని సకాలంలో పసిగట్టలేకపోవడం ఉన్నతాధికారగణం వైఫల్యం. కనీసం ఇకముందైనా ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు ఏం చర్యలు అవసరమో వారు గ్రహించాలి. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top