అణు ఒప్పందానికి ట్రంప్‌ తూట్లు!

Donald Trump Declares, America Quits From Iran Nuclear Deal - Sakshi

ఇరాన్‌తో కుదిరిన అణు ఒప్పందంపై అధికారంలోకి వచ్చినప్పటినుంచీ అక్కసు వెళ్లగక్కు తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చివరకు దాన్నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఇలా చేయడం ద్వారా ఆయన తన దేశ ప్రతిష్టను దిగజార్చడంతోపాటు పశ్చిమాసి యాను అనిశ్చితిలోకి... మన దేశంతోసహా ప్రపంచ దేశాలన్నిటినీ సంక్షోభం అంచుల్లోకి నెట్టారు. రోగికి పథ్యం రుచించనట్టు యూరప్‌ దేశాల హితవచనాలు, స్వదేశంలోని నిపుణుల వినతులు ట్రంప్‌ తలకెక్కలేదు. తనకు తోచిందే సరైందనుకునే ఆయన మూర్ఖత్వాన్ని సరి చేయడం వారెవరివల్లా కాలేదు. పర్యవసానంగా ఒక మెరుగైన ఒప్పందం కష్టాల్లో పడింది.

ఇది అమెరికా–ఇరాన్‌ల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం కాదు. ఇరాన్‌తో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనాలు... వీటితోపాటు జర్మనీ, యూరప్‌ యూనియన్‌లు ఉమ్మడిగా దీన్ని ఖరారు చేసుకున్నాయి. ఆ రకంగా ఇది బహుళ దేశాల ఒప్పందం. ఇప్పుడు అమెరికా మాత్రమే ఈ ఒప్పందాన్ని కాలదన్నింది. మిగిలిన దేశాలు దానికి కట్టుబడి ఉంటామంటు న్నాయి. కానీ ఇరాన్‌పై అత్యున్నతస్థాయి ఆర్థిక ఆంక్షలు విధిస్తామని, దానితో వ్యాపార లావా దేవీలు జరిపే దేశాలకు తమ మార్కెట్లలో స్థానం ఉండబోదని అమెరికా చెబుతోంది.

ఈ బెదిరింపు వాస్తవరూపం దాలిస్తే రష్యా మాటెలా ఉన్నా మిగిలిన దేశాలన్నీ ఇరాన్‌తో ఉండాలో, లేదో తేల్చుకోక తప్పనిస్థితి ఏర్పడుతుంది. బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, చైనాలకు అమెరికా మార్కెట్లతో విడదీయరాని అనుబంధం ఉంది. అక్కడ లక్షల కోట్ల డాలర్ల పెట్టు బడులు న్నాయి. మన దేశానికి ముడి చమురు ఎగుమతి చేస్తున్న దేశాల్లో ఇరాన్‌ది మూడో స్థానం. ఆంక్షలు మొదలైతే ఈ రంగంలో పెను సంక్షోభం తప్పదు.

ఇజ్రాయెల్, సౌదీ అరేబియాల ప్రయోజనాలు కాపాడటం తప్ప మరే లక్ష్యమూ లేని ట్రంప్‌కు ఇది పనికిమాలిన ఒప్పందం అనిపించవచ్చు. కానీ దీని వెనక ఎంతో కృషి ఉంది. ఏళ్ల తరబడి తెరవెనక జరిగిన సంప్రదింపుల పర్యవసానంగా చర్చలు సాకారమయ్యాయి. ఆ దశలో కూడా సమస్యలు తలెత్తాయి. ఇరాన్‌పై సడలించాల్సిన ఆంక్షలపై అగ్రరాజ్యాలు మంకు పట్టు పడితే... తన సైనిక స్థావరాలను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(ఐఏఈఏ) తనిఖీ చేయ డానికి ఇరాన్‌ ఒప్పుకోలేదు. కేవలం మా అణు కార్యక్రమంపైన మాత్రమే చర్చించడమేమిటి, ఇందులో పశ్చిమాసియా దేశాలన్నిటినీ భాగస్వాముల్ని చేయాలని ఇరాన్‌ డిమాండ్‌ చేసింది.

అలాగైతేనే అణ్వస్త్రరహిత పశ్చిమాసియా సాకారమవుతుందని స్పష్టం చేసింది. అయితే తన సన్నిహిత దేశమైన ఇజ్రాయెల్‌ వద్ద అప్రకటిత అణ్వస్త్రాలున్నందువల్ల అమెరికాకు ఇది మింగుడు పడలేదు. ఎలాగైతేనేం ఇరాన్‌తో ఈ దేశాలన్నీ అణు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అవి ఉత్తపుణ్యానికి ఈ పని చేయలేదు. ఇరాక్‌ దురాక్రమణతో బొప్పికట్టి, సిరియాలో కూడా చేతులు కాల్చుకుని ఈ అగ్రరాజ్యాలన్నీ అయోమయావస్థలో ఉన్నాయి. పశ్చిమాసియా తమ చేజారుతోందని గ్రహించాయి. అణుబాంబులు చేయడానికి అవసరమైన సాధనాసంపత్తి అంతా ఇరాన్‌ దగ్గర సిద్ధంగా ఉన్నదని, ఈ స్థితిలో దాన్ని నిలువరించడం కూడా కష్టమని వాటికి అర్ధమైంది.

పైగా ఈ ప్రాంతంలో అత్యంత శక్తివంతమైన సైన్యం ఉన్నది ఇరాన్‌కు మాత్రమే. ఇవన్నీ గమనించాకే ఆ దేశాలు ఇరాన్‌తో సంప్రదింపులకు సిద్ధమయ్యాయి. ఇరాన్‌ సైతం దశాబ్దాల తరబడి అమలైన ఆంక్షలతో అన్నివిధాలా దెబ్బతింది. ప్రాణావసరమైన ఔష ధాలు లభ్యంకాక లక్షలమంది పౌరులు చనిపోయారు. ఉపాధి లేమి, అధిక ధరలు, మంద గించిన ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయి. అత్యంత విలువైన ముడి చమురు అపారంగా లభ్యమవుతున్నా దాన్ని విక్రయించడానికి ఆంక్షలు అవరోధంగా మారాయి. 

ఇరాన్‌లో అతివాద, ఛాందసవాద నాయకుల శకం అంతరించి ఉదారవాద దృక్పథం ఉన్న మధ్యేవాద నాయకుడు హసన్‌ రౌహానీ అధ్యక్షుడయ్యాక సామరస్య ధోరణిలో సమ స్యల్ని పరిష్కరించుకోవాలన్న అభిప్రాయం బలపడింది. కానీ ఇప్పుడు ట్రంప్‌ నిర్ణయంతో రౌహానీ స్థితి బలహీనపడే ప్రమాదం ఏర్పడింది. ఇరాన్‌ సర్వోన్నత నాయకుడు అలీ ఖమేనీ ఇప్పటికే ట్రంప్‌ ప్రకటనపై తీవ్రంగా స్పందించారు. తాను జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్‌ వగైరాలను కూడా నమ్మదల్చుకోలేదని నిర్మొహమాటంగా చెప్పారు. దేశ ప్రయోజనాలకు ముప్పు ఏర్ప డుతుందనుకుంటే అణ్వాయుధాల తయారీ బాటపడతామని హెచ్చరించారు. ఆంక్షల సడ లింపు పర్యవసానంగా మూడేళ్ల తర్వాత ఇప్పుడిప్పుడే ఇరాన్‌ కుదుటపడుతోంది.

తొలిసారి నిరుడు స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) పెరిగింది. ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి. చమురు రంగంలో పాశ్చాత్య దేశాల పెట్టుబడులు క్రమేపీ పెరుగుతున్నాయి. దేశంలో ఏటా 40,000 కార్ల అమ్మకానికి జర్మన్‌ కార్ల కంపెనీ డైమ్లర్‌ ఏర్పాట్లు చేసుకుంది. ఈ కారణాలవల్లే ఈ దేశాలన్నీ ట్రంప్‌కు చివరివరకూ నచ్చజెబుతూ వచ్చాయి. అటు ఇరాన్‌ సైతం ఒప్పందాన్ని తు.చ.. తప్పకుండా అమలు చేసింది. తనకున్న శుద్ధిచేసిన 10,000 కిలోల యురేనియంలో కేవలం 3 శాతం మాత్రమే ఉంచుకుని మిగిలినదంతా ఐఏఈఏకు అప్ప జెప్పింది. కీలకమైన ప్లుటోనియం ప్లాంట్‌ను పూర్తిగా తొలగించింది. ఇవన్నీ ట్రంప్‌కు సరిపోలేదు.

ఒప్పందంలో లేని బాలిస్టిక్‌ క్షిపణుల ధ్వంసం, ఉగ్రవాద సంస్థలకు మద్దతు నిలుపుదల వంటి అంశాలను చేరుస్తూ సరికొత్త ఒప్పందం చేసుకోవాలంటున్నారు. వాటిపై మరో ఒప్పందానికి రావాలని కోరకుండా కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేయాలనడం మూర్ఖత్వం తప్ప మరొకటి కాదు. ఒకపక్క తనతో చర్చలకు సిద్ధపడుతూ వేరే దేశంతో కుదిరిన పాత ఒప్పందాన్ని రద్దు చేసు కున్న ట్రంప్‌ను ఉత్తరకొరియా నమ్మగలదా? ఈ అవివేక నిర్ణయాన్ని నిలువరించగలిగింది, ప్రపంచాన్ని సంక్షోభం ముంచెత్తకుండా చూసేది అమెరికా పౌరుల విజ్ఞతే. వారు గట్టిగా ఒత్తిడి తెస్తే తప్ప ట్రంప్‌ దారికి రారు. ఆ దిశగా వారు కదలాలి.
 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top