పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగాలన్నా... ఆ సమావేశాల్లో తాననుకున్న బిల్లులన్నీ ఆమోదం పొందాలన్నా అధికార పక్షానికి సంఖ్యా బలం ఒక్కటే సరిపోదు.
పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగాలన్నా... ఆ సమావేశాల్లో తాననుకున్న బిల్లులన్నీ ఆమోదం పొందాలన్నా అధికార పక్షానికి సంఖ్యా బలం ఒక్కటే సరిపోదు. ఆ బిల్లులు ప్రజా ప్రయోజనాలకు అనుగుణమైనవేనన్న అభిప్రాయం కలగజేయాలి. వాటిని గట్టిగా సమర్థించుకోగలగాలి. అందుకు సంఖ్యాబలంతోపాటు నైతికబలం కూడా అవసరమవుతుంది. అధికార పక్షానికి లోక్‌సభలో మంచి మెజారిటీ ఉన్నా రాజ్యసభలో విపక్షాలదే పైచేయి అన్న సంగతి నిజమే. అయితే, జాగ్రత్తగా అడుగులేస్తే...బిల్లుల్లో సత్తా ఉంటే అలాంటి అడ్డంకుల్ని అధిగమించడం కష్టమేమీ కాదని పార్లమెంటులో చాలాసార్లు రుజువైంది.
గత దశాబ్దకాలంగా జరిగిన పార్లమెంటు సమావేశాలతో పోలిస్తే బుధవారం ముగిసిన సమావేశాలు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టు ఫలవంతమైనవేనని అంగీకరించాలి. ఎందుకంటే, ఈ సమావేశాల్లో అధికార పక్షం 24 బిల్లుల్ని ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంది. లోక్‌సభ మొత్తం 35 రోజులు సమావేశమైంది. ఇందులో మూడు రోజులు మినహా మిగిలిన రోజుల్లో ప్రశ్నోత్తరాల సమయం సాఫీగా సాగింది. గత అయిదేళ్లలో ఇది రికార్డు. ఈమధ్యకాలంలో ఎప్పుడూ లేని విధంగా వివిధ మంత్రిత్వ శాఖల పద్దులపై చర్చ జరిగింది. సమావేశాలకు అంతరాయం కలగడం తగ్గింది. రోజుల తరబడి వాయిదాలతో కాలక్షేపం చేయడమే రివాజైన చోట ఈసారి ఆరుగంటల 54 నిమిషాలపాటు మాత్రమే అంతరాయం ఏర్పడిందని గణాంకాలు చెబుతున్నాయి.
అయితే, దీన్ని కూడా భోజన విరామ సమయంలో సభలు కొనసాగించడం ద్వారా భర్తీ చేశారు. ఎన్డీయే సర్కారు మరో పక్షం రోజుల్లో తొలి వార్షికోత్సవం జరుపుకోబోతుండగా సమావేశాలు ఇలా సజావుగా ముగియడం అధికార పక్షం సంబరపడే అంశమే. అయితే, నిర్మాణాత్మక చర్చలకు ఉపయోగపడే స్థాయీ సంఘాల విషయంలో కేంద్రం విముఖత ప్రదర్శిస్తున్నది. వివిధ బిల్లుల విషయంలో సభలో అన్ని కోణాల్లోనూ కూలంకషంగా చర్చించడం సాధ్యంకాదు గనుక స్థాయీ సంఘాల ఏర్పాటు సంప్రదాయం పుట్టుకొచ్చింది. ఈ ప్రక్రియవల్ల బిల్లుల ఆమోదంలో జాప్యం చోటు చేసుకుంటుందనుకోవడం సరైంది కాదు.
అయితే ఇంత సజావుగా సాగిన సభల్లో కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భూసేకరణ సవరణ బిల్లు, సరుకులు,సేవల బిల్లులను ఆమోదింప జేసుకోవడంలో కేంద్రం విఫలమైంది. నిరుడు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గణనీయంగా సీట్లు సాధించినందువల్ల ఎన్డీయే నేతృత్వంలోని సర్కారుకు పాలన అనేది నల్లేరుమీద నడకలా సాగుతుందని అందరూ భావించారు. మొట్టమొదటిసారి కేవలం 44 సీట్లకు పరిమితం కావడంవల్ల కాంగ్రెస్ మానసిక స్థైర్యాన్ని కోల్పోయివుంది. ఇక మిగిలిన పక్షాలు వేర్వేరు కారణాలవల్ల కలిసి అడుగేసే అవకాశం ఏమాత్రం లేదు. పరిస్థితి ఇంత అనుకూలంగా ఉన్నప్పుడు సైతం అధికార పక్షం ముఖ్యమైన బిల్లులు రెండింటిలోనూ తొట్రుపాటు పడాల్సిరావడం ఆశ్చర్యం కలిగించే అంశం. నిజానికి విపక్షాలమధ్య సభలో ఎలాంటి సమన్వయంలేని సమయంలో ఈ భూసేకరణ బిల్లు వచ్చి వారిని ఏకం చేసింది. ఆత్మవిశ్వాసం ఉండటం ముఖ్యమేగానీ అది అతి విశ్వాసంగా మారకూడదు. నిజానికి పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు వెలువడిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చేదు అనుభవాన్ని చవిచూసినా... భూసేకరణ ఆర్డినెన్స్ విషయంలో దేశవ్యాప్తంగా అసంతృప్తి పెల్లుబుకుతున్నా బీజేపీ పెద్దలు గమనించిన దాఖలాలు కనబడలేదు.
ఆ ఆర్డినెన్స్ స్థానంలో బిల్లు తీసుకురావడం ఖాయమంటూ ప్రకటనలు చేశారు. అటు విపక్షాలు మాత్రం జనం అసంతృప్తిని పసిగట్టాయి. మోదీ ప్రభుత్వంపై సమరభేరి మోగించడానికి ఇదే అదునని భావించాయి. పర్యవసానంగానే కాంగ్రెస్‌తోసహా విపక్షాలన్నీ కలిసి ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ వరకూ పాదయాత్ర చేశాయి. ఉప్పు-నిప్పులా ఉండే ములాయం, లాలూ, నితీష్‌కుమార్ వంటివారు ఒకే గొడుగుకిందకు వచ్చి జనతా పరివార్‌గా ఏకమయ్యే ప్రయత్నాలు చేశారు.
ఇప్పుడు భూసేకరణ బిల్లు సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు వెళ్లింది గనుక అవసరమైతే భూసేకరణపై మూడోసారి ఆర్డినెన్స్ తెచ్చేందుకైనా తాము సిద్ధమని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి బీరేంద్రసింగ్ తాజాగా ప్రకటించారు. ఆ బిల్లు విషయంలో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయని తెలిసినా బీజేపీ పెద్దలు ఎందుకంత పట్టుదలగా ఉన్నారో అనూహ్యం. దేశంలో పారిశ్రామికాభివృద్ధికి ఇప్పుడున్న భూసేకరణ చట్టం ప్రధాన ఆటంకంగా ఉన్నదని కేంద్రం చెబుతున్నదాన్లో వాస్తవం లేదని ఈమధ్యే సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైన వివరాలు తెలుపుతున్నాయి. భూ వివాదం కారణంగా ఆగిపోయిన ప్రాజెక్టులు 8 శాతం లోపేనని ఆ వివరాలంటున్నాయి. మరో ముఖ్యమైన సరుకులు, సేవల బిల్లు విషయంలోనూ రాజ్యసభలో కాంగ్రెస్‌దే పైచేయి అయింది. తృణమూల్ కాంగ్రెస్‌నూ, బిజూ జనతాదళ్‌నూ కలుపుకున్నా అధికారపక్షానికి అనుకూల వాతావరణం ఏర్పడలేదు. అదే సమయంలో యూపీఏ హయాంలో బంగ్లాతో కుదిరిన భూ బదలాయింపు ఒప్పందం విషయంలో తలపెట్టిన సవరణలను కేంద్రం ఉపసంహరించుకున్నాకే రాజ్యసభలో ఆ బిల్లుకు ఆమోదముద్ర పడింది.
అధికారపక్షం అప్రమత్తంగా ఉంటే...సభలో ఎలాంటి పరిణామాలు ఎదురుకాగలవన్న అంశంలో నిర్దిష్టమైన అంచనాకు రాగలిగితే మెజారిటీ ఉందా లేదా అనే అంశంతో నిమిత్తం లేకుండానే అవరోధాలను అధిగమించడం సాధ్యమవుతుంది. ఆ విషయంలో ఎన్డీయే సర్కారు ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది. బడ్జెట్ తొలి దశ సమావేశాల సమయంలో కనబడని రాహుల్ రెండో దశ సమావేశాలకు వచ్చి కేంద్రంపై నిప్పులు కురిపించారంటే అందుకు ఎన్డీయే తప్పిదాలే కారణం. తొలుత బీహార్ అసెంబ్లీ ఎన్నికలూ... ఆ తర్వాత కేరళ, పశ్చిమబెంగాల్ ఎన్నికలూ ముంచుకొస్తున్న తరుణంలో బీజేపీ రాగలకాలంలో మరింత జాగ్రత్తగా అడుగులేయాల్సి ఉంటుంది. బడ్జెట్ సమావేశాల సారాంశం ఇదే.