ఎన్నికల దూషణలు | Abusive leaders, sounding charges | Sakshi
Sakshi News home page

ఎన్నికల దూషణలు

Feb 8 2017 3:59 AM | Updated on Aug 14 2018 9:04 PM

వానాకాలం వస్తే కప్పల బెకబెకలు వినిపించినట్టు ఎన్నికలొచ్చాయంటే చాలు నేతల దుర్భాషలు, ఆరోపణలు హోరెత్తుతాయి.

వానాకాలం వస్తే కప్పల బెకబెకలు వినిపించినట్టు ఎన్నికలొచ్చాయంటే చాలు నేతల దుర్భాషలు, ఆరోపణలు హోరెత్తుతాయి. రాయడానికి, తిరిగి చెప్పడానికి వీల్లేని స్థాయిలో ప్రత్యర్ధి పక్షాలపై నోరు పారేసుకుంటారు. ఈ క్రమంలో అణగారిన కులాలనూ, మైనారిటీలనూ, మహిళలనూ కించపరిచేలా మాట్లాడతారు. ఇది కేవలం పురుష నేతల్లో ఉన్న పైత్యం మాత్రమే అనుకుంటే పొరపాటు. కొందరు మహిళా నేతలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఈసారి బీజేపీ నేత వినయ్‌ కతియార్‌ కాంగ్రెస్‌ అధినేత సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక గాంధీపై అలాంటి వ్యాఖ్యలు చేసి ఎన్నికల జాతర మొదలైందని అందరికీ గుర్తుచేశారు. యూపీలో ప్రియాంక కాంగ్రెస్‌కు ఓట్లు రాబట్టగలరనుకుంటున్నారా అని అడిగితే...ఆమెను మించిన అందగత్తెలు తమ పార్టీలో ఉన్నారని జవాబిచ్చారు. అలా అనడం ద్వారా తమ పార్టీ మహిళా నేతలను కూడా కించపరుస్తున్నానని ఆయన మరిచారు. అంతేకాదు, ఆమె అందగత్తె... కాబట్టే ప్రజల్ని ఆకర్షించడానికి ప్రచారం చేస్తున్నారని అన్నారు. కన్న కూతురి గౌరవం కంటే ఓటు గౌరవమే ఎక్కువని జనతాదళ్‌ (యు) నాయకుడు శరద్‌ యాదవ్‌ లెక్కలేసి అందరినీ నివ్వెరపరిచారు. ఆడపిల్లల విషయంలో ఆయనకు ఎలాంటి నిర్లక్ష్య ధోరణి ఉన్నదో ఆ వ్యాఖ్య తేటతెల్లం చేసింది. వీటిపై మహిళా సంఘాల నుంచి, ఇతర పార్టీలనుంచి ఎన్ని విమర్శలొచ్చినా  కతియార్, శరద్‌యాదవ్‌లకు తమ తప్పేమిటో తెలియలేదు.   

ఈసారి నేతల ఆరోపణలు ఎన్నికల సంఘాన్ని కూడా తాకాయి. పంజాబ్‌లో చాలాచోట్ల ఓటింగ్‌ యంత్రాలు సరిగా పనిచేయలేదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)నేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. అంతేకాదు...ఎన్నికల సంఘం కుమ్మక్కవడం వల్లే ఇలా జరిగి ఉంటుందని వ్యాఖ్యానించారు. అది నిస్సిగ్గుగా, వెన్నెముక లేకుండా తయారైందన్నారు. సీబీఐ, ఆర్‌బీఐ తరహాలో ఎన్నికల సంఘం కూడా ప్రధాని మోదీ ముందు మోకరిల్లిందని ఆరోపించారు. అందుకు సంబంధించి నిర్దిష్టమైన సాక్ష్యాలను వెల్లడించి ఉంటే వేరుగా ఉండేది. కానీ ఆయన ఆ పని చేయలేదు. అంతక్రితం మాటేమోగానీ టీఎన్‌ శేషన్‌ 1990లో ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా వచ్చాక  ఆ సంస్థ పనితీరు గణనీయంగా మారింది. అది నిర్భీతితో వ్యవహరించడం మొదలుపెట్టింది. తటస్థమైన సంస్థగా చెప్పుకోదగ్గ గుర్తింపు పొందింది. పెత్తందారీ నేతలు గూండాల సాయంతో పోలింగ్‌ కేంద్రాలు ఆక్రమించుకోవడం, రిగ్గింగ్‌కు పాల్పడటం, దళితులను, ఇతర బలహీన వర్గాల పౌరులను ఓటు హక్కు వినియోగించుకోకుండా నిరోధించడం వంటి ఉదంతాలు చాలా వరకూ తగ్గాయి. ఎన్నికల హింస కూడా అదుపులోకి వచ్చింది. అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరించినట్టు ఆరోపణలొచ్చిన ఉన్నతాధికారులను విధులనుంచి తప్పించడంతోసహా కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు నిజమని తేలితే రీపోలింగ్‌ నిర్వహించడం, బాధ్యులపై చర్యకు సిఫార్సు చేయడం కనబడుతుంది. నేతలు ఎంతటివారైనా హెచ్చరించడం, అదుపు చేయడానికి ప్రయత్నించడం కూడా చూస్తుంటాం. అయితే ఈ చర్యలు ఏమూలకూ సరిపోవడం లేదన్నది వాస్తవం. బాహాటంగా బయటపడినవాటిపై ఏదో మేరకు చర్యలుంటున్నా లోపాయికారీగా జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. ఓటర్లను ప్రలోభపెట్టడానికి కోట్లాది రూపాయలు వెదజల్లడమన్నది ఆగలేదు. భారీ ఊరేగింపులు, బహిరంగ సభలు నిర్వహించడం, మీడియాలో వాణిజ్య ప్రకటనలు తగ్గలేదు. అయినా ఎన్నికల వ్యయం చెప్పాల్సివచ్చేసరికి ప్రతి పార్టీ పరిమితులకు లోబడే ఖర్చు చేశామని చెబుతుంది. అభ్యర్థులు సైతం దొంగ లెక్కలు అందజేస్తారు. ఒకరిద్దరు నాయకులు నోరు జారిన సందర్భాలున్నా వారిపై ఎన్నికల సంఘం ఏ చర్యా తీసుకోదు. డబ్బు ప్రభావాన్ని తగ్గించడం కోసం సంఘం చర్యలు తీసుకుంటున్నకొద్దీ అవినీతి నాయకులు, గూండాయిజానికి పాల్పడేవారు కొత్త కొత్త మార్గాలు వెదుకుతున్నారు. నిరుడు తమిళనాట ఎన్నికల సమయంలో కోయంబత్తూరులో మూడు ట్రక్కులతో రూ. 570 కోట్ల విలువైన కరెన్సీ నోట్లు పట్టుబడిన సంగతి అందరికీ తెలుసు.

ఆ డబ్బు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖకు వెళ్తున్నదని తొలుత వెల్లడైనా అది మాదేనని రిజర్వ్‌బ్యాంక్‌ అంగీకరించడం మినహా అందుకు సంబంధించి ఇతర వివరాలేవీ వెల్లడికాలేదు. అధికారులు చెప్పిన సంజాయిషీలపై మరిన్ని అనుమానాలు తలెత్తాయి. ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని తగ్గించడానికి, అవి మరింత పారదర్శకంగా నిర్వహించడానికి ఎన్నికల సంఘం తరచు సూచనలు చేస్తుంటుంది. వాటిపై కేంద్ర ప్రభుత్వంగానీ, వివిధ పార్టీలుగానీ తగినంతగా దృష్టి పెడుతున్నట్టు కనబడదు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించింది మొదలుకొని ఫలితాలు వెల్లడయ్యేంత వరకూ మాత్రమే ఆ సంఘం ఒకటున్నదన్న సంగతి అందరికీ తెలుస్తుంది. ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు వచ్చేవరకూ మళ్లీ దాని జాడ కనబడదు. ఎన్నికల్లో ఆచరణ సాధ్యంకాని వాగ్దానాలు, దొంగ హామీలు ఇచ్చే పార్టీలపై చర్య తీసుకునే అధికారం దానికి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు.

నేతల నోటి దురద, విచ్చలవిడి ధన ప్రవాహం, నేరగాళ్ల ఆగడాలు నియంత్రించనప్పుడు ఎన్నికల వ్యవస్థపైనా, దాని పవిత్రతపైనా పౌరుల్లో గురి కుదురుతుందా? ఈమధ్య ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా... ఓటేయనివారికి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదా తప్పుబట్టే హక్కు లేదని  సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆ తర్కంలోని ఉచితానుచితాల సంగతలా ఉంచి పరిస్థితులిలా ఉంటే ఎవరికైనా ఎన్నికల వ్యవస్థలో నమ్మకం కలుగుతుందా? ఓటేయడం తమ హక్కే కాక, బాధ్యత కూడానని...తమ ఓటు వల్ల మంచి ప్రభుత్వాలు ఏర్పడతాయని పౌరులకు అనిపించేలా పరిస్థితులున్నప్పుడే అందరూ ఆ యజ్ఞంలో పాలుపంచుకుంటారు. తమ మాటల ద్వారా, చేతల ద్వారా ఎన్నికలను ప్రహసనప్రాయం చేస్తున్న నాయకులపై చర్యలు తీసుకున్నప్పుడే... ఆ ధోరణులను సంపూర్ణంగా నియంత్రించినప్పుడే అది సాధ్యమవుతుంది. అప్పుడు ఎవరూ ఎన్నికలకు దూరంగా ఉండరు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement