దళితుల సంక్షేమానికి కృషి
దళితుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి పేర్కొన్నారు. శనివారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
-
ఐదారు రోజుల్లో రుణాల సంబంధిత నిధులు విడుదల
-
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి
ఆదిలాబాద్ రూరల్ : దళితుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి పేర్కొన్నారు. శనివారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దళితుల సంక్షేమం కోసం దళిత బస్తీ, గతంలో ఉన్న 60 శాతం సబ్సిడీ రుణ శాతాన్ని 80 శాతానికి పెంచడం, కల్యాణలక్ష్మి వంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోందని పేర్కొన్నారు. గతేడాది ఆగస్టులో ప్రారంభమైన దళిత బస్తీ కార్యక్రమం కింద భూ పంపిణీలో రాష్ట్రంలోనే ఆదిలాబాద్ జిల్లా ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2,150 మంది దళితులకు రూ.80 కోట్ల 25 లక్షల విలువ చేసే భూమలును కొనుగోలు చేసి పంపిణీ చేయగా జిల్లాలో 746 మందికి భూ పంపిణీ చేసినట్లు వివరించారు. కార్పొరేషన్ ద్వారా అందించే గతంలో ఉన్న 60 శాతం సబ్సిడీని 80 శాతానికి పెంచినట్లు చెప్పారు.
రుణాలకు 4,821 మంది అర్హులు
జిల్లాలో 4,821 మందిని వివిధ రుణాలకు అర్హులుగా గుర్తించినట్లు పిడమర్తి రవి తెలిపారు. అలాగే మరో 1,042 మందికి రుణాలు మంజూరు కోసం అనుమతులు తీసుకోనున్నట్లు చెప్పారు. కార్పొరేషన్ ద్వారా వివిధ రుణాలు మంజూరైన లబ్ధిదారులకు సంబంధించిన నిధులు ఐదారు రోజుల్లో విడుదల కానునన్నట్లు వెల్లడించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో అధికారులు, దళిత సంఘాల నాయకులతో కలిసి మొక్కలను నాటారు. వీరి వెంట ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జేమ్స్ కల్వాల, బీసీ కార్పొరేషన్ ఈడీ మేఘనాథ్, ఆయా శాఖల ఉద్యోగులు శంకర్, మనోహర్, రాజలింగు, దళిత సంఘాల నాయకులు, తదితరులున్నారు.