‘సాక్షి’ రిపోర్టర్లకు బెదిరింపులు! | Warnings to sakshi reporters | Sakshi
Sakshi News home page

‘సాక్షి’ రిపోర్టర్లకు బెదిరింపులు!

Mar 22 2016 2:24 AM | Updated on Aug 20 2018 8:20 PM

రాజధాని ప్రాంతాల్లో భూ కుంభకోణాలపై ఈ నెల 2, 3, 4 తేదీల్లో ‘సాక్షి’ పత్రికలో ప్రచురితమైన కథనాలతో రాష్ట్ర ప్రజలకు నిజం తెలిసిపోయిందని బెంబేలెత్తిన ప్రభుత్వం బెదిరింపులకు తెర తీసింది.

♦ పోలీసు స్టేషన్‌కు పిలిపించి విచారణ
♦ రాజధాని ప్రాంతంలో భూకుంభకోణాలపై వరుస కథనాలు
♦ టీడీపీ సానుభూతిపరులతో ఫిర్యాదులు చేయించిన ప్రభుత్వం  
 
 సాక్షి, గుంటూరు: రాజధాని ప్రాంతాల్లో భూ కుంభకోణాలపై ఈ నెల 2, 3, 4 తేదీల్లో ‘సాక్షి’ పత్రికలో ప్రచురితమైన కథనాలతో రాష్ట్ర ప్రజలకు నిజం తెలిసిపోయిందని బెంబేలెత్తిన ప్రభుత్వం బెదిరింపులకు తెర తీసింది. ‘సాక్షి’ కథనాలపై రాజధాని ప్రాంతాల్లోని 12 గ్రామాలకు చెందిన టీడీపీ సానుభూతిపరులతో ఇప్పటికే ఫిర్యాదులు చేయించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా కేసులు నమోదు చేసిన పోలీసులు ‘సాక్షి’ గుంటూరు బ్యూరో ఇన్‌చార్జి ఎం.వి.గణేశ్వరరావు, ఎడిషన్ ఇన్‌చార్జి ఎం.తిరుమల్‌రెడ్డి, స్టాఫ్‌రిపోర్టర్ ఎన్.మాధవరెడ్డి, తుళ్లూరు రిపోర్టర్ నాగేశ్వరరావులతోపాటు, మంగళగిరి, తుళ్లూరు సాక్షి టీవీ రిపోర్టర్లు అభిరామ్ కృష్ణారెడ్డి, రమేష్‌ను పోలీసు స్టేషన్‌కు పిలిపించారు. ‘సాక్షి’ పత్రికలో ప్రచురితమైన కథనాల వల్ల రాజధాని ప్రాంత రైతుల మనోభావాలు దెబ్బతిన్నాయని, పత్రికలో వచ్చిన కథనాలకు సంబంధించి ఆధారాలు ఉంటే వారం రోజుల్లో తమకు అందజేయాలన్నారు. ‘సాక్షి’ రిపోర్టర్లను సోమవారం మంగళగిరి రూరల్ పోలీసు స్టేషన్‌కు పిలిపించి డీఎస్పీ రామాంజనేయులు, సీఐ హరికృష్ణ ప్రశ్నిం చారు. తమకు రెండు వారాలపాటు గడువు కావాలని ‘సాక్షి’ బృందం కోరింది. పోలీసుల తీరు మీడియా స్వేచ్ఛను హరించేలా ఉందని పాత్రికేయ సంఘాలు విమర్శించాయి.

 మీడియా స్వేచ్ఛపై దాడే :ఐజేయూ
 సాక్షి, హైదరాబాద్: అమరావతి రాజధానితోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భూ కుంభకోణాలను వెలికితీస్తున్న మీడియా ప్రతినిధులను ఏపీ పోలీసులు విచారణ కు పిలిపించడం దారుణమని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) తీవ్రంగా ఖండించింది. పోలీసుల తీరు మీడియా స్వేచ్ఛపై దాడేనని నిరసించింది. ఈ మేరకు ఐజేయూ సెక్రెటరీ జనరల్ దేవులపల్లి అమర్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘సాక్షి పత్రిక, టీవీలకు చెందిన కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కొంతమంది రిపోర్టర్లు, డెస్కు జర్నలిస్టులను పిలిపించి భూ కుంభకోణాలకు సంబంధించిన వార్తలపై ప్రశ్నించడం, ఆ సమాచారం ఎక్కడి నుంచి, ఎలా వచ్చిందో సోర్సులు చెప్పాలని అడగడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం. పోలీసుల చర్య మీడియా స్వేచ్ఛను హరించడం, దాడిచేయడమే’’ అని ఐజేయూ ప్రెసిడెంట్ ఎస్‌ఎన్ సిన్హా, వైస్ ప్రెసిడెంట్ అంబటి ఆంజనేయులు, సెక్రెటరీ జనరల్ దేవులపల్లి అమర్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు కె.అమర్‌నాథ్ ఖండించారు.ఈ విషయంలో ముఖ్యమంత్రి సత్వరమే జోక్యం చేసుకొని మీడియాపై పోలీసుల చర్యలను నిరోధించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement