తిరంగా యాత్రలో విషాదం | vishadam in tirangayatra | Sakshi
Sakshi News home page

తిరంగా యాత్రలో విషాదం

Aug 22 2016 9:31 PM | Updated on Sep 4 2017 10:24 AM

తిరంగా యాత్రలో విషాదం

తిరంగా యాత్రలో విషాదం

నరసాపురం/మొగల్తూరు : తిరంగా యాత్రలో సోమవారం అపశ్రుతి చోటుచేసుకుంది. ఓ వ్యాయామ ఉపాధ్యాయుడు విద్యుదాఘాతానికి గురై దుర్మరణం పాలయ్యారు.

 నరసాపురం/మొగల్తూరు : తిరంగా యాత్రలో సోమవారం అపశ్రుతి చోటుచేసుకుంది. ఓ వ్యాయామ ఉపాధ్యాయుడు విద్యుదాఘాతానికి గురై దుర్మరణం పాలయ్యారు. మొగల్తూరు మండలం రామన్నపాలెం పంచాయతీ పిప్పళ్లవారి(పీవీ)తోట ఉన్నత పాఠశాలలో కురెళ్ల వెంకట పురుషోత్తం (32) వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. 
స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ సూచన మేరకు మొగల్తూరు మండలంలో సోమవారం తిరంగా యాత్ర చేయాలని స్థానిక నాయకులు నిర్ణయించారు. యాత్ర పీవీతోట ఉన్నత పాఠశాల మీదుగా వెళ్తుండడంతో అక్కడ జెండా వందనం చేసేందుకు ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు  ఏర్పాట్లు చేశారు. అయితే ముందుగా నిర్ణయించిన స్థలంలో కాకుండా ఎదురుగా ఉన్న మరో స్థలంలో జెండా వందనానికి ఏర్పాట్లు చేయాలని స్థానిక నాయకులు సూచించారు. దీంతో పీఈటీ పురుషోత్తం ఇనుప రాడ్డును భూమిలో పాతేందుకు యత్నించారు.
అదే ప్రాంతంలో పై నుంచి వెళ్తున్న విద్యుత్‌ హైటెన్షన్‌ వైరు రాడ్డు చివరి భాగానికి తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యారు. అపస్మారక స్థితికి చేరుకున్న పురుషోత్తంను వెంటనే స్థానికులు నరసాపురం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా, ఆయన మరణించారు. దీంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పాఠశాలకు ఇటీవలే బదిలీపై వచ్చిన పురుషోత్తం అనతికాలంలోనే గ్రామస్తులు, విద్యార్థుల మన్ననలు పొందారు. ఆయనకు భార్య, ఇద్దరుపిల్లలు ఉన్నారు. పురుషోత్తం మృతదేహాన్ని చూసి విద్యార్థులు, ఉపాధ్యాయులు కంటతడిపెట్టారు. ఘటనాస్థలాన్ని డీవైఈవో దువ్వూరి సూర్యనారాయణ పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 
ఉపాధ్యాయుల ఆందోళన 
 పురుషోత్తం మృతదేహానికి నరసాపురం ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు పెద్దఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లకుండా జిల్లా ఉపాధ్యాయుల సంఘం, పీఈటీల సంఘం నాయకులు ఆందోళన చేశారు. పురుషోత్తం కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. 2005 సంవత్సరం తరువాత నియమితులైనందున  పురుషోత్తం కుటుంబానికి ఎలాంటి ప్రయోజనాలు ఉండవని, ఎంపీ, ఎమ్మెల్యేలు స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మాట్లాడారు. దీంతో ఉపాధ్యాయులు ఆయనతో వాదనకు దిగారు. 
ఇదేమీ ప్రభుత్వ కార్యక్రమం కాదని, అయినా జెండా ఎగుర వేయించాలని పీఈటీకి పురమాయించడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పుడు అతను ప్రాణాలు కోల్పోయాడని, దీనికి ఎవరు బాధ్యులని ఉపాధ్యాయులు గోపీ, చల్లా దుర్గారావు తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎంపీ గోకరాజు గంగరాజు వ్యక్తిగతంగా రూ.5 లక్షలు  ఇస్తామని ప్రకటించారని, సీఎంతో మాట్లాడి పురుషోత్తం భార్యకు ఉద్యోగం వచ్చేలా, పరిహారం ఇప్పించేలా చూస్తానని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికిప్పుడు హామీ ఇవ్వాలని, ఇంకా 25 ఏళ్ల సర్వీసు ఉంది కాబట్టి రూ.50లక్షలు ఇవ్వాలని ఉపాధ్యాయులు పట్టుబట్టారు. దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ.. రెండురోజుల్లో స్వయంగా ముఖ్యమంత్రి దగ్గరకు తీసుకెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో ఉపాధ్యాయ సంఘ నేతలు ఆందోళన విరమించారు. హామీ నెరవేర్చకపోతే, జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement