శ్రీవారి సేవలో తరించాలంటే..! | to do srivari seva..! | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో తరించాలంటే..!

Aug 5 2016 7:13 PM | Updated on Sep 4 2017 7:59 AM

నిడమర్రు : తిరుమల తిరుపతి వెంకటేశ్వస్వామిని తనివితీరా దర్శించి తరించాలనిచాలామంది భక్తులు భావిస్తారు. శ్రీవారికి సేవ చేయాలని పరితపిస్తారు. ఇలాంటి వారి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అవకాశం కల్పిస్తోంది. స్వామి సన్నిధిలో వారంపాటు సేవ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎంపికైన భక్తులకు కేటాయించిన తేదీల్లో తిరుమలలో సేవకులుగా పనిచేసే అవకాశం కల్పిస్తామని టీటీడీ పౌర సంబంధాల అధికారి టి.రవి తెలిపారు. ఆ వ

నిడమర్రు : తిరుమల తిరుపతి వెంకటేశ్వస్వామిని తనివితీరా దర్శించి తరించాలనిచాలామంది భక్తులు భావిస్తారు. శ్రీవారికి సేవ చేయాలని పరితపిస్తారు. ఇలాంటి వారి కోసం  తిరుమల తిరుపతి దేవస్థానం అవకాశం కల్పిస్తోంది. స్వామి సన్నిధిలో వారంపాటు సేవ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎంపికైన భక్తులకు కేటాయించిన తేదీల్లో తిరుమలలో సేవకులుగా పనిచేసే అవకాశం కల్పిస్తామని టీటీడీ పౌర సంబంధాల అధికారి టి.రవి తెలిపారు. ఆ వివరాలు, మార్గదర్శకాలు మీకోసం..
 నెల ముందే సమాచారం ఇవ్వాలి
స్వామి సేవలో వాలంటీరుగా బాధ్యతలు నిర్వహించేందుకు ఆసక్తిగల భక్తులు నెల ముందే శ్రీవారి సేవా సదనంకు పోస్టు ద్వారా సమాచారం ఇచ్చి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. వాలంటీరుగా దరఖాస్తు చేసుకునేవారికి ఆధ్యాత్మిక పరిజ్ఙానం ఉండాలి. స్త్రీ, పురుష భక్తులు పదిమందికి తగ్గకుండా వందమంది వరుకూ ఒక బృందంగా దరఖాస్తు చేసుకోవాలి. గ్రూపులోని సభ్యులంతా వారిపేరు, చిరునామా, వయస్సు, సెల్‌ నంబర్‌ తదితర వివరాలను నెల ముందే టీటీడీ శ్రీవారి సేవా సదనానికి లేఖ ద్వారా పంపాలి. అదే బ్రహ్మోత్సవాల్లో సేవ చేయాలనుకుంటే మూడు నెలలు ముందుగా అనుమతి కోరుతూ లేఖ పంపిచాలి. 
సేవకు దరఖాస్తు ఇలా..
సేవకు సంసిద్ధత తెలుపుతూ భక్తులు పంపిన లేఖ ఆధారంగా వారిని ఆహ్వానిస్తూ..  టీటీడీ అధికారులు దరఖాస్తు ఫారాలు తిరిగి పోస్టుద్వారా పంపుతారు. బృంద సభ్యులకు వ్యక్తిగతంగా వీటిని పంపుతారు. సెల్‌ నంబర్‌కు సంక్షిప్త సమాచారం కూడా  పంపుతారు. దరఖాస్తును పూరించి సభ్యులకు  కేటాయించిన తేదీల్లో శ్రీవారి సేవా  సదనం సిబ్బందికి అందజేయాలి. దరఖాస్తుతోపాటు ఒక ఫొటో, ఆధార్‌ కార్డు జిరాక్స్, మెడికల్‌ సర్టిఫికెట్‌ జతపరచాలి. బృందంలో ఒకరిని గ్రూపు లీడరు/ కోఆర్డినేటర్‌గా ఎంపిక చేసుకున్న వారి పూర్తి వివరాలు అదేరోజు టీటీడీ సేవా సదనంలో అందించాలి. ఒక వేళ టీటీడీ నుంచి పోస్టుద్వారా దరఖాస్తులు అందని పక్షంలో సెల్‌కు పంపిన ఎస్‌ఎంఎస్‌ ఆధారంగా ఆయా తేదీల్లో సేవకులు సేవా సదనంలో సంప్రదిస్తే వారికి అక్కడే దరఖాస్తులు అందిస్తారు. సేవకు ఎంపికైన వారు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు సేవా సదనంలోని సహాయక ప్రజా సంబంధాల అధికారికి నివేదించాలి.  
 శ్రీవారికి సేవకు అర్హులు ఇలా..   హిందువులు మాత్రమే అర్హులు. హిందువులుగా గుర్తించేందుకు తిరుమల నామం, తిలకం/ కుంకుమ/ చందనం బొట్టు ధరించాలి.  వాలంటీరు వయసు 18 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి. ఆరోగ్యంగా ఉన్నట్టు అర్హతగల డాక్టర్‌ జారీచేసిన ధ్రువీకరణపత్రం ఉండాలి. తిరుమల ఆస్థాన మండపంలో ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమయ్యే శిక్షణ తరగతులకు శ్రీవారి సేవకులు హాజరు కావాలి.
సేవకులకు సౌకర్యాలు
 సేవకులకు ఉచిత బస కల్పిస్తారు. పురుషులను పీఏసీ–3లో, మహిళలకు సేవాసదనంలో వసతి కల్సిస్తారు. సేవకులు తమ లాకర్‌ కోసం సొంత తాళం, చెవిలు తెచ్చుకోవాలి. శ్రీవారి సేవా సదన్‌లో ముందు రోజు సాయంత్రం 4 గంటలకు డ్యూటీలు కేటాయిస్తారు. రోజుకు కనీసం ఆరుగంటలు విధులు  నిర్వహించాల్సి ఉంది. సేవా సమయంలో శ్రీవారి స్కార్ఫ్‌లు ధరించాలి. గోవిందుని స్మరిస్తూ భక్తులను గోవిందా గోవిందా అని సంభోదించాలి. 
సేవ అనేది పూర్తిగా యాత్రికులకు సాయం చేసేందుకు ఉద్దేశించిన స్వచ్ఛంద సేవ మాత్రమే. సేవ కోసం గ్రూపు కోఆర్డినేటర్‌కు కానీ సేవకులకు కానీ ధన, వస్తు రూపంలో ఎలాంటి చెల్లింపులూ ఉండవు. 
–నిబంధనలు
  కేటాయించిన ప్రదేశంలో సేవ చేయాలి, గర్భాలయ సేవ నిర్భంద సేవ కాదు, గర్భాలయం సేవ కోసం సిబ్బందిపై ఒత్తిడి చేయకూడదు. సేవా సదన్‌లో ఉండే మహిళా సేవకులు రాత్రి వేళల్లో నైటీలు ధరించరాదు.  నియమ నిబంధనలు అతిక్రమిస్తే రెండేళ్ల వరకూ మళ్లీ సేవకు అనుమతించరు.  సేవకులు తమ చిన్నారులు, వృద్ధులను వెంట తీసుకురాకూడదు. 
–డ్రెస్‌ కోడ్‌ :సేవకు వచ్చే మహిళలు మెరూన్‌ బార్డర్‌ కలర్‌తో కూడిన ఆరెంజ్‌ కలర్‌ చీర, రవికను, పురుషులు తెలుపురంగు దుస్తులు ధరించాలి. 
––––––––––––––––––––––––
వివరాలు పంపించాల్సి చిరునామా
పౌరసంబంధాల అధికారి
తిరుమల తిరుపతి దేవస్థానం
కపిలతీర్ధం రోడ్, తిరుపతి
పిన్‌: 517501
మరిన్ని వివరాలకు 0877–2263544/2264392/2264217 ల్యాండ్‌ నంబర్లను సంప్రదించవచ్చు. 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement