
ఆప్షన్ల వేళ డిగ్రీలో చేరబోయే విద్యార్థుల హడావిడి
ఇంజనీరింగ్ కీ విడుదల తర్వాత పెరిగిన వేడి
సాంకేతిక నేపథ్యం గల డిగ్రీపై మక్కువ
ఈ–కామర్స్, బీఎఫ్‌ఎస్‌ఐ కోర్సులపై ఆరా
బీబీఏ, బీసీఏ కోర్సులకు పెరుగుతున్న డిమాండ్
సాక్షి, హైదరాబాద్: డిగ్రీలో ఏ కోర్సులో చేరితే బెటర్ అంటూ విద్యార్థులు ఆరా తీస్తున్నారు. ఇటీవల దోస్త్ నోటిఫికేషన్ విడుదల కాగా, ఈ నెల 10వ తేదీ నుంచి విద్యార్థులు ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఈ నెల 22 వరకూ కొనసాగుతుంది. ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రాథమిక కీ కూడా విడుదలైంది. దీని ఆధారంగా ఎన్ని మార్కులు వస్తాయనే అంచనాకు విద్యార్థులు వచ్చారు.
ఈ కారణంగా దోస్త్‌కు ముందుగా దరఖాస్తు చేసేందుకు వారు ఆసక్తి చూపుతున్నారు. ఈసారి డిగ్రీలో అనేక కొత్త కోర్సులు ఉంటాయని, సిలబస్‌లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాప్టర్లు తీసుకొస్తుండటంతో కొన్ని రకాల డిగ్రీ కోర్సుల్లో ఈసారి డిమాండ్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
ఇంజనీరింగ్ కన్నా మెరుగైనవి
» ఇంజనీరింగ్ కన్నా మెరుగైన కోర్సులు డిగ్రీ స్థాయిలో కూడా ఉన్నాయి. అయితే, ఇవి ఎక్కువగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. తక్షణ ఉపాధి లభిస్తుందని, సాఫ్ట్‌వేర్ వైపు కూడా వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుందని కొన్ని కోర్సుల గురించి విద్యార్థులు ఎక్కువగా వాకబు చేస్తున్నారు.
» బీకాంలో గతంలో సంప్రదాయ సబ్జెక్టులు ఉండేవి. ఇప్పుడు కొత్తగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ), ఈ–కామర్స్ ఆపరేషన్స్, రిటైల్ ఆపరేషన్స్ వంటి కోర్సులు వచ్చాయి. కరోనా తర్వాత ఈ–కామర్స్ పెరిగింది. ఆడిటింగ్ వ్యవస్థలోనూ డిజిటలైజేషన్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ–కామర్స్, కంప్యూటర్ అనుసంధానిత కోర్సులను ఎంచుకునేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు.
» బీఎస్సీలో మేథ్స్, బీజెడ్‌సీ వంటి కోర్సులే ప్రాధాన్యం సంతరించుకున్న పరిస్థితి మారిపోయింది. కానీ ఇప్పుడు బీఎస్సీలో టూరిజం అండ్ హాస్పిటాలిటీ ఆపరేషన్స్, డిజిటల్ ఇండస్ట్రీయల్ ఆపరేషన్స్, బీఎస్సీ మేథ్స్ డేటాసైన్స్, బీఎస్సీ ఆనర్స్ వంటి కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. దీంతోపాటు బీఎస్సీలోనూ ఏదైనా ఒక ఇతర సబ్జెక్టు చేసుకునే వీలుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని బీఎస్సీ మేథ్స్ విద్యార్థులు డేటాసైన్స్ వైపు ఆసక్తి చూపుతున్నారు.
ఆప్షన్‌లో మా కాలేజీకి ప్రాధాన్యం ఇవ్వండి అంటూ..
గత ఏడాది దోస్త్ ఐదు దశలు నిర్వహించినా, ప్రైవేట్ కాలేజీల్లో 38 శాతమే సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులను ఆకర్షించేందుకు ప్రైవేట్ కాలేజీలు ప్రయత్ని స్తున్నాయి. ప్రతీ విద్యార్థికి ఫోన్లు చేసి, ఏజెంట్ల ద్వారా కలుసుకొని దోస్త్ ఆప్షన్లలో తమ కాలేజీకే ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. కొన్ని కాలేజీలు ప్రత్యేక రాయితీలు కూడా ఇస్తామంటున్నాయి.
తొలిదశలో చేరిన వారికి రవాణా సౌకర్యం కల్పిస్తామని, బహుమతులు ఇస్తామని చెబుతున్నాయి. గ్రామీణ కాలేజీలు ఊరికో ఏజెంట్‌ను పెట్టుకొని మరీ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. మీ–సేవ కేంద్రాలను కొన్ని కాలేజీలు మచ్చిక చేసుకుంటున్నాయి. కేంద్రాలకు వచ్చే వారిని తమ కాలేజీల వైపు మళ్లించాలని నజరానాలు ఇస్తున్నాయి.