ప్రైవేట్ పాఠశాలల్లో ఇక నుంచి విద్యార్ధులకు పాఠాలు బోధించాలంటే టీచర్లు టెట్(ఉపాధ్యాయ అర్హత పరీక్ష)లో అర్హత సాధించి ఉండాల్సిందే. ఈ మేరకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ
ప్రైవేట్ పాఠశాలల్లో ఇక నుంచి విద్యార్ధులకు పాఠాలు బోధించాలంటే టీచర్లు టెట్(ఉపాధ్యాయ అర్హత పరీక్ష)లో అర్హత సాధించి ఉండాల్సిందే. ఈ మేరకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుండడంతో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల్లో ఆందోళన నెలకొంది.
ఆలేరు
యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమారు 145 ప్రైవేట్ పాఠశాలలున్నాయి. ఇందులో ప్రాథమిక–25, ప్రాథమికోన్నత–30, ఉన్నతపాఠశాలలు–90 ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో విద్యార్థులకు మెరుగైన విద్య అందనుంది. దీంతో పాటుగా టెట్‌లో క్వాలిఫై అయిన ఉపాధ్యాయులకు ఆయా పాఠశాలల యాజమాన్యం వేతనం ఎక్కువగా ఇచ్చే అవకాశముంది. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ బడుల్లో బోధించాలంటే టెట్ తప్పనిసరి. ఇటీవల ప్రైవేట్ పాఠశాలలను ప్రత్యేక బృందాలు తనిఖీ చేశాయి. అనేక పాఠశాలల్లో టెట్ క్వాలిఫై కానివారు బోధిస్తున్నారని తేలింది. వచ్చే విద్యాసంవత్సరం నాటికి టెట్‌లో క్వాలిఫై అయినవారినే ఉపాధ్యాయులుగా నియమించుకునేలా ఆదేశాలు జారీచేయనున్నారు.
అనుభవం లేని ఉపాధ్యాయులతో..
జిల్లాలోని పలు పాఠశాలల్లో అనుభవం లేని ఉపాధ్యాయులచే బోధన జరుపుతున్నారు. విద్యార్ధులకు ఆ«ధునిక పరిజ్ఞానంతో విద్యాభోధన అంటూ వేలాది రూపాయల్లో ఫీజులను వసూలు చేస్తున్నారు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, డిగ్రీ విద్యార్హత ఉన్నవారితో భోదిస్తున్నారు. సరైన విద్యార్హతలు లేకుండానే నియమిస్తున్నారు. అయితే బీఎడ్, డీఎడ్ శిక్షణతో పాటు టెట్ తప్పనిసరి ఉండాలనే నిబంధనతో ప్రైవేట్ యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. ఇలా అయితే ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉత్తీర్ణులైన అభ్యర్ధులు దొరకగా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంది. దీంతో పాటుగా ప్రైవేట్ యాజమాన్యాలు 1 నుండి 5, 1 నుండి 7 తరగతులకు ఆప్‌గ్రేడ్ కావాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. 5 నుండి 7, 6నుండి 10 తరగతుల వరకు ఆప్‌గ్రేడ్ కావాలంటే టెట్ అర్హత ఉన్న ఉపాధ్యాయులను నియమించుకోవాల్సిందే.
పాఠశాల కమిటీలేవీ..
ప్రతి ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో పాఠశాల కమిటీ ఏర్పాటు చేయాలి. పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ నిర్ణయం ప్రకారమే పాఠశాలలోని సౌకర్యాల ఆధారంగా ఫీజులు నిర్ణయించాల్సి ఉం టుంది. విద్యాశాఖ కూడా పాఠశాల ఫీజులకు సంబంధించి ఆదేశాలిచ్చింది. ప్రతినెల తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించాలని నిబంధన ఉన్న అమలుకు నోచుకోవడం లేదు.
టెట్ అర్హతపై విమర్శలు
ఉపా«ధ్యాయ ఉద్యోగం సంపాదించుకోవడానికి అర్హత అభ్యర్థులకు ప్రభుత్వం సంకెళ్లు వేస్తుందని ఆరోపి స్తున్నారు. అర్హత సాధించినవారే డీఎస్సీ రాసేందుకు అర్హులని పేర్కొనడంతో పలు విమర్శలకు దారితీస్తున్నాయి. టెట్‌ను మొదటి నుంచి ఉపాధ్యాయ సంఘాల నాయకులు, నిరుద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. దీంతోపాటుగా ప్రైవేట్‌స్కూళ్లలో బోధన జరపాలంటే టెట్ క్వాలిఫై ఉండాలని విద్యాశాఖ పేర్కొనడంతో బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు మండిపడుతున్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు కోరుతున్నారు.
నిబంధనలు ఇవీ..
బీఎడ్, డీఎడ్ చేసిన ఉపాధ్యాయులు ఉండాలి. వీరికి కనీస వేతనాలు అమలుచేయాలి. పీఎఫ్ తదితర సౌకర్యాలు కల్పించాలి. ఉపాధ్యాయుల పేర్లు, వారి విద్యార్హతలు తెలిపే వివరాలను, వారి జీతభత్యాలను పాఠశాల ఆవరణలోని బోర్డుపై అడ్మిషన్‌లకు ముందే పెట్టాలి. ఫీజుల వివరాలను బోర్డుపై పెట్టాలి. ఇష్టానుసారంగా ఫీజులు పెంచే అధికారం లేదు. మేనెజ్‌మెంట్ కమిటీ నిర్ణయం మేరకు పెంచాలి. దీంట్లో విద్యార్థుల తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేయాలి. విద్యాహక్కు చట్టం ప్రకారం వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు 25శాతం సీట్లను కేటాయించాలి. క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలకు సరిపడే స్థలం ఉండాలి. 14సంవత్సరాలలోపు పిల్లలను పాఠశాలలో చేర్చుకునేటప్పుడు ఎలాంటి ప్రవేశపరీక్ష నిర్వహించరాదు. డోనేషన్‌లు, బిల్డింగ్ ఫండ్, మేనేజ్‌మెంట్ ఫీజు, వార్షికోత్సవాలు వివిధ కార్యక్రమాల పేరిట ఫీజులను వసూలు చేయవద్దు. కేవలం ట్యూషన్ ఫీజులను మాత్రమే తీసుకోవాలి.