అధికారం అండతో పాశవిక దాడి | Tdp Supporters Attacks On Tribal | Sakshi
Sakshi News home page

అధికారం అండతో పాశవిక దాడి

Oct 8 2016 10:46 PM | Updated on Aug 10 2018 6:49 PM

అధికారం అండతో పాశవిక దాడి - Sakshi

అధికారం అండతో పాశవిక దాడి

అధికారం అండతో టీడీపీ వర్గీయులు ఓ గిరిజనుడి ఇంటి పైకి దండెత్తారు. ఇంట్లో అన్నం తింటున్న వారిపై పాశవికంగా దాడి చేశారు. 30 మంది కలిసి వేట కొడవళ్లు, గొడ్డళ్లు, ఇనుపరాడ్లతో దాడి చేయడంతో.. వారు తీవ్ర గాయాల పాలయ్యారు.

ఎర్రగుంట్ల, టీడీపీ వర్గీయులు, గిరిజనుడి
- గిరిజనుడి ఇంటిపై టీడీపీ వర్గీయులు వేటకొడవళ్లతో దాడి..  తీవ్ర గాయాల పాలైన బాధితులు
- స్థల వివాదమే కారణం

ఎర్రగుంట్ల: అధికారం అండతో టీడీపీ వర్గీయులు ఓ గిరిజనుడి ఇంటి పైకి దండెత్తారు. ఇంట్లో అన్నం తింటున్న వారిపై పాశవికంగా దాడి చేశారు. 30 మంది కలిసి వేట కొడవళ్లు, గొడ్డళ్లు, ఇనుపరాడ్లతో దాడి చేయడంతో.. వారు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి బాధితులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మేకలబాలయపల్లెలో గిరిజనులైన రామచంద్రుడు, హనుమంతుడు కుటుంబాల మధ్య స్థల వివాదం కొనసాగుతోంది. అయితే అధికార పార్టీకి చెందిన వల్లెపు చిన్నవన్నూరయ్య.. హనుమంతుడుకి మద్దతుగా వచ్చి స్థలాన్ని ఎలాగైనా కాజేయాలని చూశాడు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ఇంటిలో రామచంద్రుడు, అతని భార్య నాగమణి, సోదరుడు రాముడు అన్నం తింటున్న సమయంలో.. చిన్నవన్నూరయ్యతోపాటు అనుచరులు 30 మంది దాకా వచ్చి వేటకొడవళ్లు, గొడ్డెళ్లు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. ఇందులో రామచంద్రుడు, నాగవేణి, రాముడుకు తీవ్ర గాయాలు కాగా, వారి బంధువులైన జయరాయుడు, చిన్నారి సుమిత్రకు స్వల్ప గాయాలయ్యాయి. కలమల్ల పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న బాధితులను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన వారిని పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నించగా.. వారు గ్రామం వదిలి పారిపోయారు. ఈ సంఘటనలో మరో వర్గానికి చెందిన హనుమంతుడు, రామాంజనేయులు, వన్నురమ్మకు గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న వెంటనే వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ ఎంవీ సుధీర్‌రెడ్డి ఆస్పత్రికి వెళ్లి రామచంద్రుడు కుటుంబ సభ్యులను పరామర్శించారు. తరువాత సీఐ రాజేంద్రప్రసాద్‌ క్షతగాత్రుల నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
మమ్మల్ని చంపాలనే కక్షతోనే..
తమ ఇళ్ల మధ్య ఉన్న స్థలాన్ని కాజేయాలనే ఆలోచనతోనే చిన్నవన్నూరయ్య దాడి చేశారని రామచంద్రుడు వాపోయాడు. ‘మేం అధికార పార్టీకి చెందిన వారమని, నిన్ను ఏం చేసినా ఎవరూ ఏమి చేయలేరు’ అని బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రాణ హాని ఉందని చాలా సార్లు పోలీసులకు తెలిపినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఇంట్లోని సామాన్లు, ఆటోను పగలగొట్టారని వివరించారు.
చర్యలు తీసుకోవాలి: సుధీర్‌రెడ్డి
ఆధిపత్యం కోసం నాయకులు గ్రామాల్లో కక్షలు పెట్టి అనుచరులను ప్రోత్సహిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ సుధీర్‌రెడ్డి అన్నారు. రామచంద్రుడుపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కడప డీఎస్పీకి, సీఐకి తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement