రాబోయే రోజుల్లో నగదు లావాదేవీలన్నీ స్వైపింగ్ మిషన్ల ద్వారానే జరుగుతాయని లీడ్ బ్యాంకు మేనేజర్ (ఎల్‌డీఎం) రఘునాథరెడ్డి తెలిపారు.
ప్రొద్దుటూరు టౌన్: రాబోయే రోజుల్లో నగదు లావాదేవీలన్నీ స్వైపింగ్ మిషన్ల ద్వారానే జరుగుతాయని లీడ్ బ్యాంకు మేనేజర్ (ఎల్‌డీఎం) రఘునాథరెడ్డి తెలిపారు. మంగళవారం మహిళా స్వశక్తి భవన్‌లో స్వయం సహాయక సంఘాల లీడర్లు, ఆర్పీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే అయినా దాని ఫలితాలు ముందు చాలా ఉన్నాయన్నారు. 24, 25 తేదీల్లో మరో రూ.300 కోట్లు వస్తోందని, ప్రజలకు ఇబ్బందులు తగ్గుతాయని వివరించారు. ప్రతి ఒక్క లావాదేవీ చెక్కు, డెబిట్ కార్డు ద్వారానో చేయాలని తెలిపారు. జిల్లాలో 10వేల స్వైపింగ్ మిషన్లను తెప్పిస్తున్నామని అందులో ప్రొద్దుటూరుకు 3 వేలు ఇస్తున్నామని చెప్పారు. జిల్లాలో 2.48 లక్షల మంది పింఛన్ డబ్బు కూడా బ్యాంకు ఖాతాలోనే పడుతుందని తెలిపారు. 12 రోజుల్లో రూ.1460 కోట్లు బ్యాంకులకు వచ్చి చేరిందని, ఇందులో రూ.650 కోట్లు నోట్ల మార్పిడి జరిగిందన్నారు.
మహిళలకు, సీనియన్ సిటిజన్లకు ప్రత్యేక లైన్
మహిళలకు, సీనియర్ సిటిజన్లకు బ్యాంకుల వద్ద ప్రత్యేక లైన్ ఏర్పాటు చేయాలని ఇప్పటికే అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంకులకు వెళ్లి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లీడర్లు, సీఓలు ఎల్‌డీఎం దృష్టికి తీసుకొచ్చారు. కార్పొరేషన్ బ్యాంకులో రూ.500 నోట్లు తీసుకోలేదని సంఘం లీడర్ గజ్జల కళావతి చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకర్లు కూడా ఒత్తిడికి గురవుతున్నారని, అందరి సహకారం ఉండాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ ఉండేల గురివిరెడ్డి మాట్లాడుతూ ప్రధాని తీసుకున్న నిర్ణయం మంచిందని, నల్లధనం బయటికి వస్తుందని, సామాన్య ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఫీల్డ్ ఆఫీసర్లు అనురాధ, మల్లిఖార్జున, పీఆర్పీ కెజియా జాస్లిన్, సీఓలు విమల, సరస్వతి , సంఘ లీడర్లు, ఆర్పీలు పాల్గొన్నారు.