సీటు వదలడు.. దందా ఆగదు | seat will not leave busniss not stop | Sakshi
Sakshi News home page

సీటు వదలడు.. దందా ఆగదు

Jun 24 2017 11:42 PM | Updated on Aug 30 2019 8:37 PM

సీటు వదలడు.. దందా ఆగదు - Sakshi

సీటు వదలడు.. దందా ఆగదు

అయిన వారంతా అమాత్యులంటాడు...ఉద్యోగ సంఘానికి నాయకుడని చెబుతాడు.. నిబంధనలేవీ తనకు వర్తించవంటూ ఐదేళ్లుగా గనులశాఖ కార్యాలయంలో సీటుకు పెవికాల్‌ వేసుకుని మరీ అతుక్కుపోయాడు.

- అమాత్యుల అండ ఉందంటూ ఐదేళ్లుగా గనులశాఖలో తిష్ట 
- పైస్థాయి అధికారులతో సంప్రదింపులు...కిందిస్థాయి సిబ్బందికి వేధింపులు
- పరిశీలించే బాధ్యతలుండటంతో లీజ్‌ హోల్డర్‌లనూ వదలని వైనం 
- దందా సాగిస్తూ రూ.కోట్ల కొద్ది ఆస్తులు కూడబెట్టిన వైనం 
 
అయిన వారంతా అమాత్యులంటాడు...ఉద్యోగ సంఘానికి నాయకుడని చెబుతాడు.. నిబంధనలేవీ తనకు వర్తించవంటూ ఐదేళ్లుగా గనులశాఖ కార్యాలయంలో సీటుకు పెవికాల్‌ వేసుకుని మరీ అతుక్కుపోయాడు. పలుకుబడి తనదైనప్పుడు..పెత్తనం కూడా తనదేనంటూ ఉన్నతాధికారులను ఘీంకరిస్తూ సిబ్బందిని వేధింపులకు గురిచేస్తున్న ఓ అధికారి పెత్తనం ఆ శాఖ కార్యాలయంలో చర్చనీయంశంగా మారింది. చిన్న తప్పులకే మెమోలు జారీ చేసి చర్యలు తీసుకునే ఉన్నతాధికారులు.. ఈ అధికారిని మాత్రం ఉపేక్షిస్తున్నారు.. అయితే ఈయన చర్యలతో విసిగి వేసారిన ఎందరో పై స్థాయి అధికారులు కేంద్ర కార్యాలయానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది.
 
 కర్నూలు (వైఎస్‌ఆర్‌ సర్కిల్‌): తన బంధువులు రాష్ట్ర అమాత్యులని..తనను ఎవ్వరూ ఏమి చేయలేరంటూ ఓ అధికారి ఐదేళ్లుగా తన శాఖలో దందా సాగిస్తున్నాడు. గనుల అనుమతులు..ఇతర ప్రతిపాదనలకు సంబంధించిన పత్రాల పరిశీలన అనంతరం ప్రతిపాదించే బాధ్యతలుండడంతో ఆడిందే ఆట..పాడిందే పాటగా ఆయన హవా సాగుతోంది. ఎవ్వరైనా గనులకు సంబంధించి అనుమతి కోసం వస్తే వారి ఫైలు కదిలేందుకు ఆపసోపాలు పడాల్సిన పరిస్థితి. అదే కార్యాలయంలో పలువురు ఉన్నతాధికారులు బదిలీపై వెళ్లిపోయినప్పటికీ ఈయనగారు కుర్చీని వదల్లేదు.
 
ఈ అధికారి వ్యవహార తీరుపై ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన పాపానికి ఇక్కడి అధికారులు బదిలీలకు బలైపోయారు తప్ప ఆయనమీ కాలేదంటే హవా అర్థం చేసుకోవచ్చు. ఈయన దందాను చూసి కింది స్థాయి సిబ్బంది కూడా నోరు మెదపకుండా చెప్పిన హుకుంను తూచా తప్పకుండా పాటిస్తూ బిక్కుబిక్కు మంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఉద్యోగ సంఘం నాయకుడిగా ఉన్నతంత వరకు తనను ఎవ్వరూ బదిలీ చేయలేరని ధీమాగా చెబుతుండటంతో తోటి ఉద్యోగులు మిన్నుకుండిపోతున్నారు. 
 
వేగుల ద్వారా పిటీషన్‌లు..ఆ పై అమ్యామ్యాలు..:
జిల్లా వ్యాప్తంగా మైనింగ్‌ వ్యవహారాలపై, గనుల యజమానులపై డోన్‌ ప్రాంతంలోని ఇద్దరు వేగుల ద్వారా పిటీషన్‌లను వేయిస్తాడు. వాటిని  స్వీకరించిన అధికారులు విచారణకు ఆదేశిస్తారు. దీన్ని అదనుగా చేసుకుని అనుమతులకు సంబంధించి రికార్డులు సైతం సక్రమంగా ఉన్నప్పటికీ సదరు గనుల యజమానులపై తీవ్ర స్థాయిలో వేధింపులకు గురి చేస్తాడు. విచారణ సారాంశం నివేదికను ఈయనే నివేదించాల్సి రావడంతో పై అధికారులు కూడా చేతులెత్తేస్తున్నారు. ఫలితంగా గనుల యజమానులు ఆ అధికారికి లక్షలాది రూపాయలు ముట్టజెప్పుకోవాల్సిన దుస్థితి నెలకొందని పలువురు గనుల యజమానులు వాపోతున్నారు.
 
 అడ్డూ అదుపు లేని దందా.. 
సదరు అధికారి దందా ద్వారా కోట్ల రూపాయల ఆస్తులను కూడగట్టినట్లు ఆరోపణలున్నాయి. ఉలిందకొండ సరిహద్దులో రూ.2కోట్ల విలువ చేసే పన్నెండెకరాల భూమిని ఇటీవలే బినామీ పేర్లతో కొనుగోలు చేసినట్లు సమాచారం. అనంతపురం - బెంగళూరు జాతీయ రహదారిపై కూడా రూ. కోటి విలువైన ఎకరా భూమి, సీక్యాంపు, మిలిటరీ కాలనీలో రూ. 70లక్షల విలువైన భవంతులున్నట్లు సమాచారం.
టన్నుకు రూ.5 చెల్లించాల్సిందే..
వివిధ పిటీషన్‌లను ఆధారంగా చేసుకుని ద్వారా యజమానులను వేధిస్తున్న సదరు అధికారి వారి నుంచి రాయల్టీ రూపంలో భారీగా గుంజుతున్నట్లు ఆరోపణలున్నాయి. గ్రానైట్‌ క్యూబిక్‌ మీటర్‌కు రూ.10, లైన్‌స్టోన్‌, ఇతర వాటికిటన్నుకు రూ.5 చొప్పున వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇలా కమీషన్‌ కింద నెలకు లక్షలాది రూపాయలు ఖాతాలో వేసుకుంటున్నాడు. 
 
ఏడీలతో వివాదాలు..:
గతంలో ఇదే కార్యాలయంలో పనిచేసే ఇద్దరు ఉన్నతాధికారులు ఈయన బెడద తట్టుకోలేక సర్వోన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. జరిగిన తంతుపై అవినీతి నిరోధకశాఖ అధికారులకూ ఉప్పందించారు. ఫలితం లేకపోవడం విస్మయాన్ని కల్గిస్తోందని పలువురు గనుల యజమానులు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. 
 
ఇక్కడే కొనసాగాలని నిర్ణయం..
ఐదేళ్లుగా గనులశాఖ కార్యాలయంలో సీటుకు అతుక్కుపోయిన ఈయన గారు మరో రెండేళ్లు ఇక్కడే కొనసాగాలని నిర్ణయించుకున్నారట. నిబంధనల మేరకు ఈయనకు స్థానచలనం తప్పదని భావించినా ఇటీవలే జరిగిన సాధారణ బదిలీల్లో పైస్థానంలో ఉన్న ఏడీలు మారిపోయారు తప్ప ఈయన సీటుకు డోకా లేకుండా పోయింది. దీంతో మరో రెండేళ్లు ఇక్కడే విధులు నిర్వర్తించి సర్వోన్నత కార్యాలయంలో స్థానం కోసం వ్యూహాలు రచిస్తున్నట్లు తెలిసింది. ఇదే భవిష్యత్తులో జరిగితే రెండు జిల్లాల గనులయజమానులు, కార్యాలయాల సిబ్బందికి ఈయన గారి వేధింపులు తప్పవన్న వాదన ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement