కన్నకొడుకును కడసారి చూసుకోలేదు.. | moviest leader nizamuddin mother expired | Sakshi
Sakshi News home page

కన్నకొడుకును కడసారి చూసుకోలేదు..

Aug 3 2016 9:18 PM | Updated on Sep 4 2017 7:40 AM

చివరిక్షణంలోనైనా చిన్నకొడుకు తన చెంతకు చేరతాడని ఆశపడ్డ ఆ తల్లి ఆశలు ఆవిరయ్యాయి.

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు నిజామోద్దీన్‌ తల్లి మృతి 
కోరుట్ల : చివరిక్షణంలోనైనా చిన్నకొడుకు తన చెంతకు చేరతాడని ఆశపడ్డ ఆ తల్లి ఆశలు ఆవిరయ్యాయి. ‘కొడుకా... వనం వీడి జనంలోకి రా..’ అంటూ ఆ మాతృమూర్తి పడ్డ ఆరాటం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు నిజాముద్దీన్‌ను కరిగించలేకపోయింది. ఏ క్షణంలోనైనా కొడుకు తనను చూసేందుకు వస్తాడని ఆశపడ్డ ఆ తల్లి చివరికి తుదిశ్వాస విడిచింది. 30 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లి ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు నిజాముద్దీన్‌ తల్లి రాజుబీ(88) బుధవారం అనారోగ్యంతో కన్నుమూసింది. కోరుట్ల రవీంద్రరోడ్‌ ఏరియాలో నివాసముంటే ఫక్రుద్దీన్‌–రాజుబీ దంపతులకు ఎనిమిది మంది సంతానం. వీరిలో ఐదుగురు మగపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు. మగవాళ్లలో అందరికీ కంటే చిన్నవాడైన నిజాముద్దీన్‌పై తల్లి రాజుబీకి అంతులేని ప్రేమ. 30 ఏళ్ల క్రితం 1980–83 సమయంలో కోరుట్లలో డిగ్రీ చదువుతున్న సమయంలో నిజాముద్దీన్‌ రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌ నాయకుడిగా కొనసాగాడు. 1985లో పీపుల్స్‌వార్‌లో అజ్ఞాత సభ్యుడిగా చేరారు.

ఆ తర్వాత పీపుల్స్‌వార్‌ టెక్‌ ఇన్‌చార్జిగా కొనసాగారు. పలు కీలక కేడర్లలో పనిచేసిన నిజాముద్దీన్‌ ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నట్లు పోలీసు వర్గాల సమాచారం. అజ్ఞాతంలోకి వెళ్లిన నాటి నుంచి తన తల్లిదండ్రులను ఏనాడు కలుసుకోకపోవడం గమనార్హం. ఏడాదికోసారి పోలీసులు వచ్చి నిజాముద్దీన్‌ను జనజీవన స్రవంతిలో కలవాలని కోరాలని చెప్పినప్పుడల్లా కొడుకు కోసం రాజుబీ కన్నీరుమున్నీరుగా విలపించేది. ఎప్పటికైనా కొడుకు తన వద్దకు చేరతాడని ఆశపడేది. మూడేళ్ల క్రితం తండ్రి ఫక్రుద్దీన్‌ చనిపోయిన సమయంలోనూ నిజాముద్దీన్‌ జాడ తెలియరాలేదు. ప్రస్తుతం తల్లి రాజుబీ చనిపోవడంతో మరోసారి ఈ ప్రాంతవాసులు నిజాముద్దీన్‌ ఎక్కడున్నాడో అని చర్చించుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement