భార్య మరణాన్ని తట్టుకోలేక మానసిక వేదనతో భర్త మరణించిన సంఘటన టెక్కలి మండలం నరసింగపల్లిలో
టెక్కలి : భార్య మరణాన్ని తట్టుకోలేక మానసిక వేదనతో భర్త మరణించిన సంఘటన టెక్కలి మండలం నరసింగపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కడియాల పారమ్మ (60) 12 రోజుల క్రితం అనారోగ్య కారణాలతో మృతి చెందింది. అప్పటి నుంచి ఆమె భర్త రాజన్న (63) మానసికంగా కుంగిపోయాడు.
సోమవారం పారమ్మ పెద్దకర్మ జరిగిన అనంతరం రాజన్న మరింత ఆందోళనకు గురయ్యాడు. మంగళవారం పరిస్థితి విషమించడంతో ముగ్గురు కుమారులు రాజన్నను టెక్కలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఆయన కన్నుమూశాడు. అనంతరం రాజన్న మృతదేహానికి గ్రామంలో అంత్యక్రియలు చేపట్టారు. కాగా, రాజన్న మనవరాలి వివాహం బుధవారం జరగనుండటం, ఇంతలోనే వృద్ధులిద్దరూ మృత్యువాత పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.