కుండలు తయారు చేస్తున్న కుమ్మరి
గతంలో పండుగ వచ్చిందంటే గ్రామాల్లో మట్టి పాత్రలు, కుండలు కొనేవారు. ప్రస్తుతం మారిన సాంకేతిక పరిజ్ఞానంతో స్టీలు, రాగి, కంచు, ప్లాస్టిక్ పాత్రలకు గిరాకీ పెరిగింది. దీంతో కుమ్మరులు తయారు చేస్తున్న మట్టి కుండలకు ఆదరణ తగ్గింది. మట్టి కుండలు తయారు చేస్తున్న కుమ్మరులు బతుకుల్లో వెలుగు లేకుండా పోతోంది.
గంగవరం: ఒకప్పుడు మండలంలో 350 కుటుంబాలు కుమ్మరి వృత్తిలో కొనసాగేవారు. గుండుగల్లు, మబ్బువాళ్లపేట, పత్తికొండ, కీలపట్ల, కల్లుపల్లెూల్లో ప్రస్తుతం 15కుటుంబాలు మాత్రమే ఈ వృత్తి కొనసాగిస్తున్నారు. గతంలో పల్లెల్లో ఎక్కడ చూసినా వంట చేసేది మొదలు, నీరుతెచ్చుకునేందుకు కూడా కుండలు వాడే వారు. దీంతో వృత్తిపై ఆధారపడి జీవించే వారి బతుకులు గుడ్డిలో మెల్ల చందంగా కాస్త మెరుగ్గా ఉండేవి. మారుతున్న కాలంలో కుమ్మరులకు ఉపాధి కష్టంగా మారింది. ప్లాస్టిక్, అల్యూమినియం పాత్రలు పెరగడంతో గతంలో ఉన్న మట్టిపాత్రలు వినియోగం పూర్తిగా తగ్గింది. ఎండాకాలంలో మాత్రమే కొంతమేర మట్టికుండలకు గిరాకీ ఉంటోంది. దీంతో వేసవిలో అమ్ముకొన్న మట్టి కుండలతో ఏడాది పొడవునా జీవనం సాగిస్తున్నారు.
ఆదుకోని ప్రభుత్వం
కుమ్మరులు వృత్తిని వదిలేసి వ్యవసాయ కూలీలుగా, దుకాణాలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు.ప్రభుత్వం చేతివృత్తిదారులకు ఆర్థికసహాయం చేస్తున్నామనీ, వారి జీవితాల్లో వెలుగును నింపుతామని ప్రకటనలు ఇస్తున్నారే తప్ప ప్రభుత్వం వలన ఒరిగింది లేదనీ వాపోతున్నారు.
రోజంతా కష్టపడినా...
రోజంతా కష్టపడి కుండలు తయారు చేస్తే, రూ. వంద కూడా గిట్టుబాటు కావడంలేదంటున్నారు. గతంలో చెరువు నుంచి మట్టి తెచ్చుకునే వారు. తయారీ ఖర్చు తక్కువగా ఉన్నా, గిరాకీ ఉండేది. ప్రస్తుతం మట్టి కుండలు వాడే వారే కరువయ్యారు. దీంతో రోజు కూలీు కూడా గిట్టడంలేదని ఆవేదన చెందుతున్నారు.