కలల రైలు కదిలొచ్చిన వేళ..

కలల రైలు కదిలొచ్చిన వేళ..


సాక్షి, కడప: నంద్యాల నుంచి ప్రారంభమైన డెమూ రైలు కర్నూల్‌ జిల్లా నొస్సం రైల్వేస్టేషన్‌ను దాటుకోని సాయంత్రం 6.15 గంటలకు జిల్లాలోని జమ్మలమడుగు మండలంలోని ఉప్పలపాడు రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. రైలును చూసేందుకు భారీగా గ్రామస్తులు, విద్యార్థులు తరలివచ్చి స్వాగతం పలికారు. ఈ స్టేషన్‌లో మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు రైలు టిక్కెట్‌ కొని జమ్మలమడుగు వరకు రైలులో ప్రయాణించారు. నాలుగు దశాబ్దాలుగా ఉన్న కల సాకారం కావడంతో జమ్మలమడుగు ప్రజలు భారీగా రైల్వేస్టేషన్‌కు తరలివచ్చి స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ దేవగుడినారాయణరెడ్డి, నేతలు ప్రజలు స్టేషన్‌కు చేరుకుని రైలుకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం డెమూ ప్రొద్దుటూరుకు కదిలింది.


ప్రొద్దుటూరులో రైలు పండగ

తొట్టతొలిమారు ప్రొద్దుటూరుకు రైలు వస్తోందని తెలుసుకున్న పట్టణవాసులతోపాటు పరిసర ప్రాంతాల ప్రజలు పెద్దఎత్తున రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం నుంచే మహిళలతోపాటు జనమంతా రైల్వేస్టేషన్‌ కిక్కిరిసింది. రాత్రి 7.07 ప్రాంతంలో రైలు ప్రొద్దుటూరు స్టేషన్‌కు చేరుకోగా 20 నిమిషాలపాటు ఇక్కడ ఆపారు. ప్రోటోకాల్‌ ప్రకారం రైల్వే అధికారులు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి చేత జెండా ఊపించి రైలును కదిలించారు. చిరకాలంగా ఎదురుచూస్తున్న స్వప్నం నెరవేరడంతో అనేక మంది ఈ సందర్భాన్ని ఉత్సవంలా నిర్వహించారు. దొరసానిపల్లె సర్పంచ్‌ తరఫున వైఎస్సార్‌సీపీ నాయకుడు యాకోబ్‌ లడ్లు పంచిపెట్టగా, టౌన్‌బ్యాంక్‌ చైర్మన్‌ యల్లాల కుమార్‌రెడ్డి కూల్‌డ్రింక్స్‌ అందించారు. టీడీపీ పట్టణాధ్యక్షుడు ఘంటసాల వెంకటేశ్వర్లుతోపాటు గులాబి పూలతో స్టేషన్‌కు వచ్చే వారికి స్వాగతం పలికారు. అలాగే కొంత మంది మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అలాగే ఎల్‌ఐసీ వారి ఆధ్వర్యంలో డెమూ డ్రైవర్‌ను పూలమాలలతో సన్మానించారు. మొదటి ప్రయాణం టికెట్‌ అమ్మకాల ద్వారా ప్రొద్దుటూరు రైల్వేస్టేషన్‌కు రూ.3,501 ఆదాయం వచ్చింది.

కర్పూర హారతి

రాత్రి 8 గంటలకు ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్‌కు డెమో రైలు స్టేషన్‌కు చేరుకుంది. అప్పటికి వేలాదిసంఖ్యలో స్టేషన్‌కు చేరుకున్న ప్రజలు హర్షధ్వానాలతో రైలుకు స్వాగతం పలికారు. ఎర్రగుంట్ల– నంద్యాల రైలు కల నేటి తీరిందని వారు హర్షం వ్యక్తుం చేశారు. జనాలతో స్టేషన్‌ ఆవరణంతా కిక్కరిసింది. రైలు స్టేషన్‌కు రాగనే ఎస్టీయూ నాయకులు రైలుకు పూలమాల వేసిన స్వాగతం పలికి కాయకర్పంతో హరితి ఇచ్చి స్వీట్లును పంపిణీ చేశారు. రైలును చూసేందుకు ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల మండల చుట్టుపక్కల గ్రామాలనుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. అనంతరం కమలాపురం మీదుగా కడపకు చేరుకుంది. కడపకు రాత్రి 8:45కు చేరుకుంది. కడప రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే స్టేషన్‌ మేనేజర్‌ నాసీరుద్దీన్, ఆర్‌పిఎఫ్‌ ఇన్స్‌పెక్టర్‌ వెంకటయ్య, రైల్వేఎస్‌ఐ శ్యాం సుందర్‌రెడ్డి సిబ్బంది అధికారికంగా స్వాగతం పలికారు. అలాగే బీజేపీ నాయకులు కూడా భారీ స్వాగతం పలికారు. తిరిగి కడప– నంద్యాల (77402) రాత్రే బయలుదేరి వెళ్లింది.

నా హయాంలో రైలు వచ్చినందుకు సంతోషంగా ఉంది

నేను ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో నంద్యాల – ఎర్రగుంట్ల రైలు ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. వాస్తవానికి ఎప్పుడో రైల్వే లైన్‌ ప్రారంభించాల్సి ఉండగా నాటి నుంచి నేటి వరకు పాలకుల నిర్లక్ష్యం కారణంగా జాప్యం జరిగింది. ఇప్పటికైనా ఈ కల సాకారమైనందుకు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ అవకాశం వచ్చినందుకు ఎంతో గర్విస్తున్నాను. 

– ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top