‘పోడు’పై పోరాటం | Fighting on podu | Sakshi
Sakshi News home page

‘పోడు’పై పోరాటం

Aug 10 2016 10:22 PM | Updated on Sep 4 2017 8:43 AM

సభకు తరలివచ్చిన పోడు సాగుదారులు

సభకు తరలివచ్చిన పోడు సాగుదారులు

ఆదివాసీలను అణచివేసేందుకు కేంద్రంలోని మోడీ, రాష్ట్రంలోని కేసీఆర్‌ ప్రభుత్వాలు కుట్ర సాగిస్తున్నాయని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌ విమర్శించారు. జిల్లాలోని అదివాసీల అణచివేతకు వ్యతిరేకంగా, పోడు రైతులకు అటవీ హక్కు పత్రాలు.. బ్యాంక్‌ రుణాలు ఇవ్వాలన్న డిమాండ్లతో సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం ఖమ్మంలోని పెవిలియన్‌ గ్రౌండ్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ, అనంతరం ధర్నాచౌక్‌లో ధర్నా జరిగాయి.

ఖమ్మం సిటీ: ఆదివాసీలను అణచివేసేందుకు కేంద్రంలోని మోడీ, రాష్ట్రంలోని కేసీఆర్‌ ప్రభుత్వాలు కుట్ర సాగిస్తున్నాయని  సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌ విమర్శించారు. జిల్లాలోని అదివాసీల అణచివేతకు వ్యతిరేకంగా, పోడు రైతులకు అటవీ హక్కు పత్రాలు.. బ్యాంక్‌ రుణాలు ఇవ్వాలన్న డిమాండ్లతో సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం ఖమ్మంలోని పెవిలియన్‌ గ్రౌండ్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ, అనంతరం ధర్నాచౌక్‌లో ధర్నా జరిగాయి. ఈ  ధర్నాలో ముఖ్య అతిథిగా బృందాకారత్‌ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. తరతరాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూముల నుంచి గిరిజన బిడ్డలను వెళ్లగొట్టే లక్ష్యంతో వారిపై  కేసీఆర్‌ సర్కారు ఉక్కుపాదం మోపుతోందని విమర్శించారు. ‘‘అటవీకరణ, అడవుల పరిరక్షణ పేరుతో మోడీ; హరితహారం పేరుతో కేసీఆర్‌.. గిరిజనులను అడవుల నుంచి దూరంగా తరిమేసేందుకు కుట్రలు సాగిస్తున్నారు’’ అని మండిపడ్డారు. ప్రధాని మోడీకి మిత్రునిగా, అడవి బిడ్డలకు శత్రువుగా సీఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘‘జాతి ద్రోహులు, ఘరానా దొంగలు, పెద్ద పెద్ద నేరగాళ్లపై పెట్టాల్సిన తీవ్రమైన కేసులను.. తెలంగాణలో అమాయక గిరిజనులపై పెడుతున్నారు, జైలుకు పంపుతున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘గిరిజన ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపనకుగాను కార్పొరేట్‌ కంపెనీలకు పాలకులు అనుమతిస్తున్నారు, అడవిపై హక్కులు కల్పిస్తున్నారు. కానీ, ఆ ప్రాంతంలోని గిరిజనులు పొట్ట పోసుకునేందుకు అక్కడి అటవీ భూమిని సాగు చేసుకోవడాన్ని మాత్రం సహించడం లేదు’’ అని విమర్శించారు. అటవీ హక్కుల కోసం గిరిజనులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. పోడు సాగుదారులకు హక్కు పత్రాలు, బ్యాంకు రుణాలు  ఇచ్చేంత వరకు సీపీఎం పోరాడుతోందన్నారు. పోడు భూములను దున్నాయంటూ మూగ జీవాలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి వాటిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించడం ద్వారా సరికొత్త జాతీయ రికార్డును తెలంగాణ సీఎం సృష్టించారని బృందాకారత్‌ ఎద్దేవా చేశారు.

  • ప్రాజెక్టులకు సీపీఎం వ్యతిరేకం కాదు

తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణానికి సీపీఎం వ్యతిరేకం కాదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. ‘‘రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టాలి. పరిశ్రమలు స్థాపించాలి. దానికి భూములు తీసుకోవాలి. తీసుకున్న భూములకుగాను తగిన నష్ట పరిహారం ఇవ్వాలి. మల్లన్న సాగర్, సింగరేణి ఓసీ నిర్వాసితులందరికీ 2013 చట్ట ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలి’’ అని అన్నారు. రాష్ట్రంలోని చట్టాలను తన చుట్టాలుగా మార్చుకునేందుకు సీఎం కేసీఆర్‌ యత్నిస్తున్నారని విమర్శించారు. ‘‘ఓట్లు, సీట్లు ఎన్ని వచ్చాయన్నది ముఖ్యం కాదు. మీకు ఎన్నొచ్చినా ఉపయోగం లేదు. టీఆర్‌ఎస్‌లో చాలా వర్గాలు– కాంగ్రెస్‌ టీఆర్‌ఎస్, టీడీపీ టీఆర్‌ఎస్, ఎర్ర టీఆర్‌ఎస్, అసలు టీఆర్‌ఎస్‌ ఉన్నాయి. భవిష్యత్తులో వీరంతా తన్నుకోవటం ఖాయం’’ అన్నారు. ప్రజావ్యతిరేక టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై పోరాడేందుకు ఎర్ర జెండాలన్నీ ఏకం కావాలన్నారు. ధర్నాలో జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్, ఎమ్మెల్యే సున్నం రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement