ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ఆర్టీసీ | Alternative arrangements RTC | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ఆర్టీసీ

Aug 11 2013 12:12 AM | Updated on Sep 1 2017 9:46 PM

ఏపీఎన్జీవోలు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన తేదీ దగ్గరపడుతున్నకొద్దీ ఆర్టీసీ అధికారుల్లో ఆందోళన పెరుగుతోంది. విజయవాడ జోన్‌లో ఇప్పటికే సుమారు రూ.10 కోట్లకు పైగా నష్టాన్ని చవిచూసింది.

సాక్షి, విజయవాడ : ఏపీఎన్జీవోలు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన తేదీ దగ్గరపడుతున్నకొద్దీ ఆర్టీసీ అధికారుల్లో ఆందోళన పెరుగుతోంది. విజయవాడ జోన్‌లో ఇప్పటికే సుమారు రూ.10 కోట్లకు పైగా నష్టాన్ని చవిచూసింది. జోన్ పరిధిలో ఒక్కరోజు బస్సులు ఆగిపోతే రూ. 3 కోట్లు ఆర్టీసీ నష్టపోతుంది. 12వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేస్తే ఇంకెంత నష్టం భరించాల్సివస్తుందా అని అధికారులు అంచనాలు వేసుకుంటున్నారు. ఆంధ్ర ప్రాంతంలో  ఇంతకుముందెన్నడూ ఈ తరహాలో వారం రోజులపాటు సమ్మె జరగలేదు. ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేసినా ఇతర శాఖల సిబ్బంది సహాయ సహకారాలు తీసుకుని ఆర్టీసీ నష్టాలను తగ్గించుకునేది. 
 
 సకలజనుల సమ్మెతో రూ.60 కోట్ల వరకు నష్టం..
 
 తెలంగాణలో 45 రోజులపాటు సకలజనుల సమ్మె జరిగినప్పుడు సీమాంధ్ర ప్రాంత బస్సులను తెలంగాణలోకి రాకుండా అడ్డుకున్నారు. కృష్ణా రీజియన్ నుంచి వెళ్లే బస్సులపై దాడులు కూడా చేశారు. అప్పట్లో ఆ ప్రాంతానికి రాత్రి వెళ్లే సర్వీసులను అధికారులు రద్దు చేశారు. ఫలితంగా విజయవాడ జోన్ సుమారు రూ.60 కోట్ల వరకు నష్టపోయింది. ప్రస్తుతం సమ్మె జరిగితే నష్టం అంతకు రెట్టింపు ఉండవచ్చని అధికారులు లెక్కలు వేస్తునానరు. 
 
 కార్మికులకు హెచ్చరికలు జారీ..
 
 సమ్మెలో ఆర్టీసీ సిబ్బంది పాల్గొనకుండా చేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు.  రెండు ప్రధాన యూనియన్లు ఇచ్చిన సమ్మె నోటీసులు చెల్లవని వారంటున్నారు. 14 రోజుల వ్యవధి లేకుండా నోటీసు ఇవ్వడం చట్టరీత్యా చెల్లదంటున్నారు. చట్టవిరుద్ధంగా జరిగే సమ్మెలో పాల్గొంటే సంస్థ రెగ్యులేషన్స్ ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల్ని విధుల్లోంచి తొలగిస్తామని బెదిరిస్తున్నారు. 
 
 అద్దె బస్సులే దిక్కు..
 
 విజయవాడ జోన్‌లో మొత్తం 3300 బస్సులుండగా, అందులో 520 అద్దెవి ఉన్నాయి. సమ్మె జరిగితే అద్దె బస్సుల సేవలను పూర్తిగా వినియోగించుకోనున్నారు. రవాణా, ఇతర శాఖలకు చెందిన డ్రైవర్లు, సిబ్బందిని రప్పించి వారితో ముఖ్యమైన రూట్లలో ఆర్టీసీ బస్సులను నడిపే ఆలోచన చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చిన బస్సుల్ని ఉద్యమకారులు ఆపివేస్తే ఏం చేయాలనే అంశంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. 
 
 బెదిరింపులకు భయపడం 
 
 రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఈ సమ్మె చేస్తున్నామే తప్ప, కార్మికుల హక్కుల సాధన కోసం కాదని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జోనల్ కార్యదర్శి వై.వి.రావు చెప్పారు. కార్మికుల హక్కుల కోసమైతే మాత్రం నిబంధన ప్రకారం నోటీసు ఇచ్చి సమ్మెలోకి వెళతామని స్పష్టం చేశారు. అధికారుల బెదిరింపులకు భయపడబోమని, ఏ ఒక్క ఉద్యోగిని విధుల్లోంచి తొలగించినా అంగీకరించబోమని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement